MohanPublications Print Books Online store clik Here Devullu.com

మనోల్లాస యోగం-Personal problems, Mental stress, Yoga, వ్యక్తిగత సమస్యలు, మానసిక ఒత్తిడి, యోగా


మనోల్లాస యోగం
వ్యక్తిగత సమస్యలు, సామాజిక సమస్యలు, వృత్తి నిర్వహణలో వచ్చే సమస్యలు, విద్యార్థుల సమస్యలు – ఇవన్నీ మానసిక ఒత్తిడికి కారణం అని అందరికీ తెలుసు. కానీ, ఈ ఒత్తిడి వల్ల మనసు, శరీరంపై ఎటువంటి దుష్ప్రభావం ఉంటుందో ముందుగా తెలుసుకుంటే ఈ సమస్యను నివారించడం లేదా పరిష్కరించడం ఎంత ముఖ్యమో అర్థం అవుతుంది.
మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలోని ఎడ్రినల్‌ గ్రంధులు కార్టిజోన్, ఎడ్రినలిన్, నార్‌ ఎపినెఫ్రైన్‌ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఎడ్రినలిన్‌ వలన గుండె వేగం పెరిగి తద్వారా రక్తపోటు పెరుగుతుంది. కార్టిజోన్‌ వలన రక్తనాడుల లోపల లైనింగ్‌ పనితీరు క్రమం దెబ్బతింటుంది. ఇది గుండెపోటుకు దారి తీయవచ్చు. కార్టిజోన్‌ లెవెల్స్‌ ఎక్కువ అయినప్పుడు ఆకలికి సంబంధించి మార్పులు రావడం, బరువు పెరగడం, జీర్ణాశయ సమస్యలు, ఆస్టియోపొరోసిస్, క్యాన్సర్, డయాబెటిస్‌ వ్యాధులకు కారణమవుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్‌ని ఉత్పత్తి చేసి, ఉన్న బ్రెయిన్‌ సెల్స్‌ చనిపోవడానికి, కొత్త బ్రెయిన్‌ సెల్స్‌ పుట్టకుండా చేస్తుంది. ఇది అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్, స్కీజోఫ్రేనియా, డిమిన్షియా, అల్జీమర్స్‌ వంటి మెదడు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.
యోగ ఆసనాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. దీనికి చేయవలసిన కొన్ని ముఖ్యమైన ఆసనాలు –ఒత్తిడిలో ఉన్నప్పుడు ముందుగా తలలోని భాగాలు, మెడ, భుజాలు బాగా ప్రభావితమవుతాయి. కనుక వీటికి సంబంధించిన యోగాసనాలు చేయాలి. వీటిలో బ్రహ్మముద్రలు, చాలన తాలాసన, ఉత్థాన హస్తపాదాసన. మార్జాలాసన, అర్ధ అధోముఖ, అధోముఖ శ్వానాసన, నిరాలంబాసన, ఉదరాకర్షణాసన, మకరాసన, శశాంకాసన.. వంటి తేలికపాటి ఆసనాలు రెగ్యులర్‌గా సాధన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. యోగనిద్ర, సరైన ధ్యాన మార్గాలను కూడా సాధన చేసినట్లయితే సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. ఆసనాలు చేసే విధానం...
1.చాలన తాలాసన
కుడి ఎడమలకు ముందు సమస్థితిలో నిలబడి, కుడికాలు ముందుకు ఎడమకాలు వెనుకకు ఉంచి శ్వాసతీసుకుంటూ చేతులు రెండూ పైకి లేపి, శ్వాస వదులుతూ చేతులు రెండూ ముందు నుండి డయాగ్నల్‌గా కిందకు తీసుకురావాలి. కాలి మడమను తిప్పుతూ వెనుకకు తిరుగుతూ చేతులు రెండూ డయాగ్నల్‌గా క్రిందనుంచి పైకి తీసుకువెళ్ళి చేతులు విశ్రాంతిగా భుజాల వెనుక ఉన్న ట్రెపీజియస్‌ కండరాల మీద ఉంచాలి. ఈ విధంగా ముందునుండి వెనుకకు, వెనుక నుండి ముందుకు 5 నుండి 10 సార్లు చేయాలి. ఇదేవిధంగా రెండవవైపు కూడా చేయాలి. నెమ్మదిగా, సౌకర్యవంతంగా శ్వాస తీసుకుని వదులుతూ చేయాలి.
2. ఉత్థాన హస్తపాదాసన
సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందు నుండి పైకి తీసుకువెళ్ళి, శ్వాస వదులుతూ మోకాళ్లు ముందుకు వంచి క్రిందకు వంగి, చేతులు రెండూ ఫొటోలో చూపినట్లుగా వెనుకకు, పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందు నుంచి పైకి తీసుకువెళ్లాలి. ఇలా 5 నుంచి 10 సార్లు చేయవచ్చు.
3. అధోముఖ శ్వానాసన
చేతులు రెండూ క్రిందకు ఉంచిన తరువాత (పై పొజిషన్‌లో) కుడికాలు వెనుకకు తరువాత ఎడమకాలు వెనుకకు తీసుకువెళ్లి శ్వాస వదులుతూ నడుమును పైకి తీసుకువెళ్లి పొట్టని బాగా లోపలకు లాగుతూ 3 లేదా 5 శ్వాసలు ఉండాలి. ఈ స్థితిలో తలవైపునకు రక్తప్రసరణ పెరిగి మెదడు తదితర భాగాలు చురుకుగా పనిచేస్తాయి.
4. నిరాలంబాసన
పై స్థితిలో నుండి శ్వాస తీసుకుంటూ కుడి మోకాలు క్రిందకు, తరువాత ఎడమ మోకాలు క్రిందకి తీసుకువచ్చి మార్జాలాసనంలో రిలాక్స్‌ అవ్వాలి. తరువాత రెండు కాళ్ళు వెనుకకు స్ట్రెచ్‌ చేస్తూ పొట్ట భాగాలు పూర్తిగా నేలకు తాకే విధంగా చెక్‌ చేసుకుంటూ మోచేతులు రెండూ నేలమీద ఉంచి, చేతులు గడ్డం కింద ఉంచి 3 నిమిషాలు రిలాక్స్‌ అవ్వచ్చు.
5. ఉదరాకర్షణాసన
భూమి మీద బోర్లాపడుకుని కుడి చేయి నడుముకి పక్కన, ఎడమ చేయి తలకు సమాంతరంగా ఎడమ మోకాలు మడచి ఎడమపాదం కుడి తొడకు దగ్గరగా తీసుకువచ్చి శరీరంలో వీలైనన్ని భాగాలు భూమి మీద ఆనిస్తూ రిలాక్స్‌ అవ్వాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా కనీసం 3 నిమిషాల పాటు రిలాక్స్‌ అవ్వాలి. ఇది హై బీపీని తగ్గించడంలో మెటబాలిక్‌ రేట్‌ని రెగ్యులేట్‌ చేయడంలో ఉపయోగపడుతుంది.
6. యోగనిద్ర
పైన చెప్పిన ఆసనాలు అన్నీ పూర్తయిన తరువాత కొన్ని తేలికపాటి ప్రాణాయామాలు (సూర్య భేది, అనులోమ విలోమ, చంద్రభేది, భ్రామరి) చేయాలి. తర్వాత యోగనిద్రలోకి వెళ్లి, 5 నుండి 10 నిమిషాల పాటు శరీరంలోని భాగాలన్నిటిమీద, మాడుపై భాగం నుండి కాలి వేళ్ళ వరకు మనో నేత్రంతో చూస్తూ రిలాక్స్‌ అవ్వాలి. దీని వలన ఆయా అవయవాలకు సాంత్వన, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
ఎ.ఎల్‌.వి కుమార్‌
ట్రెడిషనల్‌ ,యోగా ఫౌండేషన్‌


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list