షోడశ గణపతులు
ముద్గల పురాణాన్ని అనుసరించి 32 రకాల గణపతి మూర్తులున్నారు.. వారిలో 16 గణపతులు చాలా మహిమాన్వితం.. వీరిని షోడశ గణపతులు అంటారు.. ఆ గణపతులను ఈ వినాయక చవితి నాడు ఏ విధంగా ఆరాధించాలో ఇక్కడ ఇస్తున్నాం..
బాల గణపతి
శ్లోకం: కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాల సూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
రూపం : నాలుగు చేతులతో ఉండి కుడివైపు చేతుల్లో అరటిపండు, మామిడి పండు.. ఎడమవైపు చేతుల్లో పనస తొన, చెరుకు గడని పట్టుకొని ఉంటాడు.
ఫలితం : బుద్ధి కుశలత, పిల్లలకు చదువు.
తరుణ గణపతి
శ్లోకం : పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంతశాలీనమపి
స్వహస్రైః ధత్తే సదా య సతరుణాభః
పాయాత్సయుష్మాం ష్రరుణో గణేషః
రూపం : ఎనిమిది చేతులు కుడివైపు చేతుల్లో పాశం, వెలగగుజ్జు, దంతం, వరివెన్ను.. ఎడమ వైపు చేతుల్లో అంకుశం, నేరేడు, చెరుకుగడ పట్టుకొని అభయముద్రతో ఈ రూపం ఉంటుంది.
ఫలితం : ధాన్య లాభం
భక్త గణపతి
శ్లోకం : నాలీకేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్ఛంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్
రూపం : నాలుగు చేతులతో ఉంటాడీ గణపతి. కుడివైపు చేతుల్లో మామిడి పండు, అరటి పండు, ఎడమవైపు చేతుల్లో కొబ్బరికాయ, పరమాన్నం గిన్నె పట్టుకొని ఉంటాడు.
ఫలితం : భక్తి భావం.
సిద్ధి గణపతి
శ్లోకం : పక్వచుత ఫల పుష్ప మంజరీ ఇక్షుదండ
తిలమోదకై స్సహ ఉద్వహన్ పరశుమస్తుతే
నమః శ్రీ సమృద్ధియుత హేమం పింగళ
రూపం : నాలుగు చేతులతో ఉండే ఈ గణనాథుడు సిద్ధి, బుద్ధిలతో కూడి ఆసీనుడై ఉంటాడు. కుడి చేతుల్లో మామిడి పండు, గొడ్డలి, ఎడమ చేతుల్లో పూలగుత్తి, చెరుకు గడని పట్టుకొని ఉంటాడు.
ఫలితం : పనుల్లో విజయం.
ఉచ్ఛిష్ట గణపతి
శ్లోకం : నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేషః పాతు మేచకః
రూపం : నాలుగు చేతులతో ఉంటాడీ గణపతి. కుడి చేతులతో నల్ల కలువ, జపమాల.. ఎడమవైపు చేతుల్లో వరివెన్ను, వీణని పట్టుకొని ఉంటాడు.
ఫలితం : కోరిన కోరికలు తీర్చుట.
నృత్య గణపతి
శ్లోకం : పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః
క్లుప్త పరాంగులీకుమ్ పీతప్రభం కల్పతరో రధః
స్థం భజామి తం నృత్త పదం గణేషమ్
రూపం : ఆనంద తాండవం చేస్తాడీ గణపయ్య. నాలుగు చేతులతో ఉండి.. కుడి చేతుల్లో పాశం, విరిగిన దంతం ధరించాడు. ఎడమ చేతుల్లో అంకుశం, గొడ్డలి పట్టుకొని ఉంటాడు.
ఫలితం : సంతృప్తి, మనఃశ్శాంతి.
మహా గణపతి
శ్లోకం : హస్తీంద్రావన చంద్ర చూడ మరుణచ్ఛాయం
త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా
స్వాంకస్థయా సంతతమ్ బీజాపూరగదా ధనుర్విద్య
శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల వ్రీహ్యగ్ర స్వవిశాణ
రత్న కలశాన్ హైస్త్రె ర్వహంతం భజే
రూపం : పది చేతులతో ఉండి కుడి చేతుల్లో మొక్కజొన్న, చక్రం, పాశం, కలువ, విరిగిన దంతం ఉంటాయి. ఎడమవైపు చేతుల్లో పద్మం, గద, శంఖం, చెరుకుగడ చక్రం, అమ్మవారిని పట్టుకొని ఉంటాడీ గణనాథుడు.
ఫలితం : సమస్త శుభాలు.
ద్విజ గణపతి
శ్లోకం : యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కర భూషణ మిందు వర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజ గణపతే సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః
రూపం : మూడు తలలు, నాలుగు చేతులతో ఈ గణపతి దర్శనమిస్తాడు. కుడి చేతుల్లో అక్షమాల, దండం.. ఎడమ చేతుల్లో పుస్తకం, కమండలం పట్టుకొని ఉంటాడు.
ఫలితం : తెలివితేటలు.
లక్ష్మీ గణపతి
శ్లోకం : బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే
గౌరాంగో వరదాన హస్త సమితో లక్ష్మీ గణేశో శావతాత్
రూపం : పది చేతులతో ఉంటాడు ఈ విఘ్నేశ్వరుడు. రెండు చేతుల్లో సిద్ధి, బుద్ధితో ఉంటాడు. మిగతా కుడిచేతుల్లో చిలుక, దానిమ్మ, పాశం, ఖడ్గం.. ఎడమవైపు చేతుల్లో అంకుశం, కల్పలత, మాణిక్య కుంభం పట్టుకొని అభయహస్తంతో ఈ రూపముంటుంది.
ఫలితం : ఐశ్వర్యం.
విఘ్న గణపతి
శ్లోకం : శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ చక్ర
స్వదంత సృణి మంజరికా శరాఘై
పాణిశ్రి పరిసమీహిత భూషాణా శ్రీ విఘ్నేశ్వరో
విజయతే తపనీయ గౌరః
రూపం : పది చేతులతో ఈ వినాయకుడు దర్శనమిస్తాడు. కుడి చేతుల్లో చక్రం, దంతం, గొడ్డలి, బాణం, పాశం.. ఎడమ చేతుల్లో చెరుకు, వరిచెన్ను, శంఖం, పూలగుత్తి, విల్లు పట్టుకొని ఉంటాడు.
ఫలితం : విఘ్న నాశనం.
క్షిప్ర గణపతి
శ్లోకం : దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్
రూపం : నాలుగు చేతులతో ఉండి.. కుడిచేతుల్లో దంతం, బంగారు కుండ, ఎడమ వైపు చేతుల్లో.. కల్పవృక్ష తీగ, అంకుశం పట్టుకొని ఉంటాడీ గణపతి.
ఫలితం : సంపద.
వీర గణపతి
శ్లోకం : భేతాల శక్తి శర కార్ముక చక్రఖడ్గ ఖట్వాంగ ముద్గర
గదాంకుశ నాగపాశాన్ శూలం చ కుంత పరశుద్వజ
మాత్తదంతం వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
రూపం : పదహారు చేతులను కలిగి ఉంటాడు .ఈ గణపతి. కుడివైపు చేతుల్లో బాణం, భేతాళుడు, చక్రం, మంచం కోడు, గద, ఖడ్గం, శూలం, గొడ్డలి చిహ్న జెండాలను.. ఎడమ వైపు చేతుల్లో శక్తి, విల్లు, పాము, ముద్గరం, అంకుశం, పాశం, కుంతం, దంతములను పట్టుకొని ఈ రూపం ఉంటుంది.
ఫలితం : ధైర్యం.
శక్తి గణపతి
శ్లోకం : ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం పరస్పరా
శ్లిష్ట కటి ప్రదేశమ్ సంధ్యా రుణం పాశ
స్పటీర్దధానం భయాపహం శక్తి గణేష మీదే
రూపం : నాలుగు చేతులతో ఉండి.. కుడి చేతిలో అంకుశం, విరిగిన దంతం, ఎడమ చేతుల్లో పాశం, అమ్మవారితో కలిపి ఈ రూపం ఉంటుంది.
ఫలితం : ఆత్మ స్థయిర్యం
హేరంబ గణపతి
శ్లోకం : అభయ వరదహస్త పాశ దంతాక్షమాల సృణి పరశు
రధానో ముద్గరం మోదకాపీ ఫలమధిగత సింహ
పంచమాతంగా వక్త్రం గణపతి
రూపం : నాలుగు తలలతో సింహవాహనుడై ఉంటాడు ఈ గణపతి. పది చేతులతో ఉండే ఆ గణనాథుడి కుడి చేతుల్లో.. కత్తి, అక్షమాల, మోదకం, దంతం ఉంటాయి. ఎడమ చేతుల్లో.. అంకుశం, ముద్గరం, పాశం, గొడ్డలి ఉంటాయి.
ఫలితం : ప్రయాణాల్లో ఆపదల నివారణ.
విజయ గణపతి
శ్లోకం : పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనా
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః
రూపం : నాలుగు చేతులతో ఉండే ఈ బుజ్జి వినాయకుడి కుడి చేతుల్లో.. పాశం, విరిగిన దంతం, ఎడమ చేతుల్లో.. అంకుశం, మామిడిపండు ఉంటాయి.
ఫలితం : సమస్త విజయాలు.
ఊర్ధ గణపతి
శ్లోకం : కల్హార శాలి క్షమలేక్షుక చాపదంతా ప్రరోహ
కనకోజ్జల లాలితాంగ ఆలింగ్య
గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు
శుభమూర్ధ్య గణాధిపో మేః
రూపం : ఎనిమిది చేతులతో ఉండి.. కుడి చేతుల్లో వరివెన్ను, కలువ, బాణం, విరిగిన దంతం ధరించి ఉంటాడు. ఎడమ చేతుల్లో పద్మం, గద, విల్లు, అమ్మతో ఈ రూపం ఉంటుంది.
ఫలితం : కలహాల నుంచి విముక్తి.
ఏ శుభకార్యం చేసినా మొదటగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం తప్పనిసరి. చేపట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగాలని గణపయ్యను పూజిస్తారు.
ఓం గణానామ్ త్వా గణపతిగ్‌మ్ హవామహే,
కవిం కవీనా ముపమశ్రవస్తవమ్!
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆనఃశృణ్వన్నూతిభి స్సీదసాదనమ్!!
గణపతి గురించి వేదం చెప్పిన మంత్రం ఇది. ఈ మంత్రం గణపతిని మూడు విధాలుగా వర్ణిస్తుంది. లౌకిక రూపాన్నీ, తాత్త్విక స్వరూపాన్నీ, ఆత్మ చింతననూ తెలియజేస్తుందీ వేద మంత్రం.
‘‘గణాల్లో గణపతిగా ఉన్నవాడు, కవులకు కవియైు ఉన్నవాడు, అన్న సమృద్ధి కలవాడు, అందరికన్నా మొదటగా ప్రకటితమైన వాడు, వేద మంత్రాల్లో ప్రకాశించేవాడు అయిన గణపతిని.. మా ప్రార్థనలు విని సమస్త శక్తులతో మా సదనం (ఇంటి)లోకి రావయ్యా’’ అని పిలవడం ఈ మంత్రంలోని అర్థం.
తాత్త్విక అర్థాన్ని గ్రహిస్తే.. ‘‘గణములు అంటే సమూహం అని అర్థం. అనంత విశ్వం ఒక మహా గణం. ఈ గణాలన్నింటిలో ప్రకాశించే శక్తి గణపతి. గణములు ఎన్ని ఉన్నా.. గణపతి ఒక్కడే! గణపతి తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే.. భిన్న దృష్టి తొలగిపోయి ఏకత్వం అర్థం అవుతుంది. కర్మకు కావాల్సిన చైతన్యాన్నీ, ప్రపంచానికి అవసరమైన ఐశ్వర్యాన్నీ ప్రసాదించేది వినాయకుడే’’ అని వర్ణించారు.
మూడో అర్థాన్ని పరిశీలిస్తే.. ‘‘గణములు అంటే ఇంద్రియాలు అని కూడా అర్థం ఉంది. ఇంద్రియాలన్నీ కలిపితే ఒక గణం. మన ఇంద్రియాలన్నింటినీ శాసించే ఆత్మ- గణపతి. కవులు అంటే ఆలోచనలు. ఈ ఆలోచనలకు మూలం ఆత్మ చైతన్యం. శరీర పోషణకు అన్నం కావాలి. దాని నుంచే ఇంద్రియాలకు శక్తి కలుగుతుంది. మనం చేసే కర్మలకు ఆయన అనుగ్రహం కావాలి. మొత్తంగా చూస్తే మన శరీరం అనే సదనంలో ఆత్మ స్వరూపంగా గణపతి ప్రకాశిస్తేనే మనుగడ సాధ్యమవుతుంద’’ని తాత్వికులు వర్ణించారు.
విఘ్నేశ్వరుడి రుపాన్ని పురాణాలు లోతుగా ఆవిష్కరించాయి. ఆదిలో పరమాత్మ నిరాకారుడు కనుక.. పసుపు ముద్దతో గణపతిని రూపొందించి కొలుస్తుంటాం. అవసరాన్ని బట్టి తన తత్వాన్ని తెలియజేసే రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు. అలా ధరించిన రూపమే విఘ్నేశ్వర రూపం. ఏనుగు ముఖంతో ఆయన ప్రకటించిన రూపం బలానికీ, పుష్టికీ సంకేతం. వక్ర తుండం అంటే వంకర తొండం కలవాడని అర్థం. వక్రములను తుండనం చేయువాడని మరో అర్థం. వంకరగా ఉన్న ఆలోచనలను తొలగించే శక్తి ఆయన. ఒక కార్యంలో విఘ్నాలను పరిహరించి.. దాన్ని సవ్యంగా నడిపేవాడు గణపతి. సత్కార్యానికి విఘ్నాలు తొలగించడంలోనే కాదు... దుష్కర్మలకు విఘ్నాలు కలిగించడంలోనూ ఆయన విఘ్నేశ్వరుడే! ఈ వినాయక చవితి రోజు ఆ గణపయ్యను ఆరాధించి.. మన ఆలోచనలు సవ్యంగా సాగాలని కోరుకుందాం. మనం చేసే సత్కర్మల్లో విఘ్నాలు తొలగించమని వేడుకుందాం.
సంకట హరుడు
‘‘సృష్టి కార్యంలో బ్రహ్మదేవుడికి మొదట్లో అన్నీ విఘ్నాలే ఎదురయ్యాయట. అప్పుడు బ్రహ్మ తన జన్మకు మూలకారణమైన పరమాత్మను ‘ఓం’కారంతో ధ్యానించాడట. ‘ఓం’కారం ఒక రూపాన్ని ధరించి బ్రహ్మకు దర్శనమిచ్చాడట. ఆ రూపం ఏనుగు తల, వక్ర తుండం, మహాకాయంతో ఉందట! బ్రహ్మకు ‘వక్రతుండ’ మంత్రం ఉపదేశించి గణపతి అదృశ్యమయ్యాడట. బ్రహ్మను విఘ్నేశ్వరుడు అనుగ్రహించిన రోజు మాఘ బహుళ చతుర్థి. నాటి నుంచి ప్రతి మాసంలోనూ బహుళ చతుర్థిని సంకష్ట (సంకట) హర చతుర్థిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. ధర్మ సంస్థాపన కొరకు పరమాత్మ ఎన్నోసార్లు అవతరించాడు. ఆ కారణంగానే భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ తనయుడిగా.. వినాయకుడిగా.. ఉద్భవించాడు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565