విజ్ఞానమిచ్చే విఘ్నేశ్వరుడు
వినాయకుడి జననము, ఆ పుట్టు పూర్వత్రాలన్నీ మనలో చాలామందికి తెలిసిన విషయాలే. ఆయన గణాధిపతి కావడానికిగల కారణాల్లో మానవాళికి వినాయకుడి మార్గదర్శనం ఇమిడి ఉంది. బొజ్జ గణపయ్యను గణాధిపతిగా చేసినవి రెండు అంశాలు. ఒకటి మంత్ర జపము, రెండు తల్లిదండ్రులే ముక్కోటి దేవతలు, మూడుకోట్ల యాభై పుణ్యనదులుగా భావించడం. ఈ రెండు అంశాలు వినాయకుడిని ముక్కోటి దేవతలకు నాయకుడిని చేశాయి. వినాయకుడి చరితంలోని ఈ రెండు అంశాలు మానవాళిని మహోన్నత శిఖరాలకు తీసుకెళ్లగల అద్భుత మంత్రదండాలు. ఈ రెండు విషయాలు సమాజంలో కొరవడినందువల్ల అరాచకాలు అల్లకల్లోలాలు జరుగుతున్నాయి. మానవాళి ఎప్పుడైతే ఈ రెండు అంశాలను మంత్రదండాలుగా పట్టుకుంటారో అప్పుడే ఈ లోకం పుణ్యలోకం అవుతుంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆ విశేషాలు..
shiva-parvati
ప్రతి మానవుడు సర్వోన్నతమైన, సర్వవ్యాప్తమైన, అనంతమైన తమ దైవాన్ని తప్పనిసరిగా జపిస్తూ ఉండాలి. అది ఏ మతమైనా నమ్మకం ప్రధానం. తమ దైవం సర్వోన్నతుడు, సర్వవ్యాపకుడు, అనంతమైన వాడిగా నమ్మితే సృష్టి రహస్య విజ్ఞానమంతా మంత్రంలోనే దాగివుంది. సనాతన ధర్మంలో మంత్రానికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు. సృష్టికి సంబంధించిన శక్తి కేంద్రాల తాళం చెవులు ఆ మంత్రంలో ఇమిడివున్నాయి. మనం పట్టుకునే మంత్రాన్ని బట్టి సృష్టికి సంబంధించిన మనలోని శక్తి బయటకు వస్తుంది. అందుకే గురుస్థానాన్ని చేరుకున్న వారు ఏ సాధకుడికి ఎటువంటి మంత్రాన్ని ఇవ్వాలి, వారిలో ఎటువంటి శక్తులు ఉద్భవిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది అంచనా వేసి వేర్వేరు మంత్రాలను వేర్వేరు సాధకులకు ఇస్తుంటారు. అలాంటి సర్వోన్నతమైన నారాయణ మంత్రాన్ని శివుడు బొజ్జ గణపయ్యకు ప్రసాదించాడు.
సృష్టి రహస్యాన్ని చెప్పిన మంత్రం
ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరారు.
ఆ పదవికి గజాననుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముల్లోకముల లోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లిపోయాడు. గజాననుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరు ఇలాంటి షరతు విధించడం సబబేనా? నేను మీ పాద సేవకుడిని కదా! నా మీద దయ తలచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు.
సకృన్ నారాయణే త్యుక్త్వా పుమాన్ కల్పశత త్రయం! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!
కుమారా! ఇది నారాయణ మంత్రం. ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్యనదులలో స్నానం చేసినట్టవుతుంది. షరతు విధించిందీ తండ్రే, తరుణోపాయం చెప్పిందీ తండ్రే కాబట్టి ఇంక తాను గెలవగలనో లేదో, కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను? అని సందేహించకుండా, ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ మూడు సార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు. అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించేవాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. తన అహంకారానికి చింతించి, తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యము ఇవ్వండి అన్నాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజునే గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు.
ఇందులో మనం తీసుకోవాల్సినవి ముందుగా చెప్పుకున్నట్టుగానే రెండు అంశాలు. ఒకటి మంత్ర విశేషము. రెండు తల్లిదండ్రులను సేవించడం. ఈ రెండు నేటి సమాజానికి చాలా ఆవశ్యకములు. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా మంత్రం మనలోని ప్రకృతి శక్తులను వెలికి తీసి మనల్ని మానవాతీత స్థితికి తీసుకువెళ్తుంది. ఇక్కడ గురుస్వరూపుడైన శివుడు తనకు ఒసంగిన మంత్రాన్ని పట్టుకుని జపం చేయడం వల్ల వినాయకుడు కూడా సర్వ వ్యాపకుడిగా అయ్యాడు. అంటే అప్పటివరకు తనను తాను అల్పుడిగా భావిస్తున్న వినాయకుడిని ఒక మంత్రం దేవతలకే అధిపతిని చేసి పెట్టింది.
మంత్రం మనల్ని విఘ్నేశ్వరుడిగా చేస్తుంది
మనమంతా గుర్తుంచుకోవాల్సింది, సమాజానికి అత్యవసరంగా ఉపయోగపడేది, తక్షణ ఔషధం భగవంతుడి నామ జపం. అదే విషయాన్ని వినాయకుడు తన జీవిత ఘట్టాల ద్వారా మనకు తెలియజేశాడు. ఎప్పుడైతే మనం మంత్ర జపం చేయడం మొదలుపెడతామో అప్పుడు సాధారణమైన స్థితి నుండి అసాధారణమైన స్థితికి చేరుతాము. పైన చదివిన పురాణ కథలో కూడా నేను సాధారణమైన అశక్తమైన వాడిని అనుకున్న గణపయ్యకు శివుడు మంత్రాన్ని ఇచ్చి, జపించమని ఉపదేశం ఇవ్వడంతో వినాయకుడు ఆ మంత్రాన్ని ఎటువంటి వికల్పాలు లేకుండా జపించాడు. అప్పుడే అతి సాధారణమైనవాడిని అనుకున్న వినాయకుడు విఘ్నరాజు అయ్యాడు. మంత్రం మనిషిని మాధవుడిగా చేస్తుందని ఈ ఘట్టం తెలుపుతుంది.
గణేశుడు మంత్రం గురించి ఏం చెప్పాడంటే..
మంత్రం ఏదైనా భక్తి ప్రపత్తులతో గురువుపై నమ్మకంతో జపిస్తే ఏదైనా సాధించవచ్చని వినాయకుడు నిరూపించాడు. మానవ శరీరంతో ఉన్న మనం మంత్రాన్ని జపించడం వల్ల మన శరీరంలోని అణువులలో ఏర్పడే స్పందనలు సూక్ష్మ శరీరాన్ని చైతన్యపరిచి సంకల్పమాత్రం చేత ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా వెళ్లవచ్చని నిరూపించాడు. ఈ సూక్ష్మ శరీర యానం మనలో చాలామంది యోగ సాధకులకు అనుభవంలో ఉన్న విషయమే. మనిషి కొన్ని రకాల సాధనల వల్ల శరీరం ఉన్నచోట ఉండగానే వేర్వేరు శరీరాలతో సంకల్ప మాత్రం చేత ప్రయాణించవచ్చు. దీన్నే సూక్ష్మ శరీర యానం అంటారు. ఈ రహస్యమైన విజ్ఞానాన్ని మనకు బొజ్జ గణపయ్య తన జీవిత ఘట్టాల ద్వారా తెలియజేశాడు. ఇవే కాదు మనిషిగా శరీరం తీసుకున్న ప్రతి ఒక్కరు జీవన్ముక్తుడు అవడానికి ఎలా జీవించాలి అనే విషయమై మనకు తన జీవితం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించాడు.
తల్లిదండ్రులే సకల దేవతా స్వరూపాలు
దేవతలకు విఘ్నాధిపతిగా ఎవరిని ఎన్నుకోవాలన్న ఈ ఘట్టంలో వినాయకుడు తన భౌతిక శరీరాన్ని కైలాసంలోనే ఉంచి తండ్రి ఇచ్చిన మంత్రాన్ని వాహనంగా చేసుకుని తన సూక్ష్మ శరీరంతో సంకల్ప మాత్రంగా వెళ్లి వచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంలో వినాయకుడు తను పూర్తిగా తల్లిదండ్రులకు శరణాగతి చెంది మీరే సర్వస్వం అని వారినే ముక్కోటి దేవతలుగా భావించి ప్రదక్షిణ చేయడం కనబడుతుంది. దీన్ని నిశితంగా పరిశీలిస్తే ఒక సాధకుడు తన సాధనలు ముందుకు వెళ్లాలంటే తల్లిదండ్రుల అనుగ్రహం చాలా అవసరమని తెలుస్తుంది. నేటి రోజుల్లో చాలామంది యోగా సెంటర్లని, ఆధ్యాత్మిక కేంద్రాలని వెళ్తూ తమ ఉత్సాహాన్ని చాటుకుంటున్నారు. ప్రశాంతత కోసం పరుగులు పెడుతున్నారు. అయితే ఈ ఆధ్యాత్మిక కేంద్రాల చుట్టూ తిరుగుతున్నవారిలో చాలామంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పెట్టి, డబ్బు కట్టి వదిలించుకున్నవారు ఉన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు ఇంట్లో ఉండడం సహించలేకపోతున్న నేటి కాలం కొడుకులు, కూతుళ్లు ఎన్ని యోగ సాధనలు చేసినా, ఎన్ని మంత్ర జపాలు ఆచరించినా దేవుడు మాత్రం కనికరించడనేది మన విఘ్నాధిపతి చెబుతున్న విషయం. తల్లిదండ్రులను సేవించే వ్యక్తికి సరైన సంకల్పాలు వృద్ధి చెందుతాయి. తల్లిదండ్రులు ఎటువంటివారైనా సరే వారి కడుపులో పుట్టిన మనం వారి బాధ్యతను తీసుకుని వారు ఆనందంగా జీవించేలా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. వారి ఆశీస్సులే మనల్ని సర్వశక్తివంతులను, సర్వోన్నతులను చేస్తాయి. ఎటువంటి సాధనలైనా తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులతోనే పండుతాయనే ఆధ్యాత్మిక, జీవన రహస్యాన్ని వినాయకుడి ఇలా మనకు తెలియజేశాడు. తల్లిదండ్రులపై భక్తి, మంత్రశక్తిపై విశ్వాసం బొజ్జ గణపతిని దేవతలకు రాజును చేసినప్పుడు మనల్ని కేవలం వృత్తి వ్యాపారాదుల్లో ఉన్నతులను చేయదా అనే ఆలోచన మనలో కలిగితే మన సమాజంలో ఉత్తమ పౌరులుగా వెలుగుతాము. - శ్రీకాంత్ కొణపర్తి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565