#వినాయకి గురించి విన్నారా!
ఆంజనేయునిలాగానే వినాయకుడు కూడా ఘోటక బ్రహ్మచారి అని ఒక నమ్మకం. అయితే చాలా సందర్బాలో ఆయనకు ధర్మపత్నిగా వేర్వేరు దేవతల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఉత్తరాదిలో ఆయనను సిద్ధి, బుద్ధి అనే దేవతా సమేతంగా ఆరాధించడం కనిపిస్తుంది. అక్కడక్కడా వృద్ధి అనే మరో దేవత పేరు కూడా గణపతి ధర్మపత్నిగా వినిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే లక్ష్మీ లేదా సరస్వతీదేవి వినాయకునికి తోడుగా కనిపిస్తారు. కానీ చాలా అరుదుగా వినాయకి అనే సహచరి పేరు కూడా వినిపిస్తుంది. ఆ విశేషాలు...
వేల ఏళ్ల క్రిందటే!
గణేశుని స్త్రీ రూపం అయిన వినాయకి ప్రతిమలు వేల సంవత్సరాల నుంచే ప్రాచుర్యంలో ఉన్నాయి. రాజస్థాన్‌లో లభించిన క్రీస్తుపూర్వం నాటి ఒక వినాయకి టెర్రకోట ప్రతిమను ఇందుకు ఉదాహరణగా చెబుతూ ఉంటారు. వినాయకికి సంబంధించి ప్రత్యేక ఆలయాలు లేనప్పటికీ సుచీంద్రం, చెరియనాడ్ వంటి ప్రాచీన ఆలయాలలోని గోడల మీద వినాయకి శిల్పాలు కనిపిస్తాయి.
పురాణాలలో ప్రస్తావన
వినాయకి గురంచి జనబాహుళ్యంలో పెద్దగా ప్రచారం లేనప్పటికీ, పురాణాలలో మాత్రం ఈమె ప్రస్తావన తరచూ కనిపిస్తుంది. స్కాంద, మత్స్య, వాయు, లింగ పురాణాలలో వినాయకి గురించి కబుర్లు వినిపిస్తాయి. కొన్ని కథల ప్రకారం వినాయకి తొమ్మిదిమంది మాతృకలలో ఒకరు. మరికొన్ని కథనాల ప్రకారం ఆమె 64మంది యోగినిలలో ఒకరు. వినాయకికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, స్పష్టమైన కథనం మాత్రం అంధకాసురుని వధ సందర్భంగా వినిపిస్తుంది.
అంధకాసురుని వధ
పరమేశ్వరుడు ఒకనొకప్పుడు లోకకంటకుడైన అంధకాసురుడు అనే రాక్షసుని వధించడానికి బయల్దేరాడు. కానీ అంధకాసురునికి ఒక చిత్రమైన వరం ఉంది. అదేమిటంటే... అతని రక్తం నేల మీద పడగానే, ప్రతి ఒక్క రక్తపు బొట్టు నుంచి ఒకో అంధకాసురుడు ఉద్భవిస్తాడు. అలా అంధకాసురుని రక్తం నేల మీద పడకుండా చూడటానికి ప్రతి ఒక్క దేవతా నుంచీ స్త్రీ స్వరూపాలు వెలికివచ్చాయట. అలా వినాయకుని నుంచి వెలికి వచ్చిన స్త్రీ తత్వమే వినాయకి.
ఆరాధన
గజానని, గణేశని, విఘ్నేశ్వరి... ఇలా వినాయకికి వివిధ పేర్లు కనిపిస్తాయి. చాలా సందర్భాలలో ఆమెకూ వినాయకునికీ మధ్య స్పష్టమైన సంబంధం చెప్పనప్పటికీ, ఆమె రూపం మాత్రం అచ్చు వినాయకునిలాగే ఉండటం విశేషం. పరశు, గొడ్డలి, మోదకాలను ధరించిన వినాయకి రూపమే ప్రాచీన శిల్పాలలో కనిపిస్తుంది. వినాయకిని విఘ్నాలకు అధినేత్రిగా భావిస్తారు. స్త్రీ దేవతలకు అధికంగా ప్రాధాన్యతను ఇచ్చే తాంత్రిక ఆచారాలలో వినాయకి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతిలోని పురుష తత్వం, స్త్రీ తత్వం ఉన్నట్లే... ప్రతి దేవతకీ తప్పకుండా స్త్రీ స్వరూపాన్ని ఆపాదించడం మన తత్వంలోనే ఉంది. ఎందుకంటే, ఈ రెండు గుణాలూ కలిస్తేనే పరిపూర్ణత అని మనకు తెలుసు. మరి ఆ గణేశుని స్త్రీ స్వరూపంగా వినాయనికి ఆరాధించడంలో వింతేముంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565