MohanPublications Print Books Online store clik Here Devullu.com

కృష్ణ అష్టమి-Krishna Astami


నల్లనయ్య ఎలా అయ్యాడు?
నిజంగానే ఏమీ తెలియక, ఎవరైనా ఏమైనా అడిగితే ఏదో ఒకటి చెప్పేసి చెల్లుబాటు కావచ్చు. కానీ, అన్నీ తెలిసి తెలిసే కావాలని అడుగుతుంటే ఏమనుకోవాలి? మన లోతెంతో తెలుసుకోవడానికి అలా అడిగారనుకోవాలా? ఒకవేళ తెలిసినా హఠాత్తుగా ఇప్పుడది గుర్తుకు రాక అడిగారనుకోవాలా? అయినా, ఆ ఆడిగింది సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడే అయితే, ఎవరికైనా ఇంక మాటలెలా వస్తాయి! కాకపోతే ఆ అడిగింది తల్లి యశోదనే కాబట్టి, లోకానికి చక్రవర్తే అయినా, తల్లికి కొడుకే కాబట్టి, ఆమేదో సమాధానం చెబుతుంది. 1978లో విడుదలైన ‘సత్యం-శివం-సుందరం’ సినిమా కోసం విఠ్ఠల్‌ భాయ్‌ పటేల్‌ రాసిన ఈ పాటలో ఈ తల్లీ కొడుకుల సంభాషణల స్వారస్యమే కనిపిస్తుంది. లక్ష్మీకాంత్‌- ప్యారేలాల్‌ స్వరరచనకు లతా మంగే ష్కర్‌ గాత్రం నిజంగా ప్రాణమే పోసింది.
యశోమతీ మైయా సే బోలే నంద్‌లాలా
రాధా క్యోఁ గోరీ.... మై క్యో కాలా?
(నందకిశోరుడే అడిగాడు యశోదమ్మని...
రాధ ఎందుకు ఎరుపు? నేనెందుకు నలుపని?)
తనకు తెలిసిందేదో తెలిసే ఉంటుంది. తనలో కదిలే ప్రశ్నలకు తనవైన సమాధానాలు ఉండే ఉంటాయి. అయినా ఆ ప్రశ్నలకు ఎదుటి వాళ్ల నుంచి ఏం సమాధానం వస్తుందో చూద్దామనే కదా ఆ ప్రశ్నలు వేయడం! అయితే ఏ ప్రశ్నకైనా అందరి నుంచీ ఒకే సమాధానం రాదు. ఎందుకంటే ఎవరి అనుభవాలు వారివి! ఎవరి జీవితం వారిది! మొత్తంగా చూస్తే ఒక్కొక్కరికీ ఇక్కడ ఒక్కో వేరు వేరు ప్రపంచం ఉంటుంది. అందరి రక్తం ఒకటే కదా అన్నట్లు, స్థూలంగా అందరి జీవితాలూ ఒకేలా అనిపించవచ్చు. కానీ, అత్యంత సూక్ష్మమైన లోలోతుల్లోకి వెళితే హృదయానికీ, హృదయానికీ మధ్య, జీవితానికీ జీవితానికీ మధ్య అనంతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. దీనికి తోడు, అసలు సమాధానం ఒకటైతే, దాన్ని వక్రీకరించడం మరొకటి. అందుకే ఒకే ప్రశ్నను వేరు వేరు వ్యక్తులను అడగడం ద్వారా ఒక ప్రశ్నకు చెందిన వేయి సమాధానాలు దొరుకుతాయి. ఒకే సత్యానికి చెందిన వేయి ముఖాలు తెలుస్తాయి.
బోలీ ముస్కాతీ మైయా లలన్‌ కో బతాయా
కారీ అంధియారీ ఆధీ రాత్‌ మే తూ ఆయా
లాడ్‌లా కన్హయ్యా మేరా కాలీ కమ్‌లీ వాలా
ఇసీ లియే కాలా / యశోమతీ మైయా/
(ముసిముసిగా నవ్వుతూ అమ్మ ముద్దుల కొడుకుతో అంది...
నడిరాత్రి కారు చీకట్లో కదా! నువ్వు జన్మించింది.
అందుకే ఓరి కన్నా! నువ్వు నల్ల కలువవయ్యావు.. నువ్వు అందుకే నలుపు..)
నేనెందుకు నలుపని కన్నబిడ్డే నిలదీసి అడుగుతుంటే కన్నతల్లిగా సమాధానం చెప్పాలి కదా! నిజమే కానీ, ఏ పరిణామానికైనా లోకంలో ఒకే ఒక్క కారణం ఉండదు కదా! ప్రతి పరిణామం వెనుక పైకి కనిపించేవీ, కనిపించనివీ అనేకానేకమైన కారణాలు ఉంటాయి. అలా అని అన్ని కారణాల్నీ ఒకేసారి చెప్పడం కూడా అన్నిసార్లూ కుదరదు . అందుకే ఒక కారణంగా యశోద ’’నాన్నా! అర్థరాత్రి వేళ అదీ కటిక చీకట్లో నువ్వు పుట్టావు. ఆ చీకటి ప్రభావంతోనే నువ్వు నల్ల కమలానివయ్యావు.. నీ నలుపు అలా వచ్చిందే కన్నా’’ అనేసింది. ఆ సమాధానంతో సంతుష్టుడు కాని కృష్ణుడు అది కాదు సమాధానం అంటూ మారాం చేశాడు. ‘‘నా నలుపు సంగతేంటో తేల్చ’’మని తిరిగి ప్రశ్నించాడు.
బోలీ ముస్కాతీ మైయా సున్‌ మేరే ప్యారే
గోరీ గోరీ రాధికా కే నైన్‌ కజ్‌రారే
కాలే నైనో వాలీ నే ఐసా జాదూ డాలా
ఇసీ లియే కాలా / యశోమతీ మైయా/
(ఆ తల్లి మందహాసం చేస్తూ, ఓ ముద్దుతండ్రీ!
ఎర్రనైన రాధికవి నల్లనల్లని కాటుక కళ్లు!
ఆ నల్లకళ్ల అమ్మాయే ఆ మంత్రమేదో వేసింది.
నువ్వు అందుకే నలుపు)
మరో సమాధానంగా యశోద ‘‘రాధ తన కాటుక కళ్లతో నిన్ను అదే పనిగా చూడటమే నువ్వు నలుపు అయిపోవడానికి అసలు కారణం’’ అనేసింది. చూసినంత మాత్రాన్నే మనుషులు నలుపెక్కుతారా? అంటే ఏమోమరి! ఆమె ఎన్నిసార్లు, ఎంత తీక్షణంగా చూసిందో ఎవరికి తెలుసు? అందులో ఏదో నిజమంటూ లేకపోతే, కన్నకొడుకుతోనే అలా ఎందుకంటుంది! అనుకుంటూ మనమేదో మన మనసుకు సర్ది చెప్పుకోవచ్చు. కానీ, ఆ తల్లికి అలా చెప్పాల్సిన అవసరం ఏముందో ఎవరికి తెలుసు? అయినా ముందు ఒక కారణం చెప్పి ఆ తర్వాత మరో కారణం ఎందుకు చెప్పినట్లు! అంటే అసలు నిజం చెప్పడం ఆమెకు ఇష్టం లేకేనేమో ఇలా దాటేయడం? కాకపోతే, తన కొడుకు ఔన్నత్యం గురించి చెబితే లోకానికి కంటగింపుగా ఉంటుందని కూడా ఆమె అసలు నిజం చెప్పకపోవచ్చు.
ఇత్‌నే మే రాధా ప్యారీ ఆయీ ఇఠ్‌లాతీ
మైనే నా జాదూ డాలా, బోలీ బల్‌ ఖాతీ
మైయా కన్హయా తేరా జగ్‌ సే నిరాలా
ఇసీ లియే కాలా / యశోమతీ మైయా /
(అంతలోనే ప్రియమైన రాధ... హొయలొలుకుతూ వచ్చింది
అలక వహిస్తూ నేను ఏ మంత్రమూ వేయలేదు
అమ్మా నీ కొడుకు లోకానికే అతీతుడు.. అందుకే నలుపు అంది)
కన్నతల్లి ఏం చెబితే నేమిటి? అసలు నిజం దాచేయాలని ఆమె ఎంత ప్రయత్నిస్తేనేమిటి? అదంతా బట్టబయలు చేసింది రాధ. కాదా మరి! కృష్ణుడి రంగు నలుపెక్కడానికి తన కాటుక కళ్లే కారణమని చెప్పేస్తుంటే తానెలా ఊరుకుంటుంది.? అందుకే అంది.... ‘‘యశోదమ్మా! నీ కొడుకు నలుపు రంగుకు నేనెలా కారణమవుతాను తల్లీ! నావి ఎంత కాటుక కళ్లు అయితే మాత్రం నా చూపులకే నీ కొడుకు నలుపెక్కుతాడా?అసలు విషయం ఏమంటే... నీ కొడుకు లోకానికే అతీతుడు అతని నలుపు రంగుకు అసలు కారణం ఇదే! కాదనగలవా అమ్మా!’’ అంటూ అటు నుంచి విసురుగా వెళ్ళిపోయింది రాఽధ. అవునూ! అతీతుడు కావడానికీ, శరీర వర్ణం నలుపు కావడానికీ ఏమిటి సంబంధం అనిపిస్తోంది కదూ! అందులో వింతేమీ లేదు. అనంతమైనవే ఎప్పుడూ అతీతంగా ఉంటాయి. అనంతమైనవే నలుపు ( నీలం) రంగులో ఉంటాయి. అనంతమైన సముద్రం నలుపు రంగులో ఉంటుంది. అనంతమైన ఆకాశం నలుపురంగులో ఉంటుంది. అలా చూస్తే అనంతమూర్తులైన రాముడూ నలుపే, కృష్ణుడూ నలుపే. అందుకే నలుపు రంగు అనంతత్వానికీ, దివ్యత్వానికీ ప్రతీకే తప్ప మరొకటి కాదు. రాధ మాటల్లోని ఆ అతీత తత్వం, పరమ సత్యమే తప్ప వేరేమీ కాదు.
- బమ్మె

కృష్ణార్పణం
కన్నయ్య వెన్నదొంగ. కన్ను పడిందా... కుండ వణికిందే! ఉట్టికెగిరి ఓ పట్టు పట్టేస్తాడు... అంతిష్టం వెన్నముద్ద అంటే..! కానీ, పాపం! పండగ పూట చిన్ని కృష్ణయ్యకు ఈ పాట్లెందుకు చెప్పండి... బాగా వెన్నపూసను దట్టించి వెరైటీగా మీరే రకరకాల మిఠాయిలు తయారు చేయండి. ఎలా తయారు చే యాలో చెబుతున్నాముగా... చేతకావని దిగులెందుకు... శ్రద్ధతో తయారు చేసి ‘కృష్ణార్పణం’ అంటూ
భక్తితో సమర్పించండి.. ఆ తర్వాత కృష్ణుడి ప్రసాదంగా... మీరు, మీ కుటుంబమంతా హాయిగా లాగించెయ్యండి. తియ్యతియ్యగా..! కార కారంగా
అక్కర వడిసాల్‌
కావలసినవి: బియ్యం–అర కప్పు; పెసరపప్పు–ఒక కప్పు; చక్కెర– ఒక కప్పు; వెన్న తీసిన పాలు– 3 కప్పులు; (ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌ కూడా
వాడవచ్చు); వెన్న తీయని పాలు– అర కప్పు; కుంకుమ పువ్వు– నాలుగు రేకలు; బాదం, జీడిపప్పు పలుకులు– టేబుల్‌ స్పూన్‌; వెన్న– ఒక కప్పు.
తయారీ: బియ్యం, పెసర పప్పు కలిపి మందపాటి పెనంలో వేసి సన్న మంట మీద వేయించాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించి దించేయాలి. చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి అందులో మూడున్నర కప్పుల పాలు పోసి ఆ గిన్నెను ప్రెషర్‌కుకర్‌లో పెట్టి ఉడికించాలి. ఒక విజిల్‌ వచ్చిన తర్వాత మంట తగ్గించి ఐదు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఈ లోపు... ∙అరకప్పు మీగడ పాలను మరిగించి కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి ∙పెనంలో రెండు స్పూన్ల వెన్న వేసి జీడిపప్పు, బాదం పలుకులను వేయించి పక్కన పెట్టుకోవాలి ∙కుకర్‌లో ఉడికించిన అన్నం, పప్పు మిశ్రమాన్ని గరిటతో మెదపాలి ∙ఇప్పుడు వెడల్పాటి పెనంలో వెన్న వేసి కరిగిన తర్వాత అన్నం, పప్పు మిశ్రమం వేసి అందులో చక్కెర కలపాలి. చక్కెర కరిగినప్పుడు అన్నం గరిటె జారుడుగా అవుతుంది. అడుగు పట్టకుండా కలుపుతూ దగ్గరయ్యే వరకు ఉడికించాలి. చివరగా కుంకుమ పువ్వు పాలను పోసి కలిపి, వేయించిన జీడిపప్పు, బాదం పలుకులతో గార్నిష్‌ చేయాలి.
గమనిక: ప్రెషర్‌ కుకర్‌లో నీటిని పోసి అందులో అన్నం, పప్పు ఉన్న పాత్రను పెట్టి ఉడికించాలి. ఈ పాత్ర చిన్నదైతే ఉడికేటప్పుడు పాలు ఒలికిపోతాయి. కాబట్టి పాత్ర సగం ఖాళీగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు మిశ్రమం ఉడికిన తర్వాత కూడా పాత్రలో ముప్పావుకు మించదు.
శ్రీఖండ్‌
కావలసినవి : పెరుగు: మూడు కేజీలు; పంచదార: కేజి; ఏలకుల పొడి: టీ స్పూన్‌; రోజ్‌వాటర్‌: 1 టీ స్పూన్‌; లెమన్‌ కలర్‌: కొన్ని చుక్కలు; బాదంపప్పు: 2 టీ స్పూన్లు; పిస్తా: 2 టీ స్పూన్లు
తయారి : 
∙పెరుగుని మెత్తని బట్టలో కట్టి నీళ్లు పోయేటట్లు రెండు గంటలపాటు ఉంచాలి
∙ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పంచదార, ఏలకుల పొడి, రోజ్‌వాటర్, లెమన్‌ కలర్‌ వేసి బాగా కలియపెట్టాలి
∙ఇలా తయారైన శ్రీఖండ్‌ని ఫ్రిజ్‌లో చల్లబడేవరకూ ఉంచాలి
∙సర్వ్‌ చేసేముందు పిస్తా, బాదంతో అలంకరించుకోవాలి.
వెన్న ఉండలు
కావలసినవి :
మైదా–కప్పు; బియ్యప్పిండి–1/4 కప్పు; పంచదార–కప్పు; ఉప్పు–చిటికెడు; వంటసోడా–చిటికెడు; నూనె– వేయించడానికి సరిపడా.
తయారి :
∙మైదాలో బియ్యప్పిండి, ఉప్పు, వెన్న, వంటసోడా వేసి బాగా కలిపి తగినన్ని వేడినీళ్లు పోసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకొని గంటసేపు నాననివ్వాలి
∙తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారుచేసుకొని వేడినూనెలో తక్కువ మంటమీద బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి
∙ఒక గిన్నెలో పంచదార తీసుకొని, మునిగే వరకు నీళ్లు పోసి ఉండపాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించాలి ∙అప్పుడు వేయించిన ఉండలను పాకంలో వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి.
పన్నీర్‌ లడ్డు
కావలసినవి :
పాలు: రెండు లీటర్లు; మైదా: అయిదు టీస్పూన్లు; నెయ్యి: అరకప్పు; పంచదార: రెండు కప్పులు; వెనిగర్‌: కప్పు; జీడిపప్పు: రెండు టీస్పూన్లు; కిస్‌మిస్‌: రెండు టీస్పూన్లు
తయారి : ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి ∙మరో చిన్న గిన్నెలో మైదాపిండి తీసుకొని నీళ్లు కలిపి వేడి చేసిన పాలలో పోయాలి ∙దీంట్లో వెనిగర్‌ కలిపితే పాలు విరుగుతాయి ∙విరిగిన పాలను సన్నని బట్టలో వేసి చల్లటి నీళ్లలో రెండు నిమిషాలు ఉంచాలి ∙నీళ్లు పూర్తిగా పిండేసి గట్టిపడిన మిశ్రమాన్ని ప్లేట్‌లో ఆరనివ్వాలి ∙బాణలిలో పంచదార, నెయ్యి, విరిగిన పాల మిశ్రమం వేసి కలపాలి ∙ చేతికి కొద్దిగా నెయ్యి అద్దుకొని ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ జీడిపప్పు, కిస్‌మిస్‌లను చేర్చుతూ కావల్సిన సైజులో లడ్డూలు కట్టాలి.
అజ్మీరీ కలాకండ్‌
కావలసినవి : 
పాలు: అయిదు లీటర్లు;
పంచదార: అరకిలో;
నెయ్యి: అరకప్పు;
జాజికాయ పొడి: చిటికెడు.
తయారి : ∙పాలను ఒక బాణలిలో తీసుకుని దానిలో పంచదార వేసి బాగా చిక్కగా అయ్యేవరకు మరగనివ్వాలి ∙ఆ తరువాత
నెయ్యి చేర్చి బాగా కలియపెట్టాలి . జాజికాయ పొడిని కలిపి దించాలి.
ఉప్ప సీదై
కావలసినవి : బియ్యప్పిండి – ఒక కప్పు; (రెడీమేడ్‌గా పిండి లేకపోతే ఒకటిన్నర కప్పు బియ్యాన్ని కడిగి రెండు గంటల సేపు నానబెట్టి వడపోసి, తడి పోయే వరకు మందపాటి టవల్‌ మీద ఆరబెట్టి మిక్సీలో పొడి చేసి జల్లించాలి); మినప్పప్పు– 2 టేబుల్‌ స్పూన్‌లు; ఎండు కొబ్బరి తురుము– 2 టేబుల్‌ స్పూన్‌లు; వెన్న – ఒక కప్పు; నువ్వులు– ఒక టేబుల్‌ స్పూన్‌; ఉప్పు– తగినంత; నూనె – వేయించడానికి సరిపడినంత.
తయారీ : మందపాటి పెనంలో మినప్పప్పును దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేయాలి. బియ్యప్పిండి, మినప్పిండిని కలిపి జల్లించాలి. ఈ పిండిలో ఉప్పు, వెన్న, నువ్వులు, కొబ్బరి పొడి వేసి కలపాలి. ఇప్పుడు తగినంత నీటిని వేస్తూ ముద్ద చేయాలిబాణలిలో నూనె పోసి కాగేలోపు పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. నూనెలో కొద్దిగా పిండి వేసిన వెంటనే అది పైకి తేలితే నూనె కాగినట్లు. అప్పుడు ఉండలను వేసి చిల్లుల గరిటెతో కలియతిప్పుతూ బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసేయాలి. ఇవి కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి.
గమనిక
ఉండలు బఠాణి గింజల కంటే కొంచెం పెద్దవిగా ఉండాలి. మరీ పెద్దవయితే లోపల సరిగా కాలవు. అలాగే మీడియం ఫ్లేమ్‌ మీద వేయించాలి. మంట ఎక్కువైతే లోపల పచ్చిగా ఉండగానే పైన నల్లగా అవుతాయి ∙వెన్న ఉండలు మరింత మృదువుగా కావాలనుకుంటే బియ్యప్పిండిలో మైదా కూడా కలుపుకోవచ్చు. ఆరోగ్యం కోసం మైదాను మినహాయించడమే మంచిది.


జ్ఞానమూర్తి... గీతాచార్య
సందర్భం
శ్రీ మహావిష్ణువు దశావతారాలలో అత్యంత విలక్షణమైనదీ, జ్ఞానస్మృతి కలిగినదీ శ్రీ కృష్ణావతారం. సకల జీవులలో తానే ఉన్నానని తనను తాను స్వయంగా భగవానుడిగా ప్రకటించుకున్న మధుసూదనుడాయన. సమస్త భూమండలాలలో యదువంశ శిరోమణి అయిన శ్రీ కృష్ణభగవానుడు అందరినీ మించిన పూజార్హుడని వేదం చెబుతుంది. పిలవగానే పలికే దైవం శ్రీమన్నారాయణుడే అని అనడానికి కారణాలెన్నో ఉన్నాయి కానీ, వాటిలో ముఖ్యమైనవి కొన్ని... వాసుదేవుని ఎంతో ఆరాధించే పాండవులతోపాటు ద్రౌపదికి జరిగిన అవమానం ఇప్పుడు ప్రస్తావిస్తే.. నిస్సహాయులైన తన భర్తలను చూసి రోదిస్తూ నిండుసభలో ద్రౌపది పరాభవ సమయంలో త్వమేవ శరణం అని పిలవగానే వచ్చి తన శీలాన్ని కాపాడిన కృష్ణుడిని సోదర భావంతో ఆరాధించేది. ఎప్పుడు కష్టం కలిగినా, నేనున్నాను అని అన్నయ్య స్థానాన్ని తీసుకుని ద్రౌపదికి ఆపద్బాంధవుడయ్యాడు ఈ గోకుల నందనుడు. తనను ఆరాధించే వారికి తానున్నానంటూ అక్కున చేర్చుకునే దయాహృదయుడు వాసుదేవుడు.
అర్జునుడికి ఒక ఇష్టసఖుడనే కాకుండా తనని ఎప్పుడూ మంచి స్నేహితునిగా చూసే శ్రీకృష్ణభగవానుడు, ధర్మక్షేత్రంగా పేరుగాంచిన కురుక్షేత్ర రణరంగంలో యోధానుయోధుల నడుమ నిలిచి శోకమోహాలలో మునిగిన అర్జునుడికి గురువై తత్వ దర్శనం కలిగించాడు.
శకునికి మాయారూపిగా, విదురునికి ధర్మాత్మునిగా ఇలా అనేకులకు అనేకవిధాలుగా దర్శనం ఇవ్వడం శ్రీమన్నారాయణుడికే సాధ్యం. నీతిశాస్త్ర కోవిదుడు అయిన విదురుడు శ్రీకృష్ణభగవానుడి గురించి అనేక సందర్భాలలో మహారాజు ధృతరాష్ట్రునికి, సభికులందరికీ శ్రీకృష్ణుడి జీవితం ఒక ధర్మశాస్త్రం అని భగవానుడి నోటినుంచి వచ్చే అక్షర ధ్వని వేదప్రమాణం అని తెలిపేవాడు.
మాయాజూదగాడయిన శకునికి ఎవరివద్దనైనా తన మాయ చెల్లుతుంది కానీ శ్రీకృష్ణుని వద్ద మాత్రం సాధ్యం కాదని తెలుసు. అందుకే కృష్ణ భగవానుడు శకునికి మాయారూపిగా దర్శనం ఇస్తుండేవాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మాధవ మేధస్సుకు అందని ఆ గోవిందుడి లీలలు అనేకం. భీష్ముడే శ్రీ కృష్ణుని జగద్గురువుగా కీర్తించాడు. పరమేశ్వరుడు కూడా శ్రీ మహావిష్ణువునే ఆరాధిస్తాడని వేదాలు ఘోషిస్తున్నాయి. జయ జయ కృష్ణ.
– స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శారదాపీఠం, విశాఖపట్నం


అందరి బంధువయా!
కృష్ణతత్వం చిత్రమైనది. బాలకృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి, రాధాకృష్ణుడిగా ఆయన చూపిన రాసలీలలు, గీతాచార్యుడిగా ఆయన చేసిన ఉపదేశం.. ఇలా అనంత కోణాల్లో.. అనంత తత్వాలు గోచరిస్తాయి ఆయనలో. అందుకే వ్యాస భగవానుడు ప్రతి పురాణంలోనూ కృష్ణుని గురించి ఎక్కడో ఓ చోట, ఏదో రకంగా స్పృశించాడు. అయినా తృప్తి కలుగక ‘శ్రీమద్భాగవతం’ ద్వారా కృష్ణతత్వాన్ని ప్రపంచానికి చాటి, తన అవతార ప్రయోజనాన్ని నెరవేర్చుకున్నాడు వ్యాసుడు.

కృష్ణుడు కేవలం లీలలు చూపిన ఆనందలోలుడు కాదు. పరమాత్మ భావాన్ని పరిపూర్ణంగా ప్రకటితం చేసిన అవతారం.. కృష్ణావతారం. ఉపనిషత్‌ సారభూతమైన భగవద్గీతను బోధించి జగద్గురువు అయ్యాడు. భాగవత దృష్టాంతాలు.. నల్లనయ్య ఎంత చల్లనయ్యో తెలిపితే... ‘భగవద్గీత’ సిద్ధాంతంలో సంపూర్ణమైన కృష్ణతత్వం గోచరం అవుతుంది. ‘‘కృష్ణస్తు లీలామయః, కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌’’ అంటారు. తన చేష్టలనే లీలలుగా చూపించి అందరివాడు అయ్యాడాయన. సంపూర్ణమైన జ్ఞానంతో జగత్తు రక్షణ కోసం చేసిన లీలలవి. భగవద్గీతలో తానే దైవాన్ని అని ప్రకటించుకున్నాడు కృష్ణుడు. అందుకే ఆయన లీలామానుష రూపంలో ఉన్న భగవానుడు. ఈ జగత్తును ఉద్ధరించడానికి అవతారమూర్తిగా వచ్చాడు.

అవతారం అన్నప్పుడు దానికో ప్రయోజనం ఉండాలి. వాటిని నెరవేర్చుకోవడానికి కృష్ణుడు బాల్యం నుంచే లెక్కలేనన్ని మాయలు చూపాడు. మాయాశక్తిగా అవతరించాడు, ద్వారపాలకులను మాయజేసి చెరసాల నుంచి బయటపడ్డాడు. మాయ ద్వారానే యమునా నదిని దాటి రేపల్లె చేరుకున్నాడు. మట్టి తిని యశోదమ్మకు బ్రహ్మాండాలు చూపించాడు. శకటాసురుణ్ణి నిర్జించాడు. కాళీయుడి పీచం అణిచాడు. గోవర్ధనగిరిని చిటికెన వేలుతో ఎత్తాడు. కంసుడిని సంహరించాడు.. ఇలా బాల్యంలోనే ఎన్నో మాయలు చూపాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి మాయోపాయాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. మాయలో పడిపోయినవారిని కాపాడడానికి ఈ మాయలు చూపాడు. కానీ, ఎన్నడూ మాయలో పడిపోలేదు. అందుకే కృష్ణుడు దేవుడయ్యాడు. యుగాలు దాటినా పూజలు అందుకుంటున్నాడు.

కృష్ణానుభవం కోసం ఎందరో మునులు, సిద్ధులు పరితపిస్తుంటారు. కృష్ణదర్శన లాలసలో కొట్టుమిట్టాడుతుంటారు. బృందావనంలో కృష్ణ దర్శనం కోసం ఇప్పటికీ ఎందరో సిద్ధులు తపస్సు చేస్తూ కనిపిస్తుంటారు. రాధాదేవి లోనైన అలౌకిక ఆనందాన్ని తమకూ ప్రసాదించాలని కృష్ణుడిని కొలుస్తుంటారు. ఆ స్వామి కొందరిని అనుగ్రహిస్తాడు, కొందరిని ఆటపట్టిస్తాడు. లౌకిక విషయాలకు లోనవకుండా పరమాత్మ దర్శనం కోసం పట్టువిడువక పరితపించే వారికి బృందావన దర్శన భాగ్యం కల్పిస్తాడు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list