చిరు'చి '
సజ్జలు, జొన్నలు, రాగులు... ఇవి చిరుధాన్యాలు.
చిరకాలం తినే రుచినిచ్చే
ఆరోగ్యాన్ని సంరక్షించే.. ఆనందాన్ని అందించే
కొన్ని చిరుధాన్యాలతో.. కొన్ని వంటకాలు
ఈ చిరుచులు ఆస్వాదించండి.
సజ్జ టిక్కా
కావలసినవి: సజ్జలు – అర కప్పు; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; తరిగిన క్యారెట్ – అర కప్పు; పచ్చి బఠానీలు – పావు కప్పు; కారం – అర టీ స్పూన్; జీలకర్ర పొడి – పావు టీ స్పూన్; చాట్ మసాలా – పావు టీ స్పూన్; గరమ్ మసాలా – చిటికెడు; తరిగిన కొత్తిమీర – కొంచెం; నూనె – తగినంత; ఉప్పు – సరిపడా.
తయారి :సజ్జలను బాగా కడిగి 15–20 నిమిషాలు నాననివ్వాలి ∙బాణనిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరిగిన ఉల్లిపాయముక్కలు, క్యారెట్, బఠానీలు వేసి కాసేపు వేగనివ్వాలి. దీనికి 1 కప్పు నీళ్లను పోసి సరిపడా ఉప్పు వేసుకోవాలి ∙నానపెట్టుకున్న సజ్జలను వేసి మూతపెట్టి చిన్న మంట మీద నీరు పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడకనివ్వాలి ∙పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ ఇంకా నీళ్లు ఉన్నట్టయితే ఇంకాసేపు మూతపెట్టి సన్నమంట మీద ఉంచుకోవాలి ∙కారం, జీలకర్రపొడి, చాట్ మసాలా, గరం మసాలా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ∙ఇలా తయారుచేసుకున్న దానిని ఉండలుగా చేసి అరచేతిలో టిక్కా మాదిరిగా ఒత్తుకోవాలి. (ఈ టిక్కాను బ్రెడ్ పొడిలో అద్దుకోవచ్చు) ∙స్టౌ మీద పెనం పెట్టి వేడయ్యాక నూనె వేసి ఒక్కొక్క టిక్కాను పెనం మీద వేసి సన్న మంట మీద బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా కాలనివ్వాలి ∙వీటిని టమోటో కెచెప్‌తో లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేయాలి.
మిల్లెట్ స్వీట్ పొంగల్
కావలసినవి : వరిగెలు – పావు కప్పు; సామలు – పావు కప్పు; పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్లు; పాలు – పావు కప్పు; తరిగిన బెల్లం – అర కప్పు, లేదా బెల్లం పాకం – అర కప్పు; తురిమిన కొబ్బరి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 10; కిస్మిస్ – 15; యాలకులు – 6 (పొడి చేసుకోవాలి); నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు
తయారి: ∙బెల్లంలో కొంచెం నీళ్లు పోసి స్టౌ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. తీగ పాకానికి దగ్గరగా ఉండగానే స్టౌ ఆఫ్ చేసి వడపోసి పక్కన పెట్టుకోవాలి ∙నెయ్యి వేడిచేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ను వేయించుకోవాలి ∙వరిగెలు, సామలు, పెసరపప్పు ఈ మూడింటిని కలిపి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ∙ఉడికిన ఈ మిశ్రమానికి బెల్లం పాకం, కొబ్బరి తురుము, యాలకుల పొడి, పాలు పోసి మరో పది నిమిషాలు ఉడికించాలి ∙చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ∙ఈ పొంగలి వేడిగా కంటే చల్లారిన తర్వాత ఇంకా రుచిగా ఉంటుంది.
మిల్లెట్ లడ్డు
కావలసినవి: కొర్రలు – 3 టేబుల్ స్పూన్లు; సజ్జలు – 3 టేబుల్ స్పూన్లు; రాగులు – 3 టేబుల్ స్పూన్లు; సామలు – 3 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – 10; పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్లు, బార్లీ – 1 టేబుల్ స్పూను; తరిగిన బెల్లం – 1 కప్పు; యాలకులు – 4; నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు (కలపడానికి తగినంత).
తయారి: ∙చిరుధాన్యాలు, పెసరపప్పు, బార్లీ, యాలకులు వేసి 10 నిమిషాల సేపు చిన్న మంటపై కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి ∙అన్నీ కలిపి కాకుండా ఒక్కొక్కటిగా కూడా వేయించుకోవచ్చు ∙ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మరీ మెత్తగా కాకుండా సన్న రవ్వలా పట్టుకోవాలి ∙చిన్న బాణలిలో నెయ్యి వేడిచేసి జీడిపప్పు వేయించాలి ∙పిండి ఉన్న జార్‌లో బెల్లం, జీడిపప్పు, నెయ్యి వేసి మళ్లీ ఒక్కసారి మిక్సీ పట్టాలి ∙ఈ పిండిని వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని కొంచెం కొంచెం నెయ్యి కలుపుతూ లడ్డూలు చేసుకోవాలి. (నెయ్యి వాడని వారు గోరు వెచ్చటి పాలతో కూడా లడ్డూలు చేసుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవు) ∙వీటిని ఎయిర్‌టైట్ కంటెయినర్‌లో పెట్టుకోవాలి. వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి
జొన్న ఉప్మా
కావలసినవి: జొన్న రవ్వ 1 కప్పు; కరివేపాకు – 1 రెమ్మ; ఉడికించిన కూరగాయ ముక్కలు – 1 కప్పు (క్యారెట్, బీన్స్); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి – 2; అల్లం తరుగు – 1 చెంచా; నూనె – 2 చెంచాలు; కొత్తిమీర తరుగు – 2 చెంచాలు; ఆవాలు – 1 చెంచా; జీలకర్ర – అర చెంచా; శనగపప్పు – 2 చెంచాలు; మినప్పప్పు – 1 చెంచా; ఇంగువ – చిటికెడు; ఎండుమిర్చి – 2, జీడిపప్పు – 10.
తయారి: ∙జొన్న రవ్వ దోరగా వేపుకుని పెట్టుకోవాలి ∙బాణలిలో నూనె తీసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో పోపు పెట్టుకుని, దీనికి ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు చేర్చి, మూడు కప్పుల నీళ్లు పోసుకుని, తగినంత ఉప్పు చేర్చి, బాగా మరగనివ్వాలి ∙నీళ్లు బాగా మరిగేటప్పుడు, రవ్వ చేర్చి బాగా కలియపెట్టుకుని, మూత పెట్టు్టకుని, సన్నని సెగమీద బాగా ఉడికేవరకు ఉడకపెట్టుకోవాలి. నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుంటే కమ్మదనం పెరుగుతుంది. వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేయండి. ఈ ఉప్మా ఏ చట్నీతోనైనా తినవచ్చు.
మార్పుచేర్పులు: పోపులో ఆకుకూర కూడా వేసుకోవచ్చు. కావాలకునేవాళ్లు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. దించబోయేముందు ఒక చెంచా నెయ్యి కలుపుకుంటే ఉప్మా రుచి పెరుగుతుంది. అన్ని రకాల చిరుధాన్యాల రవ్వలతో ఈ ఉప్మా తయారు చేసుకోవచ్చు.
రాగి రొట్టె
కావలసినవి: రాగుల పిండి – 1 1/2 కప్పు; ఉల్లిపాయ – 1; పచ్చిమిరపకాయలు – 2; కొత్తిమీర – 1 చిన్న కట్ట; ఆవాలు – 1 స్పూన్, జీలకర్ర – 1 స్పూన్; ఉప్పు – రుచికి సరిపడ, నూనె – తగినంత.
తయారి : ముందుగా రాగుల పిండిని బాణలిలో వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించిన తర్వాత ఈ మిశ్రమాన్ని, ఉప్పును పిండిలో కలుపుకోవాలి ∙ఇప్పుడు వేరే గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి ఈ వేడి నీళ్లను కొంచెం కొంచెంగా పిండిలో పోస్తూ గరిటెతో కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా చేతితో రొట్టెలా ఒత్తడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి ∙ఈ పిండిని మనకు కావలసిన సైజులో ఉండలుగా చేసుకుని ఒక ప్లాస్టిక్ కవరుపై నూనె రాసి చేతితో రొట్టెలా చేసుకోవాలి ∙స్టౌ పైన పెనం పెట్టి వేడయ్యాక, 1 స్పూన్ నూనె వేసి, కవరుపై చేసిన రాగి రొట్టెను జాగ్రత్తగా పెనంపై వేసి రెండు వైపులా కాలనివ్వాలి ∙వేడి వేడి రాగి రొట్టెలకు కొత్తిమీర పచ్చడి లేదా కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565