MohanPublications Print Books Online store clik Here Devullu.com

పాడనా తెనుగు పాట.._Padana telugu pata





పాడనా తెనుగు పాట..

చిత్రం: అమెరికా అమ్మాయి
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: జి.కె. వెంకటేశ్‌
గానం: పి. సుశీల


పల్లవి :

పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

చరణం : 1
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మూపులపైన మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాలపేట మధురామృతాల తేట
ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

చరణం : 2
త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడునాడులుకదిలించేది వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట

ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

చరణం : 3
ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
ఒళ్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్లకు పారాణి మెరిసే కుంకుమబొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడే
తెలుగుతల్లి పెట్టనికోట తెలుగునాట ప్రతిచోట
ఒకపాట... పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

చిత్రం : అమెరికా అమ్మాయి (1976)
సంగీతం : జి.కె.వెంకటేష్
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : పి.సుశీల

‘అమెరికా అమ్మాయి’ చిత్రంలోని ‘పాడనా తెనుగుపాట’ నాకు చాలా చాలా ఇష్టమైన పాట. అమెరికాలో ఉండే అమ్మాయి, మన దేశానికి వచ్చి, మన భాష, సంస్కృతి, సంగీతం, సంప్రదాయం నేర్చుకుంటుంది. ఒకసారి వేదిక మీద జరుగుతున్న ఒక కార్యక్రమంలో తెలుగువారు... పాశ్చాత్య పోకడలను అనుకరిస్తూ, వారి సంస్కృతిని కల్తీ చేసి నాట్యం చేస్తారు. ‘ఇది కాదు మన సంస్కృతి’ అని అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి, తెలుగుదనం వెల్లివిరిసేలా పాడే పాట ఇది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ఈ పాటలో చూపాలి. సందర్భానికి తగ్గట్టుగా దేవులపల్లి వారు రాసిన పాట ఇది. వారి పదాలలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. అందుకే ఆయన చేత రాయించుకున్నాను.

ఈ పాటకు జి. కె. వెంకటేశ్‌ సంగీతం సమకూర్చారు. ప్రముఖ వయొలిన్‌ విద్వాంసులు ఎల్‌.వైద్యనాథన్, ఇళయరాజా సంగీత సహాయకులుగా పని చేశారు. ఈ చిత్రంలో అమెరికా అమ్మాయిగా ‘దేవయాని’ అనే ఫ్రెంచ్‌ అమ్మాయిని ఎంచుకున్నాం. ఈ అమ్మాయి మద్రాసు కళాక్షేత్రంలో నాట్యం నేర్చుకుని ప్రదర్శనలు ఇచ్చేది. ఈ పాట ఎత్తుగడే ‘పాడనా తెనుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట...’ అని వస్తుంది. ఒక విదేశీ అమ్మాయి భారతదేశానికి వచ్చి, తెలుగు సంస్కృతీసంప్రదాయాలను అలవర్చుకుని, పట్టుచీర, కుంకుమబొట్టు, పూలతో అందమైన అచ్చమైన పల్లెవాతావరణాన్ని ప్రతిబింబించేలా కనిపిస్తుంది.

మన తెలుగువారి పాట మన ఎదురుగా వినిపిస్తాను అంటూ ఈ పాట పాడుతుంది. ‘‘కోవెల గంటలు, గోదావరి తరగలు, మంచి ముత్యాలు, మధురామృతాలతో నిండిన పాట పాడుతాను’’ అంటూ తెనుగు భాష, తెనుగు నేల గొప్పదనాన్ని ఈ పాటలో పలుకుతుంది కథానాయకి. తెనుగు వాగ్గేయకారులైన త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసుల కవితలో చక్కెర మాటల మూటలు, చిక్కని తేనెల ఊటలు ఉన్నాయంటే తేనె వంటి తెనుగును చూపారు కృష్ణశాస్త్రి గారు. ఈ పాటలో ముఖ్యంగా ‘‘ఒళ్లంత వయ్యారి కోక, కళ్లకు కాటుక రేఖ...’’ చరణంలో తెలుగు నేపథ్యం, గ్రామీణ వాతావరణం, పల్లెల గొప్పదనం, ప్రాశస్త్యం చూపాలనుకున్నాం. అందుకుగాను రాజమండ్రి దామెర్ల ఆర్ట్‌ గ్యాలరీలో ఉన్న దామెర్ల రామారావు చిత్రాలు చూపాలనుకున్నాను.

నాకు అత్యంత సన్నిహితులైన బాపు గారి ద్వారా ఆ చిత్రాలు తెప్పించి, అవి చూపాం. మూడో చరణమంతా అలా అచ్చలె నుగు పల్లెను పిక్చరైజ్‌ చేశాం. ఈ పాటలోని ప్రతి పదంలోనూ తెనుగుదనం ఉట్టిపడుతుంది. తెనుగు భాష విశిష్టతను, తెనుగుదనాన్ని తేనెలొలికించారు కృష్ణశాస్త్రి గారు. ఆయన గురించి చెప్పడమంటే మాటలు కాదు. అప్పటికే మల్లీశ్వరి చిత్రం ద్వారా తెలుగువారికి సుపరిచితులైన కృష్ణశాస్త్రిగారు ఈ పాటను కూడా అంతే అందంగా రచించారు.
– సంభాషణ: డా. జయంతి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list