భలే కరక్కాయ
కరక్కాయ చూర్ణానికి సమానంగా, పాతబెల్లం కలిపి ముద్దగా దంచి ప్రతి దినము ఒక స్పూను సేవిస్తూ ఉంటే, రక్తమొలలు, అజీర్తితో పాటు, గౌట్ సమస్యలూ తగ్గుతాయి.
రాత్రి భోజనం తర్వాత అరస్పూను కరక్కాయ చూర్ణం వేసుకుంటే, మలబద్దకం సమస్య తొలగిపోతుంది.
కరక్కాయ చూర్ణానికి సమానంగా ఎండు ద్రాక్షను కలిపి దంచి ముద్దగా చేసి, రోజూ ఉదయాన్నే ఉసిరికాయ పరిమాణంలో తింటూ ఉంటే, కడుపులో మంట, పులితేన్పులు, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
కరక్కాయ చూర్ణానికి సమానంగా ఆముదం కలిపి లేహ్యంగా చేసి దాన్ని ప్రతి ఉదయం, రాత్రి పడుకునే ముందు ఒక స్పూను మోతాదులో తీసుకుంటే వాపుతో వచ్చే కీళ్లనొప్పులు సయాటికా సమస్యలతో పాటు, హెర్నియా కూడా తగ్గుతుంది.
కర క్కాయ చూర్ణానికి సమానంగా పిప్పళి చూర్ణం లేదా శొంఠి చూర్ణం కలిపి, అందులో తేనెలో కూడా కలిపి లేహ్యంగా చేసుకోవాలి. ఈ లేహ్యాన్ని ముద్దగా దంచి ప్రతిదినము అర స్పూను చొప్పున చప్పరిస్తూ ఉంటే, బొంగురు గొంతుతో పాటు నసకూడా తగ్గుతాయి.
కరక్కాయ చూర్ణానికి పచ్చిగడ్డి కలిపి, మెత్తగా నూరి పైపూతగా వాడితే కాలిన గాయాలు, చీము పట్టిన పుండ్లు మానిపోతాయి.
కరక్కాయ చూర్ణాన్ని గోమూత్రంలో వేసి మరగించి, అందులో కొంచెం ఆముదం కలిపి, ప్రతి ఉదయం, పరగడుపున తీసుకుంటే వరిబీజం తగ్గుతుంది.
కరక్కాయ గింజలు నూరి నుదుటిపై పట్టిస్తే, మైగ్రేన్ తగ్గుతుంది.
గరికతో ప్రసన్నం
ఒకసారి యమలోకంలో పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో నాట్యకత్తెలు నృత్యం చేస్తున్నారు. అందులో తిలోత్తమ నాట్యం చేస్తుండగా చూసి యముడు ఆమెను మోహించాడు. అందుకు పర్యవసానంగా అనిలాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు జన్మించాడు. అనిలాసురుడు ఎక్కడికెళ్లినా అగ్ని ఉద్భవించి అంతా భస్మీపటలం అయ్యేది. అటువంటి భయంకరమైన రాక్షసుడు దేవతలపై దండెత్తుతాడు. అప్పుడు దేవతలు భయకంపితులై గణపతిని ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థనలు విన్న వినాయకుడు బాలగణేశుని రూపంలో ప్రత్యక్షమై అనిలాసురుణ్ణి సంహరిస్తానని మాటిస్తాడు. ఆ మాటలు విన్న దేవతలు సంతోషిస్తారు. అదే సమయంలో నలుదిశలు భస్మం చేస్తూ అనిలాసురుడు అక్కడికి వచ్చాడు. ఆ రాక్షసుణ్ణి చూసి దేవగణమంతా తలోదిక్కూ పారిపోయారు. బాలగణేశుడు మాత్రం అక్కడే నిలుచుని ఉన్నాడు. అదిచూసి అనిలాసురుడు బాలగణేషున్ని మింగేయాలని ముందుకు వచ్చాడు. కానీ బాలగజాననుడే పర్వతమంత ఎత్తు ఎదిగి అనిలాసురుణ్ణి మింగేశాడు. సాక్షాత్తు అగ్నిస్వరూపుడైన అనిలాసురుణ్ణి మింగిన కారణంగా గణేశునికి ఒళ్లంతా మంట పుట్టింది. ఆ మంటను భరించలేక గణేశుడు నేల మీద పడి దొర్లసాగాడు. గణేశుని బాధ చూసి దేవతలంతా అక్కడకు వచ్చారు. గణేశుని బాధను తగ్గించడానికి రకరకాల ఉపాయాలు ఆలోచించారు. ఇంద్రుడు గణేశుని తలమీద అమృతమయమైన చంద్రుణ్ణి ఉంచాడు. బ్రహ్మదేవుడు సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు కన్యలను రప్పించాడు. విష్ణుమూర్తి తన చేతిలోని చల్లటి కమలం ఇచ్చాడు. వరుణుడు చల్లటి వర్షం కురిపించాడు. శివుడు తన సర్పాన్ని గణేశుడి ఉదరానికి చుట్టాడు. ఇవన్నీ చేసినా మంటలు చల్లారలేదు. అప్పుడు 88వేల మంది మునులు ప్రతి ఒక్కరు 21 పచ్చటి గరికలు గజాననుడి శిరస్సుపై ఉంచారు. అప్పుడు గణేశుని దేహం చల్లారి శాంతి పొందింది. గణేశుడు ప్రసన్నమై ఇలా సెలవిచ్చాడు. ‘ఈ రోజు నుంచి నాకు గరికలు సమర్పించే వారికి కొన్ని వేల యజ్ఞాలు, వ్రతాలు, దానాలు, తీర్థయాత్రలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది’ అన్నాడు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565