బలహీనులు!..బలవంతులు!!
ధర్మపథం
ఒక దేశం గానీ, సమాజం గానీ, కుటుంబం గానీ, ఊరు గానీ.. ఐకమత్యంగా ఉంటేనే బలంగా ఉంటాయి. ఐక్యమత్యం లోపించినది ఏదైనా అంతరించి పోతుంది. కాలగతిలో కనుమరుగైపోతుంది.
వ్య క్తి కంటే సంఘ బలమే గొప్పదని బుద్ధుడు ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. కుల, మత, ప్రాంత భేదాలు సమాజాన్ని బలహీనపరుస్తాయని పదే పదే హెచ్చరించేవాడు. ‘బహుజన హితాయ.. బహుజన సుఖాయ’ అనేది బౌద్ధ ధర్మం. పక్షులన్నీ కలిసి ఒకే మాట మీద ఉంటే తాము చిక్కిన వలను కూడా ఎత్తుకుపోగలవు! అలా కాకుండా తమలో తాము గొడవలు పడితే.. అందరూ బలైపోతారు అని ఉదాహరణగా ఎన్నో కథలు చెప్పాడు. ఈ విధంగా ఆయన కాలంలో గ్రామాల మధ్య, గణాల మధ్య, రాజుల మధ్య చెలరేగిన ఎన్నో యుద్ధాల్ని ఆపాడు బుద్ధుడు. తన ప్రబోధంతో వారి మధ్య శాంతినీ, మైత్రినీ నెలకొల్పాడు.
ఐకమత్యం ఎంత గొప్పదో చెప్పే కథ ఇది..
ఒకసారి వారణాసి సమీపంలోని ఓ గ్రామంలో.. ప్రజల మధ్య గొడవలు రేగాయి. ఆ విషయం తెలిసి బుద్ధుడు తన భిక్షు సంఘంతో అక్కడికి వెళ్లాడు. ఆ రాత్రి ఆకాశంలో మేఘాలు కమ్మాయి. పెను గాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో కుండపోతగా వాన కురిసింది. తెల్లారేసరికి వర్షం తగ్గిపోయింది. రాత్రి వీచిన పెనుగాలికి ఊరు చివరన ఉన్న మర్రిమాను ఒకటి కూలిపోయిందనే విషయం తెలిసింది. వందలాది ఊడలు దిగిన మహావృక్షం అది. గ్రామస్థులంతా కూలిపోయిన చెట్టు దగ్గరికి చేరుకున్నారు. ఆ ఊరికి దూరంగా ఒక మామిడి తోట ఉంది. ఆ తోటలో చెట్లు మరీ అంత పెద్దవి కావు. బలమైవీ కావు. కానీ, ఆ తోటలోని చెట్లలో ఏ ఒక్కటీ కూలిపోలేదు. అప్పుడు బుద్ధుడు.. ‘గ్రామస్థులారా! చూశారా! ఈ కూలిపోయిన మహావృక్షం ఒంటరిగా ఉంది. ఆ తోటలోని చెట్లన్నీ కలసి మెలసి ఒకేచోట ఉన్నాయి. ఒంటరి బలశాలి కన్నా... ఒక్కటిగా కలిసి ఉన్న బలహీనులు బలమైన వారు. వ్యక్తి కంటే సమాజం బలమైనది. సంఘం బలమైనది. మీరూ అలాగే కలసి మెలసి ఉండండి. అలా ఉన్నంత కాలం.. మీరు బలవంతులే!’’ అని చెప్పాడు. ఐకమత్యంలో బలం వారికి అర్థమై.. గొడవలు మాని.. చక్కగా కలసి జీవనం కొనసాగించారు.
-బొర్రా గోవర్ధన్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565