నగల్ని కుట్టేస్తున్నారు
Sewing jewels
ఎన్ని రకాల నగలున్నా వాటిలో ఇంకెన్ని భిన్నమైన ఫ్యాషన్లు వచ్చినా మరో కొత్త రకం నగ కోసం మగువ మనసు చేసే అన్వేషణ ఆగదు. బహుశా దేవుడు అమ్మాయిలతో పాటే ఆభరణం అన్న మాటను కూడా పుట్టించాడేమో. కాబట్టే తలకూ జడకూ చెవికీ చేతికీ ముక్కుకీ మెడకూ నడుముకీ నాభికీ కాలుకీ వేలుకీ... ఇలా నఖ శిఖ పర్యంతం ఆభరణం అమ్మాయిలో భాగమైపోయింది. అందానికి మెరుగులద్దుతోంది. ఆశ్చర్యం ఏంటంటే ఒంటి నిండా ఆభరణాలున్నా ఇంకా కొత్తవి పెట్టుకుంటే బాగుంటుందా... అనుకుంటూనే ఉంటారు. ఆ మక్కువే నగల్ని దుస్తులమీదికీ తెచ్చేసింది. జాకెట్లమీద బుట్టలూ చాంద్‌బాలీలూ వేరు వేరు డిజైన్ల పోగులూ హారాలూ అరవంకీలను ఎంబ్రాయిడరీ చేయించుకోవడం ఇప్పుడు నడుస్తోన్న ఫ్యాషన్ మరి. రకరకాల దారాలూ మెరిసే రాళ్లూ కుందన్లతో మగ్గం మీద రూపొందించే ఈ నగల్ని దూరం నుంచి చూస్తే పొరపాటున చెవి పోగు జారి జాకెట్టుకు వేలాడుతోందా... హారాలను మెడకే కాకుండా వీపుకీ వేలాడేస్తున్నారా... అనుకోవాల్సిందే. ఇక, అరవంకీ ఎంబ్రాయిడరీలైతే బంగారు అరవంకీ చేయించుకోలేదే అన్న ఆలోచనే రానంత అందంగానూ, జాకెట్టు జాకెట్టుకో కొత్త అరవంకీని పెట్టేశాం అన్నంత ట్రెండీగానూ ఉంటున్నాయి.
వీటిలో కొందరు చేతుల మీద బుట్టల్లాంటి పెద్ద పెద్ద పోగులు రెండింటిని ఎంబ్రాయిడరీ చేయిస్తుంటే మరికొందరు మొత్తం జాకెట్టూ క్రాప్ టాప్‌లమీద చిన్న చిన్న బుట్టలూ పోగుల్ని కుట్టిస్తున్నారు. మెడ వెనక భాగాన్ని చుడుతూ నెక్లెస్ ఆకారం వచ్చేలా చేస్తున్న ఎంబ్రాయిడరీ మరోరకం. అన్నట్లూ చీరల కొంగులమీదా పెద్ద పెద్ద పోగులూ గాజుల్ని ఎంబ్రాయిడరీ చెయ్యడం మరో సరికొత్త ఫ్యాషన్. అదండీ సంగతి... ఇదివరకు పెళ్లిళ్లకూ ఫంక్షన్లకూ ఏం నగలు వేసుకున్నారూ... అని చూసేవారు కాస్తా ఇప్పుడు ఏ నగలున్న జాకెట్లు వేసుకున్నారూ అని చూస్తున్నారు.
#నగల్ని_కుట్టేస్తున్నారు
#Sewing_jewels
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565