కాణిపాకం_సిద్ది_వినాయకుడి_బ్రహ్మోత్సము
Kanipakam
సత్యప్రమాణాల దేవుడిగా కాణిపాకం వినాయకుడికి పేరు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు స్వామిగా ఆయన్ను భక్తులు కొలుస్తారు. ఆ కాణిపాకం గణపయ్యకు వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
గణపతి ప్రథమ పూజ్యుడు. విఘ్న వినాశకుడు. విద్యలకు ఒజ్జ. ఆయన్ను పూజించేవారికి కొండంత అండ. అందుకే గణపతి నవరాత్రులను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఇంటింటా గణపయ్యను కొలువుదీర్చి పత్రపుష్పాలతో అర్చిస్తారు. హైందవ సంప్రదాయంలో అంత ప్రాధాన్యమున్న గణపతికి తెలుగురాష్ట్రాల్లోని సుప్రసిద్ధ ఆలయం కాణిపాకం. ఇక్కడి వరసిద్ధి వినాయకుడ్ని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచీ నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఏటా భాద్రపద శుద్ధ చవితి నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. తొలి తొమ్మిది రోజులూ బ్రహ్మోత్సవాలతో పాటు, పదో రోజు నుంచి మిగతా పన్నెండు రోజులూ ప్రత్యేకోత్సవాలను నిర్వహిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ వేడుకను చూసేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.
వెయ్యేళ్ల క్రితం...
చిత్తూరు జిల్లాలో బహుదా నదీ తీరంలో వెలసిన గణపయ్యకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే వూరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేస్తూ జీవించేవారు. అందులో పెద్దవాడు గుడ్డివాడుగా జన్మించగా, మిగతా ఇద్దరూ మూగ, చెవిటివారిగా పుట్టారట. కొన్నాళ్లకు ఆ వూరిని కరవు కమ్మేసింది. తాగేందుకూ నీళ్లు లేక అక్కడి ప్రజలు అల్లాడేవారు. ఈ నేపథ్యంలో ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. అక్కడ ఒక పెద్దరాయి అడ్డు వచ్చింది. దాన్ని పెకిలించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో రాయికి పార తగిలింది. వెంటనే రాయిలోంచి రక్తం చిమ్మినట్టుగా బయటకు వచ్చి ఆ సోదరుల మీద పడిందట. మరుక్షణం వారి వైకల్యం తొలగిపోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ వూరి ప్రజలందరికీ చెప్పారు. పరుగుపరుగున బావి దగ్గరికి వచ్చిన గ్రామస్థులకు అందులో వినాయకుడి రూపం దర్శనమిచ్చిందట. ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు కాణి (ఎకరం) దూరం పారిందట. అలా విహారపురికి ‘కాణి పారకమ్’ అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు ‘కాణిపాకం’గా మారింది. అలా బావిలో ఉద్భవించిన వినాయకుడి విగ్రహం నిత్యం పెరుగుతూ ఉండటం విశేషం. సుమారు 65 సంవత్సరాల క్రితం ఒక భక్తురాలు బహూకరించిన వెండికవచం, 2000 సంవత్సరంలో మరో భక్తుడు ఇచ్చిన తొడుగు స్వామికి ఇప్పుడు సరిపోకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతారు. ఈ దేవుడి సన్నిధి సత్యప్రమాణాలకు ప్రసిద్ధం. ఇక్కడి పుష్కరిణిలో స్నానంచేసి తడిబట్టలతో స్వామి ఎదుట ప్రమాణం చేస్తారు. ఇక్కడ సామాన్య భక్తులే కాకుండా దురలవాట్లకు బానిసైన వారూ, రాజకీయ నాయకులు కూడా ప్రమాణాలు చేస్తుంటారు. అబద్ధం చెబితే స్వామి వాళ్లను తప్పక శిక్షిస్తాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి అనుబంధంగా మణికంఠేశ్వర స్వామి, మరగదాంబికా అమ్మవారు, వరదరాజస్వామి, వీరాంజనేయ స్వాముల గుళ్లున్నాయి.
దొరకునా ఇటువంటి సేవ...
సిద్ధి వినాయకుడికి బ్రహ్మోత్సవ సేవ భాద్రపద శుద్ధ చవితినాడు ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా స్వామి వాహనమైన మూషిక పటం ఉన్న జెండాను ధ్వజస్తంభంపై ఎగరేస్తారు. తర్వాతి రోజు స్వామికి హంసవాహన సేవ. అందుకే ఆ రోజు స్వామిని దర్శిస్తే మనిషిలోని చెడు గుణాలు పోవడంతో పాటు సకల విద్యలూ సిద్ధిస్తాయని చెబుతారు. తర్వాత రోజు నెమలివాహన సేవ. మూడో రోజు మూషిక వాహన సేవ. తిరుమలలో గరుడవాహనానికి ఎంత ప్రాధాన్యమో ఇక్కడ మూషిక వాహనానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. తరువాతి రోజు శేషవాహన సేవ. తిరుమల తరహాలోనే గణపతికీ చిన్నశేషవాహన సేవ, పెద్ద శేషవాహన సేవలను నిర్వహిస్తారు. తర్వాతి రోజు శివానుగ్రహాన్ని కలగజేసే వృషభవాహన సేవ. మర్నాడు గజవాహన సేవ. దీన్ని వీక్షించడం వల్ల మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందట. తర్వాతి రోజు రథోత్సవం. మరుసటి రోజు జరిగే అశ్వవాహన సేవను చూస్తే కోరికలు నెరవేరతాయట. వాహన సేవలన్నీ రాత్రి ఎనిమిదీ తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రారంభమవుతాయి. తొమ్మిదో రోజు ధ్వజావరోహణం కార్యక్రమం జరుగుతుంది. తర్వాత వినాయకుడి మూల విరాట్టుకు పాయసం, వడలతో అభిషేకం చేస్తారు. దీన్ని ‘వడాయత్తు ఉత్సవం’ అని పిలుస్తారు. సాయంత్రం ఏకాంత సేవలో ఎండుపండ్లూ, బాదంపాలూ తదితరాలను నివేదించి, స్వామికి జోలపాటలు పాడతారు. తర్వాతి రోజు నుంచి ప్రత్యేక ఉత్సవాలు మొదలవుతాయి. అందులో స్వామిని అధికార నందివాహనం, కల్పవృక్షం, చంద్రప్రభ తదితర వాహనాల మీద వూరేగిస్తారు. వీటిలో సెప్టెంబరు 9న జరిగే పుష్పపల్లకీ సేవ విశిష్టమైనది. దీనిలో పల్లకీ అలంకరణకు 20 నుంచి 40 టన్నుల పూలు వాడతారు. ఆ వేడుకను చూసేందుకు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకూ జనం తరలివస్తారు. చివరి రోజు....పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాల తంతు ముగుస్తుంది. - కామిశెట్టి నరసింహులు, న్యూస్‌టుడే, కాణిపాకం
#కాణిపాకం_సిద్ది_వినాయకుడి_బ్రహ్మోత్సము
#Kanipakam
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565