మంచి పని వల్ల ఎప్పటికైనా మంచే!
ఆత్మీయం
ఇతరులకు మనం మంచి చేస్తే మంచి ఫలితాన్ని, చెడు చేస్తే చెడు ఫలితాన్నీ పొందుతామన్న సూక్తిని హిందూమతం, ఇస్లాం, క్రైస్తవం, సిక్కుమతం, జైనమతం వంటి అన్ని మతాలూ బోధించాయి. అయితే దీని మీద మనకి నమ్మకం కాని, గురి కాని, గౌరవం కాని, భయం కాని లేకపోవడంతో ఈ దైవనియమాన్ని అర్థం చేసుకుని మన బాగు కోసం ప్రవర్తించడం మనం పూర్తిగా విస్మరించాం. దీని ఫలితమే నిత్యం నేడు మనం దినపత్రికల్లో చూసే వివిధ అకృత్యాలు, అన్యాయాలు, ఇతర దారుణాలు. ‘నేను ఇతరులను బాధించి లబ్ధి పొందితే, తిరిగి దానికి నేను ఎక్కువ రెట్లు బాధ అనుభవించి, నేను లబ్ధి పొందిన దానికంటే ఎక్కువ రెట్లు కోల్పోతాను’ అనే నమ్మకంతో కూడిన భయం స్పష్టమైన ఉదాహరణలతో మనకి అందక పోవడం వల్లే మనుషులు అన్యాయాలు చేయడానికి వెరవడం లేదు.
కారణం లేకుండా కార్యం జరగదు అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది కాబట్టి బిల్‌గేట్స్ లేదా వారెన్ బఫెట్ ఉత్తినే ప్రపంచ కుబేరులు కాలేదు. గతజన్మల్లో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే ఈ జన్మలో వారు కుబేరులయ్యారు. ఏ ప్రకారం వ్యాపార నడక సాగిస్తే, వారు ఆ స్థితికి చేరుకోగలరో ఆ నడకని వారికి స్ఫురింప చేసేది వారి గత జన్మకర్మలే. దీనినే అమెరికన్లు‘సరైన మనిషి, సరైన ప్రదేశంలో, సరైన సమయంలో’ అని చెబుతారు. హిందూమతం దీనినే కర్మసిద్ధాంతరూపంలో వివరిస్తుంది. దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా పిలుస్తుంటారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565