దైవ దర్శనమ్!
నివేదన
పూర్వం ఒక పట్టణం శివారులో ఒకానొక ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలో ఒక సాధుపుంగవుడు ఉండేవాడు. నిత్యం అతడు పట్టణంలోకి వెళ్లి భిక్ష తీసుకుని వస్తుండేవాడు. ప్రతి ఇంటికీ వెళ్లి నాలుగు మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. పట్టణంలో ఉండేవారంతా దేవుడిని చూడాలనే కుతూహలం ఉన్నవారే! అయితే అందుకు తగిన సాధన సంపత్తి వారిలో కనిపించలేదు. ప్రాపంచిక విషయాల్లో కొట్టుమిట్టాడుతూ దైవాన్ని దర్శించడం అంటే మాటలా! ఎప్పుడూ పరనింద చేస్తూ కాలక్షేపం చేసే వారిని దైవం మాత్రం అనుగ్రహిస్తుందా! ప్రజల కలుషిత మనసులను మార్చాలని భావించాడు ఆ సాధువు. అందుకుగానూ ఆశ్రమంలో మహాయజ్ఞం ఒకటి తలపెట్టాడు. 30 రోజులు నిర్విరామంగా జపహోమాదులు నిర్వహించాడు.
హోమం రేపు ముగుస్తుందనగా.. పట్టణంలో వీధివీధినా కరపత్రాలు పంచాడు. ‘‘రేపటితో ఆశ్రమంలో హోమం పూర్తవుతోంది. పూర్ణాహుతి అవ్వడంతోనే హోమగుండంలో నుంచి దేవుడు ప్రత్యక్షమవుతాడు. దైవ దర్శనం కోరుకునే వారు రేపు రాత్రి 8 గంటలకల్లా ఆశ్రమానికి చేరుకోగలరు’’ అని ఆ కరపత్రంలో అచ్చువేయించాడు. దానిని చూడగానే ప్రజలంతా ఆశ్చర్యచకితులు అయ్యారు. సాధువు గొప్పదనం తెలిసి.. దైవాన్ని చూపిస్తాడని విశ్వసించారు. మరుసటి రోజు సాయంత్రానికే పట్టణ ప్రజలంతా ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమంలో భారీ వేదిక ఏర్పాటు చేశాడు సాధువు. వేద మంత్రాలతో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేశాడు. దేవుడు ప్రతక్ష్యమవుతాడని అందరూ ఎదురు చూడసాగారు. అరగంట దాటింది.. గంట పూర్తయింది. అయినా దేవుడు ప్రత్యక్షం కాలేదు. ప్రజలంతా సాధువును ఆక్షేపించారు. ‘‘అయ్యా! దేవుడు ప్రతక్ష్యం అవుతాడన్నారు కదా! ఎక్కడ?’’ అని ప్రశ్నించారు. సాధువు నవ్వుతూ.. ‘‘నాయనలారా! దేవుడు తప్పక ప్రత్యక్షం అవుతాడు. కానీ, ఎవరి మనసులు పవిత్రంగా ఉంటాయో వారికే దర్శనమిస్తాడు. ఎవరైతే ఇతరులను నింద చేయారో వారికి కనిపిస్తారు. ఈ రెండు దోషాలున్న వారికి కనిపించడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వెళ్లిపోవచ్చు’’ అని ప్రకటించాడు.
ఆ మాటలు వినగానే పురప్రజలంతా తల దించుకున్నారు. తమలోని దోషాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకున్నారు. కల్మష చిత్తులమైన తమకు దైవ దర్శనం దుర్లభమని అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు. మరుసటి రోజు నుంచి.. తమలోని దోషాలను ఒక్కొక్కటీ నివృత్తి చేసుకోసాగారు. పాపభీతితో ఆదర్శవంతమైన జీవనం కొనసాగించారు.
మన ఆయుష్షు మన చేతుల్లోనే!
ఆత్మీయం
అన్నీ ఉన్నా ఆయుష్షు లేకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తాము ఆయురారోగ్యఐశ్వర్యాలతో సుఖంగా జీవించాలని కోరుకుంటారు. అది సహజం. అందుకే సంకల్పంలో కూడా అదే చెప్పుకుంటారు. మనం పెద్దలకూ, పూజారులకూ నమస్కరించినప్పుడు వారు ‘ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వదిస్తారు. అయితే లోకంలో కొందరు పూర్ణాయుష్కులుగానూ, మరికొందరు అర్ధాయుష్కులుగానూ, ఇంకొందరు అల్పాయుష్కులుగానూ ఉంటున్నారు. అందుకు కారణం వారి అలవాట్లు, నడవడిక అన్నింటికీ మించి విధిరాత.
‘మానవుడు జీవించి ఉంటే వంద సంవత్సరాలకైనా ఆనందాన్ని పొందగలడు అన్న లోకోక్తి సత్య దూరం కాదని నాకు తోస్తోంది..!’ అని లంకలోని అశోకవనంలో రావణ బందీగా ఉన్న సీతాదేవి రామదూతగా తన వద్దకు వచ్చిన హనుమంతునితో అన్న మాటలు ఇవి. వ్యాసభారతంలో ధృతరాష్ట్రుడు విదురుని ఓ ప్రశ్న అడుగుతాడు.. ‘వేదాలు మానవునికి నూరు సంవత్సరాల ఆయువు అని చెబుతున్నాయి. కానీ, మానవుడు ఏ కారణం చేత పూర్ణాయుర్దాయం పొందలేకపోతున్నాడు?’ అని.
దీనికి విదురుని సమాధానం... ‘గర్వము, హద్దుమీరి పలుకుట, మహాపరాధాలు చెయ్యటం, క్రోధం, తన సుఖమే చూసుకోవడం, నమ్మిన వారిని చెర^è టం అనే ఆరు లక్షణాలు పదునైన కత్తులవంటివి. దేహం ఆయువును ఇవి నశింపజేస్తాయి. నిజానికి మానవుని చంపేది ఈ లక్షణాలే, మృత్యువు కాదు. కాబట్టి ముందు మనలోని ఈ ఆరు అవలక్షణాలనూ వెళ్లగొట్టగలిగితే మన ఆయుష్షు ఆ మేరకు పొడిగించుకోగలిగినట్లే!
ఇమ్యూనిటీని పెంచే చిలగడదుంప
గుడ్ ఫుడ్
ఉడకబెట్టుకొని తింటే అద్భుతంగానూ, నిప్పుల మీద కాల్చుకుని తింటే పరమాద్భుతంగానూ ఉండే చిలగడదుంప అంటే చాలామందికి ఇష్టమే. వేర్వేరు ప్రాంతాల్లో దీనికి గణుసుగడ్డ, మోరంగడ్డ అంటూ రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్యపరంగానూ దీని విశిష్టతలు ఎక్కువే.
►చిలగడదుంపలో విటమిన్–బి6 పాళ్లు పుష్కలం. విటమిన్–బి6 అనేది హోమోసిస్టిన్ అనే రసాయనం దుష్ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుండెజబ్బులు వచ్చేందుకు ఈ హోమోసిస్టిన్ కారణమవుతుంది. అంటే చిలగడదుంప వల్ల అనేక గుండెజబ్బులు నివారితమవుతాయని నిర్ద్వంద్వంగా తేలింది.
►చిలగడదుంపలో బీటా–కెరొటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి.
►చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్ ఉత్పత్తికి విటమిన్–సి బాగా దోహదపడుతుంది. అందుకే విటమిన్–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుందన్నమాట. చిలగడదుంపలోనూ విటమిన్–సి పాళ్లు చాలా ఎక్కువ. అందుకే దీన్ని తినేవారి చర్మం అంత త్వరగా ఏజింగ్ దుష్ప్రభావాలకు గురికాదు.
►చిలగడదుంపలో శరీరంలోని విషాలను బయటకు పంపే గుణం ఉంది. ఒత్తిడి వల్ల ఒంట్లో పేరుకునే విషాలను కూడా చిలగడదుంప తొలగిస్తుంది.
►చిలగడదుంపలో ఐరన్ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తహీనత తగ్గడంతో పాటు, తగినన్ని ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల ఉత్పాదన జరుగుతుంది.
►ఇందులోని మెగ్నీషియమ్ మన ఒంట్లోని ధమనులు, ఎముకలు, గుండె, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
కిచెన్ కుచేల
అటుకులు అతుకేసే స్నేహాన్ని మించిన స్నేహం లేదు.
అంటే, పేదరికం స్నేహానికి అడ్డం రాదు.
అంత పవిత్రమైంది అటుకుల స్నేహం.
శ్రీకృష్ణుడిని కలవడానికి వెళ్లిన
కుచేలుడు తీసుకెళ్లిన కానుక అటుకుల మూట.
పంచభక్ష్య పరమాన్నాలు తినే శ్రీకృష్ణుడు అటుకులు తిని
తన్మయత్వం చెందాడు. రేపు స్నేహితుల దినోత్సవం.
అటుకులు పంచండి. స్నేహం పెంచండి.
హాట్ పోహా!
కావల్సినవి: అటుకులు–4 కప్పులు; పచ్చిమిర్చి – 2; ఎండుమిర్చి – 3; జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్లు; శనగపప్పు – 5 టేబుల్‌స్పూన్లు; పుట్నాల పప్పు – 5 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్; ఆలివ్ నూనె–4 టేబుల్ స్పూన్లు
తయారీ: ∙కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి ∙దీంట్లో పల్లీలు వేసి వేయించాలి ∙తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి ∙ఆ తర్వాత కరివేపాకు, పసుపు, పుట్నాలపప్పు వేయించి మంట తగ్గించాలి ∙ఉప్పు కలిపి ఆ తర్వాత కప్పు అటుకులు వేసి కలపాలి ∙అటుకులకు పసుపు, నూనె పట్టిన తర్వాత మిగతా అటుకులు వేసి కలపాలి ∙ ఇలా చేయడం వల్ల మిగతా అటుకులకంతా పోపు మిశ్రమం బాగా పడుతుంది ∙5–8 నిమిషాల సేపు అలా సన్నని మంట మీద ఉంచి, అడుగుమాడకుండా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి ∙తర్వాత మంట తీసేసి, చల్లారాక నిమ్మముక్కతో సర్వ్ చేయాలి.
రోల్స్
కావల్సినవి: గుడ్డు – 1; అటుకులు – పావు కప్పు; బంగాళదుంప ముక్కలు – 100 గ్రాములు; పచ్చిమిర్చి – 2; పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; ఆమ్చూర్ – పావు టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; కారం – పావు టీ స్పూన్; బ్రెడ్ క్రంబ్స్ – 2; నూనె – వేయించడానికి తగినంత; కొత్తిమీర – కొన్ని ఆకులు
తయారీ: ∙బంగాళదుంపపై పొట్టు తీసి, ఉడకబెట్టాలి ∙తర్వాత గరిటతో గుజ్జులా చేయాలి ∙అటుకులను కడిగి, జల్లెడలో పోయాలి ∙కడాయిలో నూనె పోసి, స్టౌ మీద పెట్టి పల్లీలు వేయించాలి ∙దీంట్లో అటుకులు, పల్లీలు, మిర్చి, కరివేపాకు, మెత్తగా చేసిన బంగాళదుంపల గుజ్జు వేసి బాగా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేత్తో రోల్‌లా చేయాలి ∙ పొయ్యిమీద కడాయి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి ∙సిద్ధంగా ఉంచుకున్న అటుకుల రోల్స్‌ని గుడ్డు సొనలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి అన్ని వైపులా వేయించాలి ∙టొమాటో సాస్ లేదా పచ్చడితో వేడి వేడిగా వడ్డించాలి.
కట్లెట్
కావల్సినవి: అటుకులు – కప్పు; శనగపిండి – 2 1/2 కప్పులు; క్యాప్పికమ్ తరుగు – పావు కప్పు; అల్లం ముద్ద – అర టీ స్పూన్; పచ్చిమిర్చి పేస్ట్ – అర టీ స్పూన్; కారం – టీ స్పూన్; నిమ్మరసం – అర టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; జీలకర్ర – 1/4 టీ స్పూన్; కొత్తిమీర – పావు కప్పు; పుదీనా ఆకులు – కొన్ని (తరగాలి); టీ స్పూన్ – పంచదార; ఉప్పు – తగినంత; నూనె – వేయించడానికి తగినంత
తయారీ: ∙అటుకులను కడిగి 2 నిమిషాలు జల్లెడలో నీళ్లన్నీ పోయేదాక ఉంచాలి ∙ఒక గిన్నెలో మిగిలిన దినుసులు, పిండి అన్నీ వేసి కలపాలి ∙దీంట్లో అటుకులు కూడా వేసి బాగా కలిపి ముద్దలా చేయాలి ∙సుమారు 8 నుంచి 10 చిన్న చిన్న ఉండలు చేసి, చేత్తో అదమాలి ∙పొయ్యి మీద కడాయి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి ∙దీంట్లో సిద్ధం చేసుకున్న పట్టీలను వేసి రెండువైపులా ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీయాలి ∙పుదీనా లేదా టోమాటో చట్నీ లేదా కెచప్‌తో వేడి వేడిగా అటుకుల కట్లెట్‌ను సర్వ్ చేయాలి.
లడ్డు
కావల్సినవి అటుకులు – కప్పు; బెల్లం – ముప్పావు కప్పు; యాలకులు – 2 (పొడి చేయాలి); ఎండుకొబ్బరి తురుము – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడిపప్పు – 10; కిస్‌మిస్ – 10
తయారీ : అటుకులను వేయించాలి. దీంట్లో కొబ్బరి తురుము కలిపి సన్నని మంట మీద మళ్లీ కొద్దిగా వేయించాలి సువాసన వస్తుండగా మంట తీసేసి చల్లారనివ్వాలి ∙యాలకుల పొడి, బెల్లం కలిపి మిక్సర్‌లో బ్లెండ్ చేయాలి ∙ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙పాన్‌లో నెయ్యి, జీడిపప్పులు వేయించిన తర్వాత కిస్‌మిస్ వేసి మంట తీసేయాలి ∙దీంట్లో మిగిలినవన్నీ వేసి కలపాలి చిన్న చిన్న ముద్దలు తీసుకొని, బాల్స్ చేయాలి ∙ దీంట్లో వేయించిన ఇతర నట్స్ కూడా కలుపుకోవచ్చు ∙త్వరగా, సులువుగా, రుచిగా ఈ లడ్డూలను తయారుచేసుకోవచ్చు.
స్వీట్ పోహా!
కావల్సినవి : అటుకులు – కప్పు; బెల్లం – అర కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; కొబ్బరిపొడి – 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పులు – 8 (సగం పలుకుగా చేయాలి); బాదం పప్పులు – 7 (సన్నగా తరగాలి); నెయ్యి – అర టేబుల్ స్పూన్లు.
తయారీ: ∙అటుకులను కడిగి, జల్లిలో వేసి, పూర్తిగా నీళ్లు పోయాక గిన్నెలోకి తీసుకోవాలి ∙వీటిపైన మళ్లీ 2 టేబుల్ స్పూన్ల నీళ్లు చల్లాలి పది నిమిషాల తర్వాత పొయ్యిమీద మూకుడు పెట్టి, దాంట్లో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, బాదం పలుకులు వేయించాలి ∙దీంట్లో కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి కలపాలి ∙అర కప్పు నీళ్లలో బెల్లం వేసి కరిగించాలి. సన్నని మంట మీద 8 నిమిషాల సేపు ఉంచితే బెల్లం పూర్తిగా కరుగుతుంది ∙ఈ బెల్లం పాకంలో నానిన అటుకులు, కొబ్బరి తురుము, వేయించిన నట్స్ వేసి కలపాలి ∙వడ్డించే ముందు మరిన్ని నట్స్ వేసుకోవచ్చు ∙ఎండుకొబ్బరి బదులుగా పచ్చికొబ్బరి తురుము కూడా వాడుకోవచ్చు.
దద్ద్యోజనం
కావల్సినవి : అటుకులు – కప్పు; పెరుగు – 3 కప్పులు; ఆవాలు – టీ స్పూన్; మినప్పప్పు – టేబుల్ స్పూన్; శనగపప్పు – టేబుల్ స్పూన్; ఎండుమిర్చి – 3; నూనె – టేబుల్ స్పూన్; కరివేపాకు – రెమ్మ; ఉప్పు – తగినంత
తయారీ: ∙అర టీ స్పూన్ ఉప్పు 2 కప్పుల నీళ్ళలో కలిపి, అటుకులు నిమిషంసేపు నానబెట్టాలి ∙తర్వాత అటుకులను వడకట్టాలి పెరుగును గరిటతో మృదువుగా అయ్యేంత వరకు చిలికి, కొద్దిగా ఉప్పు కలపాలి ∙మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి ∙దీంట్లో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేయించి మంట తీసేయాలి ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి 10–20 సెకన్లు అలాగే ఉంచాలి ∙దీంట్లో నానబెట్టిన అటుకులు, పెరుగు వేసి కలపాలి ∙కావాలనుకుంటే పోపులో పావు టీ స్పూన్ శొంఠి వేసుకోవచ్చు.
దోసె
కావల్సినవి: బాయిల్డ్ రైస్ – కప్పు; అటుకులు – అర కప్పు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మజ్జిగ – కప్పు; బేకింగ్ సోడా – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్; నూనె – తగినంత
తయారీ: ∙బియ్యం కడిగి నీళ్లుపోసి నానబెట్టాలి ∙మరోగిన్నెలో అటుకులు, మినప్పప్పు వేసి నీళ్లతో కడిగి వడబోయాలి ∙దీంట్లో మజ్జిగను కలిపి 3 గంటల సేపు నానబెట్టాలి ∙ముందుగా బియ్యం, తర్వాత నీళ్లను వడకట్టి అటుకుల మిశ్రమం మిక్సర్‌జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ∙పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత బేకింగ్ సొడా, ఉప్పు కలపాలి ∙4 గంటలసేపు పిండిని అలాగే ఉంచి, ఆ తర్వాత దోసెలు వేసుకోవాలి ∙పొయ్యి మీద నాన్‌స్టిక్ పెనం పెట్టి, పైన 2–3 చుక్కల నూనె వేసి మెత్తటి బ్రష్ లేదా గుడ్డతో తుడిచేయాలి ∙తర్వాత గుంట గరిటతో పిండి తీసుకొని పెనం మీద వేసి, ఆ పైన గుండ్రంగా పిండి విస్తరించేలా గరిటను తిప్పాలి తర్వాత దోసె చుట్టూత నూనె వేసి, కాలనివ్వాలి ∙ఇష్టాన్ని బట్టి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. కొబ్బరి పచ్చడి లేదా సాంబార్‌తో వడ్డించాలి.
డై‘టిప్’ యా‘పిల్’
మనుషులకు ఉపకరించే మంచి బ్యాక్టీరియాను శరీరంలో పెంచడంలో యాపిల్ ఎంతో బాగా తోడ్పడుతుంది.
యాపిల్‌లో క్యాల్షియం, సి, ఎ విటమిన్లు, ఇనుము ఎక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు అసలే ఉండవు. పైగా వీటిలో ఉండే పొటాషియం, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
యాపిల్‌లో ఉండే పీచుపదార్థంలో పెక్టిన్ ఉంటుంది. ఇది ఉదర కోశ ఆరోగ్యాన్ని పెంచే కొన్ని రకాల బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉదర కోశ గోడలను కాపాడేందుకు పనికివచ్చే ‘బుటారైట్’ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది.
పెక్టిన్ జీర్ణక్రియను చైతన్యవంతంగా ఉంచడంతోపాటు ఇన్సులిన్ అవసరాన్ని త గ్గిస్తుంది. తద్వారా మధుమేహాన్ని అదుపు చేయడానికి కొంతమేర ఉపయోగపడుతుంది.
యాపిల్‌లో ఉండే క్వెర్‌సెటిన్ వృద్ధాప్యంలో వాటిల్లే మెదడు కణాల క్షీణత వేగాన్ని బాగా తగ్గిస్తుంది. దీనివల్ల అల్జీమర్స్‌కు గురికాకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే పెద్దపేగు కేన్సర్, హై-బీపీలను అడ్డుకునే శక్తి యాపిల్‌లో ఉంది.
తరచూ యాపిల్ తినేవారికి రక్తపోటు వచ్చే ప్రమాదం 37 శాతానికి తగ్గుతుంది. అయితే యాపిల్ పండ్లను తొక్కతో సహా తింటేనే ఈ ప్రయోజనాలన్నీ సమకూరుతాయి.
యాపిల్ పండును కోసిన కాసేపటికే ఆ ముక్కలు నల్లబడతాయి. ఈ పండులో ఐరన్ (ఫెర్రస్) ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. పండును కోసినప్పుడు అందులోని ఫెర్రస్, వాతావరణంలోని ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది. దానివల్ల ఫెర్రస్ ఆక్సైడ్ అనే పొర ఏర్పడుతుంది. పండు రంగు మారడానికి ఇదే కారణం. అయితే యాపిల్ ముక్కల పై భాగాన నిమ్మరసం రాస్తే ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.
హిడెన్ జాబ్స్‌ను సెర్చ్ చేయండిలా..
ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటే ఏ కంపెనీ అయినా ఏమి చేస్తుంది. నోటిఫికేషన్ జారీ చేయడం, దరఖాస్తులు స్వీకరించడం, ఇంటర్వ్యూ/రాత పరీక్ష నిర్వహించడం వంటి విధానాలను అనుసరిస్తుంది. ఇది అందరూ అనుసరించే సంప్రదాయ పద్ధతి. కానీ ప్రస్తుతం ఈ ట్రెండ్ క్రమంగా తగ్గుతోంది. కారణలేమైనా నోటిఫికేషన్స్‌ను వెలువరించకుండా రిఫరెన్స్, జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక జాబ్ సీకర్ ‘హిడెన్ జాబ్స్/అన్‌లిస్టెడ్ జాబ్స్’ను ఏ విధంగా సెర్చ్ చేయాలి. అందుకు ఏయే మార్గాలు అనుసరించాలో చూద్దాం..
ఒక కంపెనీలో ఏదైనా వేకెన్సీ ఉంటే దాన్ని నోటిఫికేషన్‌ను జారీ చేసి నిర్దేశిత రూపంలో కాకుండా ప్రత్యామ్నాయ విధానాల్లో భర్తీ చేస్తారు. ఇటువంటి జాబ్స్‌ను హిడెన్ జాబ్స్ లేదా అన్‌లిస్టెడ్ జాబ్స్‌గా పేర్కొంటారు. ఒక అంచనా మేరకు దాదాపుగా 60 నుంచి 80 శాతం ప్రైవేటు ఉద్యోగాలు ఎటువంటి ప్రకటన లేకుండానే ఈ విధానంలో భర్తీ అవుతున్నాయి.
నెట్‌వర్కింగ్
ఇటువంటి హిడెన్ జాబ్స్‌ను తెలుసుకోవడానికి ఉపయోగపడే కీలకమైన సాధనం నెట్‌వర్కింగ్. అంటే పరిచయాలను పెంచుకోవాలి. వాటిని ప్రభావవంతంగా వినియోగించుకోవాలి. ముందుగా మన ప్రొఫైల్‌ను అనుసరించి సంబంధిత రంగంలోని ప్రొఫెషనల్స్‌తో పరిచయాలు పెంచుకోవాలి. ఈ క్రమంలో నిజాయితీగా వ్యవహరించాలి. ఈ పరిచయాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి. కేవలం జాబ్ లేదా అవసరమైన సందర్భంలోనే కాకుండా ఎప్పుడూ వారితో టచ్‌లో ఉండటానికి ప్రయత్నించాలి. ఈ సందర్భంలో మీరు జాబ్ పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారనే విషయం వారికి తెలిసేలా నడుచుకోవాలి. తద్వారా ఒక రకమైన సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. వారి దృష్టిలో ఏదైనా అవకాశం ఉంటే ముందు మీ పేరే స్ఫురణలోకి వస్తుంది.
రెజ్యూమె సబ్మిషన్
కొన్ని కంపెనీలు అభ్యర్థులు నేరుగా రెజ్యూమెను సబ్మిట్ చేయడాన్ని ప్రోత్సహిస్తాయి. కాబట్టి ముందుగా మీ ప్రొఫైల్‌కు సరిపడే కంపెనీలను లిస్టవుట్ చేసుకోవాలి. తరవాత ఆయా కంపెనీల రిక్రూట్‌మెంట్ మేనేజర్ల సమాచారాన్ని వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు వారిని ఉద్దేశిస్తూ నేరుగా కవర్ లెటర్‌తో కూడిన రెజ్యూమెను ఫార్వర్డ్ చేయాలి. అయితే ఇటువంటి కంపెనీలు ఎటిఎస్ (అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్) ద్వారా రెజ్యూమెలను షార్ట్‌లిస్ట్ చేస్తుంటాయి. కాబట్టి రెజ్యూమెలోని పదాలు, ఎటిఎస్ విధానానికి అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మేనేజర్‌తో నేరుగా
ఒక్కోసారి మేనేజర్లను నేరుగా కలవడం ద్వారా కూడా హిడెన్ జాబ్స్‌ను దక్కించుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా మన ప్రొఫైల్‌కు సరిపడే కంపెనీల హెచ్‌ఆర్/రిక్రూట్‌మెంట్ మేనేజర్ల సమాచారాన్ని పొందొచ్చు. తరవాత ఈ-మెయిల్ లేదా ఇతర మార్గాల ద్వారా వారిని కలుసుకునేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. వారిని కలిసినప్పుడు మన సామర్థ్యాలు అంటే..అర్హత, అనుభవం, నైపుణ్యాలు వంటి వాటిని ప్రభావవంతంగా వివరించాలి. తద్వారా మనపై ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. కంపెనీలో ఏదైనా అవకాశం ఉంటే ముందే మన పేరే స్ఫురణకు రావచ్చు. అంతేకాకుండా ఏదైనా అవకాశం ఉంటే రిఫర్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయవచ్చు. కాబట్టి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్స్, సోషల్ మీడియా ద్వారా నిత్యం టచ్‌లో ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంగా ఇచ్చే సలహాలు, సూచలనలకు మీరు ఎంత విలువ ఇస్తున్నారో వారికి తెలిసేలా వ్యవహరించాలి. తద్వారా అవకాశాలు మెరుగవుతాయి.
జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్స్
జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్స్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవడం మరో మార్గం. కొన్ని కంపెనీలు రిక్రూట్‌మెంట్ విషయంలో ఇటువంటి వెబ్‌సైట్స్ సహాయం తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవడం ప్రయోజనకరం. ఎందుకంటే ఏవైనా నియామకాలు చేపట్టాలనుకుంటే జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్‌లోని డేటా బేస్ ఆధారంగా జాబ్ సీకర్స్‌కు నేరుగా రిక్రూటర్లు కాల్ చేస్తుంటారు. కాబట్టి అర్హతలు, అనుభవం, నైపుణ్యాలు, వంటి అంశాల ఆధారంగా రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. కొన్ని కంపెనీలు సోషల్ మీడియా ద్వారా అప్లికేషన్స్ పరిశీలించి అభ్యర్థులకు నేరుగా కాల్ చేస్తుంటాయి. కాబట్టి సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ ప్రొఫైల్‌ను మెయింటైన్ చేయాలి.
రిఫరెన్స్
హిడెన్ జాబ్స్ విషయంలో ప్రభావవంతంగా పని చేసేవి రిఫరెన్స్. చాలా మంది హెచ్‌ఆర్ మేనేజర్లు మాజీ ఉద్యోగులు, గతంలో తమతో కలిసి పని చేసిన వారికి అవకాశం కల్పిస్తుంటారు. అంతేకాకుండా సంస్థలోని ఉద్యోగుల రిఫరెన్స్ ద్వారా కూడా కొత్త వారికి అవకాశం ఇస్తారు. ఇటువంటి అంతర్గత రిఫరెన్స్‌కు కూడా కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. సరైన ఉద్యోగిని రిఫర్ చేస్తే బోనస్‌ను కూడా ప్రకటిస్తున్నాయి. కాబట్టి ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను విస్త్రతం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
జాబ్ ఫెయిర్స్, జాబ్ అలర్ట్స్
మరో మార్గం..జాబ్ ఫెయిర్స్, జాబ్ అలర్ట్స్. వివిధ కంపెనీలు నిర్దేశిత సమయాల్లో జాబ్ ఫెయిర్స్ నిర్వహిస్తుంటాయి. వాటి ద్వారా కూడా హిడెన్ జాబ్స్‌ను దక్కించుకోవచ్చు. ఆన్‌లైన్ జాబ్‌లిస్టింగ్ వెబ్‌సైట్స్ లేదా సంబంధిత సేవలను ఆఫర్ చేస్తున్న సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర రిజిస్ర్టేషన్ చేసుకుంటే మన ప్రొఫైల్‌కు సరిపడ జాబ్ అలర్ట్స్ వస్తుంటాయి. వాటి ద్వారా కూడా అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.
అనుబంధాల రుచులు
స్నేహితుల ఆత్మీయ ఆలింగనాలు. సోదరీసోదరుల ఆప్యాయతలు. ఏది ఎక్కువ? ఏది తక్కువ? సరితూచలేని స్పెషల్సే ఈ రెండూ. ఈ వేడుకలు ఒకదాని తరువాత
ఒకటి పలకరించబోతున్నాయి. రేపు ఫ్రెండ్‌షి్‌ప డే. ఆ మరునాడే రాఖీ పండగ.
మరి ఈ ప్రత్యేక రోజులని స్వీట్ అండ్ హాట్ రుచులతో హార్ట్‌ఫుల్‌గా పంచుకోకపోతే ఎలా?!
యాపిల్ కోకోనట్ బర్ఫీ
కావలసినవి: యాపిల్ తరుగు- మూడు కప్పులు, తాజా కొబ్బరి తురుము - ఒక కప్పు, పంచదార - ఒకటిన్నర కప్పులు, వాల్‌నట్స్ పలుకులు - అరకప్పు, యాలకల పొడి- పావు టీస్పూన్ (నలిపి), పిస్తాపప్పులు - ఒక టేబుల్ స్పూన్ (నిలువుగా తరిగి)
తయారీ:
నాన్ స్టిక్ పాన్‌లో కొబ్బరి, యాపిల్,
పంచదార వేసి ఓ మాదిరి మంట మీద మిశ్రమం దగ్గరకు వచ్చి, యాపిల్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇందుకు దాదాపు పది నిమిషాల సమయం పడుతుంది.
తరువాత యాలకల పొడి, వాల్‌నట్
పలుకులు వేసి బాగా కలపాలి. మిశ్రమం మృదువైన పిండిముద్దగా అయ్యేవరకు
కలుపుతూనే ఉండాలి. ఇందుకు మూడు నిమిషాలు పడుతుంది. తరువాత స్టవ్
ఆపేయాలి.
మిశ్రమం వేడిగా ఉండగానే నెయ్యి పట్టించిన వెడల్పాటి పళ్లెంలో కాస్త మందంగా పోయాలి. మిశ్రమాన్ని గరిటెతో సమంగా అదమాలి. పైన పిస్తా పలుకులతో అలంకరించాలి. ఇవి వేశాక కూడాసున్నితంగా అదమాలి.
బర్ఫీ కాస్త వేడిగా ఉండగానే స్క్వేర్ ఆకారంలో కోయాలి.
రెండు గంటల పాటు అలానే ఉంచితే బాగా ఆరిపోతుంది.
తరువాత బర్ఫీని గాలి చొరబడని డబ్బాలో ఉంచితే రెండు వారాల పాటు పాడు
కాకుండా ఉంటుంది. తాజాగా తింటే ఆ మజానే వేరనుకోండి.
ఫ్రూటీ క్రష్
కావలసినవి: తాజా నిమ్మ రసం - 45 మిల్లీలీటర్లు, పైనాపిల్ గుజ్జు - కొద్దిగా, పంచదార పాకం - 20 మిల్లీలీటర్లు, క్రష్డ్ ఐస్ - 30 మిల్లీలీటర్లు, ఉప్పు - చిటికెడు.
తయారీ:
నిమ్మరసం, పైనాపిల్ గుజ్జు, పంచదార పాకం, ఉప్పులను షేకర్‌లో వేసి బాగా కలపాలి.
తయారైన ఫ్రూటీక్ర్‌షను సర్వింగ్ గ్లాసులో పోసి తాగేయడమే. కావాలంటే చిన్న పైనాపిల్ ముక్కతో గ్లాస్‌ను అలంకరిస్తే చూసేందుకు కూడా బాగుంటుంది.
బ్రెడ్ దహీవడ
కావలసినవి: బ్రెడ్ స్లయి్‌సలు - ఎనిమిది, పెరుగు - నాలుగు కప్పులు, ఎండుద్రాక్ష(కిస్మిస్) - రెండు టేబుల్ స్పూన్లు, కారం, వేగించిన జీలకర్ర పొడి - ఒక్కోటి ఒక్కో టీస్పూన్ చొప్పున, చింతపండు గుజ్జు - అర కప్పు (కొంచెం పంచదార కలపాలి), ఉప్పు, పంచదార - రుచికి సరిపడా, నూనె - వేగించడానికి సరిపడా, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ:
బ్రెడ్ నలువైపులా ఉన్న గట్టి భాగాన్ని తీసేయాలి. తరువాత బ్రెడ్‌లో కొంచెం పెరుగు, ఉప్పు వేసి మెత్తటిమద్ద చేయాలి.
చిన్న చిన్న ఉండలు చేసి మధ్యలో ఎండుద్రాక్షని ఉంచాలి. నూనె వేడిచేసి బ్రెడ్ వడల్ని కరకరలాడేట్టు వేగించి పక్కన పెట్టాలి.
మిగిలిన పెరుగులో ఉప్పు, పంచదార వేసి కలపాలి. ఇందులో వేగించిన బ్రెడ్ వడలను వేయాలి.
కారం, జీలకర్ర పొడి పైన చల్లాలి, చింతపండు గుజ్జు పోయాలి.
కొత్తిమీర తరుగుతో అలంకరించి తింటే యమ్మీయమ్మీగా ఉంటుంది.
పోహా ఫింగర్స్
కావలసినవి:
అటుకులు - ఒక కప్పు, ఆలుగడ్డలు- మీడియం సైజువి రెండు (ఉడికించి, నలిపి), జీలకర్ర పొడి - అర టీస్పూన్, పచ్చిమిర్చి - ఒకటి (సన్నగా తరిగి), కారం - అర టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, ఆమ్‌చూర్ పొడి - ముప్పావు టీస్పూన్, కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, బొంబాయి రవ్వ - అరకప్పు, నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు (పోహా ఫింగర్స్‌ను వేగించడానికి).
తయారీ:
పోహా(అటుకులు)ని శుభ్రంగా నీళ్లతో కడగాలి. కొన్ని నీళ్లు ఉంచి మిగతావన్నీ వంపేయాలి. పోహా రకాన్ని బట్టి నీళ్లను మిగల్చాలి. మందంగా ఉన్నవయితే పలుచటి కాస్త ఎక్కువ నీళ్లు ఉంచాలి.
పెద్ద గిన్నెలో నానబెట్టిన అటుకులు, ఉడికించి పొడిగా నలిపిన ఆలుగడ్డల్ని వేసి ఉండలు లేకుండా కలపాలి.
తరువాత జీలకర్ర పొడి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, కారం, ఆమ్‌చూర్ పొడి, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ పిండి ముద్దను ఎనిమిది లేదా పది భాగాలు చేయాలి. ఒక్కోదాన్ని సున్నితంగా నొక్కుతూ సిలిండర్ ఆకారంలో లేదా చేతి వేలి ఆకారంలో వత్తాలి.
తయారుచేసుకున్న ఒక్కో ఫింగర్‌ను బొంబాయి రవ్వలో దొర్లించాలి. పాన్ వేడిచేసి కొంచెం నూనె వేసి వేగించాలి. అన్నివైపులా బంగారు రంగులో వేగాక స్టవ్ ఆపేయాలి.
వేడివేడిగా టొమాటో సాస్‌తో తింటే టేస్టీగా ఉంటాయి.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పోహా మెత్తగా అయ్యేవరకు మాత్రమే నానబెట్టాలి. ఎక్కువ నీళ్లు పోస్తే పిండి ముద్ద జారుగా అవుతుంది. దాంతో పోహా ఫింగర్స్ షేప్ సరిగా రావు.
స్పైసీ కార్న్ చాట్
కావలసినవి: మొక్కజొన్న గింజలు - మూడున్నర కప్పులు, క్యాప్సికమ్ (ఆకుపచ్చ, పసుపురంగు) - ఒక కప్పు, టొమాటో - అరకప్పు (సన్నగా తరిగి), అల్లం రసం - ఒక టీస్పూన్, ఉప్పు - ఒక టీస్పూన్, వేగించిన జీలకర్ర పొడి - ఒక టీస్పూన్, నల్లమిరియాలు, కారం - ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున, పచ్చిమిర్చి (సన్నగా తరిగి) - ఒక టీస్పూన్, కొత్తిమీర తరుగు, నిమ్మరసం - ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున.
తయారీ:
ఉప్పు, జీలకర్ర పొడి, నల్లమిరియాలు, కారాలను కలిపి పక్కన పెట్టాలి.
నాన్‌స్టిక్ పాన్‌కు నూనె రాసి ఓ మాదిరి మంట మీద వేడిచేయాలి. తరువాత మొక్కజొన్న గింజల్ని వేసి నాలుగైదు నిమిషాలు వేగించాలి. ఇవి వేగించేటప్పుడు గరిటెతో కలుపుతూనే ఉండాలి. మొక్కజొన్న గింజలు చిటపటమంటుంటాయి. వాటిమీద బ్రౌన్ రంగు మచ్చలు వస్తాయి. అప్పుడు స్టవ్ ఆపేయాలి.
వేగించిన మొక్కజొన్న గింజలు గది ఉష్ణోగ్రతకు చేరుకున్నాక క్యాప్సికమ్, టొమాటో, మసాలా మిశ్రమం, అల్లం రసం, కొత్తిమీర, నిమ్మరసం, పచ్చిమిర్చిలు వేసి కలపాలి. ఇంక దేనికి ఆలస్యం స్పైసీ కార్న్ చాట్ తినేయడమే.
ఇంట్లోనే వాక్సింగ్
బ్యూటిప్స్
చేతుల మీద అవాంఛిత రోమాలను తొలగించడం పెద్ద పనే. కానీ ఇంట్లోనే వ్యాక్సింగ్ చేసుకోవచ్చు. ఒక టీ స్పూను నిమ్మరసంలో ఒక టీ స్పూను చక్కెర కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే వ్యాక్సింగ్ నైఫ్‌తో కాని స్పూను వెనుక భాగంతో కాని చేతులకు పట్టించి వెంటనే కాటన్ క్లాత్ కప్పేసి గట్టిగా అదమాలి. వ్యాక్సింగ్ మిశ్రమం చల్లారి ఆరే కొద్దీ చర్మానికి క్లాత్ అతుక్కుపోతుంది. పూర్తిగా ఎండిన తరువాత క్లాత్ ఒక వైపును పట్టుకుని గట్టిగా లాగేయాలి. ఇలా చేయడం వల్ల రోమాలన్నీ క్లాత్‌కు అతుక్కుని వచ్చేస్తాయి.
ఇది కొంచెం నొప్పిగా అనిపిస్తుంది కాని క్రమంగా రోమాల కుదుళ్లు బలహీన పడి పెరుగుదల ఆగిపోతుంది. వ్యాక్సింగ్ పట్టించేటప్పుడు రోమాలు ఏ దిశగా ఉన్నాయన్న సంగతిని గుర్తించి అదే దిశగా అప్లై చేసి, క్లాత్ లాగేటప్పుడు వ్యతిరేక దిశగా లాగాలి. వ్యాక్సింగ్ చేసినప్పుడు ర్యాష్ వచ్చినట్లయితే వెంటనే రెండు చుక్కల గ్లిజరిన్ రాయాలి. వ్యాక్సింగ్ చేయడానికి క్లాత్‌కు బదులు వ్యాక్సింగ్ టిష్యూలను వాడవచ్చు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565