విండోస్‌లో మ్యాక్...
ఫీచర్లు రాక్!
ఆపిల్ కంప్యూటర్లలో ఉండే కొన్ని ఆప్షన్లు ఆసక్తికరంగా ఉన్నాయి. విండోస్ సిస్టమ్స్‌లో లేని ఉపయుక్తమైన సదుపాయాల్ని అందిస్తున్నాయి. మీ ల్యాపీ/కంప్యూటర్‌కు ఈ సాఫ్ట్‌వేర్లను జోడిస్తే విండోస్‌లో రాకింగ్ మ్యాక్ ఫీచర్లను పొందొచ్చు.
ఏమున్నాయో చెప్పండి
సెర్చ్ చేసేటప్పుడు మ్యాక్‌లో ఫోల్డర్లు వేగంగా లోడ్ అవుతాయి. విండోస్‌లో ఈ ప్రోసెస్ ఆలస్యంగా ఉంటుంది. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి సిస్టమ్ సెట్టింగ్స్‌లో చిన్న మార్పు చేసుకుంటే సరి. ఫోల్డర్‌పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి ‘కస్టమైజ్’ ఆప్షన్‌లోకి వెళ్లండి. ఆ ఫోల్డర్‌లో ఏముంచుతారు అని అడుగుతుంది. అక్కడ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, మ్యూజిక్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు కావల్సిన దాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత సెర్చ్ చేసినప్పుడు ఫలితాల్ని వీలైనంత త్వరగా పొందొచ్చు.
స్క్రీన్ షాట్ కోసం
విండోస్ సిస్టమ్‌లో స్క్రీన్ షాట్ తీయాలంటే... కీబోర్డులోని ప్రింట్ స్క్రీన్ బటన్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత దాన్ని ఫొటోషాప్ లేదా పెయింట్‌లోకి వెళ్లి పేస్ట్ చేసుకొని క్రాప్ చేసుకోవాలి. అదే మ్యాక్‌లో అయితే మనకు కావల్సిన భాగం వరకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. విండోస్‌లో Lightshot సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని మ్యాక్ తరహా స్క్రీన్ షాట్‌ను తీసుకోవచ్చు. ఈ ఆప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఎప్పటిలాగే ప్రింట్ స్క్రీన్ బటన్‌ను క్లిక్ చేయాలి.అప్పుడు స్క్రీన్ లేత నలుపు రంగులోకి మారుతుంది. అందులో కావల్సిన భాగాన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఆప్షన్స్‌లోకి వెళ్లి ప్రింట్ స్క్రీన్ బటన్‌కు బదులు కంట్రోల్, ఆల్ట్ లాంటి ఇతర బటన్స్ ఎంచుకోవచ్చు.
పేరు మార్చేద్దాం
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్లలో ఫోల్డర్ లేదా ఫైల్ పేరు మార్చాలంటే దాని మీద మౌస్‌తో రైట్ క్లిక్ చేసి... రీనేమ్ ఆప్షన్‌లోకి వెళ్లి కావల్సిన పేరు ఇవ్వొచ్చు. అదే మ్యాక్ సిస్టమ్‌లో అయితే చాలా సులభంగా ఆ ఫోల్డర్/ఫైల్‌ను ఎంచుకొని ఎంటర్ బటన్‌ను క్లిక్ చేసి మార్చుకోవచ్చు. విండోస్ ఆధారిత కంప్యూటర్‌లోనూ ఇలాంటి సౌకర్యం ఉంది. రీనేమ్ చేయాలనుకుంటున్న ఫైల్ లేదా ఫోల్డర్‌ను సెలెక్ట్ చేసి కీబోర్డు పైన ఉన్న F2 బటన్‌ను క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు కావల్సిన పేరు ఇచ్చుకోవచ్చు.
పరిమాణం తగ్గించి
ఓ ఫొటో సైజు, రిజెల్యూషన్‌ను తగ్గించాలి అంటే... దాన్ని ఫొటోషాప్ లాంటి సాఫ్ట్‌వేర్‌లో ఓపెన్ చేసి మార్చాలి. అదే ఓ 50 ఫొటోలంటే చాలా సమయం తీసుకుంటుంది. మ్యాక్‌లో అయితే ఆటోమేటడ్ సౌకర్యం ఉంటుంది. దీంతో మొత్తం ఫొటోల సైజ్ ఒకేసారి మార్చుకోవచ్చు. అన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్‌లో మీకు కావల్సిన సైజు, రిజెల్యూషన్, ఫార్మేట్ ఇచ్చి ప్రోసెస్ చేస్తే ఫొటోస్ మారిపోతాయి. ఇలాంటి ఫీచర్‌ను విండోస్ కంప్యూటర్‌లో వాడాలంటే అందులో Image Resizer ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఎక్కడైనా రాసేలా...
బస్సులో ఆఫీసుకు వస్తూ... ఏదో విషయానికి సంబంధించి మొబైల్‌లోని నోట్స్ ఆప్‌లో రాసుకున్నారు. ఆఫీసుకు వచ్చాక ఐప్యాడ్ తీసుకొని అందులో ముందు రాసిన దాన్ని కొనసాగించారు. ఆపిల్ మొబైల్స్‌లో నోట్స్ సింక్ ఆప్షన్ ఉండటం వల్ల ఎక్కడైనా వాడుకునే వీలుంటుంది. విండోస్‌లోనూ ఈ తరహా సౌకర్యాన్ని పొందడానికి కొన్ని థర్డ్ పార్టీ ఆప్స్ ఉన్నాయి. గూగుల్ కీప్, ఎవర్ నోట్ లాంటి ఆప్స్‌ను మొబైల్‌లో ఓపెన్ చేసి సమాచారం రాసుకోవచ్చు. తర్వాత సిస్టమ్‌లో ఆయా వెబ్‌సైట్లను ఓపెన్ చేసి మీ రాతను ఆపిన దగ్గరి నుంచి కొనసాగించొచ్చు.
అన్నీ వెతుక్కోవచ్చు
ఆపిల్ కంప్యూటర్లలో ఉండే ఫైళ్లు, సాఫ్ట్‌వేర్లను వెతుక్కోవడానికి స్పాట్ లైట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ట్యాబ్‌లోకి వెళ్లి సిస్టమ్ సెర్చ్‌తోపాటు, అంతర్జాల శోధన కూడా చేసుకోవచ్చు. విండోస్ 8, 10 ఓఎస్ ఆధారిత కంప్యూటర్లలో కొర్టానాతో ఈ సౌకర్యం వచ్చింది. విండోస్ 7 ఆధారిత కంప్యూటర్లలోనూ ఈ తరహా సౌకర్యాన్ని పొందొచ్చు. దీనికి చేయాల్సిందల్లా సిస్టమ్‌లో Woxసాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడమే. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేస్తే స్క్రీన్ మీద సెర్చ్ బార్ వస్తుంది. దాన్ని స్పాట్‌లైట్ మాదిరి వినియోగించుకోవచ్చు.
ఎక్కడున్నా కదులుతుంది
కంప్యూటర్‌లో ఒకేసారి బ్రౌజర్, వర్డ్ డాక్యుమెంట్‌ను వాడుతున్నారు. మౌస్ బాల్‌ను స్క్రోల్ చేసినప్పుడు యాక్టివ్‌గా ఉన్న (పైన ఉన్న) సాఫ్ట్‌వేర్ స్క్రోల్ అవుతుంది. అంటే రెండింటిలో పైకి ఉన్న సాఫ్ట్‌వేర్ యాక్సెస్ అవుతుంది. ఉదాహరణకు పైకి బ్రౌజర్ ఉండి, వెనుక వర్డ్ డాక్యుమెంట్ ఉంటే పైన ఉన్న బ్రౌజర్ పేజీ స్క్రోల్ అవుతుంది. వర్డ్ డాక్యుమెంట్‌ను యాక్సెస్ చేయాలంటే దాన్ని మౌస్‌తో క్లిక్ చేయాల్సిందే. అదే ఆపిల్ సిస్టమ్స్‌లో అయితే క్లిక్ చేయకుండా, కేవలం దాని మీద మౌస్ హోవర్ (ఆ సాఫ్ట్‌వేర్‌పై కర్సర్ ఉంచితే) చేసి స్క్రోల్ చేయొచ్చు. విండోస్‌లో ఇలాంటి ఆప్షన్ కావాలంటే KatMouseసాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
టాస్క్ బార్... డాక్
విండోస్ కంప్యూటర్లలో మినిమైజ్ చేసిన అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్లు దిగువన టాస్క్ బార్‌లో వచ్చి చేరుతాయి. అదే మ్యాక్ కంప్యూటర్లలో అయితే డాక్ అనే ట్రేలోకి వచ్చి చేరుతాయి. ఆ డాక్ కనిపించే విధానం, పని చేసే శైలి వైవిధ్యంగా ఉంటుంది. విండోస్ కంప్యూటర్లలో డాక్ ఆప్షన్‌ను పొందాలంటే RocketDock సాఫ్ట్‌వేర్‌ను మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేశాక... ఏయే సాఫ్ట్‌వేర్లు, ఫోల్డర్లు అందులో కనిపించాలనేది మీరే ఎంచుకోవచ్చు. అది కనిపించే శైలిని కూడా మార్చుకోవచ్చు.
ఒక సిస్టమ్... రెండు డెస్క్‌టాప్‌లు
విండోస్ కంప్యూటర్లలో ఒకటికి మించి యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే మ్యాక్ కంప్యూటర్లలో అయితే ఒకటికి మించి డెస్క్‌టాప్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీని వల్ల ఎంచక్కా ఒక కంప్యూటర్‌ను రెండు, మూడు కంప్యూటర్లగా వాడుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్‌ను విండోస్ కంప్యూటర్‌లోనూ పొందాలంటే Dexpotసాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీన్ని సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాక స్క్రీన్ నాలుగు స్క్రీన్‌లుగా విడిపోతుంది. అంటే ఒక్కో స్క్రీన్ ఒక్కో కంప్యూటర్ డెస్క్‌టాప్ అన్నమాట. ఒక్కోదానికి ఒక్కో స్క్రీన్ సేవర్, ఒక్కో దాంట్లో ఒక్కో సాఫ్ట్ వేర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
అంచులు తాకితే...
ఆపిల్ కంప్యూటర్లలో కర్సర్‌ను స్క్రీన్‌లో ఓ మూలకు క్లిక్ చేస్తే అప్పటివరకు ఓపెన్ చేసిన అప్లికేషన్ విండోస్ అన్నీ మినిమైజ్ అయిపోతాయి. మరో మూలకు క్లిక్ చేస్తే సిస్టమ్ స్టాండ్ బై మోడ్‌లోకి వెళ్లిపోతుంది. కార్నర్స్ ఆప్షన్ ద్వారా ఇది వీలవుతుంది. విండోస్ సిస్టమ్‌లో ఒక్కో విండోను మినిమైజ్ చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. maComfot సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే మ్యాక్ తరహాలో ‘కార్నర్స్’ ఆప్షన్‌ను విండోస్‌లోకి తీసుకురావొచ్చు.
అంకెల్లో...
70 కోట్లు
- ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు
50 కోట్లు
- ప్రపంచవ్యాప్తంగా లింక్డ్‌ఇన్ వినియోగదారులు
1,00,000
- ఫేస్‌బుక్ మెసెంజర్‌లో డెవలపర్లు రూపొందించిన ఛాట్‌బోట్స్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565