పతంజలి రామ్‌దేవ్ విసిరిన రాకెట్టు!
విదేశాల్లో చదువుకున్న కార్పొరేట్ దిగ్గజాలు లేరు. అత్యున్నత బిజినెస్ స్కూళ్ల నుంచి పట్టభద్రులైన ఉద్యోగులు లేరు.ప్రచారానికి కనీసం సినిమా, క్రీడా ప్రముఖులు కూడా లేరు. అయినా సరే ‘పతంజలి’ కేవలం పదేళ్లలో రూ.10వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించింది. దశాబ్దాల తరబడి పాతుకుపోయిన విదేశీ సంస్థల్ని కలవరపెడుతూ, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ సంస్థగా అవతరించింది. స్వదేశీ ఉత్పత్తుల పేరుతో బాబా రామ్‌దేవ్ ఎక్కుపెట్టిన ఈ ఆయుర్వేద బాణం, ఒక సంస్థ కాదు... సంచలనం, ఒక విప్లవం.
బాబా రామ్‌దేవ్... యోగా ప్రాశస్త్యం గురించి వివరిస్తూ సైకిల్ మీద వీధి వీధీ తిరిగారు. ఆపైన బుల్లితెరపైన యోగా పాఠాలు నేర్పారు. ప్రపంచానికి మన దేశమిచ్చిన గొప్ప వరం యోగాభ్యాసం అని ప్రచారం చేశారు. ప్రజలూ, సినీ ప్రముఖులూ, నాయకులూ, విదేశీయులూ... అంతా ఆయన మాటల్ని నమ్మారు. ఆయన పాఠాల్ని ఆకళింపు చేసుకున్నారు. ఆయన సూత్రాలతో జీవనశైలిని మార్చుకున్నారు. ఫలితం... కోట్లాది భారతీయులు ఆ బక్కపల్చని బాబాకి ఏకలవ్య శిష్యులయ్యారు.
అదే బాబా రామ్‌దేవ్... ప్రజల్లో తనకున్న ఆదరణా, అభిమానమే పెట్టుబడిగా స్నేహితుడితో కలిసి ‘పతంజలి’ పేరుతో ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థకు ప్రాణం పోశారు. ప్రపంచానికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం ఆయుర్వేదమని ప్రచారం చేశారు. మనిషి శరీరంలోని అన్ని సమస్యలనూ నయం చేసే శక్తి ఆయుర్వేదానికి ఉందని సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూ వచ్చారు. ఈసారీ సామాన్యుల నుంచీ సెలెబ్రిటీల దాకా అందరూ ఆయన మాటల్ని నమ్మి, ఆ ఉత్పత్తులను కొనడం మొదలుపెట్టారు. ఫలితం... అతి తక్కువ కాలంలో రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించిన భారతీయ ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ సంస్థగా ఈ ఏడాది పతంజలి రికార్డు సృష్టించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థల్ని వెనక్కి నెట్టి అత్యంత ప్రభావశీల సంస్థల జాబితాలో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ల తరవాత నాలుగో స్థానంలో నిలిచింది. రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థగా అవతరించే దిశగా పతంజలి వడివడిగా అడుగులేస్తోంది.
పతంజలి పేరు చెబితే మొదట స్ఫురించేది బాబా రామ్‌దేవ్ రూపమే. సంస్థ ఉనికికీ, విస్తరణకూ ఆయనకున్న ఆదరణే చాలా వరకూ కారణమన్నది అందరి అభిప్రాయం. కానీ చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం ఎంతోకాలం సాధ్యం కాదు. కేవలం రామ్‌దేవ్ ప్రచారం వల్లే సంస్థ ఇంత దూరం వచ్చిందన్న వాదనలోనూ నిజం లేదు. పైకి పదేళ్లలో సంస్థ ఎదిగినట్లు కనిపించినా, దాని వెనక ముప్ఫయి ఏళ్ల కష్టం ఉందంటారు రామ్‌దేవ్. ఆయన మాట సాయంతో పాటు అనూహ్యమైన మార్కెటింగ్ శైలి, అతివేగంగా విస్తరించిన సంస్థ రిటైల్ స్టోర్లు, పోటీ సంస్థలని ఆత్మరక్షణలో పడేసే ధరలు, అన్నింటికీ మించి వినియోగదార్ల హృదయాల్ని సూటిగా తాకే ప్రచార పంథా ‘పతంజలి’ విజయానికి ముఖ్య కారణాలన్నది మార్కెట్ నిపుణుల విశ్లేషణ. ఆ ఎదుగుదల క్రమంలో పతంజలి అడుగులు, స్టార్టప్ వీరుల నుంచీ కార్పొరేట్ దిగ్గజాల వరకూ అందరికీ గెలుపు పాఠాలు.
పైసా పెట్టుబడి లేకున్నా...
పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రారంభమై తొమ్మిదేళ్లయింది. కానీ దానికి పునాది 22ఏళ్ల క్రితమే పడింది. దివ్య ఫార్మసీ... పతంజలి సంస్థకి తొలిరూపు ఈ చిన్న ఔషధ దుకాణమే. 1995లో హరిద్వార్‌లోని కన్‌కల్ ప్రాంతంలో స్నేహితుడు బాలకృష్ణతో కలిసి రామ్‌దేవ్ దీన్ని తెరిచారు. యోగా, ఆయుర్వేదం... ఈ రెండు రంగాల అభివృద్ధికి సాయపడటాన్ని గురువు బల్‌దేవ్ తనపైన పెట్టిన బాధ్యతగా రామ్‌దేవ్ భావించేవారు. యోగా గురువుగా అప్పటికే స్థానికంగా రామ్‌దేవ్‌కు మంచి పేరొచ్చింది. ఆయన స్నేహితుడు బాలకృష్ణకు ఆయుర్వేదంపైన తిరుగులేని పట్టుంది. ఇద్దరూ చిన్నప్పుడు ఒకే ఆశ్రమంలో పెరిగారు. తరవాత హిమాలయాలకూ కలిసే ప్రయాణమయ్యారు. అక్కడ రామ్‌దేవ్ యోగా సాధనలో నిమగ్నమైతే, బాలకృష్ణ ఆయుర్వేదంలో నైపుణ్యం సాధించారు.
హరిద్వార్‌కు తిరిగొచ్చాక రామ్‌దేవ్ యోగా శిక్షణలో మునిగిపోయారు. ఆ క్రమంలో కొంత శిష్య గణాన్నీ సమకూర్చుకున్నారు. మరోపక్క బాలకృష్ణ ఆయుర్వేద ప్రయోగాల్లో లీనమయ్యారు. అనేక ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద ఔషధాలను తయారుచేసే పనిలో పడ్డారు. రామ్‌దేవ్ ఉచిత శిక్షణ ద్వారా హరిద్వార్‌లో చాప కింద నీరులా యోగా ప్రాబల్యం విస్తరించింది. దాంతో యోగాకి ప్రాచుర్యం తేవాలన్న ఆయన లక్ష్యం కొంతవరకూ నెరవేరింది. కానీ వ్యాపారం మొదలుపెడితే తప్ప ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రచారం దక్కే పరిస్ధితి లేదు. ఆ పని చేయడానికి స్నేహితులిద్దరి దగ్గరా చిల్లి గవ్వలేదు. ఆ సమయంలో కొందరు శిష్యులూ, శ్రేయోభిలాషులూ రామ్‌దేవ్‌ని ఆదుకున్నారు. గురు దక్షిణగా ఐదు లక్షల రూపాయలను ఆయనకి అందించారు. అదే వాళ్ల వ్యాపారానికి తొలి పెట్టుబడి. ఆ డబ్బు సాయంతో బాలకృష్ణ కనిపెట్టిన ఆయుర్వేద సూత్రాలకు అనుగుణంగా కొన్ని ఉత్పత్తులను తయారు చేశారు. హరిద్వార్‌లో దివ్య ఫార్మసీ పేరుతో దుకాణాన్ని తెరిచి వాటిని అమ్మకానికి పెట్టారు. కేవలం ఉత్పత్తుల్ని అమ్మడం కాకుండా, ఆయుర్వేద ప్రాధాన్యాన్ని విస్తరించడమే ఆ స్నేహితుల లక్ష్యంగా ఉండేది. అందుకే తమపైన నమ్మకంతో వచ్చిన పేదలకు వీలైతే ఉచితంగా, లేదంటే నామమాత్రపు ధరకే తమ ఉత్పత్తులను అందించేవారు.
టీవీతో మొదలు...
రామ్‌దేవ్ జీవితానికీ, ఆయన నెలకొల్పిన వ్యాపారానికీ మలుపు 21వ శతాబ్దం తొలి రోజుల్లో పడింది. అప్పటిదాకా హరిద్వార్‌లో ఆసక్తి ఉన్నవాళ్లకి యోగా నేర్పుతూ వచ్చిన రామ్‌దేవ్‌కి ‘సంస్కార్’ ఛానెల్‌లో తెల్లవారుజామున ఓ ఇరవై నిమిషాల పాటు యోగా కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం దొరికింది. ఆయన నేర్పే ఆసనాల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయంటూ నోటి మాట ద్వారా ప్రచారం దక్కడంతో నెమ్మదిగా కార్యక్రమానికి ఆదరణ పెరిగింది. అలా దేశవ్యాప్తంగా ఆయన్ని గుర్తుపట్టేవారి సంఖ్య ఎక్కువవుతూ వచ్చింది. ఆపైన మూడేళ్లకు మరో ఛానెల్ ‘ఆస్థా’తో నేరుగా లైవ్ కార్యక్రమంలో యోగా నేర్పడానికి ఒప్పందం కుదిరింది. దాంతో ఆయన పరిధి సామాన్యుల నుంచి ప్రముఖులకు విస్తరించింది. ఎందరో ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ నేతలూ, సినీ ప్రముఖులూ ఆయన పాఠాలను అనుసరించడం మొదలుపెట్టారు. క్రమంగా భారీ బహిరంగ వేదికలపైన యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే స్థాయికి ఎదిగారు. అలా పెరిగిన పేరు ప్రతిష్ఠలే రామ్‌దేవ్ వ్యాపారానికి వరంగా మారాయి. యోగా పాఠాల్లో భాగంగానే ఆయుర్వేదానికీ ఆయన ప్రచారం కల్పించేవారు. ఇంకోపక్క ఆయన స్నేహితుడు బాలకృష్ణ ప్రయోగశాలను ఏర్పాటు చేసి ఆయుర్వేద ఉత్పత్తుల తయారీనీ పెంచారు. ఆ రెండు విభాగాల అభివృద్ధి కోసం 2006లో హరిద్వార్ దగ్గర పతంజలి యోగా పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి పదిహేను రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రామ్‌దేవ్ పేరు చర్చనీయాంశమైంది. ఆపైన మూడేళ్లకు ఆ ప్రాంగణంలోనే బాలకృష్ణతో కలిసి రామ్‌దేవ్ ‘పతంజలి ఆయుర్వేద్’ సంస్థను నెలకొల్పి పెద్ద ఎత్తున ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టారు. ఆయనకి ఉన్న గుర్తింపు ఫలితంగా తొలి ఏడాదిలోనే అది రూ.60కోట్ల టర్నోవర్‌ని సాధించి ఆ రంగంలోని సంస్థలకు గట్టి హెచ్చరికలే పంపింది.
స్వదేశీ నినాదం
సాధారణంగా ఏదైనా వ్యాపారం వల్ల వ్యక్తికి గుర్తింపు వస్తుంది. కానీ ‘పతంజలి’కి ఆ సూత్రం వర్తించదు. ఇక్కడ రామ్‌దేవ్ వల్లే ఆ సంస్థకి గుర్తింపు దక్కింది. ఈ రోజుకీ దాని ప్రచార బాధ్యతలు ఆయన భుజాల మీదే ఉన్నాయి. ‘పతంజలి’ని ఏర్పాటు చేసిన సమయంలోనే ‘భారత్ స్వాభిమాన్’ ఉద్యమాన్నీ మొదలుపెట్టడం రామ్‌దేవ్‌లోని వ్యాపార కోణానికి నిదర్శనం. బహుళ జాతి సంస్థల వల్ల దశాబ్దాలుగా దేశ సంపద కరిగిపోతోందనీ, వాటి ఉత్పత్తులు దేశానికి మంచికంటే చెడే ఎక్కువ చేశాయనీ ప్రచారం చేస్తూ వాటిని బహిష్కరించాలంటూ ఉద్యమాలు చేశారు. మరోపక్క ‘పతంజలి’ ఉత్పత్తులు మహాత్మా గాంధీ బోధించిన స్వదేశీ సిద్ధాంతాలకు నిదర్శనమనీ, వాటి అమ్మకాల ద్వారా వచ్చే డబ్బు తిరిగి జాతి నిర్మాణానికే ఉపయోగపడుతుందంటూ ప్రచారం చేపట్టారు. ఇప్పటికీ ‘ఐ సపోర్ట్ స్వదేశీ’ పేరుతో ఆన్‌లైన్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. వినియోగదార్ల అవసరాలతో పాటు వాళ్ల దేశభక్తి భావాల్నీ లక్ష్యంగా చేసుకొని సంధించిన ఈ ప్రచార బాణం ప్రజల హృదయాన్ని సూటిగా తాకింది. సంస్థ అతి తక్కువ కాలంలోనే అనూహ్యంగా విస్తరించడానికి ఈ ‘స్వదేశీ’ కోణం మొదటి కారణం.
‘సహజ’ ప్రచారం...
రానురానూ కల్తీల ప్రభావం పెరిగిపోవడం, నిత్యం వినియోగించే ఎన్నో పదార్థాలు రసాయనాల మయం కావడం, ఇటీవలి కాలంలో జనాలు ఆర్గానిక్ ఉత్పత్తులవైపు మొగ్గు చూపడానికి ఓ ప్రధాన కారణం. ఆ విషయాన్ని రామ్‌దేవ్ గ్రహించారు. సహజ సిద్ధమైన ఉత్పత్తులపైన వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని అర్థం చేసుకున్నారు. దాంతో తన ప్రచారంలో రెండో స్థానం దానికే కేటాయించారు. ‘మా ఉత్పత్తులన్నీ పూర్తిగా ప్రకృతిలో దొరికే ముడిసరకుతో తయారు చేసినవే, వీటిలో ఎలాంటి రసాయనాలూ లేవు’ అంటూ ప్రచారం చేశారు. దానికితోడు ‘ఇన్నాళ్లూ రసాయనాలతో నిండిన ఉత్పత్తులు వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారు. ఇకపై మీకా అవసరం లేదు’ అంటూ వినియోగదార్లను ఆలోచనలో పడేశారు. ఫలితంగా ఆయుర్వేద ఉత్పత్తుల వల్ల మేలు జరిగినా, లేకున్నా హాని మాత్రం జరగదనే భావనని వాళ్లలో రేకెత్తించి, తక్కువ సమయంలోనే వాళ్ల దృష్టిని తమవైపు లాగారు. పతంజలి విజయానికి ఇది రెండో కారణం.
తక్కువ ధరలు!
ఇతర బ్రాండ్ల గోధుమ పిండి కిలో, పతంజలి గోధుమ పిండి కిలో... రెంటినీ పక్కన పెట్టి చూస్తే పతంజలికి చెందిన పిండి ధర తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సంస్థ నుంచి వచ్చే దాదాపు అన్ని ఉత్పత్తుల ధరల్లోనూ ఈ వ్యత్యాసం స్పష్టమవుతుంది. ఇతర సంస్థలతో పోలిస్తే లాభాల విషయంలో తాము స్వీకరించే మార్జిన్ తక్కువగా ఉంటుందనీ, తమ స్టోర్లు భారీ హంగులతో కాకుండా చాలా సాదాసీదాగా ఉండటంతో వాటి నిర్వహణలో మిగిలిన ఖర్చుని వినియోగదార్లకు బదలాయిస్తామనీ సంస్థ చెబుతోంది. ప్రచారం కోసం సెలెబ్రిటీలను వాడుకోకపోవడం వల్ల ఆదా అయ్యే డబ్బు కూడా తమ ధరలపైన ప్రభావం చూపుతుందని అంటోంది. మధ్యవర్తులతో పనిలేకుండా నేరుగా రైతుల నుంచే ముడిసరుకు కొనడం ద్వారానూ కొంత ఖర్చు తగ్గుతోంది. కారణమేదైనా తమ ఉత్పత్తుల ధరలు తక్కువన్న విషయాన్ని పతంజలి త్వరగానే జనాల్లోకి తీసుకెళ్లింది. ఆ సంస్థ అమ్మకాలు వూపందుకోవడానికి ఇది మూడో కారణం.
బాబా బ్రాండ్
మొదట్నుంచీ పతంజలికి స్టార్ అంబాసిడర్ బాబా రామ్‌దేవే. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఏ ప్రముఖుడికీ పైసా చెల్లించేది లేదని ఆయన చాలాసార్లు అన్నారు. తొంభై శాతం టీవీ ప్రకటనల్లో ఆయనే కనిపిస్తూ పతంజలికి ప్రచారం చేశారు. హేమామాలిని, సుశీల్ కుమార్ లాంటి ప్రముఖులు ఆ సంస్థ ప్రకటనల్లో కనిపించినా, దానికోసం వాళ్లు డబ్బులు తీసుకోలేదనీ, తమపైన ఉన్న నమ్మకంతో ఉచితంగా ప్రచారం చేశారన్నది రామ్‌దేవ్ మాట. యోగా గురువుగా ఆయనకున్న గుర్తింపు వినియోగదార్లను సులువుగానే ఆకర్షించింది. అన్ని రకాల ప్రకటనల్లో ఆయన కనిపించడం, వాటికి తోడు యోగా శిక్షణతో టీవీ కార్యక్రమాల్లో, సామాజిక ఉద్యమకారుడిగా వార్తల్లో తరచూ ప్రజల ముందుకు రావడంతో ఆయన్ని గుర్తించే వారి సంఖ్య పెరిగింది. ఆ ఫలితం బ్రాండ్ వాల్యూ పెరగడానికి సాయపడింది. పతంజలి విజయానికి రామ్‌దేవ్ ప్రచారం నాలుగో కారణం.
తిరుగులేని వ్యూహాలు...
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సిద్ధాంతాన్ని పతంజలి తూ.చ. తప్పకుండా ఆచరిస్తోంది. అందుకే మార్కెట్లో ఒక ఉత్పత్తి బావుందన్న పేరు రాగానే వెంటనే మరో ఉత్పత్తిని తీసుకొస్తోంది. సబ్బులూ, షాంపులూ, పేస్టులూ, టాయిలెట్ క్లీనర్లూ, నిత్యావసరాలూ, పిల్లల ఆహారం... ఇలా ఐదేళ్లలో యాభై నుంచి ఏకంగా వెయ్యికి పైగా ఉత్పత్తులను తీసుకొచ్చే స్థాయికి పతంజలి విస్తరించింది. ప్రత్యేక స్టోర్లు ఉండటంతో ఒక వస్తువు కొనడానికి వచ్చేవాళ్లు నాలుగైదు వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉండటం కూడా అమ్మకాలకు వూతమిస్తోంది. ఎదగడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ పతంజలి వదిలిపెట్టలేదు. గతంలో హానికారక రసాయనాలు ఉన్నాయంటూ ఓ సంస్థ నూడుల్స్ నిషేధానికి గురైన వెంటనే పతంజలి రంగంలోకి దిగింది. తమ నూడుల్స్ పూర్తిగా సహజ సిద్ధ పదార్థాలతో తయారయ్యాయని విస్తృతంగా ప్రచారం చేస్తూ ‘పతంజలి నూడుల్స్’ని విడుదల చేసి వేగంగా వినియోగదార్ల ఆదరణ పొందడంలో సఫలమైంది. ప్రత్యేక స్టోర్లూ, అతి వేగంగా దూసుకొస్తున్న ఉత్పత్తుల సంఖ్యా, సందర్భానికి తగ్గ మార్కెటింగ్ వ్యూహాలూ... సంస్థ ఎదుగుదలకు ఐదో కారణం ఈ అంశాలే. ఈ ఐదు సూత్రాలూ పతంజలికి పంచ ప్రాణాలుగా మారి అతి తక్కువ కాలంలో దేశ మార్కెట్లో సంచలనాలు సృష్టించే దిశగా నడిపించాయి.
లక్ష కోట్లు... రాబోయే 5-10ఏళ్ల కాలానికి అమ్మకాల పరంగా రామ్‌దేవ్, బాలకృష్ణలు పెట్టుకున్న లక్ష్యమిది. మొత్తంగా దేశంలో ఏటా అమ్ముడయ్యే ‘ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్’ విలువలో ఇది మూడో వంతు. ఇప్పటివరకూ ఏ సంస్థకూ ఈ టర్నోవర్ సాధ్యం కాలేదనీ, ఈ లక్ష్యం ఆకాశానికి నిచ్చెన వేయడం లాంటిదేననీ అంటారు కొందరు మార్కెట్ నిపుణులు. పోటీ సంస్థలకంటే ఎన్నో రెట్లు ఎక్కువ వృద్ధిని ఏటా పతంజలి నమోదు చేస్తోందనీ, ఇదే వేగం కొనసాగితే ఆ లక్ష్యాన్ని అందుకోవడం పెద్ద కష్టం కాదనీ అంటారు ఇంకొందరు విశ్లేషకులు. ఎవరేమన్నా ఇటీవలి కాలంలో ఏ సంస్థకూ సాధ్యం కాని రీతిలో పతంజలి దూసుకెళ్తొందన్నది అక్షర సత్యం. పదేళ్ల క్రితం పైసా ఆస్తిలేని బాలకృష్ణ ఇప్పుడు అపర కుబేరుడిగా ఎదగడమే అందుకు సాక్ష్యం. ఆదాయపరంగా గతేడాది పతంజలి 1011శాతం వార్షిక వృద్ధిని సాధిస్తే, రెండో స్థానంలో ఉన్న మరో సంస్థ 80శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. ఆ అంతరం చాలు మార్కెట్లో పతంజలి దూకుడేంటో చూపడానికి.
ఎమ్మెన్సీల ప్రాబల్యం తగ్గించి దేశానికి సేవ చేయడానికి వ్యాపారం, రైతులకు మేలు చేయడానికి ఆయుర్వేద సంస్థ, వినియోగదార్ల మంచి కోసం భిన్నమైన ఉత్పత్తులూ, పేదల కోసం ఖర్చుచేయడానికి లాభాలూ... ఈ నాలుగు నినాదాలనే వ్యాపార విధానాలుగా మార్చుకొని ‘పతంజలి’ అంతకంతకూ ఎదుగుతోంది. ఆ విధానాలు దారి తప్పనంత వరకూ సంస్థ ఎదుగుదలకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు..!
ఆచార్య... అన్నీ తానై
ఆచార్య బాలకృష్ణ... ‘పతంజలి’లో 94శాతం వాటా ఆయనదే. ఆయన అసలు పేరు నారాయణ్ ప్రసాద్ సుబేది. నేపాల్‌లో పుట్టిన ఆయన పెరిగిందంతా భారత్‌లోనే. సంస్థ ముఖచిత్రం రామ్‌దేవ్ అయితే, దాని చోదక శక్తి బాలకృష్ణ. ముప్ఫయ్యేళ్లుగా రామ్‌దేవ్‌కి సన్నిహితుడిగా ఉంటున్న బాలకృష్ణకి ఆయుర్వేద విద్యలో అద్భుతమైన నైపుణ్యం ఉంది. కాలక్రమంలో మరుగునపడిన ఎన్నో ఆయుర్వేద సూత్రాలను ఆయన వెలికి తీసి వాటి ఆధారంగా తిరిగి ఆ ఔషధాలను తయారు చేశారన్న పేరుంది. యోగ విద్య, సంస్కృతం, వేదాలనూ ఆయన ఆపోశన పట్టారు. తొలిదశలో సంస్థ తీసుకొచ్చిన ఔషధాలూ, ఉత్పత్తులన్నీ ఆయన సృష్టే. ప్రచారం చేసేది రామ్‌దేవ్ అయినా దాని వెనకుండే వ్యూహకర్త బాలకృష్ణే. ప్రయోగశాల నుంచి బయటికొచ్చిన ప్రొడక్ట్‌ని ఆమోదించి, దాన్ని ప్యాక్ చేసి మార్కెట్‌కి తరలించేవరకూ ప్రతి పనీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది. సంస్థని మొదలుపెట్టాక ఒక్కరోజు కూడా వ్యక్తిగత పనుల కోసం సెలవు తీసుకోలేదనీ, రోజూ ఉదయం ఏడు నుంచి రాత్రి పది వరకూ సంస్థ పనుల్లోనే నిమగ్నమవుతాననీ బాలకృష్ణ అంటారు. ‘పతంజలి ఆయుర్వేద్’కు ఎండీగా ఉన్న ఆయన, మరో 34 అనుబంధ సంస్థలకూ అధినేత. నిత్యం తెల్లని దుస్తులు వేసుకొని సాదాసీదాగా కనిపించే ఆయన కంప్యూటర్ సాయం తీసుకోకుండా కేవలం కాగితాల ద్వారానే వ్యాపార లావాదేవీల్ని నిర్వహిస్తారు. మార్కెట్ సర్వేల జోలికి పోకుండా తాను అనుకున్నది నిజమై తీరుతుందన్న నమ్మకంతో అడుగేస్తారు. ‘అల్లం జ్యూస్‌ని మార్కెట్లోకి తెచ్చే ముందు కొందరు సన్నిహితులు మొదట మార్కెట్ సర్వే చేయించమన్నారు. కానీ నేను మనస్సాక్షిని నమ్మి దాని తయారీ మొదలుపెట్టా. ఇప్పుడు అత్యధికంగా అమ్ముడయ్యే మా ఉత్పత్తుల్లో అదీ ఒకటీ’ అంటారు బాలకృష్ణ. రూ.25వేల కోట్ల రూపాయలకుపైగా ఆస్తులతో గతేడాది ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో 48వ స్థానాన్ని దక్కించుకున్న ఆయన, ‘మా లాభాల్ని సేవా కార్యక్రమాలవైపు మళ్లిస్తాం కాబట్టి నేను ఎక్కువ కాలం ఆ జాబితాలో కొనసాగలేకపోవచ్చు’ అని చెబుతారు.
సంస్థ ముఖచిత్రం
బాబా రామ్‌దేవ్... ‘పతంజలి’లో అధికారికంగా నయాపైసా వాటా లేకపోయినా, దాని విజయానికి పునాది వేసింది ఆయనే. సన్యాసి అయిన తనకు డబ్బుతో అవసరం లేదని రామ్‌దేవ్ అంటారు. కానీ బహుళజాతి సంస్థల ఆధిపత్యాన్ని తగ్గించి, ప్రజలను స్వదేశీ బాట పట్టించి, ఇక్కడి సంపద విదేశాలకు తరలకుండా ఇక్కడే ఖర్చయ్యేలా చూడటం తన బాధ్యతని చెబుతారు. అందుకే పతంజలిలో కీలక పాత్ర పోషిస్తూ, సంస్థ ఉత్పత్తులకు ప్రచారం కల్పించడంతో పాటు అవి మార్కెట్లోకి విడుదలయ్యే ముందు స్వయంగా తానే వాటిని వాడి చూస్తానని చెబుతారు. గతంలో ఎప్పుడూ నూడుల్స్ రుచి చూడని ఆయన, సంస్థ వాటి ఉత్పత్తిని మొదలుపెట్టడానికి ముందు చాలా రోజులపాటు నూడుల్స్‌ని ఆహారంలో భాగం చేసుకున్నారట. సంస్థలో కీలక స్థానాలకు ఉద్యోగులను ఆయనే ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
కనిపించని శక్తి
రామ్ భరత్... బాబా రామ్‌దేవ్ తమ్ముడైన ఆయన ‘పతంజలి’ రోజువారీ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. సంస్థకు అనధికారిక సీయీవోగా ఆయనకు పేరుంది. మీడియా కంటికి ఏమాత్రం చిక్కని ఆయన వ్యాపారానికి సంబంధించిన కీలక సమావేశాలు నిర్వహించ¿డంతో పాటు ఉద్యోగులూ, బాలకృష్ణ, రామ్‌దేవ్‌లకు మధ్య వారధిలా పనిచేస్తున్నారు. సంస్థ విస్తరణలో తమ ఇద్దరి తరవాత కీలక పాత్ర భరత్‌దే అంటారు బాలకృష్ణ.
ఆదాయమంతా సేవకే!
పతంజలిలో కొందరు ఉద్యోగులు జీతాలు తీసుకోకుండానే పనిచేస్తారట. వాళ్లు తమ ఉద్యోగాన్ని సమాజ సేవగా భావిస్తూ పతంజలి ఆశ్రమాల్లోనే ఉంటూ రోజువారీ పనుల్లో పాల్గొంటారు.
* రామ్‌దేవ్, బాలకృష్ణలను ఉద్యోగులంతా ‘ఆచార్య’ అనే సంబోధిస్తారు. వాళ్లముందు ఎవరూ చెప్పులేసుకోరు సరికదా, ఇద్దర్లో ఎవరు ఎదురుపడ్డా చేస్తున్న పని ఆపేసి మరీ ఆశీర్వాదం తీసుకోవడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది.
* నూడుల్స్, గోధుమపిండి, ఎరువుల లాంటి భిన్నమైన ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టిన తొలి ఆయుర్వేద సంస్థ పతంజలి. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ త్వరలో దుస్తులనూ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. జీన్స్‌తో సహా పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ అనువైన దుస్తులను ఉత్పత్తి చేయనుందట.
* పతంజలి ఆదాయంలో సింహ భాగం సేవా కార్యక్రమాలకే కేటాయిస్తున్నట్లు రామ్‌దేవ్ చెబుతారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వెలుస్తున్న పతంజలి విద్యా కేంద్రాలూ, ఆయుర్వేద చికిత్సాలయాలను దానికి సాక్ష్యంగా చూపిస్తారు. మొత్తం ఆదాయంలో ఎనభై శాతం విద్యపైనా, మిగతాది ఇతర సేవల కోసం ఖర్చుచేయాలన్నది తన ఆలోచన అంటారు రామ్‌దేవ్.
* గతంలో కేవలం పతంజలి కేంద్రాల్లో మాత్రమే ఆ సంస్థ ఉత్పత్తులు దొరికేవి. కానీ ఇటీవలే బిగ్‌బజార్, రిలయన్స్ లాంటి సంస్థలతోనూ ఒప్పందం చేసుకోవడంతో వాటి స్టోర్లలోనూ పతంజలి ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ఈ ఏడాది వాటి అమ్మకాల విలువ రూ.20వేల కోట్లు దాటుతుందని అంచనా.
అంకెల్లో పతంజలి
రూ. 10,561 కోట్లు: గత ఆర్థిక సంవత్సరంలో పతంజలి ఆదాయం
47000: దేశవ్యాప్తంగా ఉన్న పతంజలి రిటైల్ స్టోర్లు
1000+ : సంస్థ ఉత్పత్తుల సంఖ్య
1500+ : సంస్థకి ముడిసరుకుని అందిస్తున్న రైతులు
1000 ఎకరాలు: హరిద్వార్‌లోని పతంజలి ప్రధాన కార్యాలయ ప్రాంగణ వైశాల్యం
200: కొత్త ఉత్పత్తుల తయారీ కోసం పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల సంఖ్య
30: హరిద్వార్‌లో పతంజలి ప్రాంగణంలో ఉన్న ఫ్యాక్టరీలు
10: పతంజలి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్న దేశాలు
#పతంజలి_రామ్ దేవ్ విసిరిన రాకెట్_
#patanjali_Ramdev_baba
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565