శ్రీ మల్లికార్జునస్వామి సమేత
కామాక్షితాయి ఆలయం
శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయికదా. దేవీ పూజలు, ఆలయాలలో అమ్మవారికి రకరకాల అలంకారాలతో అనేక అవతారాలలో అమ్మ దర్శనాలు, ఈ పది రోజులు ఎంతో సందడిగా వుంటుంది కదా. మరి ఈ సందర్భంగా మనం కూడా కొన్ని అమ్మవారి ఆలయాలను దర్శిద్దాము.
నెల్లూరుజిల్లాలో ప్రసిధ్ధి చెందిన శ్రీ మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయం నెల్లూరుకి 18 కి.మీ. ల దూరంలో వున్నది. స్కాంద పురాణంలో శ్లాఘించబడిన ఈ దేవతల ఆవిర్భావం కృతయుగంలో జరిగింది. ఆ కధ ఏమిటంటే….
ఆ కాలంలో ఋషీశ్వరులు, రాజులు, లోక కళ్యాణంకోసం యజ్ఞాలు చేసేవారు. ఒకసారి కశ్యప ప్రజాపతి ప్రజాక్షేమం కోసం ఒక యజ్ఞాన్ని చేయాలనుకుని తగిన ప్రదేశంకోసం వెతుకుతూ పినాకినీ నదీతీరాన వున్న ఈ ప్రాంతాన్ని చూసి యజ్ఞానికి అనువైన ప్రదేశమనుకుని ఇక్కడ తూర్పు, నైరుతి, వాయవ్యాలలో యజ్ఞకుండాలను స్ధాపించి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశాడు. ఈ యజ్ఞంమూలంగా అప్పుడు జరిగిన లోక కళ్యాణం సంగతి ఎలా వున్నా, ఇన్ని యుగాలయినా భక్తుల కోరికలు తీరుస్తూ, వారి కొంగు బంగారమై పూజలందుకుంటున్న మూడు దేవతామూర్తుల ఆవిర్భావం జరిగింది.
యజ్ఞం పూర్తయిన వెంటనే తూర్పున ప్రతిష్టింపబడ్డ ఆహవనీయాగ్నియందు శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీరంగనాధుడు ఆవిర్భవించాడు. ఆయనే ప్రస్తుతం నెల్లూరులోవున్న తల్పగిరి రంగనాధస్వామి. నైరుతిలోప్రతిష్టింపబడ్డ వైవస్వతాగ్నిలో శ్రీలక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువుతీరాడు. వాయువ్యానవున్న గార్హస్పత్యాగ్నియందు పరమశివుడు లింగాకృతిలో ఆవిర్భవించాడు. కశ్యప ప్రజాపతి మహాశివుణ్ణి అక్కడనే కొలువుండి ప్రజలను కాపాడమని ప్రార్ధించగా పరమశివుడు అంగీకరించాడు. అదే నాటి రజతగిరి. యజ్ఞము చేసిన ప్రదేశముగనుక యజ్ఞవాటిక, అదే కాలక్రమేణా జన్నవాడ, జొన్నవాడ అయింది.
కైలాసంలో పార్వతీదేవి శివుడు కనబడక తన మనోనేత్రంతో అసలు విషయం తెలుసుకుని తానూ అక్కడికి వచ్చి పరమశివుణ్ణి కైలాసానికి రమ్మని కోరింది. అందుకు శివుడు అత్యంత సుందరమైన ఆ ప్రదేశాన్ని వీడలేనని పార్వతీదేవినికూడా అక్కడే కొలువుతీరి భక్తుల కోర్కెలు తీర్చమని ఈశ్వరుడు ఆదేశించగా పార్వతీదేవి కూడా అక్కడే కొలువుతీరింది. ఇది పురాణగాధ. కాలక్రమంలో పినాకినీ నది (పెన్నా నది) వరదలలో ఈ ప్రదేశమూ, ఆలయమూ నీట మునిగాయి. మేటలు వేసి, బీళ్ళుగామారిన ఈ ప్రాంతంలో మనుమసిధ్ధి రాజుల పాలనా కాలంలో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి పశువులు ఇక్కడికి మేతకివచ్చేవి.
వాటిలో సమీప గ్రామమయిన పెనుబల్లి జమీందారుకి చెందిన ఒక ఆవు సరిగా పాలు ఇవ్వక పోవటంతో ఒకనాడు పశువుల కాపరి ఆ ఆవుని వెంబడించి, ఆ ఆవు ఒక పుట్టలోకి పాలను వదులుతూండటం చూసి, చేతిలోని గునపాన్ని విసిరాడు. ఆవు తప్పించుకుందిగానీ, గునపం పుట్టలోదిగి పుట్టనుంచి రక్తంరావటం మొదలయింది. అది చూసిన పశువుల కాపరి భయపడి పరుగున వెళ్ళి జమీందారుకి విషయం తెలియజేశాడు. వెంటనే జమీందారు ఆ ప్రదేశానికి చేరుకుని పనివాళ్ళతో ఆ పుట్టని తవ్వించగా రక్తపు మడుగులో శివలింగము కనిపించింది. జమీందారు వెంటనే ఆ లింగాన్ని పినాకినీ నది నీళ్ళతో శుభ్రపరిచి, ఆ పరిసరాలన్నీ శుభ్రంచేయించి, లింగానికి పూజలు జరపటానికి ఒక బ్రాహ్మణుణ్ణి నియమించాడు.
కొన్నాళ్ళకి శివుడు జమీందారు కలలో కనిపించి తనకి శిరోవేదనగావున్నదనీ, మల్లెపూవుల చల్లదనంతో తన శిరో వేదన తీర్చమని ఆదేశించాడుట. జమీందారు తన కలని గురించి పెద్దలకి తెలియజేసి, తన తోటలోని మల్లెపూవులతో శివుణ్ణి అర్చించాడుట. అప్పటి పండితులు ఆలోచించి మల్లెపూవులతో పూజించమని శివుడు ఆజ్ఞాపించాడుగనుక, మల్లెపూవుల నడుమ విలసిల్లుతున్న ఆ దేవదేవునికి మల్లికార్జునుడని పేరుపెట్టారు.
మరికొంతకాలము తర్వాత పార్వతీదేవి ఆ జమీందారుకి స్వప్న దర్శనమిచ్చి తాను వస్తున్నానని, తనని పరమేశ్వరుని చెంత ప్రతిష్టించమని ఆదేశించింది. తర్వాత ఒకనాడు పెనుబల్లి గ్రామ సమీపంలో పినాకినీ నదిలో చేపలు పడుతున్న బెస్తవారికి అమ్మవారి విగ్రహం కనబడింది. వారు అమిత సంతోషంతో ఆ తల్లిని గంగమ్మతల్లిగా భావించి తమకు చేతయిన విధంగా పూజించి, తమకు లభించిన ఆహారాన్ని ఆ తల్లికి నివేదించి తాము తినసాగారు. (అందుకే ఇప్పటికీ ఈ ఆలయంలో సంకల్పంలో గంగా, కామాక్షీ అనుగ్రహసిధ్ధ్యర్ధం అని చెబుతారు). జమీందారుకి ఈ విషయం తెలిసి అక్కడికివెళ్ళి, తన కలసంగతి చెప్పి, వారి అంగీకారంతో అమ్మవారినితెచ్చి స్వామి దగ్గర ప్రతిష్టించారు. అమ్మవారి విగ్రహం పెనుబల్లి సమీపంలో దొరికిందికనుక అమ్మవారిని పెనుబల్లి ఆడబడుచుఅని, ఈనాటికికూడా బ్రహ్మోత్సవాలలో కళ్యాణంనాడు అమ్మవారికి ఆ గ్రామమునుంచి సారె తీసుకువస్తారు. కళ్యాణం తర్వాత అమ్మవారు ఊరేగింపుగా ఆ గ్రామానికి వెళ్తారు.
అమ్మవారిని శివుని పక్కన ప్రతిష్టించిన తర్వాత ఆలయంలో బ్రాహ్మణుడు నివేదన చేస్తే బయట పామరులయిన భక్తులు తాము వండుకున్న మాంసాదులు నివేదించేవారు. ఆ నివేదనలు అలవాటుపడ్డ అమ్మవారు మాంసాహార నివేదన లేని రోజు అర్ధరాత్రి ఊరిలో ప్రవేశించి పశువులను ఆరగించటం మొదలుపెట్టింది. భయపడిన భక్తులు రాత్రిళ్లు ప్రాణాలరచేతిలో పెట్టుకుని బతికేవారు.
ఆ సమయంలో ఆది శంకరాచార్యులు ఆ గ్రామానికి విచ్చేశారు. గ్రామస్తులద్వారా అమ్మవారి ఆగడాలు విన్న శంకరాచార్యులవారు ఆలయం తలుపులు తెరిపించి రాత్రికి అక్కడే విశ్రమించారు. అర్ధరాత్రి బయటకు వెళ్ళబోతున్న అమ్మని ప్రార్ధించి, అనేక విధముల స్తోత్రములు చేసి, శాంతపరచి, తిరిగి గర్భగుడికి చేర్చారు. అమ్మ ఉగ్ర రూపాన్ని శాంత రూపంగా మార్చటానికి తన తపశ్శక్తిని ధారపోసి ఒక శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాలచెంత ప్రతిష్టించారు.
తన ధ్యానములో కృతయుగములో అమ్మవారు స్వామిని చూడవలెనని కోరికతో కైలాసమునుంచి వచ్చి ఇచ్చట కొలువుతీరిన వృత్తాంతము, తరువాత జరిగిన విషయములు గ్రహించి, స్వామిని చూడవలెననే కోరికతో వచ్చినది కావున ఆనాడే పరమేశ్వరుడు కామాక్షీ అని పిలిచిన పలుకులు గ్రహించి, అమ్మకి కామాక్షీతాయి అని నామకరణము చేశారు. తాయి అంటే అమ్మ అని అర్ధము. ఆది శంకరాచార్యులవారు కాలడివారు, జన్నవాడ ఆ కాలములో మదరాసు ప్రాంతములో వున్నది కనుక తాయి అని అనివుండవచ్చు.
ఆది శంకరులవారు కొంతకాలము అక్కడే వుండి అమ్మవారికి మాంసాహరము పూర్తిగా నిషేధించి, పైదీక మార్గమున శ్రీచక్రమును నవావరణములతో పూజించే విధానాన్ని అక్కడి బ్రాహ్మణులకు బోధించారు. అప్పుడు గ్రామస్ధులు ఆదిశంకరులవారిని “అయ్యా, మేము మాసాహారులం, ఏ ఆహారమైనా భగవంతునికి చూపించిన తరువాత భుజించాలి అంటారు..మరి మేము తినే ఆహారము అమ్మవారికి చూపించకూడదు అంటున్నారు..దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి” అని అడిగారు. అందుకు శంకరాచార్యులవారు దేవాలయమునకి సమీపములోవున్న వేపమానును చూపించి దీనిని కనకదుర్గ అవతారముగా భావించి, మీ నైవేద్యములు ఇక్కడ సమర్పించుకోండి అని చెప్పి తమ యాత్రని కొనసాగించారు.
కొంతకాలం తర్వాత పల్లవరాజు నరసింహవర్మ తురుష్కలమీద దండయాత్రకి వెళ్తూ తోవలో
ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారు నరసింహవర్మకు స్వప్న దర్శనమిచ్చి, నీకు యుధ్ధములో విజయం చేకూరుతుంది, తిరుగు ప్రయాణంలో ఈ ఆలయాన్ని పునరుధ్ధరించమని ఆదేశించారు. యుధ్ధములో విజయము సాధించిన పల్లవరాజు తిరుగు ప్రయాణంలో ఈ దేవాలయమును దృఢముగా నిర్మింపచేసి, దేవీ కైంకర్యమునకు అనేక భూములను దానము చేసెను.
సంతానము లేనివారు ఈ ఆలయములో నిద్ర చేస్తే అమ్మ స్వప్న సాక్షాత్కారమిచ్చి వారి కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం.
ఈ దేవాలయంలో జరిగే నవావరణ పూజ బీజాక్షరములతో వుంటుంది. కొన్ని తరముల క్రితం సాక్షాత్తూ అమ్మవారిచేత గుడిలోని ప్రధాన పూజారికి ఉపదేశింపబడిన బీజాక్షరముల సంపుటీకరణమే ఈ నవావరణయని ప్రసిధ్ధి. ఈ పూజ ప్రపంచంలో కేవలం ఈ దేవాలయమునందుమాత్రమే జరుపబడుతుంది. ఈ పూజకి ఎంతో శక్తి వున్నదని భక్తుల నమ్మకం. అమ్మవారికి ఈ పూజ అంటే ఎంతో ప్రీతి అని ఇక్కడికి వచ్చే భక్తులు ఈ పూజ జరిపించుకుంటారు.
ఇక్కడ శివాలయంలో శివునికి జరిగే సహస్రనామం కూడా సాక్షాత్తూ వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి వేదములలోని సారమంతా క్రోడీకరించి సహస్రనామాలుగా ఉపదేశించారని ప్రతీతి. ఈ సహస్రనామ పూజ వలన నాలుగు వేదములు పారాయణ చేసినంత ఫలితం వస్తుందిట. ఈ సహస్రనామం వేరే ఏ దేవాలయంలో జరుగదు. వ్రాత ప్రతి తప్ప ఏ గ్రంధములోను ఈ సహస్రనామం లేదు. దీనిని ఇక్కడి అర్చకులు ఎవరికి చెప్పరు. అది వారి నియమము.
ఇన్ని విశేషాలు వున్న ఈ ఆలయాన్ని అవకాశం వున్నవారు తప్పక దర్శించాలి.
దర్శన సమయాలు ఉదయం 6-30 నుంచి మధ్యాహ్నం 1-00 గం. దాకా తిరిగి సాయంత్రం 5-00 గం. ల నుంచి రాత్రి 9-00 గం. ల దాకా. -పి.యస్.యమ్. లక్ష్మి
Boost Post
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565