అర్ధసత్యాలను నమ్మొద్దు!
దశోపనిషత్తుల్లో రెండవది కేనోపనిషత్తు. ఈ కేనోపనిషత్తు ఆత్మ అంటే ఏమిటో, బ్రహ్మమంటే ఏమిటో వివరిస్తుంది. ఆత్మ శక్తితోనే చెవి వినగలుగుతోంది. మనస్సు గ్రహిస్తోంది. వాక్కు పలుకుతోంది. ప్రాణం ఉంటోంది. కన్ను చూస్తోంది. ఈ సత్యాన్ని, ఆత్మ తత్వాన్ని తెలుసుకున్నవారు అమృతత్వాన్ని పొందుతారు.
ఈ ఆత్మను... అనగా బ్రహ్మపదార్థాన్ని ఎలా చూడాలి? ఎలా చెప్పాలి... అంటే, దానిని కళ్లతో చూడలేము. వాక్కుతో చెప్పలేము. మనసుతో తెలుసుకోలేము. అది మనకు తెలిసిన వాటన్నింటికీ వేరైనది. తెలియని వాటికి పైన ఉంటుంది. అయితే, తెలియనిదానిని గురించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఊహించి అదే సత్యం అనుకుంటారు. నలుగురు గుడ్డివాళ్లు ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు. ఒకడు తొండం పట్టుకుని తొండమే ఏనుగు అన్నాడు. మరొకడు తోక పట్టుకొని తోకే ఏనుగు అన్నాడు. ఇంకొకడు కాలు, మరొకడు దంతాన్ని పట్టుకుని అనే ఏనుగు అనుకున్నారు. వారికి తెలిసిన పాక్షిక సత్యాన్ని అజ్ఞానంతో అహంకారంతో సంపూర్ణ సత్యంగా ప్రకటిస్తున్నారు.
పాక్షిక సత్యాన్ని విని మోసపోవద్దని చెప్పడం కేనోపనిషత్తు విశిష్టత. దేనిని మాటలతో చెప్పలేమో, దేనితో మాటలు ఏర్పడ్డాయో అదే అసలైన బ్రహ్మపదార్థం. భ్రమతో అనుకునేది నిజమైనది కాదు. ఏది మనస్సుకు తెలియదో, దేనివల్ల మనస్సు అన్నిటినీ తెలుసుకోగలుగుతోందో అనే అసలైన బ్రహ్మం. దేనిని కళ్లతో చూడలేమో, దేనివల్ల కళ్లు చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మం. దేనిని చెవితో వినలేమో, దేనివల్ల చెవి వినగలుగుతోందో అదే బ్రహ్మం.
దేనిని ప్రాణం బతికించలేదో ప్రాణం దేనివల్ల ఉంటున్నదో అదే బ్రహ్మం అని తెలుసుకోవాలి. అంతేకానీ, పాక్షిక సత్యాలను తాత్కాలిక ఫలితాలను నమ్మి మోసపోవద్దని కేనోపనిషత్తు చెబుతోంది. మాటలతో, మనసుతో, చూపుతో, వినికిడితో, ప్రాణంతో పరబ్రహ్మజ్ఞానం కలిగినట్లు భావించరాదు. అంతరిక్షంలోకి పోయే వాహనంలో కొన్ని భాగాలు ఎక్కడికక్కడ విడిపోయి పడిపోతూ ఉంటాయి. అసలైన ఉపగ్రహాన్ని పైకి చేర్చటమే వాటి పని. అంతేకాని అవి ఉపగ్రహం కావు. వాక్కు, మనస్సు, కన్ను, చెవి, ప్రాణం అలాంటివి. సగుణపాసన అలాంటిదే అని కేనోపనిషత్తు స్పష్టంగా చెబుతోంది.
ఇనుములాంటి ఒంటి కోసం మినుములు
మినుములు తింటే ఇనుమంత బలం అన్నది మన వాడుక. దీనిలోని పోషకాలు మంచి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తాయి కాబట్టి... వ్యాధి కారకాలకు మన ఒళ్లు ఇనుములాగే తోస్తుంది. దాంతో ఎన్నో రకాల జబ్బుల నుంచి నివారణ సాధ్యమవుతుంది. వంద గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు (ఫైబర్) ఉంటుంది. ఒక గ్రాము పొటాషియమ్, రెండు గ్రాముల కొవ్వులతో పాటు విటమిన్ సి, విటమిన్ బి–కాంప్లెక్స్‌లోని బి1, బి3 వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాల్షియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, ఐరన్ కూడా ఎక్కువే. మినుములతో ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని...
► మినుముల్లో ప్రోటీన్ పాళ్లు ఎక్కువ. ప్రోటీన్లు కండరాల రిపేర్లకు ఉపయోగపడతాయి. పైగా మినుముల్లో వాపు, మంటను తగ్గించే యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ గుణం ఉంది. కాబట్టి గాయాలైన వారికి అవి త్వరగా తగ్గడానికి మినుములు మంచి ఆహారం.
► ఇక మినుముల్లో దాదాపు 72 శాతం పీచు ఉండటం వల్ల మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేగాక మలబద్దకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను స్వాభావికంగానే తొలగిస్తాయి. అంతేకాదు... జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు కూడా మందులకు బదులు మినుముతో చేసిన వంటకాలను వాడవచ్చునని ఆహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
► గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణం మినుములకు ఉంది. ఇందుకు మినుముల్లో పుష్కలంగా ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే కారణం. అవి రక్తంలోకి వెలువడే చక్కెర, కొలెస్ట్రాల్ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది.
► కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలిగించే గుణం కూడా మినుములకు ఉంది.
► స్వాభావికమైన పీచు ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ సమస ఉన్నవారికి మినుములు మంచి ఆహారం.
కొబ్బరి పొడి
తయారి సమయం 25 నిమిషాలు
కావలసినవి
నూనె లేదా నెయ్యి – టేబుల్ స్పూన్
మినప్పప్పు – అర కప్పు
శనగపప్పు – అర కప్పు; ఎండుమిర్చి – 8
ఎండు కొబ్బరిచిప్ప – ఒకటి; వెల్లుల్లి రేకలు – 8
ఉప్పు – రుచికి సరిపడా
తయారి: ∙ముందుగా ఎండుకొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ∙మందపాటి పాత్రలో టీ స్పూన్ నూనె వేసి, పప్పులు, ఎండుమిర్చి వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ∙అదే పాత్రలో ఎండుకొబ్బరి ముక్కలు వేసి నాలుగు నిమిషాల పాటు వేయించి తీయాలి. ∙చల్లారిన పదార్థాలతో వెల్లుల్లి రేకలు, ఉప్పు కలిపి మిక్సీలో వేసి పొడి చేయాలి ∙గ్రైండ్ చేసిన పొడిని కంటైనర్‌లో నిల్వ చేయాలి ∙వేడివేడి ఇడ్లీల్లోకి గాని, దోసెల్లోకి గాని నేతి కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది.
మొటిమల నివారణకు..
సాధారణంగా టీనేజ్‌లోనే బాధించే మొటిమలు వాటితో వచ్చే యాక్నె సమస్య ఇప్పుడు వాతావరణ కాలుష్యం కారణంగా ఎవరినీ వదలడం లేదు. ఇందుకోసం ఎక్కువ సమయం, డబ్బు వెచ్చించకుండా ఇంట్లోనే కొద్దిగా శ్రమ పడితే ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు.
► ముల్లంగిని మెత్తగా గ్రైండ్ చేసి అందులో రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అంతే మోతాదులో టొమాటో రసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇది పట్టించిన తర్వాత ఐదు నిమిషాల సేపు కొద్దిగా మంట అనిపిస్తుంది. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా ఒక వారం రోజుల పాటు రోజుకొకసారి చేస్తే మొటిమలు, వాటి కారణంగా వచ్చే ఇన్‌ఫెక్షన్స్ పూర్తిగా తగ్గుతాయి.
► మొటిమలు తగ్గినా కూడా వారానికొకసారి ఈ ప్యాక్ వేస్తే చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. మొటిమలు, యాక్నె రాకుండా ముఖం తేటగా ఉంటుంది.
► ముల్లంగిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. 20 ఎం.ఎల్ రసానికి అంతే మోతాదులో మజ్జిగ కలిపి ముఖానికి పట్టించాలి. ఒక గంట సేపటి తర్వాత ముఖాన్ని వేడి నీటితో కడగాలి. ఈ ప్యాక్ చర్మగ్రంథుల నుంచి విడుదలయ్యే అదనపు జిడ్డును తొలగించి బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది. ఇలా ఒక వారం చేస్తే కొత్త మొటిమలు రావు. అప్పటికే ఉన్నవి కూడా రాలిపోయి చర్మం నునుపుగా మారుతుంది.
తిండి తగ్గించేకొద్దీ... షుగర్ పెరుగుతోందేమిటి?
నా వయసు 36,. గత మూడేళ్లుగా నాకు మధుమేహం ఉంది. మాత్రలు వేసుకుంటున్నా, షుగర్ నియంత్రణలోకి రాకపోవడంతో ఇటీవల తినే ఆహారపు మోతాదును బాగా తగ్గించాను. అప్పుడూ ఇప్పుడూ మూడు పూటల తిండే... కాకపోతే తినే మోతాదే సగానికి తగ్గించాను. దీనివల్ల శరీరం నీరసించిపోతోందే తప్ప షుగర్ మాత్రం తగ్గడం లేదు. పైగా ఒక్కోసారి పెరుగుతోంది కూడా. నేనున్నది మార్కెటింగ్ రంగంలో. షుగర్ నియంత్రణ కోసం వాకింగ్, జాగింగ్ లాంటివి చేసే టైం నాకెలాగూ లేదు. ఈ స్థితిలో నన్నేం చేయమంటారో చెప్పండి.
కె. ప్రవీణ్, విశాఖపట్నం.
మీ భోజనం మోతాదును సగానికి తగ్గించానంటున్నారు. అయితే అంతకు ముందు ఏం తినే వారు, ఇప్పుడు ఏం తింటున్నారు? ఈ వివరాలేమీ రాయలేదు. సాధారణంగా ఎక్కువ మంది తీసుకునేది కార్బోహైడ్రేట్లే కాబట్టి వాటి స్థానంలో ప్రొటీన్ మోతాదును, ఫైబర్ మోతాదును పెంచాలి. క్యాల్షియం, ఐరన్, జింక్ , పొటాషియం, మెగ్నీషియం మోతాదును పెంచాలి. అలా కాకుండా అప్పటికే చాలీ చాలని పోషకాలు తీసుకుంటూ ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు, వాటిల్లోనే ఇంకా సగం తగ్గించేస్తే శరీరం నీరసించిపోకుండా ఏమవుతుంది? దీనికి తోడు ఆ లోటును బలవర్థక ఆహారంతో పూరించకపోతే, ఎముకలు, కండరాలు రోజురోజూ బలహీనపడతాయి. దీనివల్ల ఎముకలు గుళ్లబారిపోయి ఆస్టియో పొరోసిస్ వ్యాధి మొదలయ్యే ప్రమాదం ఉంది. అన్నింటినీ మించి షుగర్‌కు సంబంధించిన జీవక్రియలు అత్యధికంగా జరిగేది కండరాల్లోనే. కండరాలు బలహీనపడే కొద్దీ ఈ జీవక్రియలు మరింత కుంటుపడిపోయి షుగర్ నిలువలు అలా పెరుగుతూ వెళతాయి. అందువల్ల కండరాల, ఎముకల శక్తి ఏ మాత్రం తగ్గని రీతిలో మీరు తీసుకునే ఆహారం ఉండాలి. ఆకు కూరలకు ప్రాధాన్యతనివ్వాలి. పైగా మధుమేహం మొదలయ్యాక భోజనం చేయడాన్ని మూడు పూటలకే పరిమితం చేయడం ఎంత మాత్రం సరికాదు. అంతకన్నా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు అంటే ఓ ఐదు సార్లు తీసుకోవడం ఉత్తమం. అయితే ఎంత మంచి పౌష్టికాహారం తీసుకున్నా, శరీర శ్రమ ఏదీ చేయకపోతే అందులోని పోషకాలేవీ ఒంటికి పట్టవు. మీకు మీ వృత్తిపరమైన ఒత్తిళ్లు ఎంతగా ఉన్నా వీరు వ్యాయామాకి సమయం కేటాయించాల్సిందే. పార్కులకో, మైదానాలకో వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే ఆ ఏర్పాట్లు చేసుకోండి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు చేయగలిగితే, మీ చక్కెర తప్పకుండా నియంత్రణలోకి వస్తుంది.
డాక్టర్ జె. శరచ్చ్చంద్ర, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
ఎవరి కర్మ వారికే!
ఒకానొక గ్రామంలో ఒక ఆశ్రమం ఉండేది. ప్రతి రోజూ సాయంత్రం ఆశ్రమంలో ఒక సాధువు ప్రవచనం చెప్పేవాడు. గ్రామస్థుల్లో చాలామంది ఆ ప్రవచనం వినడానికి వెళ్లే వాళ్లు. ప్రవచనం పూర్తయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతుండేవారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ప్రతి రోజూ ప్రవచనం మధ్యలో ఉండగానే లేచి అక్కడి నుంచి వెనుదిరిగేవాడు. ఆ వ్యక్తి.. ప్రతి రోజూ ప్రవచనం మధ్యలోనే వెళ్లిపోవడం సాధువు గమనించాడు. ఒకరోజు అతణ్ణి పిలిచి.. ‘‘నాయనా! రోజూ ఎందుకలా మధ్యలోనే వెళ్లిపోతున్నావు?’’ అని అడిగాడు. దానికా వ్యక్తి.. ‘‘స్వామీ! మీ ప్రవచనం అద్భుతంగా ఉంటుంది. అయితే, చీకటి పడేలోపు నేను ఇంటికి వెళ్లిపోవాలి. నా కోసం నా భార్యా, బిడ్డలూ, తమ్ముళ్లూ, మరదళ్లూ, వారి పిల్లలూ.. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నా రాక కాస్త ఆలస్యం అయినా.. తట్టుకోలేరు. నాపై వారికంత ప్రేమ. అందుకే మధ్యలోనే వెళ్లిపోతున్నాను’’ అని బదులిచ్చాడు. సాధువు నవ్వి.. ఆ వ్యక్తి చెవిలో ఒక విషయం చెప్పాడు.
మరుసటి రోజు ఆ వ్యక్తి యథాప్రకారంగా ప్రవచనం మధ్యలో లేచి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన భర్తను చూసి భార్య మురిసిపోయింది. పిల్లలు తండ్రితో ఆడుకుంటున్నారు. తమ్ముళ్లూ, మరదళ్లూ ఏవో కబుర్లు చెబుతున్నారు. అంతలో.. ఆ వ్యక్తి మూర్చ వచ్చి పడిపోయాడు. ఇంట్లో అందరూ కలవరపడసాగారు. ఇంతలో సాధువు వాళ్లింటికి వచ్చాడు. తమ ఇంటి యజమానికి ఎలాగైనా కాపాడమని సాధువుతో అందరూ వేడుకున్నారు. అందరినీ సంయమనం పాటించమన్నాడు సాధువు. లోనికి వెళ్లి ఒక పాత్రలో నీరు తీసుకురమ్మని చెప్పాడు. అలాగే తెచ్చారు. ‘‘బాధ పడవలసింది ఏమీ లేదు. మీ ఇంటి యజమానికి దుష్టగ్రహం పట్టింది. దానిని ఈ పాత్రలోని నీటిలోకి ఆవాహన చేస్తాను. అయితే, మీలో ఎవరో ఒకరు ఆ నీటిని తాగి.. ఆ దుష్ట
గ్రహాన్ని గ్రహించాలి’’ అన్నాడు. ఆ మాట వినడంతోనే ఇంట్లో వాళ్లందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ‘‘మా ఇంటి యజమానిపై మాకు ప్రేమ ఉన్న మాట వాస్తవమే! ఆయన బాధ తప్పించాలనే భావన ఉన్న మాటా నిజమే! కానీ, చూస్తూ.. చూస్తూ.. దుష్టగ్రహ బాధను ఎవరు తీసుకుంటారు. అయినా స్వామీ! ఎవరి కర్మ వారు అనుభవించాలని మీరే చెబుతారు కదా! ఇది ఆయన కర్మ.. ఆయన్నే అనుభవించనీయండి’’ అని బదులిచ్చారు. ఆ మాటలు విన్న తర్వాత ఆ ఇంటి యజమానికి అసలు విషయం తెలిసొచ్చింది. అంతసేపూ మూర్చతో పడిపోయినట్టు నటించిన ఆ వ్యక్తికి.. వాస్తవం ఎలా ఉంటుందో బోధపడింది. సంసార బంధాలు, కుటుంబ బాధ్యతలు అందరూ ఆచరించాల్సిన ధర్మాలే. అయితే, అవే ముఖ్యమనుకొని వాటిలోనే పడి కొట్టుకుపోతే.. ముక్తిని పొందాల్సిన మానవ జన్మ పరమార్థం పక్కదారి పడుతుంది! భగవంతుడిని దర్శించాలన్న కోరిక.. కోరికగానే మిగిలిపోతుంది!!
గోల్డెన్ గ్రీన్‌టీ
గ్రీన్ టీ తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వింటున్నాం. దాంతో గ్రీన్ టీని మన జీవితంలో భాగం చేసుకున్నాం. అయితే గ్రీన్ టీ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా? అయితే ఈ వాస్తవాలు తెలుసుకోండి.
మెటబాలిజం పెరుగుతుంది: గ్రీన్ టీ లో ఉండే కెఫీన్ వల్ల శరీర కొవ్వు కరగటంతోపాటు మెటబాలిజం కూడా పెరుగుతుంది. కప్పు గ్రీన్ టీలో 20 నుంచి 40 మి.గ్రా కెఫీన్ ఉంటుంది. అలాగే దీనిలో క్యాచెటిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెటబాలిజమ్‌ను బూస్ట్ చేస్తాయి.
వ్యాయామంతో రెట్టింపు: గ్రీన్ టీ తాగితే కొవ్వు వేగంగా కరుగుతుంది. దీనికి వ్యాయామాన్ని కూడా జోడిస్తే రెట్టింపు ఫలితం దక్కుతుంది. అంటే గ్రీన్ టీ తాగుతూ వ్యాయామం చేయగలిగితే బరువు తగ్గే వేగం 15 శాతం పెరుగుతుంది. అంతేకాదు. విశ్రాంతిలో ఉన్నా కొవ్వు కరిగే వేగంలో మార్పు ఉండదు.
తక్కువ తింటాం: గ్రీన్ టీ తాగటం వల్ల తక్కువ కెలోరీలను తీసుకుంటాం. దాంతో బరువు తగ్గుతాం. అలాగే గ్రీన్ టీ ఆకలిని తగ్గిస్తుంది. దీని వల్ల కూడా శరీరంలోకి ఎక్కువ కెలోరీలు చేరకుండా ఉంటాయి.
ఆరోగ్యానికి తొలిపొద్దు
పొద్దు తిరుగుడు గింజలను దీని ఆకురసంతో నూరి ముద్దగా చేసి మూడు రోజులు వరుసగా నుదుటి మీద పట్టివేస్తే మైగ్రేన్ తగ్గుతుంది.
పొద్దుతిరుగుడు చెట్టు వేరును ఆవుపాలతో మెత్తగా రుబ్బి, రోజుకు రెండు పూటలా తులం చొప్పున వేసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
పది చుక్కల పొద్దు తిరుగుడు ఆకు రసాన్ని, పాలల్లో కలిపి తాగిస్తే పిల్లలకు వచ్చే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి బాధలు తగ్గుతాయి.పొద్దు తిరుగుడు ఆకులను పైన కట్టుకట్టి ఉంచితే, గడ్డలు వాపు తగ్గుతాయి.
100 మి.లీ. ఆకు ర సానికి 100 మి. లీ నువ్వుల నూనె చేర్చి, అందులో 25 గ్రాముల ఆకులను ముద్దగా నూరి వేసి తైలముగా కాచి ఆ తైలాన్ని చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గుతుంది. ఆకు రసానికి సమానంగా, త్రికటు చూర్ణం వేసి వెచ్చచేసి రెండు చుక్కలు చెవిలో వేస్తే, చెవిలోని ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
పొద్దు తిరుగుడు వేరుకు సమానంగా, వెల్లుల్లి కలిపి, ముద్దగా నూరి, కంఠానికి పట్టీగా కట్టుకడితే గాయిటర్ తగ్గుతుంది.
పొద్దు తిరుగుడు గింజల చూర్ణానికి సమానంగా, చక్కెర పొడి కలిపి 6 గ్రాముల మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే, అర్శమొలలు తగ్గుతాయి.
మూడు గ్రాముల గింజల చూర్ణాన్ని రెండు పూటలా సేవిస్తే కడుపులోని నులిపురుగులు నశిస్తాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565