అందానికి గంధం...
సహజంగా లభించే గంధంలో చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో ఉన్నాయి. వాటిల్లో మొటిమల్ని అదుపులో ఉంచడం, చర్మఛాయను మెరుగుపరచడం వంటివి కొన్ని...మరి ఇంతకీ ఎలా ఉపయోగిస్తే మంచిదంటే...
తరచూ ఎండలో తిరగడం వల్ల దుమ్మూ, ధూళి వంటివాటివల్ల చర్మం పొడిబారినట్లుగా, గరకుగా మారుతుంది. దీనికి పరిష్కారంగా గంధం చక్కని ఫలితాన్నందిస్తుంది. పాలతో గంధం చెక్కను అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి సవ్య, అపసవ్య దిశల్లో మర్దన చేయాలి. చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. కాంతిమంతంగా కనిపిస్తుంది.
* ముఖంపై మొటిమల తాలూకు మచ్చలు టీనేజీ అమ్మాయిల్ని కలవరపెడుతుంటాయి. ఇలాంటివారు గంధపొడిలో చెంచా పాలు, రెండు చుక్కల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఆరాక కొన్ని నీళ్లు తీసుకొని తడుపుతూ మృదువుగా మర్దన చేయాలి. తరవాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా దూరమవుతుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది.
* సూర్యకిరణాల తాకిడికి ఎండతగిలే శరీరభాగాలు రంగు మారుతుంటాయి. ఇలాంటప్పుడు పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. దీన్ని అరగంట పాటు ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా కనీసం రెండు మూడు రోజులకోసారైనా చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
* బ్లాక్‌హెడ్స్, యాక్నే వంటి సమస్యలు కొందరిని వేధిస్తుంటాయి. ఇలాంటప్పుడు గంధంపొడిలో చెంచా పసుపు, కర్పూరం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. ఒకవేళ మొటిమలు, బ్లాక్‌హెడ్స్ సమస్యలు అధికంగా ఉన్నప్పుడు మాత్రం రాత్రి పడుకోబేయే ముందు రాసుకొని ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి.
హెల్త్ టిప్స్
పంటి నొప్పి తగ్గాలంటే ఒక స్పూను దాల్చినచెక్క పొడిలో ఐదు స్పూన్ల తేనె కలిపి నొప్పి ఉన్న చోట పెట్టాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇవి లేకపోతే... లవంగాన్ని కొద్దిగా చిదిమి నొప్పి ఉన్నచోట అదిమినట్లు పెట్టి కొద్దిసేపు అలాగే ఉంచాలి.
శ్వాస తాజాగా ఉండాలంటే ఉదయం పళ్లు తోముకున్న తరువాత ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూను తేనె, ఒక స్పూను దాల్చిన చెక్క కలిపి ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. ఉదయం ఒకసారి ఇలా చేస్తే రోజంతా నోరు శుభ్రంగా ఉండి దుర్వాసన దరి చేరదు.కఫంతో కూడిన దగ్గు బాధిస్తుంటే... గోరువెచ్చటి పాలలో చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి.
మౌనం మంచిదే... కానీ?
ఆత్మీయం
మాట వెండి అయితే, మౌనం బంగారం అని ఆంగ్లంలో ఓ సామెత ఉంది. బంగారానికి నానాటికీ విలువ పెరిగినట్టుగానే మౌనానికి కూడా విలువ పెరుగుతుందే కాని తరగదు. మౌనం వల్ల శరీరక్రియ క్రమబద్ధమై ముఖం తేజోవంతమయ్యి, చుట్టూ కాంతి వలయం కనపడుతుంది. మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. మౌనం మానవుని ఆయుష్షును పెంచడమే కాక ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అందుకే మునులు అందరి మన్ననలు పొందారు. మృతులకు ఆత్మశాంతి కలిగించేందుకు రెండు నిమిషాలు మౌనం పాటించడం మనకు తెలిసిందే! పుస్తకం పెదవి విప్పకుండా మౌనంగానే పుటలకొద్దీ విలువైన సమాచారాన్ని బోధిస్తుంది.
అయితే... మాట్లాడటం ఒక అందమైన కళ. మౌనం అంతకన్న అద్భుతమైన కళ అని గాంధీ మహాత్ముడంటే, మాట్లాడటం ద్వారా శక్తిని వృథా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చునని స్వామి వివేకానంద బోధించారు. ఎందుకంటే మనస్సుని భౌతిక ప్రపంచం వైపు వెళ్లకుండా పరమాత్మలో లీనం చేసేదే నిజమైన మౌనం. మౌనం వల్ల అజ్ఞానం నశిస్తుంది. అంతఃకరణ శుద్ధి అవుతుంది. ధనాత్మక శక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యోగా తరగతులు బోధించేటప్పుడు మౌనంగా ఉండటం వల్ల ఒనగూరే లాభాలను కూడా తప్పనిసరిగా చెబుతారు.
ప్రకృతిని గమనిస్తే వృక్షాలు, పశు, పక్షి, జంతుజాలాదులన్నీ మౌనంగానే పుడతాయి, పెరుగుతాయి, ఫలదీకరణ చెందుతాయి. లోకాలను చుట్టి వచ్చే ఆదిత్యుడు, తారాచంద్రులు మౌనంగానే సంచరిస్తూ, మౌనంగానే తమ విధులను నిర్వహిస్తున్నారు. ఆత్మదర్శనానికి మౌనదీక్ష తప్పనిసరి! అలాగని అన్ని వేళల్లోనూ మౌనాన్నే ఆశ్రయించడం సరికాదు. ముఖ్యంగా నేరనిర్థారణ సందర్భాల్లో నేరస్థుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది కాబట్టి ఆ సమయంలో మౌనాన్ని ఆశ్రయించరాదు.
►నేరనిర్థారణ సందర్భాల్లో నేరస్థుడు మౌనం వహిస్తే నేరం అంగీకరించిన భావం వస్తుంది.
మేలు పండు
మేడిపండ్లను నీడలో ఎండించి చూర్ణం తయారు చేసుకోవాలి. ఆ చూర్ణానికి సమాన మోతాదులో చక్కెర కలిపి 10 గ్రాముల పరిమాణంలో ప్రతిరోజూ సేవిస్తే, రక్తదోషాలు తొలగిపోవడంతో పాటు, రక్తశుద్ధి, రక్తవృద్ధి కలిగి చర్మం కాంతివంతమవుతుంది.
మేడిపండ్ల చూర్ణాన్ని ప్రతి రోజూ పడుకునే ముందు తీసుకున్నా, తరుచూ మేడిపండ్లును తింటూ ఉన్నా మలబద్ద సమస్య ఉండదు.
60 గ్రాముల మేడి చెట్టు బెరడును నలయగొట్టి, 2 గ్లాసుల నీటిలో వేసి అరగ్లాసు అయ్యే వరకు మరగించాలి. ఆ తర్వాత వడబోసి, అందులో ఒక స్పూను తేనె కలిపి ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
60.మి.లీ. మేడి పండ్ల రసంలో అరస్పూను కరక్కాయ పొడి కలిపి ప్రతి రోజూ రెండు పూటలా సేవిస్తే నడుము నొప్పి తగ్గుతుంది.
మేడి బెరడు చూర్ణానికి సమానంగా పటిక బెల్లం కలిపి తులం మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే స్త్రీలలోని గర్భాశయ, జననాంగ సమస్యలతో పాటు, తెల్లబట్ట తగ్గుతుంది.
60 మి.లీ. మేడిపండ్ల రసంలో కొద్దిగా తేనె చేర్చి సేవిస్తూ, పాల అన్నం మాత్రమే తింటూ ఉంటే, అధిక రుతుస్రావం సమస్య తగ్గుతుంది.
గర్భస్రావం అయ్యే స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత మేడి బెరడు కషాయంలో బార్లీపిండి, పటిక బె ల్లం కలిపి తాగుతూ ఉంటే గ ర్భం నిలుస్తుంది.
250 మి.లీ. మేడి చెక్క కషాయంలో 3 గ్రాములు పొంగించిన పటిక చూర్ణం కలిపి పుక్కిలిస్తూ ఉంటే నోటి పుండ్లు మానిపోతాయి.
ఒత్తిడిని తగ్గిస్తాయివి!
ప్రస్తుత పరిస్థితుల్లో జీవితం ఉరుకుల పరుగులమయంగా మారింది. ఓపికను పరీక్షించే ట్రాఫిక్, ఆరోగ్యంతో ఆడుకునే కాలుష్యం... ఆఫీస్‌లో డెడ్‌లైన్‌లూ, ఇలా ప్రతిదీ మన ఒత్తిడిని పెంచేసేవే!. మరేం చేయాలంటారా... కొన్ని పదార్థాలు తీసుకోవడంతో ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
నేరేడుపళ్లు: వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లూ, ఫైటో న్యూట్రియంట్లూ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి ఒత్తిడిని తగ్గించమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తినీ అందిస్తాయి.
పాలు: వీటిలో యాంటీఆక్సిడెంట్లూ, బి2, బి12 విటమిన్లూ, మాంసకృత్తులూ, క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పాలలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దాంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి ప్రతిరోజూ గ్లాసు పాలు తప్పనిసరిగా తాగడం అలవాటు చేసుకోవాలి.
బాదం: వీటిలో బి2, ఈ విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది ఒత్తిడీ, వ్యాకులతకు కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది. ఆలస్యమెందుకు ప్రతిరోజూ ఓ గుప్పెడు బాదం పప్పును తినేయండి మరి.
కమలాపండు: ఇది విటమిన్‌సికి కేరాఫ్ అడ్రస్ లాంటిది. ఇందులో ఎక్కువమొత్తంలో ఆ పోషకం ఉంటుంది. ఇది కూడా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. దాంతోపాటు కార్టిసోల్ హార్మోను ప్రభావాన్నీ తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయంపూట ఒక్క పండు తింటే చాలు.
చేపలు: వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ స్థాయులను నియంత్రిస్తాయి. కాబట్టి వారంలో రెండుసార్లు మీనాలను తింటే మంచిది.
బ్యూటిప్స్
సెన్సిటివ్ స్కిన్ వాతావరణంలోని మార్పులను భరించడం కష్టం. ఏ చిన్న తేడా వచ్చినా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇటువంటి చర్మాన్ని కాపాడుకోవడానికి వాడాల్సిన టోనర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎనిమిది చుక్కల పచౌలీ ఆయిల్ (ఇది పుదీనా కుటుంబానికి చెందింది, అరోమా థెరపీలో వాడతారు. బ్యూటీ ప్రొడక్ట్స్ దొరికే షాపుల్లో ఉంటుంది) ఒక టీ స్పూను గ్లిజరిన్, ఆరు టేబుల్ స్పూన్ల పన్నీరు తీసుకోవాలి. పచౌలీ ఎసెన్షియల్ ఆయిల్‌లో గ్లిజరిన్ వేసి పూర్తిగా కలిసిన తర్వాత పన్నీటిని వేసి కలపాలి. దీనిని రాత్రి పూట చర్మానికి పట్టించాలి. ఈ టోనర్‌ను రోజూ చర్మానికి పట్టిస్తుంటే చర్మం ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
సహజమైన మాయిశ్చరైజర్‌లలో అరటి పండు ఒకటి. పొడి చర్మానికి ఈ ప్యాక్ బాగా పని చేస్తుంది. బాగా పండిన అరటి పండు ఒకటి, పావు కప్పు పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకుని బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసి అరగంట తర్వాత చన్నీటితో కడగాలి. పెరుగు, తేనె లేకున్నా అరటి పండుని మాత్రమే పేస్టు చేసి ప్యాక్ వేసుకోవచ్చు.క్లోరినేటెడ్ వాటర్‌లో స్విమ్మింగ్ చేసినప్పుడు జుట్టు పొడిబారి రంగు మారి పోతుంటుంది. అప్పుడు గోరు వెచ్చటి నీటిలో ఏడెనిమిది యాస్పిరిన్ టాబ్లెట్లు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే జుట్టుకు ముందున్న రంగు వస్తుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565