విశ్వకర్మ పూజ
కర్మ చేసేవాడు కార్మికుడు. అతడు చేసే కర్మలు (సేవలు) సకల మానవాళికి ఉపయోగపడాలి- అని ఉపనిషద్ వాక్యం. తాను జీవితకాలమంతా సేవలతోనే గడపాలని మనిషి కోరుకోవాలి. ఇంతకంటే వేరైన జీవిత పరమార్థం మరేదీ ఉండకూడదని ‘ఈశోపనిషత్’ చెబుతోంది.
సకల చరాచర జగత్తుకు సృష్టికర్త బ్రహ్మ. ఆయన సృష్టించేది మూలపదార్థాన్నే! దాన్ని ఆధారంగా చేసుకొని మానవ అవసరాలకు అనుగుణంగా అనేక రూపాల్ని, ఉత్పత్తుల్ని సృజించేవారు కార్మికులు. వారందరికీ ఆద్యుడు విశ్వకర్మ. బ్రహ్మదేవుడి అంశతో ఉద్భవించిన ఆయన బ్రహ్మ అంతటి పురాతనుడని శుక్ల, కృష్ణ యజుర్వేదాలు చెబుతున్నాయి. పంచభూతాలు, త్రిమూర్తులు, ఇంద్ర, సూర్య, నక్షత్రాదులు ఉద్భవించక ముందే- బ్రహ్మ స్వయంభువుగా సంకల్పమాత్రంగానే అవతరించాడట. మరుక్షణంలోనే తన అంశతో మరొక మూర్తిని సృష్టించాడని రుగ్వేదం పేర్కొంది.
ఆయన అవతరించిన సమయం కన్యాసంక్రమణం. మానవ అవసరాల నిమిత్తం అనేక వస్తువుల్ని సృష్టించే కర్మ చేపట్టాడు. అందువల్ల బ్రహ్మ ఆయనకు ‘విశ్వకర్మ’ అని నామకరణం చేశాడని సామవేదం వివరించింది.
రుగ్వేదంలోని పదమూడో మండలం 81, 82 సూక్తాలు విశ్వకర్మ గురించి విశదీకరిస్తున్నాయి. పురుష సూక్తం విశ్వకర్మను ‘విరాట్పురుషుడు’ అని పేర్కొంది. అధర్వణ వేదం ‘ఆహార ప్రదాత’గా వర్ణించింది. విశ్వకర్మ అంత ప్రశస్తి పొందడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. దేవతల కోసం స్వర్గాన్ని నిర్మించింది ఆయనే. త్రేతాయుగంలో ‘సువర్ణ లంక’ అనే నగరాన్ని నిర్మించి శివుడికి కానుకగా ఇచ్చినవాడు విశ్వకర్మే! (తనను మెప్పించిన రావణుడికి భక్తవశంకరుడైన శివుడు ఆ నగరాన్ని కానుకగా ఇచ్చాడని పురాణ కథనం). ద్వాపర యుగంలో ద్వారకను, కలియుగంలో హస్తినాపురాన్ని, ఇంద్రప్రస్థాన్ని నిర్మించిన ఘనతా విశ్వకర్మదే!
మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఆయన సంతతి. వారు వరసగా లోహ, దారు, కాంస్య, శిల్ప, స్వర్ణ రూపకారులుగా ప్రసిద్ధి పొందారు. వారికి పలువురు శిష్యులు ఏర్పడ్డారు. లోకానికి మహోపకారం చేసిన ఆద్యుడు విశ్వకర్మను పూజించాలని కార్మికులందరూ నిశ్చయించుకున్నారు. ఆ విషయం తెలిసిన ఆయన- ‘వ్యక్తి పూజ కన్నా శక్తి పూజ మిన్న. భుక్తి (వృత్తి)కి, దాని ద్వారా ముక్తికి మార్గం చూపేవి, లోకంలో సౌకర్యాల కల్పనకు దోహదపడేవి మీ ఉపకరణాలు. అవే మీ శక్తి రూపాలు. వాటిని పూజించండి. అలా చేస్తే నన్ను పూజించినట్లే భావిస్తాను’ అని బోధించాడంటారు. అప్పటి నుంచే సంతతి (కార్మికులు) తమ వృత్తులకు సంబంధించిన వాటిని పూజించసాగారు. అదే విశ్వకర్మ పూజగా ప్రతీతి పొందింది.
కాలక్రమంలో మానవ అవసరాలు ఎక్కువయ్యాయి. వస్తువుల రూపాలు, పరిమాణాలు పెరిగాయి. వాటిని ఉత్పత్తి చేయడానికి కేవలం శారీరక శ్రమ చాలదు. అందువల్ల దానికి సాంకేతిక, యంత్రశక్తుల్ని జోడించారు. కార్మిక లోకం పెరిగిన యంత్ర, సాంకేతిక పరికరాల్ని పూజార్హ రూపాలుగా భావించింది. అంతా కలిసి వాటిని పూజించడానికి ఒక స్థిరమైన రోజు (సెప్టెంబరు 17) ఎంచుకున్నారు. ఏటా ఇదే తేదీన పలు కర్మాగారాలు, కార్ఖానాలు, కార్మిక వాడల్లో విశ్వకర్మ పూజలు ఆచరిస్తారు.
రుతువు, మాసాలు, పక్షాలు, తిథులు వంటివాటితో సంబంధం లేకుండా- కేవలం ఆంగ్ల కాలమాన గణన ప్రకారం ఈ పూజ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ రోజునే ఈ పూజ సాగించడం వెనక ఓ ఆంతర్యం ఉంది. సౌరమాన గణన అనుసరించి, నెలకు ఒక సంక్రమణం ఏర్పడుతుంది. అది సాధారణంగా ప్రతినెలా 17వ తేదీన (ఆంగ్ల సంవత్సరం ప్రకారం) వస్తుంది. భాద్రపద మాసంలో వచ్చేది కన్యా సంక్రమణం. అదే విశ్వకర్మ జన్మదినం. జన్మించిన రోజునే ఆయనను పూజిస్తారు. అదైనా, ఆయన ఆదేశానుసారం కార్మికులకు జీవనాధారమైన ఉపకరణాల రూపంలో! ఈరోజునుఆయన జయంతిగా కాక, పూజించే రోజుగా పరిగణిస్తారు. - అయ్యగారి శ్రీనివాసరావు
చరాచర సృష్టికర్త
ఏ విశ్వకర్మ ఈ సమస్త భువనాలు తనలో లీనం చేసుకుని చరాచర సృష్టికి తానే తండ్రి అయి ఉన్నాడో విశ్వకర్మ తన సంకల్ప బలంతో పున:సృష్టి చేయదలచి ప్రాణుల హృదయ ప్రదేశాన్ని ప్రవేశించాడని ఋగ్వేదం ఉద్ఘోషిస్తున్నది.
‘‘యఇమా విశ్వాభువనాని జుహ్యదృషిర్హోతానిషసాదపితానః
సఆశిషాద్రవిణమిచ్చమానః పరమచ్ఛదోవర అవివేశ! (10-81-1)
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది సృష్టి- ప్రళయం పున:సృష్టి అనేవి క్రమబద్ధంగా జరగటానికి కారణభూతమయ్యే కర్మ విధిగా విశ్వకర్మ కర్తవ్యం- సర్వజీవుల్లో సంకల్ప రూపంగా ప్రవేశించి మానసిక కర్మలకు కావలసిన శక్తి ప్రసాదించే తత్వం విశ్వకర్మతత్వమని గుర్తించవచ్చు. ‘‘విశ్వమే నేత్రాలుగా విశ్వమే ముఖాలుగా, విశ్వమే బాహువులుగా, విశ్వమే పాదాలుగా అద్వితీయుడై ప్రకాశిస్తూ అతడు ధర్మాధర్మ బాహువులతో జగత్తును స్వాధీన పరచుకున్నా’’డని యజుర్వేదీయ విశ్వకర్మ సూక్తం చెబుతుంది.
విశ్వకర్మరూపం- సర్వజీవుల హృదయాలలో సంకల్పాత్మ కర్మ రూపంగా భాసించే నిరాకార విశ్వకర్మతత్వం సాకారమై భౌతికరూపం సంతరించుకున్నది. ఉపాసకుల సౌకర్యంకోసం భగవత్తత్వం నిరాకారస్థితి నుండి సాకారస్థితి పొందటంలో వింతయేమీలేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది అనేక దేవకోటి రూపురేఖలు ఆ విధంగా వృద్ధి పొందినవే కదా. విశ్వతోముఖుడైన విశ్వకర్మకు బ్రహ్మకంటే విశేషంగా ఊర్ధ్వముఖం ఒకటి ఉన్నట్లు చెబుతారు. అంటే ఈ ఊర్ద్వముఖంతో కలిసి ఆయన పంచముఖుడు. ఆయనకు ఐదు ముఖాలు, పది చేతులు ఉన్నాయి. కుడివైపున ఐదు చేతుల్లో కుద్దాలం, కరణి, వాప్య, యంత్రం, కమండలం అనే పని ముట్లు ఎడమవైపున ఉన్న ఐదు చేతుల్లో మేరుపు, టంకం, స్వను, భూష, వహ్మి అనే ఉపకరణాలు ఉన్నట్లు వాయు పురాణ భూఖండంలో వర్ణించారు.
పంచ లోహాలు...పంచ వృత్తులు
ఈ చేతి పనులు ఇనుము, కర్ర, ఇత్తడి, శిల్పం, బంగారం పని అనే అయో, దారు, కాంస్య, శిలా, సువర్ణాలకు సంబంధించిన పంచవృత్తులుగా స్పష్టమవుతోంది. పంచవిధ లోహములతో పంచ విధ వృత్తులను ఆశ్రయించి చేతి పనులు చేసి కర్మకారులకు సంకేత స్వరూపాలుగా విశ్వకర్మ చేతుల్లో ధరించిన ఉపకరణాలు కనిపిస్తాయి. విశ్వకర్మ సంతానంగా చెప్పబడే మనువు, మయుడు, త్వష్టశిల్పి, విశ్వజ్ఞుడు అనేవారు. ఈ పంచవృత్తులకు మూలకారణులైన పంచబ్రహ్మలుగా తైత్తిరీయపంచబ్రహ్మోపనిషత్తు, పద్మ, వాయు, స్కంద పురాణాదులు వివరిస్తున్నాయి. విశ్వకర్మ ప్రాచీ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ఊర్ధ్వముఖాలనుండి పంచబ్రహ్మలకు ఉదయించిన సానగ, సనాతన, అహభువన, ప్రత్న, సుపర్ణ రుషులు పంచవృత్తులవలంబించిన కర్మకారులకు గోత్రరుషులుగా గోచరిస్తారు.పంచబ్రహ్మలైన మనుమయాదుల భార్యలపేర్లు పరిశీలిస్తే మరికొన్ని వృత్తి విశేషాలు గోచరిస్తాయి. మనువు భార్య కాంచన, మయుడి భార్య సౌమ్య, త్వష్ట భార్య రచన కావటం రచయితలైన వారికి ఆసక్తి కలిగించే విషయం. ‘‘యోగసక్తాపరిణయ..’’ మనే తెలుగు ప్రబంధంలో ఈ విషయాలు కొన్ని ప్రస్తావించారు.
గాయత్రీ విశ్వకర్మ ఒకటిగానే కొనియాడారు. గాయత్రి వేదమాత విశ్వకర్మ
సంభూతులుగా పేర్కొనే మనువు రుక్ శాఖీయుడనీ,
సెప్టెంబర్ 17
విశ్వకర్మ జయంతి
శిల్పి సామశాఖీయుడనీ విశ్వజ్ఞుడు ప్రణవ శాఖీయుడనీ ప్రతీతి. వేదమాత అయిన గాయత్రి పంచ బ్రహ్మలకు మాతృస్థానీయురాలౌతున్నది. పంచ వృత్తులకు సంబంధించిన కార్మికలోకమంతా గాయత్రీ విశ్వకర్మల ముద్దుబిడ్డలే.
విశ్వకర్మ యజ్ఞం విశ్వసృష్టికి విశ్వకర్మ ఏ విధంగా కారణభూతుడో ప్రయోజనకరమైన లౌకిక జీవన కృత్యాలకు కార్మికులైన సర్వజనులు కారణభూతులే, ఈ కార్మికులు పరమేశ్వరుడైన విశ్వకర్మకు ప్రతిరూపాలే. విశ్వశ్రేయస్సు కోరి వీరు నిత్యం చేసే పనులన్నీ విశ్వకర్మ పరమాత్మకు ప్రీతి కలిగించేవే. కనుకనే ‘‘మేం చేసే సత్కర్మలకు కావల్సిన ఆత్మబలం మారు ప్రసాదించు తండ్రీ!’’ అని విశ్వకర్మీయులగు విశ్వబ్రాహ్మణులు ప్రార్థన. విశ్వకర్మకు చేసే ప్రార్థనా రూపమైన ఆవాహన విశ్వకర్మ యజ్ఞంగా వర్ణితమైంది. దానికి సంబంధించిన కృష్ణయజుర్వేదీయ మంత్రమిది.
‘‘వాచస్పతిం విశ్వకర్మాణ మూతయే
మనోయుజంవాజే అద్యాహువేమ
సనోదిష్ఠాహవనాని జోషతే విశ్వశంభూరవసే సాధుకర్మా!
మాకు సంబంధించిన హవిస్సులను స్వీకరిస్తూ సర్వజగత్తులకు సుఖమిస్తూ మమ్మల్ని రక్షించే సత్కర్మలు చేయించే పరమేశ్వరుడు కనుకనే వేదాధికారం గల మా మనస్సులలో లీనమై ఉన్న ఆ విశ్వకర్మను ఇప్పుడు జరిగే యజ్ఞరక్షణ కోసం ధ్యానరూపంగా ఆహహన చేస్తున్నాం. సర్వేజనా సుఖినోభవన్తు
ఎర్రోజుల లక్ష్మణాచార్యులు
++++++++++++++++++++++++++
++++++++++++++++++++++++++
విశ్వకర్మ ఎవరు?
విష్ణువుకు సుదర్శన చక్రాన్ని, బ్రహ్మకు ఘంటాన్ని, దేవతలు కు పుష్పక విమానాన్ని, మహాశక్తి కి దివ్య రధాన్ని, దేవేంద్రునికి అమరావతి నగరాన్ని, పాండవులకు ఇంద్ర ప్రస్థాన్ని సృష్టించి ఇచ్చాడు విశ్వకర్మ. మను, మయ, శిల్పి, త్వష్ట, దైవజ్ఞ అను ఐదుగురు 'నిర్మాణ బ్రహ్మలు' విశ్వ కర్మ కు రచనాదేవి కి పుట్టిన బిడ్డలు. అపూర్వమైన 'ఆదిమ వాస్తు గ్రంధం' విశ్వ కర్మ రచించినదే. సమస్త చేతి వృత్తుల వారికీ ఈయనే మూల పురుషుడు.
దేవ గురువు బృహస్పతి మేనల్లుడు విశ్వకర్మ. హిరణ్య కశిపుని కొడుకు ప్రహ్లాదుని కుమార్తె రచనాదేవి; విశ్వకర్మ భార్య. వీరికి పుట్టిన 'విశ్వరూపుడు' మహా మేధావి; దేవ గురువు బృహస్పతి కే పోటీగా వచ్చాడు; ఒకసారి దేవతలకు బృహస్పతికి మాట పట్టింపులు వచ్చాయి. దేవతలకు గురువుగా ఉండను అని బృహస్పతి పట్టింపులకు పోయాడు, ఆ సమయం లో కొంత కాలం దేవతలకు గురువుగా 'విశ్వరూపుడు' వ్యవహరించాడు. అయితే బృహస్పతిని దేవతలను విడదీయడం ఇష్టం లేని విశ్వరూపుడు రాక్షసులకు దగ్గరైనట్లుగా నటించాడు. దేవతలకు మళ్ళీ బృహస్పతి గురువు అయ్యాడు. దేవేంద్రుడు విశ్వరూపుడు రాక్షసులతో చెలిమి చేయడం సహించలేక విశ్వరూపుని సంహరించాడు. విశ్వకర్మ పుత్ర శోకంలో ములిగి పోయాడు... దేవేంద్రుని అంతం చేయడానికి తపస్సు ప్రారంభించాడు; మధ్యలో కోపం చల్లారి తన తపస్సుని వేరొక పుత్రుడు కలగాలని కొనసాగించాడు... విశ్వకర్మ తపోఫలం గా రచనాదేవికి 'వృతుడు' జన్మించాడు. ఈ వృతుడే వృతాసురుడు... మహా వీరుడు... అకారణం గా తన అన్న ను చంపిన దేవేంద్రుని పై రాక్షస వీరులతో దండెత్తి దేవేంద్రుని జయించి సింహాసనం ఆక్రమించు కొన్నాడు. తపోశక్తి తో పుట్టిన వృతాసురుడు మామూలు ఆయుధాలకు మరణించడు... విష్ణు దేవుని సలహాను అనుసరించి ధధీచి మహర్షి ని సంప్రదించారు దేవతలు ... క్షీర సాగర మధన సమయం లో దేవతలు ధధీచి మహర్షి ఆశ్రమం లో ఆయుధాలు ఉంచి అనంతరం ఆయుధాలు తీసుకువెళ్ళడం మరచారు .. అన్ని సంవత్సరాలు తన ఆశ్రమం లో ఉన్న దేవతల ఆయుధాలు ను జల స్తాపితం చేసి ఆ నీరు సేవించాడు ధధీచి... అందువల్ల అతని వెన్నెముక వజ్ర తుల్య మై శక్తివంతం గా తయారైంది.. దేవతల దీనావస్థను చూడలేని ధధీచి; వజ్ర తుల్యమైన నా వెన్నెముక తో వజ్రాయుధం తయారు చేయించి వృతాసురుని సంహరించు; అని చెప్పి ప్రాణ త్యాగం చేసాడు. ధధీచి వెన్నెముక తో వజ్రాయుధం చేయమని దేవతలు విశ్వకర్మ ను వేడుకొన్నారు. స్వర్గ క్షేమానికీ పుత్ర క్షేమానికీ మధ్య నలిగి పోయిన విశ్వకర్మ చివరకు లోక క్షేమమే తన భాద్యత గా గుర్తించి వజ్రాయుధాన్ని తయారు చేసి ఇంద్రునికి ఇచ్చాడు. ఆ వజ్రాయుధం తోనే వృతాసురుని సంహరించాడు దేవేంద్రుడు.
లోక హితం కోసం కన్నబిడ్డనే బలిదానం చేసిన మహోన్నతుడు; త్యాగమూర్తి; గుణశీలి.. విశ్వకర్మ.
విశ్వకర్మ, రచనాదేవి దంపతులకు 'సంజ్ఞాదేవి' అనే ఆడ బిడ్డ కలిగింది. ఈమెను సూర్యునికి ఇచ్చి పెండ్లి చేసాడు.. సూర్యుని ప్రతాపానికి సంజ్ఞాదేవి తాళ లేక పోయింది. అప్పుడు విశ్వకర్మ తన మంత్ర శక్తి చేత సూర్యుని ప్రతాప శక్తి నుండి ఒక చక్రాయుధాన్ని, ఒక త్రిశూలాన్ని సృష్టించాడు. దీనితో సూర్యుని శక్తి సన్నగిల్లింది; సంజ్ఞాదేవి సంతోషించింది.
విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న జరుపుకుంటారు... ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. కార్మికులు తమ పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.
... ఆధునిక వాస్తు శాస్త్రానికి మూల పురుషుడు విశ్వకర్మ.
+++++++++++++++++++
విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ.
శ్లో నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః
నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః
సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః
తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై. “ప్రజాపతి విశ్వకర్మ మనః “అని కృష్ణ యజుర్వేదమున విశ్వకర్మయే ప్రజాపతియైన బ్రహ్మయనియు చెప్పబడినది. ఆయనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము లనెడి నైదు ముఖలు.
శ్లో పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః
అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః
తా తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖము నందు సనాతన ఋషి, పశ్చిమ ముఖము నందు అహభూన ఋషి, ఉత్తర ముఖము నందు బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖము నందు సుపర్ణ ఋషులుద్బవించిరి.విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మకుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ మహర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినై.
ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్ట ను గుర్తిస్తారు.
విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం
విశ్వకర్మ నిర్మాణాలు
విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.మరియు పాండవులు నివశించిన మయసభ నూ నిర్మించారు
సకల చరాచర జగత్తుకు సృష్టికర్త బ్రహ్మ. ఆయన సృష్టించేది మూలపదార్థాన్నే! దాన్ని ఆధారంగా చేసుకొని మానవ అవసరాలకు అనుగుణంగా అనేక రూపాల్ని, ఉత్పత్తుల్ని సృజించేవారు కార్మికులు. వారందరికీ ఆద్యుడు విశ్వకర్మ. బ్రహ్మదేవుడి అంశతో ఉద్భవించిన ఆయన బ్రహ్మ అంతటి పురాతనుడని శుక్ల, కృష్ణ యజుర్వేదాలు చెబుతున్నాయి. పంచభూతాలు, త్రిమూర్తులు, ఇంద్ర, సూర్య, నక్షత్రాదులు ఉద్భవించక ముందే- బ్రహ్మ స్వయంభువుగా సంకల్పమాత్రంగానే అవతరించాడట. మరుక్షణంలోనే తన అంశతో మరొక మూర్తిని సృష్టించాడని రుగ్వేదం పేర్కొంది.
ReplyDeleteఆయన అవతరించిన సమయం కన్యాసంక్రమణం. మానవ అవసరాల నిమిత్తం అనేక వస్తువుల్ని సృష్టించే కర్మ చేపట్టాడు. అందువల్ల బ్రహ్మ ఆయనకు ‘విశ్వకర్మ’ అని నామకరణం చేశాడని సామవేదం వివరించింది.
Can you please give me references fro vedas (Rigveda, Samaveda) for the matter mentioned by you above...?