MohanPublications Print Books Online store clik Here Devullu.com

పాదం తొక్కేస్తోందా?-Foot, Depression, Bone, పాదం, డిప్రెషన్‌, ఎముక

పాదం తొక్కేస్తోందా?
ముందడుగు వేసేది పాదమే
ముందంజలో ఉంచేదీ పాదమే
పాదానికి ప్రాబ్లమ్‌ వస్తే వెనకబడిపోతాం
అవును... పడిపోతాం
పాదాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే
ఆరోగ్యాన్నే తొక్కేస్తుంది.
పాదం... పదిలం!
కాలు లేకపోతే కదలిక లేదు. పాదం కదలకపోతే పురోగతి లేదు. అంతెందుకు పాదంలో ఏదైనా సమస్య ఉండి కాళ్లను కదిలించలేక పోతే మన క్యాలరీల ఖర్చు తగ్గుతుంది. దాంతో మొత్తం ఆరోగ్యమే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కాళ్లు కదలాలి. కదలిక ఉండాలి. అంటే వ్యాయామ రూపంలోనన్నమాట. అప్పుడే ఆరోగ్యం ఉంటుంది. ఇది కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే పరిమితం కాదు... మానసిక ఆరోగ్యానికి కూడా. పిల్లల్లో ఏమాత్రం కదలికలు లేకుండా ఇంటికే పరిమితమయ్యేవారు, ఏవో కారణాలతో కాళ్లు కదలికలు మందగించి మంచానికే అంటిపెట్టుకుని ఉండేవారిలో కొన్ని మానసిక సమస్యలూ కనిపించవచ్చు. తాము బయటికి వెళ్లకపోవడం, నలుగురిలో కలవకపోవడంతో డిప్రెషన్‌ వంటి సమస్యలూ రావచ్చు. అంతేకాదు... పోటీతత్వం మందగించి మందకొడిగానూ మారిపోవచ్చు. పిల్లల్లో ఆ పరిస్థితి రానివ్వకుండా చూసుకుంటే చదువుల్లో, ఆటల్లో, ఎదిగాక సమాజంలోనూ వారిది క్రియాశీల భూమిక. అంత కీలకమైనది కాలు. చలనశీలమైనది పాదం. ఆ పాదం గురించి కొన్ని విషయాలు ఆపాదం నుంచి మస్తకంలోకి వెళ్లడానికి ఈ కథనం.
పాదాల నిర్మాణం: మానవ పాదంలో 26 ఎముకలు ఉంటాయి. మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అంటే రెండు పాదాల్లోనూ కలుపుకుంటే 52 కాబట్టి... ఒక వ్యక్తిలో ఉండే మొత్తం ఎముకల్లోని నాలుగో వంతు పాదాల్లోనే ఉంటాయన్నమాట. 107 లిగమెంట్లు, 19 కండరాలు ఉంటాయి. ఒక వ్యక్తి బరువంతా మోయడానికి వీలుగా పాదం విశాలంగా రూపొందింది.
మొదటి నష్టం షూస్‌ లేదా పాదరక్షలతోనే...
ప్రతి వ్యక్తిలోనూ 20 ఏళ్ల వయసు వచ్చే వరకూ పాదం పూర్తిగా రూపొందే ప్రక్రియ పూర్తి కాదు. కానీ మారుతున్న జీవనశైలి ప్రకారం చిన్నప్పట్నుంచే ప్రతివారి పాదాలనూ షూలతో బిగించి ఉంచడం సాధారణమైంది. బుడిబుడి అడుగులు వేసే బుడతల పాదాలను సైతం రంగురంగుల సాక్స్‌ లేదా షూలతో బిగిస్తుంటారు. దీనివల్ల వచ్చే చిన్న చిన్న లోపాలే పెద్దయ్యాక నడకలో నష్టం కలిగించే అవకాశం ఉంది.
హైహీల్‌ వల్ల నష్టాలు ఎందుకంటే...
జీవులు తమ నాలుగు కాళ్ల మీద నడవడానికి అనువుగా రూపొందాయి. కానీ మనిషి తన రెండు కాళ్ల మీదే మొత్తం బరువు మోపేలా ముందు వైపు లింబ్స్‌ను చేతులుగా రూపొందించుకుంటూ నిటారుగా నిలబడ్డాడు. దాంతో మనిషి బరువంతా రెండు కాళ్ల మీద వెన్ను మీద పడటం ప్రారంభమైంది. మన వీపు భాగం ఇంగ్లిష్‌ అక్షరమైన ‘ఎస్‌’ అనే ఆకృతితో ఉంటుంది. వెన్నెముక ఉన్న జీవులన్నీ నడిచే సమయంలో పడే ఒత్తిడిని గణనీయంగా తగ్గించడానికి ఈ ‘ఎస్‌’ ఆకృతి ఉపకరిస్తుంది. హైహీల్స్‌ తొడగడం వల్ల నడుం భాగంలో ఉండే వీపు (లంబార్‌) ప్రాంతం తన ఒంపును కోల్పోయి నిటారుగా అవుతుంది. ఆపైన ఉండే ఛాతీ భాగంలోని వెనకభాగపు వీపు (థొరాసిక్‌ లేదా మిడ్‌ బ్యాక్‌), మెడ, తల... ఇవన్నీ సాధ్యమైనంత నిటారుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో మనిషికి స్వాభావికంగా ఉండే ‘ఎస్‌’ ఆకృతి ఒంపు కాస్తా నిటారుగా మారుతుంది. దాంతో కండరాలపై ఉండాల్సినదాని కన్నా ఒత్తిడి అధికమవుతుంది. పైగా వాటిని సరైన అలైన్‌మెంట్‌లో లేకుండా అదేపనిగా ఉపయోగించడం వల్ల కండరాలు దెబ్బతిని నొప్పి వస్తుంటుంది.
హైహీల్స్‌ ఇష్టపడేవారికి టిప్స్‌
⇒రోజంతా హైహీల్స్‌ మాత్రమే వేసుకోకండి
⇒మధ్యాహ్నం లేదా సాయంత్రాలే షాపింగ్‌ చేయండి. ఆ సమయంలో మీ పాదాల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.
⇒మీ హైహీల్‌ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా... రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి. (ఒక్కోసారి హీల్‌ నిడివిలోనూ మార్పు ఉండవచ్చు. రెండింటినీ ఒకేసారి వేసుకుంటే ఆ తేడా తెలిసేందుకు అవకాశం ఎక్కువ)
⇒ మీ మడమ వెడల్పులో మడమ ఎత్తు సగం ఉంటే అది సరైన ఆరోగ్యకరమైన హీల్‌ అని గుర్తుంచుకోండి.
⇒ మీరు హైహీల్స్‌ తొడిగే ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గితే మీకు దాని వల్ల వచ్చే నొప్పులూ అంతగా తగ్గుతాయి ఠి పాయింటెడ్‌ హైహీల్స్‌ లేదా మరీ బిగుతుగా ఉండే షూస్‌ వేసుకోవద్దు
⇒మీరు హైహీల్స్‌ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాల వల్ల అసలు పాదరక్షలే తొడగలేని పరిస్థి తి కూడా తలెత్త వచ్చని గుర్తుంచుకోండి
⇒హైహీల్స్‌ వేసుకునే ముందు మీ మోకాలి కింద వెనక భాగంలో ఉండే కాఫ్‌ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ వార్మప్‌ మసాజ్‌లా చేయండి. కాఫ్‌ మజిల్స్‌కు ప్రతిరోజూ తగినంత వ్యాయామాన్ని, స్ట్రెచింగ్‌ను ఇవ్వండి
⇒ మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్‌ వేసుకుంటే... అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి పాదాలు నేలకు ఆనేట్లుగా ఉంచి కాసేపు అలాగే నిలబడండి. ఈ సమయంలో ముందుకు వంగి మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజ్‌ను చేయండి
⇒హైహీల్స్‌ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి.
పాదాలలో పగుళ్లు
పాదాల పగుళ్లకు అలర్జీలు మొదలుకొని చాలా కారణాలు ఉండవచ్చు. శరీరానికి తగిన నీరు అందకపోతే కూడా కాళ్లకు పగుళ్లు ఏర్పడతాయి. మనం వాడే సబ్బు, తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్‌ పాళ్లు తక్కువగా ఉండటమూ కారణం కావచ్చు. కాళ్ల పగుళ్లకు బ్యాక్టీరియా/ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ కారణమైతే ఒక్కోసారి అవి పగుళ్ల నుంచి పుండ్లుగా మారొచ్చు. అందుకే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్నిసార్లు డయాబెటిస్‌/థైరాయిడ్‌ /ఒబేసిటీ లాంటివీ కాళ్ల పగుళ్ల సమస్యకు కారణం కావచ్చు. పాదాల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది సూచనలు పాటించాలి. మంచినీటిని ఎక్కువగా తాగాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పొడిబట్టతో శుభ్రంగా, తడిలేకుండా తుడవాలి. మాయిశ్చరైజర్‌ ఎక్కువగా ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని సాక్సులను ధరించాలి. రాత్రంతా సాక్స్‌లు ధరించడం మంచిది.
కాలికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో...
పాదాలకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యమైన కొన్ని సమస్యలివే...
ఆనెకాయలు: షూ వల్ల ఒకేచోట నిరంతరం ఒత్తిడి పడుతుండటం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దాంతో అక్కడ మృతకణాలు చేరుతూ పోవడం వల్ల ఈ ఆనెకాయలు వస్తుంటాయి. కొందరు ఆనెకాయలను బ్లేడుతో కోసేస్తుంటారు. మరికొందరు ఆనెకాయలపై కొన్ని చుక్కల యాసి పోస్తూంటారు. కానీ ఆనెకాయలు వస్తే దాని చుట్టూ ప్లాస్టర్‌ వేసి డాక్టర్‌కు చూపించాలి.
బ్యూనియన్‌: కొందరికి షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమసయను ‘బ్యూనియన్‌’ అంటారు. కొందరిలో ఇది వారసత్వంగానూ కనిపిస్తుంది. షూ వల్ల మరింత పెరుగుతుంది. షూ ఒరుసుకుపోతున్న చోట... పాదం తనను తాను రక్షించుకునేందుకు మరో అదనపు కణజాలాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సమస్య ఉన్నవారు డాక్టర్‌ను కలిసి, అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం.
అథ్లెట్స్‌ ఫుట్‌ : ఈ సమస్య ఫంగస్‌ కారణంగా వస్తుంది. నిజానికి ఈ ఫంగస్‌ ఎప్పుడూ పాదాలపై ఉండే ఉంటుంది. కానీ పాదం నిత్యం తేమ, తడిలో ఉన్నప్పుడు ఆ ఫంగస్‌ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్‌ ఫుట్‌ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథుల స్రావంతోనూ పాదం చెమ్మబారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్‌ ఉన్న వాష్‌లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్‌ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే పాదం ఆరోగ్యంగా ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి యాంటీ ఫంగల్‌ ట్యాబ్లెట్స్‌ కూడా వేసుకోవాల్సి రావచ్చు.
బొటనవేలి గోరు లోపలికి పెరగడం : కొందరికి బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంది. ఇలా జరగకుండా చూసుకోవాలంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లో మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్‌ చేసుకుంటే ఈ సమస్యను ఎప్పటికీ రాకుండా చూసుకోవచ్చు.
పాదాలకు తిమ్మిర్లు పట్టడం : పాదానికి తిమ్మిర్లు పట్టి, పాదం మొద్దుబారినట్లుగా ఉండటం చాలా మందిలో కనిపించే సాధారణ లక్షణమే. ఇలాంటి లక్షణం కనిపించినవారిలో షుగర్‌ వ్యాధి లేకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే షుగర్‌ వ్యాధి ఉండి తిమ్మిర్లతో పాదం మొద్దుబారి స్పర్శ తెలియకపోతే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.
పాదాల వ్యాయామం: పాదాల కోసం చేయాల్సిన వ్యాయామాలు చాలా రకాలుగా ఉంటాయి. చిన్న వయసులో అయితే స్కూలు ఆవరణలో ఆడే అనేక రకాల ఆటలు పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. స్కిప్పింగ్‌ లాంటివి కాళ్ల ఆరోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన ఎదుగుదలకూ తోడ్పడతాయి. ఇక టీనేజ్‌ దాటాక జిమ్‌కు వెళ్లే యువకులు స్క్వాట్స్‌ మొదలుకొని, వారికి అనువుగా ఉండే అనేక రకాల వ్యాయామాలు చేస్తారు. పిక్కలు మనకు గుండెలాంటివి కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్తపడటం వల్ల కాళ్ల ఆరోగ్యం బాగుటుంది. అయితే ఏ వయసు వారిలోనైనా బ్రిస్క్‌ వాకింగ్‌ చేయడం అన్ని విధాలా ఆరోగ్యకరం. అది కాళ్లతో పాటు సమస్త అవయవాలకూ ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తుంది.
పాదరక్షల ఎంపిక ఎలా ఉండాలంటే...
పాదరక్షల ఎంపికలో మొదట రెండు పాదాల పొడవును కొలిచి, రెండింటికీ సౌకర్యంగా ఉండే జోడునే ఇవ్వమని చెప్పాలి. మనం తొడుక్కునే షూస్‌ పాదం చివరే ముగియకుండా... మరో రెండు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండాలి. అలా ఖాళీ ఉందో లేదో నొక్కి చూసుకోవాలి. పాదంలో వెడల్పులగా ఉండే భాగం ముడుచుకోకుండా, సౌకర్యంగా పరచుకునేలా షూ ఉండాలి. ఈమధ్య చాలామంది పొట్టిగా ఉండే ‘షార్ట్‌ సాక్స్‌’ తొడుగుతున్నారు. అవి కాలిని బాగా బిగుతుగా మడిచినట్లుగా చేసే టైట్‌ షూ అంత ప్రమాదకరం. సాక్స్‌ కాస్త సాగుతూ ఉండేవి అయితేనే మంచిది.
డయాబెటిస్‌ ఉన్నవారు పాదాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
మిగతావారితో పోలిస్తే డయాబెటిస్‌తో బాధపడేవారు పాదాలను మరింత శుభ్రంగా ఉంచుకోవాలి. అందునా ఐదు నుంచి పదేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు తమ కాళ్లను ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించుకుంటూ ఉండాలి. వారు పాదాల పరిరక్షణ కోసం పాటించాల్సిన సూచనలివి... 
⇒ తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండాలి. పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏవిధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్ని కూడా నిశితంగా పరీశించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు. అది భవిష్యత్తులో కాలిని తొలగించేంత ప్రమాదకరంగా కూడా మారేందుకు అవకాశం ఉంటుంది. అందుకే పొక్కు చిన్నగా ఉన్నప్పుడే పూర్తిగా మానిపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
⇒నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్‌ రాసుకోవాలి.
⇒కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి.
⇒ వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్‌ ఉన్నవారు హాట్‌ వాటర్‌ బ్యాగ్‌తో కాళ్లకు కాపడం పెట్టుకోక పోవడమే మంచిది.
⇒పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్‌తో కాళ్లను రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగానూ మారేలా శుభ్రం చేసుకోవాలి.
⇒కాళ్లమీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా అవసరం.
⇒కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్‌ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరుమూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్‌ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్‌ రోగుల్లో ప్రమాదం.
⇒ఇంట్లోకూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్‌ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి.
⇒ఏడాదికోసారి డాక్టర్‌కు చూపించుకుంటూ ఉండాలి. ఇవన్నీ పాదాల సంరక్షణకు ఉపయోగపడే మార్గాలు.
చివరగా... పాదాలు మన ప్రతి కదలికనూ నిర్ణయిస్తాయి... నియంత్రిస్తాయి. ప్రగతి పథాన ఉంచుతాయి. అందుకే పాదాల ఆరోగ్య పరిరక్షణే అందరి ప్రథమ ప్రాధాన్యం కావాలి.
డాక్టర్‌ కె.సుధీర్‌రెడ్డి
చీఫ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్, ల్యాండ్‌మార్క్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list