ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ప్రతి ఏటా జరిగే శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం ఓ భక్తి పూర్వక సంప్రదాయం. రెండు రోజుల ఈ ఉత్సవం వేలాది జనం మధ్య ఓ కన్నుల పండుగ.
పశ్చిమాకాశం సిందూరవర్ణం పులుముకుంది. పుడమి తల్లి పులకరించింది. పైడితల్లికి ప్రతీకగా సిరిమాను సిరులు కురిపించేందుకు ముందుకు కదిలింది. జయజయ ధ్వానాలు మిన్నుముట్టాయి. అందరి చూపులు నింగివైపుకే! భక్తిపారవశ్యంలో సిరిమానును తిలకించి బతుకు బంగారం చేసుకోవాలని ఒకటే ఆరాటం. పండుగలకే పండుగ ఉత్తరాంధ్రులకు ‘సిరిమాను పండుగ’.
ఎవరీ పైడితల్లి? ఏమిటీ సిరిమాను పండుగ?
పూసపాటి వంశీయులు, విజయనగరం సంస్థానాధీశులకు ఇలవేల్పు - బెజవాడ కనకదుర్గమ్మ. మడులు, మాన్యాలు ఇతోధికంగా సమర్పించిన భక్తులు వారు. కనకదుర్గమ్మ క టాక్షంతో పూసపాటి వంశంలో జన్మించినదో ఆణిముత్యం. అమ్మపేరునే పైడితల్లి (బంగారు తల్లి) అనేపేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచారు. చిన్నారి పైడితల్లి రాజప్రాసాదంలోని భోగ భాగ్యాలకు దూరంగా ఉంటూనే, కనకదుర్గమ్మను హృదయంలో పదిలపరుచుకుంది. రాజదర్పాన్ని ఏనాడూ దరి చేరనీయలేదు. జనబాహుళ్యంలో మమేకమై అందరి కష్టసుఖాలనూ పంచుకుంది. ప్రజల మన స్సులను దోచుకుంది.
అయినా విధి వక్రించింది. పొరుగున ఉన్న బొబ్బిలి సంస్థానంతో పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. అధికార ఆధిపత్యం కోసం విదేశీయులైన ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి కుతంత్రాలకు రెండు సంస్థానాల అధీశులూ ప్రభావితమై ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. మాటలు పెరిగి పోరుకు సిద్ధమయ్యారు. పోరువద్దని చిట్టితల్లి మొరపెట్టింది. కాదన్నాడు అన్న విజయ రామరాజు! కదనానికి కదిలాడు. ఫలితం భీభత్సం. రెండు సంస్థానాల అధీశులు విదేశీయుల కుతంత్రాలకు కన్నులు మూశారు. పరిస్థితికి తల్లడిల్లిన పైడితల్లి కోట వెనుక భాగాన ఉన్న పెద్ద చెరువులో తనువు చాలించింది. ప్రజల్లో హహాకారాలు. పైడితల్లి కనుమరుగవడంతో కకావికలమయ్యారు.
కానీ పైడితల్లి క్షేమదేవతగా కదిలింది.
విజయరామరాజు సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడుకి కలలో కనిపించి, తన ఉనికిని చెప్పింది. ఆ ప్రాంత ప్రజలకు ‘ఇలవేల్పు’గా అవతరిస్తానంది. జలదేవతగా ఉద్భవించింది. చెరువు గర్భం నుంచి బంగారు బొమ్మను వెలికి తీసి గుడి కట్టించాడు. ‘వనంగుడి’ గా ప్రాచుర్యం పొందిన ఈ గుడిలో అవివాహితయైున పైడితల్లికి క్రీ. శ. 1758 నుంచి ‘పేరంటాలు’గా ఉత్సవాలు జరుగుతున్నాయి. విజయ నగరం విస్తరించడంతో, నడిబొడ్డున ‘మూడు లాంతరు’ల ప్రాంతంలో మరొక ఆలయం నిర్మించి, సంవత్సరంలో ఆరుమాసాల పాటు పైడితల్లికి ఇక్కడ అన్ని ప్రధాన ఉత్సవాలూ నిర్వహిస్తున్నారు. ‘చదురుగుడి’ గా ప్రశస్తి పొందిన ఇక్కడ నిర్వహించే ఉత్సవాలలో ‘సిరిమాను ఉత్సవం’ అత్యంత ప్రధాన ఉత్సవం.
సిరిమాను ఉత్సవం ఎప్పుడు?
సుమారు మూడు శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి ధర్మశాస్త్రాలు ఆలంబనగా ఉన్నాయి. శరదృతువులో చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు, జగన్మాత ఒక్కటేనంటారు. శరన్నవరాత్రులు శక్తి పూజలకు విశిష్టమైనవి. పైడితల్లి కనకదుర్గ ప్రసాదం. బెజవాడ కనకదుర్గమ్మను శరన్నవరాత్రులలో ఆరాధించి, విజయదశమి నాడు అపరాజితగా, రాజరాజేశ్వరిగా ఆరాధించటం అందరికీ తెలిసిందే. ‘విజయదశమి’లో ‘విజయ’ అంటే అమ్మవారే! ఆమెకు ఇష్టమైన వారం మంగళవారం. జగన్మాత మంగళదేవత. పైడితల్లి కూడా మంగళదేవత. అందువల్ల విజయదశమి గడచిన తరువాత తొలి మంగళవారం పైడితల్లికి పండుగ చేయాలన్నది నిర్ణయం.
రెండు రోజుల ఉత్సవం
పైడితల్లి పండుగ రెండు రోజులు జరుగుతుంది. ముందురోజు ‘తోలేళ్లు’. ప్రజలంతా మ్రొక్కులు తీర్చుకుంటారు. చుట్టాలు పక్కాలతో, బాజా భజంత్రీలతో ఘటాలను శిరస్సులపై ఉంచుకొని , గుంపులు గుంపులుగా ప్రతి వీధి, వాడల నుంచి పైడితల్లిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. రోజంతా పండుగ వాతావరణమే. పగలు రాత్రి అనే తేడా లేక అంతటా సందడే సందడి. రాత్రి తెల్లవార్లూ సాంస్కృతిక కార్యక్రమాలు. ఆలయంలో వేద ఘోషలు. బయట నాటకాలు. సంగీత విభావరులు. ఎటుచూసినా ఎక్కడ చూసినా ఒకటే సందడి.
మరునాడు ‘సిరిమాను ఉత్సవం’. సిరిమానును ‘‘చింతచెట్టు’’ మానుతో రూపొందిస్తారు. చింత చెట్టు చింతలు తీర్చే చెట్టు. ప్రధాన పూజారికి తల్లి కలలో కనిపించి చింతచెట్టు ఉనికి తెలియజేస్తుంది. అలా ఆ చెట్టుకు పూజలు చేసి పండగనాటికి తెచ్చి సిద్ధం చేస్తారు. పైడితల్లికి ప్రతీకగా ప్రధాన పూజారి ఆ సిరిమానును అధిష్ఠించి సూర్యాస్తమయ సమయంలో ఆలయం నుంచి అమ్మవారి పుట్టిల్లయిన రాజప్రాసాదానికి ముమ్మారు వెళతారు. రోడ్డు కిరువైపులా పైడితల్లి రూపంలో వస్తున్న సిరిమానును తిలకించడానికి వచ్చిన లక్షలాది జనాన్ని అనుగ్రహిస్తూ ఆ కోలాహలం ముందుకు సాగుతుంది. రాజ ప్రాసాద ప్రాంగణంలో పుట్టింటి ఆడపడచును సంప్రదాయ సిద్ధంగా సత్కరించడం జరుగుతుంది.
ధర్మశాస్త్రాల్లో మూడు సంఖ్యకు ప్రాముఖ్యం ఉంది. త్రిమూర్తులు, త్రిశక్తులు, ముల్లోకాలు, మూడు కాలాలు, మూడు గుణాలు, త్రిపుటులు - ఇలా ఎన్నో ఉన్నాయి. మన భావనలోనే రహస్యమంతా అంతర్లీనమై ఉంది. ఆ భావనయే రసం. రసం అంటే పరమాత్మ. పరమాత్మ ప్రతీక ఒక దీపిక. ఆ దీపికయే మనం పూజించే మంగళదేవత. కన్నతల్లి, కల్పవల్లి, పైడితల్లి.
తల్లికి పిల్లలపై తాపత్రయం ఎక్కువ. ఏ అమ్మకైనా అంతే! అందుకే బంగారుతల్లి పైడితల్లికి బెంగ మరీ ఎక్కువ. తన సంతానాన్ని కన్నులారా చూడాలనీ, ఆప్యాయంగా పలుకరించాలనీ, వారి కన్నుల్లో ఆనందాన్ని వీక్షించాలనీ, అనుగ్రహించాలనీ సంవత్సరానికొకమారు ‘‘సిరిమాను దేవత’’గా ముందుకొస్తుంది. ఆ తల్లి చూపులు వెలకట్టలేనివి. ‘‘ పైడితల్లిని నిరంతరం తలుస్తూ, కొలుస్తూ ఉండడం ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని వందల ఏళ్లుగా ఉన్న విశ్వాసం!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565