అబద్ధం
ఈ ఆలయంలో నిషిద్ధం
దేశంలో ఎక్కడా లేని విధంగా సత్య ప్రమాణాలకు వేదికగా కాణిపాకం పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. తప్పుచేసిన వారు ఈ ఆలయంలో ప్రమాణం చేయడానికి సాహసించరు. ఇక్కడ కొలువైన వినాయకుడు కోరిన కోర్కెలు తీర్చే వరసిద్ధుడిగా పేరు గాంచాడు. ఐరాల మండలంలోని కాణిపాకం గ్రామంలో ఇరవై ఏళ్ల క్రితం కేవలం ఒక మండపంలోని ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ తిరుమల, శ్రీకాళహస్తి తరువాత జిల్లాలో అంతటి ఆదరణ గల ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఆలయానికి ప్రతి రోజు ఇరవై వేల మందికి తక్కువ కాకుండా ముఖ్యమైన పర్వదినాలలో లక్ష మంది వరకు భక్తులు ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు.
వరసిద్ధుడి ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. కాణిపాకాన్ని అప్పట్లో విహారపురిగా పిలిచేవారు. గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకొని జీవనం సాగించేవారట. వీరిలో ఒకరు అంధుడు, మరొకరు చెవిటివాడు, ఇంకొకడు మూగవాడు. వీరు తమ పొలానికి నీరు పెట్టడానికి బావి నుంచి యా తం వేసి నీరు తోడుతుండగా బావిలోని ఓ శిలకు యాతపు బాణ తగిలి రక్తం స్రవించిందట. ఆ నీరు తగిలి అంధుడికి కళ్లు కనిపించాయి,చెవిటివాడికి వినబడింది, మూగవాడు మాట్లాడగలిగాడు. యాతపు బాణ తగిలింది స్వామి విగ్రహ శిరస్సుకు. అందుకే స్వామి విగ్రహం తలపై ఇప్పటికీ కొప్పులా ఉంటుంది. పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు విగ్రహం మహిమను గుర్తించి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పూజించారు. భక్తులు కొట్టిన కొబ్బరి నీళ్లు కాణి(ఎకరా)పారకం అయింది. ఈ క్షేత్రం ఆ విధంగా కాణిపారకమని కాలక్రమేణా కాణిపాకమని పేరుపడింది.
స్వామి విగ్రహం పెరుగుతోంది
స్వయంభుగా వెలసిన స్వామి విగ్రహం అచ్చుం శిల్పి చెక్కినట్లు ఉంటుంది. ఈ విగ్రహం ప్రతి ఏడాది కొంత పరిమాణంలో పెరుగుతూ ఉందని భక్తులు చెబుతారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలలో ఉంచిన స్వామి వెండి కవచాలే దీనికి నిదర్శనం. దోషులతో నిజం చెప్పించడానికి, మద్యపానం వంటి దురలవాట్లు మాన్పించడానికి ఈ క్షేత్రంలో సత్యప్రమాణాలు చేయిస్తారు. స్వామి సన్నిధిలో అబద్ధం ఆడడానికి ఎవరూ సాహసించరని నమ్మకం.
స్వర్ణ ధ్వజ స్తంభాలు, కలశాల ఏర్పాటు
కాణిపాకం క్షేత్రంలోని ప్రదాన ఆలయం, అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వరస్వామి ఆలయంలో బెంగళూరుకు చెందిన కాశెట్టి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు కోట్లాది రూపాయలు వెచ్చించి స్వర్ణ ధ్వజస్తంభాలను ఏర్పాటు చేశారు. మణికంఠేశ్వరస్వామి ఆలయంలో త్వరలో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే వరసిద్ధుని ఆలయ విమాన గోపురం,తూర్పు రాజగోపురం, పశ్చిమరాజగోపురం,ఆంజనేయస్వామి ఆలయ విమాన గోపురంపై నెల్లూరుకు చెందిన వీటీఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత వేమిరెడ్డిప్రభాకరరెడ్డి, ప్రశాంతిరెడ్డి 14 స్వర్ణ కలశాలను ప్రతిష్ఠింపజేశారు.
వేలాది మంది భక్తులకు అన్నదానం
కాణిపాకం క్షేత్రంలో ప్రతి రోజు వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా బుగ్గమఠానికి చెందిన దేవిమంగమ్మ చారిటీ ట్రస్టు వారు తొలత విరాళం ఇచ్చి అన్నదానాన్ని వరసిద్ధుని ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం ఆలయంలో స్వామి దర్శనానికి విచ్చేసే భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు.
పోటాపోటీగా వాహనాల ఏర్పాటు
బ్రహ్మోత్సవాలలో వాహన సేవకు ఉభయదారులు ఏర్పాటు చేసే వాహనాలు పోటాపోటీగా ఉంటాయి. బ్రహ్మోత్సవాలలో రథోత్సవం, పుష్పపల్లకి సేవ, కామధేను వాహనం, తెప్పోత్సవాలకు ఉభయదారులు లక్షలాది రూపాయలను ఖర్చు చేసి అంగరంగవైభవంగా నిర్వహిస్తారు.
25 నుంచి సెప్టెంబర్ 14 వరకు బ్రహ్మోత్సవాలు
కాణిపాకంలో ఈ నెల 25 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయి సెప్టెంబర్ 14 న ముగియనున్నాయి. 25 వినాయక చవితి ఉత్సవాలు, 26న ధ్వజారోహణం, రాత్రి హంస వాహనం, 27న నెమలి వాహనం, 28న మూషిక వాహనం, 29న శేషవాహనం, 30న వృషభ వాహనం, 31న గజవాహనం, సెప్టంబర్ 1న రథోత్సవం, 2న తిరుకల్యాణం, అశ్వవాహనం, 3న ధ్వజావరోహణం, వడాయత్తుఉత్సవం, ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
అనంతరం ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా 4న అధికారనంది వాహనం, 5న రావణబ్రహ్మ వాహనం, 6న యాళి వాహనం, 7న సూర్యప్రభ వాహనం, 8న చంద్రప్రభ వాహనం, 9న పుష్పపల్లకి వాహన సేవ, 10న విమానోత్సవం, 11న కల్పవృక్ష వాహనం, 12న కామధేను వాహనం, 13న పూలంగి సేవ, 14న తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను ఆలయానికి చెందిన 14 గ్రామాల ఉభయదారులు నిర్వహిస్తారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565