MohanPublications Print Books Online store clik Here Devullu.com

పాశుపతాస్త్రం_pasupatastram



   దేవతల అనుగ్రహాన్ని సాధించి కొత్త శస్త్రాస్త్రాలు సంపాదించడానికి అర్జునుడు వ్యాసులవారి సలహాను అనుసరించి హిమవత్ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయాలనుకున్నాడు. అన్నదమ్ముల వద్ద సెలవు తీసుకుని, పాంచాలితో చెప్పడానికి వెళ్ళాడు. ఆమె అతణ్ణి చూసి, "ధనుంజయా! మా సుఖదుఃఖాలూ, మా బ్రతుకులూ, మా అందరి మానావమానాలూ, ఐశ్వర్యసంపదలూ అన్నీ నీమీద ఆధారపడి వున్నాయి. విజయుడవై, దివ్యాస్త్రాలతో త్వరగా తిరిగిరా" అని శుభాకాంక్షలు చెప్పింది.

అస్త్రాల కోసం బయలుదేరిన అర్జునుడు ఎన్నో అడవులూ, కొండలూ దాటి చివరకు ఇంద్రకీల పర్వతం చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక వృద్ధబ్రాహ్మణుడు కనిపించాడు.

"నాయనా! విల్లూ, బాణాలూ కత్తీ కటార్లూ పెట్టుకుని వున్నావు. ఎవరు నీవు? ఇక్కడ అస్త్రాలతో పనేమీ లేదే! కోపతాపాలూ, రాగద్వేషాలూ వదిలిపెట్టి నిర్మలంగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఈ తావున ఈ క్షత్రియవేషం ఎందుకు?" అంటూ ఆ వృద్ధుడు అర్జునుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. కొంతసేపటికి నిజరూపంతో ఎదుట నిలిచి, తాను ఇంద్రుడనని చెప్పాడు. "నా కుమారుడవైన నిన్ను చూసిపోదామని స్వర్గం నుండి వచ్చాను" అన్నాడు. అప్పుడు అర్జునుడు "నాకు దివ్యాస్త్రాలు కావాలి. అవి దయతో ఇప్పించండి" అని దేవేంద్రుణ్ణి అడిగాడు.

"కుమారా! అస్త్రాల వల్ల ఏం ప్రయోజనం? ఉత్తమలోకాలు కోరుకో ఇస్తాను" అన్నాడు ఇంద్రుడు.

"దేవరాజా! నాకు ఉత్తమలోకాలూ, భోగభాగ్యాలూ అక్కర్లేదు. నా భార్య ద్రౌపతినీ, నా అన్నదమ్ముల్నీ నట్టడవిలో విడిచి పెట్టి వచ్చాను. నాకిప్పుడు కావలసిందల్లా అస్త్రాలే" అని ఖచ్చితంగా చెప్పాడు అర్జునుడు.

"ముక్కంటిదేవరను గూర్చి తపస్సు చేస్తే ఆయన వరప్రసాదం వల్ల దివ్యాస్త్రాలు పొందగలవు. అలా చెయ్యి" అని చెప్పి వేయికన్నుల వేల్పు మాయమైపోయాడు. ఆ తరువాత అర్జునుడు హిమవత్పర్వతానికి వెళ్ళి పరమశివుణ్ణి గురించి చాలాకాలం కఠోరమైన తపస్సు చేశాడు.

ఒకరోజు పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా అర్జునుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి వేటగాడి వేషంలో వచ్చాడు. ఆ సమయంలో ఒక అడవిపంది అర్జునుడి మీదకి దూక వచ్చింది. అప్పుడు ఆ పందిమీద పినాకంతో శివుడూ, గాండీవంతో అర్జునుడూ ఒకేసారి బాణాలు వేశారు. "నీవెవరు? ఆడపిల్లతో ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు? నేను గురిపెట్టిన పందిని నువ్వెందుకు కొట్టావు?" అని అర్జునుడు శివుణ్ణి కోపంగా అడిగాడు.

"ఈ అడవి మాది. ఈ జంతువులు మావి. మేము తిరగక నువ్వు తిరుగుతావా? అసలు నువ్వెవరు? నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? చెప్పు ముందు" అని శంకరుడు ఎదిరించి అడిగాడు.

అందుకు జవాబివ్వకుండా, "ఈ వరాహం నాది" అన్నాడు విజయుడు.

"ఈ పందిని నేను కొట్టాను. అది నీకు కావాలంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు ముక్కంటి.

ఆ మాటలకు అర్జునుడికి కోపం వచ్చింది. సర్రున బాణం తీసి వేశాడు. కాని అది అతడిమీద పడినట్లే పడి పస ఉడిగి కిందపడిపోయింది. అర్జునుడికి మరీ కోపం వచ్చింది. వెంట వెంటనే వందల కొద్దీ బాణాలు విడిచాడు. అన్నింటినీ పరమశివుడు ప్రసన్నవదనంతో ఎదుర్కొన్నాడు. అర్జునుడి అంబులపొదిలోని అంబులన్నీ అయుపోయాయి. అప్పుడు విల్లు తిప్పి దాని కొనతో ఆ వేటగాణ్ణి కొట్టబోయాడు. దానికి కూడా బోయ చలించలేదు. అనాయాసంగా విల్లు లాక్కుని పెద్దగా నవ్వాడు. అర్జునుడికి సిగ్గువేసింది. సరసర కత్తి దూసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ ఖడ్గం కూడా ఆదిశంకరుడి తలకు తగిలి తునా తునకలై పోయింది. తరువాత రాళ్ళూ రప్పలూ తీసుకుని తలపడ్డాడు. అవీ పిండి అయిపోయాయి. చివరకు ముష్టియుద్ధానికి దిగాడు. అందులోనూ ఓడిపోయాడు. ఇక అర్జునుడికి ఏం చెయ్యడానికీ తోచలేదు. శివుణ్ణి ధ్యానించాడు. ఆ ధ్యానంతో అతనికి జ్ఞానోదయమైంది. ఆ వేటగాడెవరో తెలిసిపోయింది. పరమశివుని పాదాలమీద పడ్డాడు. శివుడు నవ్వుతూ తాను లాక్కున్న గాండీవాన్నీ, తక్కిన ఆయుధాలనూ తిరిగి అర్జునుడికి ఇచ్చేశాడు. పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి, ఇంకా అనేక వరాలను ఇచ్చి విజయుణ్ణి దీవించాడు.


ముష్టియుద్ధంలో ముక్కంటి స్పర్శ తగిలిన కారణం చేత అర్జునుడి శరీరం నూరు రెట్లు ఎక్కువ తేజస్సుతో ప్రకాశించింది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list