ఏది నిజమైన సుఖం..
ధనం, రాజ్యం, అధికారం- ఇవన్నీ దర్పాన్ని తెచ్చిపెడతాయి. కానీ, ధైర్యాన్ని ఇవ్వలేవు. సుఖాన్ని తెచ్చిపెట్టలేవు. ధనాన్ని రక్షించలేక, దాచిపెట్టలేక నానా గడ్డీ కరిచేవారు ఉన్నారు. రాజ్యాన్ని పాలిస్తూ.. ఏ క్షణంలో శత్రువుల దాడిలో మరణించాల్సి వస్తుందో అని భయపడుతూ బతికేవారు రాజులు. ఒక రాజుగారు దేశం మొత్తం తిరిగి తిరిగి చెట్టు కింద హాయిగా, ఎలాంటి భయం లేకుండా నిద్రిస్తున్న ఒక సన్యాసిని చూసి ఆశ్చర్యపడిన కథ ఒకటుంది. అలాంటి కథే కప్పిన మహారాజుది!
కప్పినుడు కుక్కట రాజ్యానికి మహారాజు. తండ్రి అనంతరం రాజయ్యాడు. పొరుగు రాజ్యాలన్నింటినీ పాదాక్రాంతం చేసుకున్నాడు. అతని చేతిలో ఓడిన రాజులందరూ రాజ్యాలు వదిలి పారిపోయారు. కప్పినుడు తన కోటలో సురక్షితమైన భవనంలో హంసతూలికా తల్పాల మీద శయనించేవాడు. ఆ భవనానికి చుట్టూ వందల మంది భటులు కాపలా కాసేవారు. చీమ రావడానికి కూడా వీలులేనంత కట్టుదిట్టమైన రక్షణ వలయం ఉండేది. భవనం పై అంతస్తులో చల్లటి గాలి వీస్తూ ఉండేది. అయినా కంటి నిండా నిద్ర పోయేవాడు కాదు రాజు. ఏ క్షణాన ఏ ప్రమాదం.. ఏ రూపంలో ముంచుకొస్తుందో అని భయపడేవాడు. ఇంత రక్షణలో ఉన్నా.. అంత మెత్తటి పరుపులూ, సుగంధ పరిమళాలూ ఉన్నా.. ఏవీ అతనికి సుఖ నిద్రను ప్రసాదించలేకపోయాయి.
ఒక రోజు భవనం మీదున్న రాజుకు దారిన పోయే ఒక భిక్షువు కనిపించాడు. అతని ముఖంలో ప్రశాంతతను చూసి.. భిక్షువు దగ్గరికి వెళ్లాడు రాజు. ఆ భిక్షువు కప్పిన మహారాజును బుద్ధుని దగ్గరకు తీసుకెళ్లాడు. బుద్ధునిలోని ప్రశాంతతని చూసి.. బుద్ధుని ప్రబోధం విని.. రాజ్యాన్ని వదిలి భిక్షువుగా మారాడు కప్పిన మహారాజు.
ఆ తరువాత ‘‘ఆహా ఏమి సుఖం! ఏమి సుఖం!! ఎంత సుఖం! ఎంత సుఖం!!’’ అంటూ కంటి నిండా నిద్రపోయేవాడు. అతని
ఆనందాతిశయాన్ని చూసిన భిక్షువులు ఈ విషయం బుద్ధునితో చెప్పగా.. ‘‘భిక్షువులారా! ఏది సుఖమో, ఏది దుఃఖమో తెలుసుకోవడమే ప్రజ్ఞ.
జీవితే వాపి సప్పజ్ఞో, అపి విత్తపరిక్ఖయో
పజ్ఞాయ చ అలాభేన, విత్తావాపి న జీవతి
ఎంత ధనవంతుడైనా.. ప్రజ్ఞ లేకపోతే సుఖంగా బతకలేడు. ప్రజ్ఞ ఉంటే ఎంతటి పేదవాడైనా సుఖంగా బతకగలడు’’ అని ప్రబోధించాడు. అనంతర కాలంలో కప్పినుడు మంచి భిక్షువుగా రాణించాడు.
బొర్రా గోవర్ధన్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565