దర్భశయన రాముడు... పెళ్లి చేసే దేవుడు
ఏ ఆలయంలోనైనా దేవుళ్లని నిలబడిన భంగిమలో లేదా కూర్చున్న భంగిమలో దర్శించుకోవడం సాధారణం. కానీ, దర్భశయనంలో మాత్రం శయనించిన శ్రీరాముని దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం రామేశ్వరానికి సుమారు 60 కి.మీ. దూరంలో రామనా«థపురానికి 8 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి రాముడిని స్థానికంగా ‘తిరుపుల్లవి’ అంటారు. తిరుపల్ అని అనే తమిళపదానికి గడ్డితో(దర్భలతో) చేసిన శయ్య అని అర్థం. (తమిళంలో పుల్ అంటే గడ్డి అని, అనై అంటే శయ్య అని అర్థం). ఒకప్పుడు దర్భలతో నిండిన దట్టమైన అడవి ఉండేదని, దాన్ని ‘పుల్లారణ్య’ అనేవారని చెబుతారు.
ఈ రాముడు కళ్యాణ జగన్నాథుడు: ప్రత్యేకించి వివాహలు కావాల్సిన వారికోసం ఇక్కడ దర్భశయనంలో కల్యాణ జగన్నాథుని ప్రతిష్టించారు. అదేవిధంగా సంతానం కోసం సంతాన వేణుగోపాలస్వామిని ప్రతిష్ఠించారు. పెళ్లి కావలసిన యువతీయువకులు దర్భశయనం వెళ్లి స్వామిని దర్శించుకొని కల్యాణ కుంకుమను తెచ్చుకుని 45 రోజులపాటు ప్రతిరోజూ నుదుట ధరిస్తే వివాహం కుదురుతుందని విశ్వాసం.
శక్తివనరులు... సజ్జలు
చూడటానికి సజ్జలు చిన్నగా అనిపిస్తాయేమోగానీ వాటి వల్ల సమకూరే శక్తి మాత్రం చాలా ఎక్కువ. పీచుపదార్థాలు ఇంకా ఎక్కువ. సజ్జలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకుంటే వాటితో చేసే వంటకాలను పదే పదే తింటారు. సజ్జలతో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని...
♦ సజ్జల్లో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. వంద గ్రాముల సజ్జల్లో మూడు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే రక్తహీనత (అనీమియా) ఉన్నవారు సజ్జలతో తయారు చేసిన పదార్థాలు తినడం మేలు.
♦ సజ్జల్లో ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తి వనరు. కణజాలం అభివృద్ధి కోసం కూడా ఫాస్ఫరస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఇక వరి, గోధుమల కంటే సజ్జల్లో ప్రోటీన్లు ఎక్కువ. అందుకే కణజాలం రిపేర్లకు కూడా ఇవి ఉపయోగపడతాయి.
♦ సజ్జల్లో పీచు పాళ్లు ఎక్కువ. అందుకే జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఇవి తోడ్పడతాయి. అంతేగాక ఈ పీచు వల్ల ఒంట్లోకి వచ్చే చక్కెర పాళ్లు చాలా నెమ్మదిగా విడుదలవుతుంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సజ్జలతో చేసిన పదార్థాలు తినడం మంచిది. సజ్జల్లో ఉన్న పీచు పదార్థాలు మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి.
♦ సజ్జల్లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. అందుకే అవి ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. వయసు పెరిగే కొద్ది వచ్చే వ్యాధులను నిరోధిస్తాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565