సాయం చేసే చేతులే మిన్న!
శ్రీకృష్ణుని అవతార సమాప్తి అనంతరం దిక్కుతోచని స్థితిలో వున్న ధర్మరాజు నారదాది మునుల సూచన మేరకు స్వర్గానికి వెళ్ళడానికి అంగీకరించాడు. ఇంద్రుని ఆదేశానుసారం దేవదూత ధర్మరాజును తన వెంట గైకొని స్వర్గమార్గంలో పయనించాడు. నారదుడు ధర్మరాజుతో సహా స్వర్గ ప్రవేశం గావించాడు. తన వాళ్ళను చూపమని కోరగా ముందుగా దుర్యోధనుని చూసిన ధర్మరాజు తీవ్ర అసహనానికి గురయ్యాడు. దుర్యోధనునికి స్వర్గ ప్రవేశం ఎలా సాధ్యం అయినదో తెలియక తన మనసులోని ఆందోళనను స్పష్టంగా బహిర్గతం చేశాడు.
తనకు అత్యంత ప్రియసోదరులైన భీమ, అర్జున, నకుల సహదేవులను, ధర్మపత్నియైన ద్రౌపదిని తదితర బంధు జనాన్ని చూపించమని ధర్మజుడు కోరగా తనతో పాండవాగ్రజుని తీసుకుని వెళ్ళదలచిన దేవదూత స్వర్గానికి తాము ఉన్న అతి భయంకర వాతావరణంతో కూడిన జుగుప్సాకర ప్రదేశానికి చేరగా అత్యంత భయంకర శిక్షలతో కూడిన హాహాకారాలతో, కత్తులతో నిర్మితమైన వంతెనను కలిగిన వైతరిణినది పరిసర ప్రాంతములనుండి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అత్యంత వేడిమితో కూడిన విషపూరిత అగ్నిజ్వాలలతో భీభత్స రస ప్రాధాన్యతకు అసలైన చిరునామాగా పరిగణించుటకు అన్ని అర్హతలున్న ఆ ప్రదేశంలో కనుల ముందు జరుగుతున్న వింత సన్నివేశాలను చూసి అయోమయ స్థితిలోనున్న ధర్మరాజు ఆ పరిసర ప్రాంతములను పరికించి చూస్తూ ముందుకు కదులుతుండగా ‘సోదరా! ఇక్కడ నుండి కదలకు.. నీ శరీరంను తాకిన వాయువు మమ్ములను స్పర్శించుటచే మేము అనుభవించుచున్న శిక్షల తాలూకు హింసలతో కూడిన బాధలనుండి చెప్పనలవి కానంత ఉపశమనం పొందే అవకాశం కలిగింది. మా మొర ఆలకించి నువ్వు ఇక్కడనే ఉండిపో.. నువ్వు ఇక్కడనుండి మమ్ములను విడిచి వేరొక చోటికి వెళ్లినట్లయితే మేము వర్ణనాతీతమైన బాధలను అనుభవించక తప్పదు అన్న మాటలు ధర్మనందుని చెవిన పడగా బాధతో కూడిన ఆ మాటలు పలికిన అదృశ్యరూపులు కర్ణ, అర్జున, భీమాది సోదరులని గ్రహించిన ధర్మరాజు తన ఆత్మీయుల కోరికను అనుసరించి ఆ ప్రాంతమునందే ఉండటానికి మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. త్యాగశీలియైన పాండవాగ్రజుడు ఆ ప్రాంతమును వీడక అక్కడనే ఉండవలెనని నిశ్చయించుకున్న వైనాన్ని తెలుసుకున్న ఇంద్ర యమధర్మరాజాది అష్టదిక్పాలకులు, సిద్ధ, సాధ్య మునిగణాది జ్ఞాన సంపన్నులు ధర్మరాజు వద్దకు చేరుకున్నారు. అపకారికి సైతం ఉపకారం చేసే సద్గుణ శీలురైన తన ప్రాణ సోదరులకు నరకలోకం ప్రాప్తించిన విషయాన్ని జీర్ణించుకోలేక, ఇంతకుముందు స్వర్గసుఖాలను అనుభవిస్తున్న దుర్యోధనుడు తనను వెక్కిరిస్తూ ఉన్నట్లుగా అనిపించిన చేదు అనుభవాన్ని మది నుండి తొలగించనలవి కాక సతమతమవుతున్న ధర్మరాజు మనఃస్థితిని గమనించిన ఇంద్ర యమధర్మరాజాదులు పాండవాగ్రజుని మనసులోని అయోమయ స్థితిని తొలగించి ఆ సత్త్వగుణ సంపన్నుని స్వర్గంలోనికి ప్రవేశింపజేయ తలపెట్టిన వారై... ఒక్కొక్కరుగా ధర్మరాజునుద్దేశించి తనదైన శైలిలో మధుర భాషణ గావించారు.
పాండవాగ్రజునితో ‘‘్ధర్మరాజా! ఇప్పటివరకు నిన్ను మూడుసార్లు పరీక్షించాను. తొలిసారి అరణ్యవాసాంతంలో ద్వైతవనంలోవ యక్షుని రూపంలో నీ కడకు వచ్చి యక్షప్రశ్నల నెపమున నిన్ను పరీక్షించగా నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ అద్భుతమైన రీతిలో నువ్వు సమాధానం చెప్పిన తీరు నన్ను నివ్వెరపరచినది. ప్రధమంగా ఆ రోజు నా పరీక్షలో నెగ్గిన నిన్ను రెండవసారి పరీక్షించగా కుక్కను బయట విడిచిపెట్టి స్వర్గంలో ప్రవేశించే ప్రసక్తే లేదని, కుక్క, నక్క.. ఇలా ఏ జీవిలో వున్న ఆత్మ, మానవునిలో ఉన్న ఆత్మ వేరు కాదని.. ఆత్మతత్త్వాన్ని చక్కగా బోధించడమేకాక ఆచరణలో సఫలీకృతమై నా పరీక్షను మరో పర్యాయం ఎదుర్కొని నీ నామాన్ని సార్థకం చేసుకున్నావు.
ఇక మూడవసారి నిన్ను పరీక్షించదలచి స్వర్గంలో వున్న దుర్యోధనుని వద్దకు నిన్ను తీసుకుని వెళ్లగా నీ మనసులో ఎలాంటి భావాలు ఉత్పన్నమయ్యాయో నేను ప్రత్యేకంగా చెప్పదలచుకోలేదు అన్న యమధర్మరాజు -
పుణ్యకార్యాలు అధికంగా చేసి, పాపపు పనులు తక్కువగా చేసిన జీవులు ప్రథమంగా నరకంలో శిక్షలను అనుభవించి తదుపరి దీర్ఘకాలం స్వర్గంలో ఉండే అవకాశాన్ని పొందుతారని, ఇందుకు భిన్నంగా ప్రవర్తించిన జీవులు ముందుగా స్వర్గ సుఖాలను, పిమ్మట దీర్ఘకాలం నరకలోక శిక్షలను చవిచూసే దుర్భర పరిస్థితి ఉంటుందని ..ఇలా ఎన్నో స్వర్గ నరకలోక ప్రవేశ రహస్య విశేషాలను ధర్మనందనుడికి వివరించి ఆ కుంతీనందనుని హృదయక్షేత్రంలోని అనుమాన బీజాలను సంపూర్ణంగా తొలగించారు. ఇంద్ర యమాదులు. సందేహాలను తొలగిన ధర్మరాజు ఆకాశగంగలో ముమ్మార్లు మునిగి పైకి లేచి తదుపరి స్వర్గలోకంలోనికి ప్రవేశించి ఇంద్ర- యమ - సిద్ధ సాధ్య మునిగణ సమూహాన్ని ఎంతగానో ఆనందింపజేశాడు ధర్మరాజు.
-అల్లాడి వేణుగోపాల్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565