MohanPublications Print Books Online store clik Here Devullu.com

అహోబిలం_స్వామివారి ‘పెళ్లి పిలుపు!’_Ahobilam


స్వామివారి ‘పెళ్లి పిలుపు!’

లోకకల్యాణ కారకుడే, తన కల్యాణానికి రమ్మని పిలుస్తాడు. సాక్షాత్తూ... లక్ష్మీపతే భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. ఆహా... అహోబిలం పరిసరాల్లోని ఆ ముప్ఫై అయిదు గ్రామాల ప్రజలు ఎంత అదృష్టవంతులు!
పండగంటే ఒకరోజు, మహా అయితే మూడురోజులు. అహోబిలం పరిసరాల్లోని ముప్ఫై అయిదు గ్రామాల్లో మాత్రం... ఆ ఉత్సవాన్ని నలభై అయిదు రోజులు జరుపుకుంటారు. ఆ ఒకటిన్నర నెలా... ప్రతి ఇంట్లోనూ సందడే. ఆడపడుచులూ బంధుమిత్రులతో వూళ్లన్నీ కళకళలాడుతుంటాయి. ఎటు చూసినా బొమ్మల దుకాణాలూ గాజులూ చిరుతిళ్ల అంగళ్లే! కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువయ్యాడు. ఎంతో ప్రాచీనమైన పుణ్యక్షేత్రమిది. సింహరూపుడైన శ్రీహరి హిరణ్యకశిపుడిని సంహరించిన చోటు ఇదేనంటారు. బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవర్లు జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరదుడు పారువేటోత్సవాలకు సిద్ధమవుతారు.
ఉత్సవ చరిత్ర 
‘పరి’ అంటే గుర్రం. స్వామివారు క్రూరమృగాల్ని వేటాడేందుకు గుర్రంపై బయలుదేరడాన్నే పారువేట అంటారు. ప్రతీకాత్మకంగా... దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ దేవదేవుడు సాగించే పర్యటన అనుకోవచ్చు. ‘గ్రామ గ్రామానికీ నన్ను తీసుకెళ్లండి. నా పాదపద్మాల్ని ఆశ్రయించే అవకాశాన్ని భక్తులకు ఇవ్వండి’ అని స్వామి ప్రథమ పీఠాధిపతికి చెప్పినట్టు అహోబిల క్షేత్ర మహత్యంలో పేర్కొన్నారు. నా పెళ్లికి నేనే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని కూడా అన్నారట. ఆరువందల సంవత్సరాల క్రితం, ప్రథమ పీఠాధిపతి శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ స్వాముల వారు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. నాటి నుంచీ నేటి వరకూ పార్వేటోత్సవాలు 45 రోజుల పాటూ 35 గ్రామాల్లో నిర్విఘ్నంగా సాగుతాయి. ఆతర్వాత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గరుడోత్సవంతో (మార్చి 17) వేడుకలు పూర్తవుతాయి.

స్థానిక ఐతిహ్యం... 
హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరహరి... వీరావేశంతో నల్లమల అడవుల్లో సంచరిస్తుంటాడు. స్వామివారి ఉగ్రత్వం ఎంతకూ తగ్గదు. ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది. ప్రహ్లాదవరదుడు ఆమెను చూసి శాంతిస్తాడు, మనువాడాలని నిర్ణయిస్తాడు. అయితే చెంచులు, స్వామికి తమ ఆడపడుచును ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. పెళ్లి కూతురికి ఓలి (కట్నంగా) ఏమిస్తావని అడిగారు. ‘పారువేటోత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను’ అని స్వామి మాటిచ్చాడు. అలా, తన వివాహ మహోత్సవానికి సమస్త భక్తజనులనూ ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో సంచరిస్తాడు నరసింహుడు.
పారువేటోత్సవాలు... 
స్వామి పారువేటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో ‘తెలుపు’లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలుపు అంటే ‘తెలుపు.. ఎరుపు’ రంగులతో అలంకరించిన వేదిక. తెలుపు మంచి మనసును సూచిస్తుంది. ఇక్కడే స్వామి కొలువుదీరి పూజలందుకుంటాడు. ప్రతి గ్రామంలోనూ తెలుపులను సిద్ధం చేసే బాధ్యత వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతోంది. పల్లకీ మోసే బాధ్యత కూడా వారసత్వమే. తరాల నుంచీ ఆ కుటుంబాలవారే మోస్తున్నారు. వీరిని బోయీలంటారు. రుద్రవరం మండలం ఆలుమూరు, టి.లింగందిన్నెలకు చెందిన సుమారు 120 మంది నరసింహుని సేవలో తరిస్తున్నారు. స్వామి ఎగువ అహోబిలం నుంచి కిందికి వచ్చినప్పటి నుంచీ మళ్లీ కొండపైకి వెళ్లేంత వరకూ..ఆ ఆశ్రిత రక్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచీ వీరి కుటుంబాలు ఆ బాధ్యత మోస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతటి ఉన్నత విద్యావంతులైనా, ఎంత ఉన్నతోద్యోగులైనా స్వామి పల్లకీని ఒక్కరోజైనా మోయాలని పోటీపడతారు.
దర్శన భాగ్యం ఇలా... 
పారువేటోత్సవాల్లో భాగంగా స్వామి పల్లకి ఎగువ అహోబిలం నుంచి కిందికి దిగుతుంది. బాచేపల్లిలో ప్రారంభమై రుద్రవరం గ్రామానికి చేరడంతో ఉత్సవతంతు ముగుస్తుంది. ఆ 45 రోజులూ ప్రతి గ్రామంలోనూ పండుగే. స్వామి తమ వూరికి వచ్చాడంటే ప్రజలకు పట్టరాని ఆనందం. వ్యాపారులు వివిధ దుకాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క ఆళ్లగడ్డలోనే వేయి దుకాణాలు వెలుస్తాయి. రోజూ కనీసం రూ.25 లక్షల వ్యాపారం జరుగుతుంది. వారంలో దాదాపు రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ‘ఆరువందల ఏళ్లుగా... ఎలాంటి ఆటంకాలూ లేకుండా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదంతా స్వామి మహిమే’ అంటారు ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్‌. అహోబిలం.. నంద్యాల నుంచి అరవై కిలోమీటర్లూ, కర్నూలు నుంచి దాదాపు నూటనలభై కిలోమీటర్లు.
- గోదిని మల్లికార్జున, కర్నూలు డెస్క్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list