చూస్తే..ఫిదా
అనంత సౌందర్యం.. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
సంచారం జీవితానికి కొత్త బాటలు వేస్తుంది. నవ జీవనగానం వినిపిస్తుంది. పర్యటన ఆనంద మార్గాల్లో ఒకటంటున్నారు పరిశోధకులు. పశ్చిమ హిమాలయాల్లోని బద్రీనాథ్ క్షేత్రానికి చేరువలో వున్న అనంత సౌందర్యరాశి వ్యాలీ ఆఫ్ ప్లవర్స్, సిక్కుల పుణ్యధామం హేమ్‌కుంద్ సాహెబాలను ఇటీవల సందర్శించారు తిప్పావఝుల కుమార్. ‘అక్కడకు వచ్చిన పర్యాటకులతో ముచ్చటించినప్పుడు సంచారం వారి జీవితాలను ఎంతగా ప్రభావితం చేసిందో తెలిసింది. సంచారంపై మక్కువను మరింత పెంచింది’ అంటూ ఆ సంగతులు పంచుకుంటున్నారిలా...
సమున్నత హిమాలయాలు విశ్వరహస్యాన్ని తనలో దాచుకున్నట్లు గంభీరంగా ఉంటాయి. అందుకే వాటి అందాలను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. అక్టోబర్ - ఏప్రిల్ మాసాల మధ్య హిమాలయాలన్నీ మంచుదుప్పటి కప్పుకుని ఉంటాయి. మిగిలిన మాసాల్లో అరుదైన వృక్ష, పుష్ప సంపదకు హిమాయలాలు నిలయాలు. ముఖ్యంగా జూలై చివరి వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు శ్రావణమేఘాలు హిమాలయాల అందాలను పదింతలు చేస్తాయి. పచ్చదనాలు పరుచుకున్న ఆ హిమవంతుడ్ని తెల్లని మేఘాలు దేవకన్యల్లా అల్లుకుంటాయి. ఆ మంచుపర్వతాల నుంచి జలపాతాలు గలగలా ప్రవహిస్తూ వుంటాయి. దారిలో వున్న అరుదైన వృక్షాలను, శిలలను ముద్దాడుతూ ప్రవహించే ఆ జలపాతాల అందాలు వర్ణనాతీతం. ఆకాశాన్ని తాకే హిమాలయాలు.. శ్రావణ జల్లుల్లో తడిసిన దేవదారు వృక్షాలు... నవరాగాలను పలికిస్తూ పారే జలపాతాల అందాలకు..... అరుదైన పూలసోయగాలు తోడైతే ఆ దృశ్యాన్ని వర్ణించేందుకు కవులకు సైతం పదాలు దొరకవేమో! ఈ నాలుగు అందాలను రాశిగా పోసిన హిమాలయ సౌందర్యం ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’.
అనంత సౌందర్యసీమ
బ్రహ్మకమలంతో సహా అరుదైన 500 రకాల పుష్పజాతులు ‘వ్యాలీ ఆప్ ఫ్లవర్స్’లో కనువిందు చేస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఏటా లక్షల మంది ఈ పుష్పసౌందర్యాన్ని ఆస్వాదించేందుకు వస్తూ ఉంటారు. సంవత్సరంలో నాలుగు మాసాలు మాత్రమే ఈ వ్యాలీకి వెళ్లే అవకాశం వుంది. మిగిలిన మాసాల్లో ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పేసి ఉంటుంది. ఆధ్యాత్మిక జీవులంతా జీవితంలో ఒకసారయినా దర్శించాలనుకునే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్‌కు చేరువలో ఉందీ సౌందర్యసీమ. బ్రహ్మకమలం, బ్లూపాపీ, మార్క్ మారీగోల్డ్, హిమాలయన్ మాంక్‌సూద్, మెడోస్వీట్ వంటి హిమాలయాల్లో మాత్రమే పుష్పించే అరుదైన పూలకు ఈ వ్యాలీ నిలయం. శ్రావణమాసంలో ఎక్కువశాతం పూలు వికసిస్తాయని, అప్పుడు వ్యాలీ సర్వాంగ సుందరంగా ఉంటుందంటారు స్థానికులు. పుష్పావతీ నదిని దాటుకుని, దట్టమైన అడవిని అధిగమిస్తే అదురైన కోటానుకోట్ల పుష్పాలు మనకు స్వాగతం పలుకుతాయి. పది కిలోమీటర్లు నడిచి, అలసిన మనకు మధుర సుగంధ పరిమళాల వింజామరలు వీచి సాంత్వన కలిగిస్తాయి. 87 కిలోమీటర్ల దూరం పరచుకున్న ఆ పూలవనం మధ్యన వున్న చిన్న కాలి బాట నుంచి సెలయేళ్లు దాటుకుంటూ, అనంత సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వెళ్లడం ఒక గొప్ప అనుభవం.
ప్రపంచ వారసత్వ కేంద్రం
బ్రిటీష్ పర్వతారోహకుడు, వృక్షశాస్త్ర నిపుణుడు ఫ్రాంక్ స్మిత్ 1939లో ‘వ్యాలీఆఫ్ ఫ్లవర్స్’ను సందర్శించి అరుదైన పుష్పజాతులపై పుస్తకం రచించాడు. ఆయన తరువాత రాయల్ బొటానిక్ గార్డెన్స్ తరపున వృక్షశాస్త్ర నిపుణురాలు మార్గరెట్ లెగ్గీ ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ సందర్శించి మరిన్ని అరుదైన పుష్పజాతులను వెలుగులోకి తెచ్చారు. ఆ క్రమంలో లోయలో పొరపాటున కాలుజారి పడి కన్నుమూశారు లెగ్గీ. కొన్నాళ్లకు ఆమె సోదరి ఇండియా వచ్చి లెగ్గీ సమాధిని నిర్మించారు. 1982లో ఈ వ్యాలీని భారత ప్రభుత్వం నేషనల్ పార్క్‌గా గుర్తించింది. యునెస్కో ఈ సుందర ప్రదేశానికి ప్రపంచ వారసత్వ కేంద్రం హోదాను ఇచ్చింది. సముద్రమట్టానికి 12 వేల అడుగులు ఎత్తులో వుండే ఈ వ్యాలీ నుంచి 9 కిలో మీటర్ల దూరం నడిచి వెళితే టిప్రా గ్లేషియర్ వస్తుంది. ప్రణాళికాబద్ధంగా వెళితే ట్రెక్కర్స్ టిప్రా వరకు వెళ్లి రావచ్చు. మరో 13 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 25 వేల అడుగుల ఎత్తులో గౌరీప్రభాత్ పర్వత శిఖరం వుంది.
హిమదేవాలయం
అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి ధీటుగా సిక్కులు పవిత్రంగా భావించే హేమ్‌కుంద్ సాహెబా గంగారియాకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో వున్న ఈ ఆధ్మాత్మిక కేంద్రంలో పదో సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ తపస్సు చేశారని విశ్వాసం. చిన్నారుల నుంచి పెద్దల దాకా సిక్కులందరూ జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. నిర్మలంగా వుండే హిమకుండంలో స్నానం చేసి, ప్రార్థనలు చేస్తారు. హేమ్‌కుంద్‌కు చేరుకునే మార్గం తిరుమల మోకాళ్ల పర్వతాన్ని తలపిస్తుంది. అయినా ఏటా రెండు లక్షల మంది భక్తులు హేమ్‌కుంద్ సందర్శిస్తున్నారు. ఆగస్టులో హేమ్‌కుంద్ వెళ్లే వారికి వేలాది బ్రహ్మకమలాలు కనువిందు చేస్తాయి.
పుష్పవనానికి ఇదీ దారి
దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుషీకేష్ 250 కిలోమీటర్ల దూరంలో వుంది. అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది జోషీమఠ్. జోషీమఠ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ వెళ్లే మార్గంలో గోవింద్ ఘాట్ వస్తుంది. అక్కడి వరకు మాత్రమే వాహన సౌకర్యం వుంటుంది. గోవింద్‌ఘాట్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగారియాకు నడకమార్గంలో చేరుకోవచ్చు. గుర్రాల మీద వెళ్లే సౌకర్యంతో పాటు హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉంది. గంగారియా సముద్ర మట్టానికి 9 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ ఉంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ పర్యాటక విభాగం గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్(జి.ఎం.వి.ఎన్)కు హైదరాబాద్‌లో బ్రాంచ్ ఉంది. ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ పర్యటనకు జిఎంవిఎన్ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఆ సంస్థ ఫోన్: 040- 2340 0259.
ఓ మహాద్భుతం
మానససరోవరంతో పాటు హిమాలయాల్లో పలు ప్రాంతాలను చూశాం. ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’ భారతదేశంలో ఉన్న ఓ మహాద్భుతం. యువత ఇలాంటి సుందర ప్రదేశాలు చూస్తే జీవితం పట్ల వారి దృక్పథంలో మార్పు వస్తుంది. ఆలోచనా పటిమ పెంపొందుతుంది. సంచారం జీవితంలో ఆనందానికి కొత్త దారులు చూపుతుంది. పిల్లల్లో పర్యటనాభిలాష పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులదే!
- డాక్టర్ పి. శ్యాంసుందర్‌రెడ్డి, డాక్టర్ దేవిరెడ్డి, బి. అశోక్‌వర్దన్‌రెడ్డి
ప్రకృతి ఆస్వాదన వరం
సువిశాల ప్రపంచాన్ని చుట్టి రావడాన్ని మించిన గొప్ప అనుభవం మరొకటి లేదు. నేను అమెరికాలో భారీనిర్మాణ కార్మికుడిగా పనిచేస్తాను. ఏడాది పాటు పనిచేసి డబ్బు కూడబెట్టుకుంటాను. మరుసటి ఏడాది ప్రపంచ దేశాలన్నీ చుట్టివస్తాను. ఐదు నెలలుగా భారతదేశంలో కన్యాకుమారి నుంచి హిమాలయాల దాకా పలు ప్రాంతాల్లో పర్యటించాను. ప్రకృతిలోని సోయగాలన్నీ పోగుపోసుకున్నట్టు ఉన్న ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’కు ఇంత తక్కువ మంది సందర్శకులు రావడం ఆశ్చర్యంగా వుంది.
- రిచర్డ్ జో, న్యూయార్క్ భ్రమణకాంక్ష
‘‘నేస్తం.. పద పోదాం.! ప్రపంచాన్ని చుట్టొద్దాం.! సంచారం కోసం మరో జన్మ వుందంటావా ఏం? నిండు నూరేళ్లు జీవించినా ఈ తరుణం మరి రాదు... పద పోదాం.! ప్రపంచాన్ని చుట్టొద్దాం!’’
- రాహుల్ సాంకృత్యాయన్.
ఇన్నాళ్లు తెలియదు
డిగ్రీ పూర్తి చేసి రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. ఫ్రెండ్‌తో కలిసి ఇక్కడికి వచ్చాను. మా రాష్ట్రంలో ఇంత సుందరప్రదేశం వున్న విషయం నాకు ఇన్నాళ్లూ తెలియదు. ప్రకృతిలోని వర్ణాలను చూశాక నేను, నా ఉద్యోగం ఎంత చిన్నవో అర్థమైంది. హేమ్‌కుంద్ సాహెబాకు నడవడం కష్టం అంటున్నారు. అయినా నేను నడిచే వెళతాను. ఈ ప్రదేశం చూశాక ప్రపంచమంతా చూడాలనే అభిలాష పెరిగింది.
- ప్రియాంక, ఉత్తరాఖండ్
ఛాన్స్ దొరికితే సంచారమే
దక్షిణ కొరియాలో పుట్టి కెనడాలో స్థిరపడ్డాను. రెండేళ్లుగా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఏ మాత్రం వీలుచిక్కినా ప్రపంచంలో ఏదో ఒక సుందర ప్రదేశాన్ని చూసొస్తాను. వందల రకాల పుష్పజాతులకు నిలయం ‘వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’. అరుదైన ఈ పుష్పజాతులు పదేళ్ల తరువాత కనుమరుగయ్యే ప్రమాదం వుంది. బ్రహ్మకమలంతో సహా అరుదైన ఈ పుష్పజాతుల డిఎన్‌ఏలు సేకరించి భద్రపరచాల్సిందిగా యునెస్కోకు లేఖ రాస్తాను.
- కిమ్, సాఫ్ట్‌వేర్ నిపుణుడు, హైదరాబాద్
వీకెండ్‌లో విహారం...
ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు జైళ్ల శాఖ ప్రయోగాత్మక నిర్ణయం
వీటికి రొమాంటిక్ ఫీలింగ్స్ కలిగించే పవర్ ఉందా...
జియో ఫోన్ బుకింగ్ స్టేటస్ తెలుసుకోండిలా...
పిల్లల్లోనూ ఆత్మగౌరవం ఎక్కువే..
వ్యర్థాలు పోతే వన్నె పెరిగినట్టే
ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం
దద్దుర్లు దరిచేరకుండా...
వెరైటీ పోరాటం!
ప్రపంచం నిదురోయింది ఇలా..
ఆరోగ్యానికి నెచ్చెలి
బచ్చలి ఆకులను, కందిపప్పుతో కలిపి కూరగా వండుకుని తింటూ ఉంటే, గర్భిణులు ఎదుర్కొనే మలబద్ధకం తొలగిపోతుంది.
పచ్చి ఆకులను, రోజుకు రెండు పూటలా నమిలి మింగుతూ ఉంటే, నాలుక మీది గుగ్గులు తగ్గిపోతాయి.
బచ్చలి ఆకులను నూరి, కణతలకు పట్టువేస్తే తలలోంచి వచ్చే తీవ్రమైన వేడి తగ్గిపోవడంతో పాటు, సుఖనిద్ర కలుగుతుంది.
బచ్చలి ఆకులతో చేసిన కూరలు తరుచూ వాడుతూ ఉంటే, ఒంటికి చలువ చేస్తుంది. దగ్గు, పైత్యం, అతిదాహం తగ్గిపోతాయి. రక్తహీనత తొలగిపోతుంది. ఆకలి పెరుగుతుంది.
మజ్జిగలో బచ్చలి ఆకులు వేసి ఉడికించి తింటూ ఉంటే, పైల్స్ కారణంగా వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.
ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పిండితే, వెంటనే మంట తగ్గడంతో పాటు, పుండు కూడా మానుతుంది.
మూత్రవిసర్జనలో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు, 50 మి.లీ బచ్చలి ఆకు కషాయాన్ని రోజుకు రెండు పూటలా సేవిస్తే మూత్రం సాపీగా సాగిపోతుంది.
తీగ బచ్చలి కూరను తరుచూ తింటూ ఉంటే వీర్యవృద్ధి కలుగుతుంది. కంఠస్వరం మృదువుగా అవుతుంది
20 గ్రాముల బచ్చలి ఆకుల రసాన్ని రోజూ రెండు పూటలా తీసుకుంటే మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565