MohanPublications Print Books Online store clik Here Devullu.com

నోరూరించే_నువ్వుల_పూర్ణం_Nuvvulapurnam

నోరూరించే నువ్వుల పూర్ణం
Nuvvulapurnam




ఖర్జూర మోదకాలు

కావలసినవి 
బియ్యప్పిండి లేదా జొన్నపిండి: 2 కప్పులు, ఖర్జూరాలు/ఎండు అంజీరాలు: కప్పు, కొబ్బరి తురుము: కప్పు, నువ్వులు: 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: చిటికెడు, నెయ్యి: 2 టీస్పూన్లు 
తయారుచేసే విధానం 
* బాణలిలో నువ్వులు వేసి వేయించి చల్లారాక మెత్తని పొడిలా చేయాలి. 
* ఖర్జూర ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. అందులోనే నువ్వులు, తాజా కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గుండ్రని ఉండల్లా చేసి పక్కన ఉంచాలి. 
* బియ్యప్పిండి లేదా జొన్నపిండిలో ఉప్పు వేసి మరిగించిన నీళ్లు కొంచెంకొంచెంగా పోస్తూ కలపాలి. నాలుగైదు నిమిషాల తరవాత పిండిని బాగా మృదువుగా కలపాలి. చేతులకి నెయ్యి రాసుకుని పిండిని గుండ్రని ఉండల్లా చేసుకుని చిన్న బిళ్లల్లా వత్తి వాటి మధ్యలో ఖర్జూర మిశ్రమంతో చేసిన ఉండని పెట్టి అంచుల్ని మూసేసి మళ్లీ గుండ్రని ఉండలాగానీ వెల్లుల్లి ఆకారంలోగానీ చేయాలి. ఇప్పుడు వీటిని ఆవిరిమీద పది పదిహేను నిమిషాలు ఉడికించి దించాలి.


ప్రసాదం పులిహోర

కావలసినవి 
బియ్యం: 2 కప్పులు, చింతపండు: పెద్ద నిమ్మకాయంత, ఆవాలు: టీస్పూను, మినప్పప్పు: 2 టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, దనియాలు: టీస్పూను, నువ్వులు: టీస్పూను, ఇంగువ: పావుటీస్పూను, పసుపు: ముప్పావు టీస్పూను, కరివేపాకు: 12 రెబ్బలు, ఎండుమిర్చి: ఎనిమిది, ఉప్పు: రుచికి సరిపడా, బెల్లం తురుము: పావుటీస్పూను, నువ్వుల నూనె: 4 టేబుల్‌స్పూన్లు 
తయారుచేసే విధానం 
* చింతపండుని మరిగించిన నీళ్లలో పది నిమిషాలు నానబెట్టి గుజ్జు తీయాలి. 
* బాణలిలో 2 టీస్పూన్ల నూనె వేసి టేబుల్‌స్పూను మినప్పప్పు, టీస్పూను సెనగపప్పు వేసి వేయించాలి. తరవాత దనియాలు, నువ్వులు, ఎండుమిర్చి కూడా వేసి వేయించి చల్లారాక పొడి చేయాలి. 
* అన్నం ఉడికించి బేసిన్‌లో వేసి చల్లారనివ్వాలి. అందులో 2 టేబుల్‌స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి కలపాలి. 
* బాణలిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి వేగాక, ఇంగువ, చింతపండు గుజ్జు వేసి అందులోని నీరంతా ఆవిరైపోయి, నూనె తేలే వరకూ ఉడికించాలి. తరవాత బెల్లం వేసి కలిపి దించి, అన్నంలో కలపాలి. తరవాత పప్పులపొడి కూడా వేసి బాగా కలపాలి.



పాలతాలికలు

కావలసినవి 
బియ్యం: కప్పు, పాలు: అరలీటరు, సగ్గుబియ్యం: 4 టేబుల్‌స్పూన్లు, బెల్లంతురుము: కప్పు, యాలకులపొడి: చిటికెడు, మంచినీళ్లు: తగినన్ని, యాలకులపొడి: టీస్పూను 
తయారుచేసే విధానం 
* బియ్యం నాలుగు గంటలపాటు నానబెట్టి నీళ్లు వంపేసి తడి లేకుండా కాస్త ఆరనిచ్చి మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేయాలి. 
* మందపాటి గిన్నెలో పాలు పోసి మరిగించి సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. 
* మరో గిన్నెలో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి కరిగిన తరవాత, రెండు టీస్పూన్ల బియ్యప్పిండి కూడా వేసి కలిపి లేత పాకం రానిచ్చి, స్టవ్‌మీద నుంచి దించి పక్కన ఉంచాలి. 
* ఇప్పుడు మిగిలిన బియ్యప్పిండిలో తగినన్ని నీళ్లు పోసి జంతికల పిండిలా కలపాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో పెట్టి, లేదా తాలికల పళ్ళెంలో మరిగిన పాయసంలో వత్తి, ఉడికించాలి. తాలికలు పూర్తిగా ఉడికిన తరవాత బెల్లం పాకం వేసి నెమ్మదిగా కలిపి యాలకులపొడి డ్రైనట్స్‌ ముక్కలు వేసి కలిపి దించాలి.


నువ్వుల పూర్ణాలు

కావలసినవి 
నువ్వులు: 2 కప్పులు, పల్లీలు: కప్పు, కొబ్బరితురుము: కప్పు, బెల్లం తురుము: మూడు కప్పులు, నూనె: వేయించడానికి సరిపడా; పైపూతకోసం: బియ్యం: 4 కప్పులు, మినప్పప్పు: 2 కప్పులు, ఉప్పు: రుచికి సరిపడా 
తయారుచేసే విధానం 
* మినప్పప్పు, బియ్యం కడిగి విడివిడిగా సుమారు ఆరుగంటలపాటు నాననిచ్చి, మెత్తగా రుబ్బుకోవాలి. 
* బాణలిలో నువ్వులు వేసి సిమ్‌లో వేయించాలి. తరవాత వేరుసెనగపప్పు కూడా వేయించాలి. ఆరాక ఈ రెండింటినీ మిక్సీలో వేసి పొడి చేయాలి. తరవాత అందులోనే కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి రుబ్బాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని గుండ్రని ఉండల్లా చేసి మినప్పిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో వేయించి తీయాలి.

#నోరూరించే_నువ్వుల_పూర్ణం
#Nuvvulapurnam

ఓ బొజ్జగణపయ్యా.. విందారగించయ్యా!
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఉత్సాహంగా రంగురంగుల పూలతో పాలవెల్లి కట్టి ‘ఓ బొజ్జ గణపయ్యా, నీ బంటు మేమయ్యా’... అంటూ వినాయకుడిని పూజిస్తారు!. దాంతోపాటూ కుడుములూ, ఉండ్రాళ్లూ తప్పనిసరే.. అవి కాకుండా ఇంకేం చేసుకోవచ్చో కూడా ఓసారి చూద్దామా.



పెసరపప్పు బూరెలు

కావల్సినవి: బియ్యప్పిండి, మైదా - కప్పు చొప్పున, పెసరపప్పు, తెల్ల నువ్వులు - కప్పు చొప్పున, ఎండు కొబ్బరి పొడి -రెండు చెంచాలు, యాలకులపొడి - చెంచా, నీళ్లు - పావుకప్పు, ఉప్పు - పావుచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా, బెల్లంతరుగు - కప్పు. 
తయారీ: పొయ్యిమీద బాణలిని పెట్టి.. పెసరపప్పును వేయించుకుని తీసుకోవాలి. తరవాత తెల్ల నువ్వులు వేయించుకోవాలి. రెండు గంటల పాటు పెసరపప్పును నానబెట్టుకుని ముద్దలా చేసుకోవాలి. నువ్వుల్ని పొడిచేసుకోవాలి. గిన్నెలో బెల్లం తరుగూ, నీళ్లూ తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. బెల్లం కరిగి తీగపాకం పడుతున్నప్పుడు పెసరపప్పు ముద్ద, ఎండుకొబ్బరి పొడీ, తెల్లనువ్వుల పొడి కలపాలి. ముద్దలా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి. వేడి చల్లారాక ఈ పూర్ణాన్ని ఉండల్లా చేసుకుని పెట్టుకోవాలి. మైదా, బియ్యప్పిండీ, ఉప్పు ఓ గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసుకుంటూ దోశపిండిలా కలుపుకోవాలి. ఇందులో ఒక పెసరపప్పు ఉండను ముంచి.. కాగుతోన్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. ఇలాగే మిగిలినవీ చేసుకోవాలి.


కొబ్బరి మోదక్‌

కావల్సినవి: పచ్చి కొబ్బరి తురుము - కప్పు, బెల్లం తురుము - కప్పు, యాలకులపొడి - చెంచా, బియ్యప్పిండి - కప్పు, నూనె - మూడు చెంచాలు, నీళ్లు - కప్పు, ఉప్పు - చిటికెడు. 
తయారీ: ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక ఉప్పూ, నూనె వేయాలి. వెంటనే బియ్యప్పిండి వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ముద్దగా అయ్యాక దింపేయాలి. ఇది చల్లారేలోగా పచ్చికొబ్బరితురుమూ, బెల్లం తురుమూ ఓ గిన్నెలో తీసుకుని సన్నని మంటపై పెట్టాలి. ఇది దగ్గరకు అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి. దీన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు మోదక్‌ అచ్చుకు కాస్త నూనె రాసి అందులో బియ్యప్పిండి ముద్దను పరిచి.. మధ్యలో కొబ్బరి పూర్ణాన్ని ఉంచాలి. అచ్చుని నొక్కితే మోదక్‌లా అవుతుంది. ఇలా మిగిలిన పిండినీ చేసుకుని అన్నింటినీ కలిపి ఇడ్లీ కుక్కర్‌లో ఉంచి పది నిమిషాలు ఆవిరిపై ఉడికించుకుని తీసుకుంటే చాలు.




వాక్కాయ పులిహోర

కావల్సినవి: అన్నం - కప్పు, వాక్కాయలు - అరకప్పు, నూనె - పెద్దచెంచా, మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు - అరచెంచా చొప్పున, ఎండుమిర్చి, పచ్చిమిర్చి - మూడు చొప్పున, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత. 
తయారీ: వాక్కాయల మధ్య ఉండే గింజల్ని తీసేసి మిక్సీలో ముద్దలా చేసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి.. నూనె వేయాలి. అది వేడయ్యాక మినప్పప్పూ, సెనగపప్పూ, ఆవాలూ, ఎండుమిర్చీ వేయాలి. అవి వేగాక పచ్చిమిర్చీ కరివేపాకు రెబ్బలూ కూడా వేయించాలి. రెండు నిమిషాలయ్యాక వాక్కాయ ముద్ద వేసి వేయించి దింపేయాలి. వేడి కాస్త తగ్గాక ఈ తాలింపును అన్నంలో పసుపూ, తగినంత ఉప్పు వేసి బాగా కలిపితే చాలు.


బటన్‌ కుడుముల తాలింపు

కావల్సినవి: తాజా బియ్యప్పిండి - కప్పు( బియ్యాన్ని ముందురోజు నానబెట్టుకోవాలి. మర్నాడు బాగా ఆరనిచ్చి పిండిలా చేసుకోవాలి), పెసరపప్పు (ముందుగా నానబెట్టుకోవాలి), పచ్చి కొబ్బరి తురుము - అరకప్పు చొప్పున, జీలకర్ర, ఆవాలు - చెంచా చొప్పున, ఎండుమిర్చి - నాలుగు, కరివేపాకు రెబ్బలు - రెండు, నూనె - మూడు చెంచాలు, నీళ్లు - కప్పు, నెయ్యి - చెంచా, ఉప్పు - తగినంత. 
తయారీ: ఓ గిన్నెలో రెండుకప్పుల నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అందులో చిటికెడు ఉప్పూ, చెంచా నూనె వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇది ముద్దలా అయ్యాక దింపేయాలి. చేతికి నెయ్యి రాసుకుని పిండిని పొడుగ్గా చేసుకుని చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక ముక్కను తీసుకుని వెడల్పుగా వచ్చేలా నొక్కాలి. ఇలా చేసుకున్న వాటిని ఆవిరిపై ఐదు నిమిషాలు ఉడికించుకుని తీసుకోవాలి. తరువాత నానబెట్టిన పెసరపప్పులోని నీళ్లు వంపేసి పచ్చికొబ్బరి తురుము వేసి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలూ, జీలకర్రా, ఎండుమిర్చీ, కరివేపాకు వేయించుకోవాలి. ఈ తాలింపులో పెసరపప్పు ముద్దను వేసి రెండు నిముషాలు వేయించి, మáందుగా అవిరి పట్టి పెట్టుకున్న కుడుములూ, తగినంత ఉప్పు వేసి వేయించుకుని తీసుకోవాలి.



ఉల్లికాడల వడల

కావల్సినవి: సెనగపప్పు - కప్పు, మినప్పప్పు - పావుకప్పు, ఉల్లికాడల తరుగు - కప్పు, పచ్చిమిర్చి - ఆరు, జీలకర్ర - చెంచా, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు, నూనె - వేయించేందుకు సరిపడా. 
తయారీ: మినప్పప్పూ, సెనగపప్పును కలిపి రెండుగంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత మరీ మెత్తగా కాకుండా రుబ్బి పెట్టుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి.. బాగా కలపాలి. ఈ పిండిని వడల్లా తట్టుకుని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి.

ఎన్‌.అన్నపూర్ణ, 
తిరుపతి


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list