మాయను ఛేదించేవాడే గురువు
ఇంటిమీద ఒక పెద్ద నీళ్ళతొట్టి. దానినిండా నీళ్ళుంటాయి. మొహం కడుక్కోవడానికి కాసిని నీళ్ళు కావాలి. కింద మన ఇంట్లో ఉన్న పంపు తిప్పుతాం. సన్నగా కావాలంటే సన్నగా; ఎంత లావుగా కావాలంటే అంత లావుగా వస్తాయి. మనకెన్ని అవసరమో అన్నే తీసుకుంటాం. భగవంతుని అనుగ్రహం గురువు ద్వారా వచ్చేటప్పుడు ఇలాగే ఏ క్రమం చేత అందుతుందో దానికి దీక్ష అని లేదా ఉపదేశం అని పేరు. గురుశిష్య సంబంధంలో ఇది అనేక క్రమాల్లో ప్రకాశిస్తుంది. మంత్రోపదేశం ఒక ప్రధానమైన దీక్షాక్రమం. ఉపదేశం అన్నివేళలా ఒకేలా ఉండాలని లేదు. వాటిలో ఒకటి కుక్కుట దీక్ష. అంటే స్పర్శ దీక్ష.
ఇందులో ఒక అద్భుతమైన క్రమం ఏమిటంటే–గురువు తన పాదాలను శిష్యుడి తలమీద ఉంచుతాడు. ఒకానొకప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర భాష్యం చేసిన మహా పండితుడు ఒకరు చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి దగ్గరకు వెళ్ళి దానిని చూపించగా ఆయన మురిసిపోయి ‘నీకేం కావాలి?’ అని అడిగారు. ‘శ్రీవారి పాదం నాతల మీద పెట్టాలి’ అన్నారాయన. ‘అబ్బో! పెద్ద కోరికే కోరావు. రేపు శుక్రవారం. తలస్నానం చేసి కామాక్షి దర్శనం చేసుకుని, గాయత్రీ జపం చేసుకుని రా’ అన్నారు స్వామి. అలా వచ్చిన పండితుని తలమీద మహాస్వామి పాదం పెట్టారు. గురువంటే జీవితంలో ఒక్కసారే అనుగ్రహిస్తాడు. అంతటి విద్వాంసుడు కనుక ఆయన కోరిక తీర్చాడు. అంతేకానీ కనబడ్డ ప్రతివానికీ 5వేలు, 10వేల రూపాయలు పుచ్చుకుని పాదాలు పెట్టే గురువు కారాయన.
గురువంటే బరువు. కిలోల లెక్కన కాదు. ఆయన బరువు–అంటే, నేను లఘువు అని అర్థం. లఘువంటే తేలిక. వయసులో చిన్న వాడయినా సరే, ఆయనకెన్నో తెలుసు. ఆయన ధర్మం, ఆచరణ తెలిసున్నవాడు, అనుష్ఠానబలం ఉన్నవాడు, ధర్మం చెప్పగలిగిన వాడు. అందుకని ఆయనంటే నాకు గురి. నాకన్నా బరువు, కాబట్టి ఆయన నాకు గురువు. నేను ఆయనకంటే చిన్నవాణ్ణి, అనుసరించాల్సిన వాణ్ణి, కాబట్టి నేను లఘువు.
స్పర్శక్రమంలో అనుగ్రహించే దానిని కుక్కుటదీక్ష అంటారు. కుక్కుటం అంటే కోడి. గుడ్డు మీద కోడి కూర్చుంటుంది. ఎంత పొందికగా కూర్చుంటుందంటే–కోడి చాలా బరువుగా ఉంటుంది. గుడ్డులో ఉన్న పిండం చాలా తేలిగ్గా ఉంటుంది. గుడు ్డపెంకేమో గట్టిగా కూర్చుంటే పగిలిపోతుంది. కానీ కోడిపెట్ట కాళ్ళు నెమ్మదిగా కదుపుతూ వచ్చి మెల్లగా దాని మెత్తటి పొట్టభాగం గుడ్డుకు తాకేటట్లు రెక్కలు రెండుపక్కలా అడ్డుబెట్టి కదలకుండా అలాగే గుడ్డుమీద కూర్చుంటుంది. దానిపొట్ట వెచ్చదనం గుడ్డుపెంకుకు తగిలి లోపల ఉన్న పిండం ప్రాణం పోసుకుంటుంది. అలా కూర్చోగా కూర్చోగా పిండం పిల్లయి పెంకు పగులగొట్టుకుని పైకొస్తుంది.
అజ్ఞానంలో ఉన్న శిష్యుణ్ణి తన స్పర్శచేత అనుగ్రహించి మంత్రోపదేశం చేస్తాడు గురువు. పిదప మాయ అన్న పెంకు పగులగొట్టుకుని పూర్ణత్వాన్ని పొందిన శిష్యుడు భక్తి, జ్ఞానం అన్న రెక్కలతో ఎగిరిపోయేటట్టు అంతటా నిండి పరబ్రహ్మమయిన ఆత్మ ఆకాశంలో ప్రయాణం చేయదగిన స్థితిని స్పర్శ చేత కలిగించే దక్షత ఉన్నవాడు గురువు. అదీ స్పర్శదీక్ష. అదే కుక్కుట దీక్ష. దానికి ప్రతీక – గురుమండల రూపి అయిన కామాక్షీ పరదేవత. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ‘అమ్మా! నీ పాదాలు నా తలమీద ఉంచమ్మా!’ అంటారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565