MohanPublications Print Books Online store clik Here Devullu.com

వృద్ధాపి జీర్ణం!-Digestive Digestion!

వృద్ధాపి జీర్ణం!
ఉదయాన్నే ఉరుకులు పరుగుల మీద ఆఫీసులకు పరుగెత్తాల్సిన పనిలేదు. డెడ్‌లైన్‌ దాటిపోతుందేమోనన్న బెంగ లేదు. కావాల్సినంత సమయం చేతిలో ఉంటుంది. మనవలు, మనవళ్లతో బోలెడంత కాలక్షేపం. వృద్ధాప్యానికి ఇదొక పార్శ్వం మాత్రమే. మరోవైపు- చర్మం ముడతలు పడుతుంటుంది. నడుం ఒంగిపోతుంటుంది. నిస్సత్తువ ఆవరించేస్తుంటుంది. ఇలా వృద్ధాప్యం మోసుకొచ్చే శారీరక మార్పులు ఎన్నెన్నో. లోలోపల్నుంచి తలెత్తే జబ్బులూ మరెన్నో. ముఖ్యంగా- జీర్ణ సమస్యల గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆకలి తగ్గిపోయి, రుచి మారిపోయి.. సరిగా తినలేక, తిన్నది అరగక.. కడుపుబ్బరం, ఛాతీలో మంట, మలబద్ధకం వంటి వాటితో సతమతమయ్యే వృద్ధులు ఎందరో. చూడటానికివి మామూలుగానే, అంత ఇబ్బందికరమైనవి కావనీ అనిపించొచ్చు. అందుకేనేమో కొందరు వీటిని వయసుతో పాటు వచ్చే ఇబ్బందులుగా భావిస్తూ నిర్లక్ష్యం చేసేస్తుంటారు. వాటితో సర్దుకుపోతుంటారు. కానీ తాత్సారం చేస్తే ఇవే క్యాన్సర్ల వంటి తీవ్ర సమస్యలకూ దారితీయొచ్చు. 
మనం ఏ పని చేయాలన్నా శక్తి కావాలి. ప్రతి కణానికీ సత్తువ కావాలి. ఇది మనకు ఆహారం నుంచే లభిస్తుంది. తిన్న ఆహారం జీర్ణమై, దానిలోని పోషకాలను శరీరం గ్రహించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇందుకు నోటి నుంచి మలద్వారం వరకూ జీర్ణ వ్యవస్థ మొత్తం సరిగా పనిచేయటం చాలా ముఖ్యం. లేకపోతే శరీరమంతా నిస్సత్తువతో జావగారిపోతుంది. మనం నోటి ద్వారా తీసుకున్న ఆహారం.. గొంతును దాటుకొని, అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ్నుంచి చిన్న పేగుల గుండా ప్రయాణించి.. చివరికి పెద్దపేగుకు చేరుకుంటుంది. అప్పటికే జీర్ణవ్యవస్థ దానిలోని పోషకాలన్నింటినీ దాదాపుగా గ్రహించేస్తుంది. మిగిలిన వ్యర్థ పదార్థం మలంగా తయారై.. ముందుకు కదులుతూ గట్టిపడి పెద్దపేగు చివరి భాగానికి చేరుకొని.. అక్కడ్నుంచి మలద్వారం గుండా బయటకు వచ్చేస్తుంది. ఈ మొత్తం వ్యవస్థలో ఎక్కడ సమస్య తలెత్తినా మొత్తం జీర్ణ ప్రక్రియే ప్రభావితమవుతుంది. రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువ. దీనికి ఆమ్లం ఉత్పత్తి తగ్గటం, పేగుల కదలికలు మందగించటం వంటి పలు అంశాలు దోహదం చేస్తాయి.
మలబద్ధకం 
వృద్ధుల్లో సర్వ సాధారణంగా కనిపించే సమస్య మలబద్ధకం. సుమారు 70-80% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. మలం గట్టిగా వస్తుండటం, ముక్కాల్సి రావటం, విసర్జన పూర్తిగా కానట్టు అనిపించటం, ఉదయాన్నే విసర్జనకు వెళ్లాలని అనిపించకపోవటం.. ఇలా ఎలాంటి తేడా అనిపించినా చాలామంది మలబద్ధకంగా భావిస్తుంటారు. నిజానికి వైద్యపరంగా వారానికి 3 కన్నా తక్కువసార్లు మల విసర్జన జరుగుతుంటేనే మలబద్ధకంగా పరిగణిస్తారు. మలబద్ధకానికి ప్రధాన కారణం పెద్దపేగు కదలికలు తగ్గిపోవటం. మనం తిన్న ఆహారం జీర్ణమై, దానిలోని సారాన్ని పేగులు పీల్చుకున్న తర్వాత మిగిలిపోయిన వ్యర్థ పదార్థం మలం రూపంలో బయటకు వస్తుంది. ముందుగా ఇది చిన్న పేగుల నుంచి పెద్ద పేగు కుడి భాగంలోకి ప్రవేశించి.. పేగు కండరాలు సంకోచిస్తున్నకొద్దీ ముందుకు కదులుతూ ఎడమ వైపునకు వస్తుంది. క్రమంగా పేగు చివర్లోని మలాశయం లేదా పురీషనాళం (రెక్టమ్‌) వద్దకు చేరుకుంటుంది. ఇలా మలం వచ్చి చేరుతున్నకొద్దీ అక్కడ ఒత్తిడి పెరిగి, మల విసర్జనకు వెళ్లాలనే భావన కలుగుతుంది. అయితే వృద్ధుల్లో పేగు కదలికలు తగ్గటం వల్ల మల పదార్థం త్వరగా ముందుకు సాగదు. దీంతో మల పదార్థంలోని నీటిని పేగు మరింతగా పీల్చేసుకుంటుంది. మలం గట్టిపడుతూ వస్తుంది. మరోవైపు- వృద్ధుల్లో మల పదార్థం చాలాసేపు కుడివైపుననే ఉండిపోవటం వల్ల అక్కడి పేగు పెద్దగా అవుతుంది కూడా. విసర్జన సరిగా కాకపోవటం వల్ల మనసును ఎప్పుడూ ఏదో ఒకరకమైన భావన తొలిచేస్తుంటుంది. చిరాకూ మొదలవుతుంది. సాధారణంగా పీచు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవటం ద్వారా మలబద్ధకం తగ్గుతుంది. కానీ వృద్ధులకు ఇది అంతగా ఉపయోగపడదు. పీచుతో మల పదార్థం ఎక్కువైనప్పటికీ.. అది కదలకుండా ఉండిపోవటం వల్ల మరిన్ని సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి వీరికి పీచుతో పాటు కదలికలను మెరుగు పరచే ప్రుకాలోప్రైడ్‌, ల్యుబిప్రోస్టోన్‌ వంటి (ప్రొకైనటిక్‌) మందులూ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నీళ్లు ఎక్కువగా తాగటం, రోజూ ఒకే వేళకు విసర్జనకు వెళ్లటమూ అలవాటు చేసుకోవాలి.
మారింది వృద్ధ నిర్వచనం! 
రోజురోజుకీ వృద్ధుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు వృద్ధాప్య నిర్వచనమూ మారిపోయింది. ఒకప్పుడు 65 ఏళ్లు దాటితే వృద్ధాప్యంగా భావించేవారు. కానీ ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజా సిఫారసుల ప్రకారం 80ల్లోకి అడుగుపెడితేనే వృద్ధాప్యం వచ్చినట్టు! అక్కడ్నుంచి 99 ఏళ్ల వరకూ వృద్ధాప్య దశే. 18-65 ఏళ్ల వారిని యువతరంగా, 66-70 ఏళ్ల వారిని మధ్యవయసువారిగా పరిగణించింది. అయితే మనదేశంలో ఇంకా 65 ఏళ్లు దాటినప్పట్నుంచే వృద్ధాప్యంగా భావిస్తున్నారు. త్వరలో మనదేశంలోనూ ఇది మారిపోవచ్చు.
ముద్ద దిగకపోవటం
మనం తిన్న ఆహారాన్ని జీర్ణాశయానికి చేర్చేది అన్నవాహిక. ఓ పొడవైన గొట్టంలా ఉండే దీనిలోని కండరాలుంటాయి క్రమపద్ధతిలో సంకోచిస్తూ.. మనం మింగిన ముద్దను జీర్ణాశయంలోకి చేరుస్తాయి. అయితే వృద్ధుల్లో ఈ కండరాల సంకోచం మందగిస్తుంది. దీన్నే ‘ప్రెస్‌బయోఈసోఫేగస్‌’ అంటారు. దీంతో ముద్ద సరిగా కిందికి దిగదు. లోపల తట్టుకున్నట్టుగా అనిపిస్తుంటుంది. ముద్ద ఎక్కువసేపు నిలిచిపోతుండటం వల్ల అన్నవాహిక వ్యాకోచించి, పెద్దగా అవుతుంది కూడా. అంతేకాదు.. రాత్రిపూట పడుకున్నప్పుడు ఆహార పదార్థాలు గొంతులోకి ఎగదన్నుకొనీ వస్తుంటాయి. ఇవి వూపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి, ఇన్‌ఫెక్షన్‌కూ దారితీయొచ్చు. కాబట్టి వృద్ధులు భోజనం చేసేటప్పుడు నీరు బాగా తాగటం మంచిది. భోజనం చేశాక కనీసం 2 గంటల తర్వాతే పడుకోవాలి. కొన్నిసార్లు వేసుకునే మాత్రలు కూడా సరిగా కిందికి దిగవు. దీంతో అన్నవాహిక దెబ్బతిని (పిల్‌ ఈసోఫేజైటిస్‌) అల్సర్లకూ దారితీయొచ్చు. అందువల్ల మాత్రలు వేసుకున్న ప్రతిసారీ ఒక గ్లాసు నీళ్లు తాగటం మంచిది.
ఛాతీలో మంట
అన్నవాహిక అడుగున ఒక బిగుతైన కండర వలయం (స్ఫింక్టర్‌) ఉంటుంది. తిన్న ఆహారం జీర్ణాశయంలోకి ప్రవేశించే సమయంలో దీని బిగువు సడలుతుంది. ముద్ద లోపలికి వెళ్లగానే ఇది తిరిగి బిగుసుకుపోతుంది. ఇలా ఇది జీర్ణాశయంలోని ఆమ్లం, ఆహారం వంటివి పైకి ఎగదన్నుకొని రాకుండా గట్టిగా పట్టి ఉంచుతుంది. వృద్ధుల్లో ఈ కండర వలయం బలహీనపడి, బిగువు సడలుతుంది. దీంతో జీర్ణాశయంలోని ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకొని వచ్చి ఛాతీలో మంట (జీఈఆర్‌డీ), నొప్పి వంటివి బయలుదేరతాయి. రాత్రిపూట పడుకున్నప్పుడు పైకి ఎగదన్నుకొని వచ్చిన ఆమ్లం వూపిరితిత్తులోకీ వెళ్లొచ్చు. ఇది ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. కొందరు గుండెజబ్బులకు ఆస్ప్రిన్‌ వంటి మందులూ వేసుకుంటుంటారు. ఇవి గుండె కండరాలతో పాటు కండర వలయాన్నీ వదులుగా చేస్తాయి. దీంతో ఆమ్లం మరింతగా పైకి ఎగదన్నుకొని రావొచ్చు. అందువల్ల వృద్ధుల్లో ఛాతీలో మంట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరిలో గుండె సమస్యలతో పాటు జీర్ణాశయ సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవటం ముఖ్యం.
అజీర్ణ వేదన
తిన్న ఆహారం సరిగా జీర్ణమైతేనే దానిలోని పోషకాలు బాగా ఒంట పడతాయి. ఇందుకు జీర్ణాశయంలోని ఆమ్లం ఎంతగానో తోడ్పడుతుంది. అయితే వృద్ధుల్లో జీర్ణాశయంలో జిగురుపొరలు క్షీణించటం (అట్రోఫిక్‌ గ్యాస్ట్రయిటిస్‌) వంటి వాటి మూలంగా ఆమ్లం ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. దీంతో తిన్నది సరిగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపుబ్బరం, త్రేన్పుల వంటివి వేధిస్తుంటాయి. వీరికి పాంక్రియాటిక్‌ ఎంజైమ్‌ల భర్తీ చికిత్స ఇస్తే జీర్ణక్రియ చాలావరకు మెరుగుపడుతుంది. ఆమ్లం తగ్గటం వల్ల తలెత్తే మరో ముప్పు విటమిన్‌ బి12 లోపం. ఆమ్లంలోని ఇంట్రిన్సిక్‌ ఫ్యాక్టర్‌ విటమిన్‌ బి12తో జత కలిస్తేనే శరీరం దాన్ని గ్రహించగలుతుంది. ఆమ్లం ఉత్పత్తి తగ్గితే ఇంట్రిన్సిక్‌ ఫ్యాక్టర్‌ కూడా తగ్గిపోయి విటమిన్‌ బి12 లోపం తలెత్తుతుంది. వృద్ధుల్లో ఇది మరింత ఎక్కువగా కనబడుతుంది. దీంతో చేతులు, కాళ్లు మొద్దుబారటం.. తిమ్మిర్లు, కండరాలు బలహీనం కావటం, రాత్రిపూట చూపు తగ్గటం వంటివన్నీ బయలుదేరతాయి. పాదాలకు స్పర్శ తగ్గటం, సమన్వయం కొరవడటంతో కింద పడిపోయే ప్రమాదమూ ఉంది. వీరికి విటమిన్‌ బి12 ఇంజెక్షన్లు క్రమం తప్పకుండా ఇస్తే చాలావరకు పరిస్థితి కుదుటపడుతుంది.
గ్యాస్‌-ఉబ్బరం
ఆహారాన్ని జీర్ణం చేస్తూ.. వాటిలోని పోషకాలను గ్రహించటంలో చిన్న పేగులదే కీలకపాత్ర. వృద్ధుల్లో చిన్న పేగుల కదలికలూ మందగిస్తాయి. దీంతో ఆహారం సరిగా ముందుకు కదలదు. దీంతో తలెత్తే మరో ముప్పు చెడు బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందటం. ఫలితంగా గ్యాస్‌ ఎక్కువై పొట్ట ఉబ్బరం.. త్రేన్పులు, అపాన వాయువుల వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి. తరచుగా విరేచనాలు కూడా కావొచ్చు. తిన్నది సరిగా జీర్ణం కాకపోవటం వల్ల పోషణలోపమూ తలెత్తొచ్చు. ముఖ్యంగా విటమిన్‌ డి, క్యాల్షియం మోతాదులు తగ్గిపోవటం వల్ల ఎముకలు బలహీనపడతాయి. చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగే ముప్పూ పెరుగుతుంది. కాబట్టి కడుపు ఉబ్బరం, అపాన వాయువుల వంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి ‘హైడ్రోజెన్‌ శ్వాస’ పరీక్ష చేసి బ్యాక్టీరియా తీరుతెన్నులను పరిశీలించాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా ఎక్కువుంటే ఇందులో బయటపడుతుంది. వీరికి యాంటీబయోటిక్స్‌, పేగు కదలిలకను మెరుగుపరచే మందులతో ఫలితం కనబడుతుంది. అలాగే ప్రొబయోటిక్స్‌ కూడా బాగా ఉపయోగపడతాయి. వీటితో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. చెడు బ్యాక్టీరియా తగ్గుతుంది. అలాగే పెరుగు, మజ్జిగ వంటివీ మేలు చేస్తాయి.
పేగులో తిత్తులు
మలపదార్థం సరిగా కదలనప్పుడు దాన్ని ముందుకు తోయటానికి పెద్దపేగు మరింతగా కష్టపడాల్సి వస్తుంటుంది. దీంతో లోపల ఒత్తిడి పెరిగి.. పేగు గోడ బలహీనపడి.. చిన్న సంచుల్లా తిత్తులు ఏర్పడుతుంటాయి. 60 ఏళ్లు పైబడిన దాదాపు సగం మందిలో ఇలాంటి తిత్తులు కనబడటం చూస్తుంటాం. ఒకప్పుడు ఇది విదేశాల్లో ఎక్కువగా కనబడేది. మన ఆహార అలవాట్లు మారిపోతుండటం, పూర్తిగా శుద్ధిచేసిన రిఫైన్డ్‌ పదార్థాలను తీసుకోవటం పెరుగుతున్నకొద్దీ మనదేశంలోనూ తరచుగా కనబడుతోంది. నిజానికి లోపల తిత్తులు ఉన్నప్పటికీ ఇవేమీ ఇబ్బంది కలిగించవు. పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. కొన్నిసార్లు గ్యాస్‌, కడుపుబ్బరం, కడుపునొప్పి వంటివి పొడసూపొచ్చు. అయితే కొందరిలో ఈ తిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ మొదలై ఇవి వాచిపోవచ్చు. దీన్నే డైవర్టిక్యులైటిస్‌ అంటారు. దీంతో తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, చలి, వికారం, వాంతి వంటివి మొదలవుతాయి. దీనికి యాంటీబయోటిక్స్‌, నొప్పి నివారణ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సర్జరీ చేసి తిత్తులు తలెత్తిన భాగాన్ని తొలగించాల్సి వస్తుంది కూడా.
రుచి-ఆకలి తగ్గటం
నాలుకపై, గొంతులో రుచి మొగ్గలుంటాయి. ఒక్కో రుచి మొగ్గలోనూ చాలా రుచి కణాలుంటాయి. మనం ఆహారాన్ని నమిలినప్పుడు ఈ కణాలు ప్రేరేపితమై.. వీటికి అనుసంధానంగా ఉన్న నాడుల ద్వారా ఆ సమాచారం మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు ఆయా ప దార్థాల రుచి తెలుస్తుంది. అయితే వృద్ధుల్లో ఈ రుచి మొగ్గల సంఖ్య తగ్గుతుంది. దీంతో నోటికి చాలా పదార్థాలు చప్పిడిగాఅనిపిస్తుంటాయి. అలాగే వాసనలు పసిగట్టే ఘ్రాణ శక్తి కూడా మందగిస్తుంది. ఫలితంగా ఆకలి వేయటమూ తగ్గుతుంది. పోషణలోపం ముఖ్యంగా జింక్‌ లోపించటం కూడా రుచి తగ్గటానికి దారితీయొచ్చు. అందువల్ల కొందరికి జింక్‌ ఇస్తే రుచి మెరుగవుతుంది. జీర్ణకోశంలో వాపు, కొన్నిరకాల మందులు, మద్యం, పొగ అలవాటు, ఒత్తిడి, కుంగుబాటు వంటివీ ఇందుకు దోహదం చేయొచ్చు. వృద్ధుల్లో ఆకలి తగ్గితే క్యాన్సర్‌ ఉందేమోననీ అనుమానించాలి. ఎందుకంటే క్యాన్సర్ల మూలంగా ఆకలిని ప్రేరేపించే ఘ్రెలిన్‌, కడుపునిండిందనే భావన కలిగించే లెప్టిన్‌ హార్మోన్ల మధ్య సమతుల్యం దెబ్బతిని ఆకలి మందగిస్తుంటుంది. కాబట్టి ఆకలి తగ్గటాన్ని తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. క్షుణ్నంగా పరిశీలించి, తగు కారణాన్ని గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది.
క్యాన్సర్లు పెద్ద సమస్య
ఈ జీర్ణ ప్రక్రియ అస్తవ్యస్తం కావటం వల్ల వృద్ధులకు క్యాన్సర్ల ముప్పూ ఎక్కువే. వీరిలో అల్సర్ల కన్నా క్యాన్సర్లే అధికంగా కనబడుతుంటాయి. అన్నవాహిక, జీర్ణాశయం, పెద్దపేగు.. ఇలా ఎక్కడైనా క్యాన్సర్లు రావొచ్చు. దీర్ఘకాలంగా గొంతులోకి ఆమ్లం ఎగదన్నుకొని వస్తుంటే అన్నవాహిక లోపలుండే సున్నితమైన పొర దెబ్బతింటుంది. క్రమంగా ఇది జీర్ణాశయంలో ఉండే పైపొర మాదిరిగానూ మారిపోతుంది (బ్యారెట్స్‌ ఈసోఫేగస్‌). దీంతో క్యాన్సర్‌ ముప్పూ పెరుగుతుంది. జీర్ణాశయంలోని జిగురుపొరలు క్షీణించటం (అట్రోఫిక్‌ గ్యాస్ట్రయిటిస్‌) వల్ల జీర్ణాశయ క్యాన్సర్లు తలెత్తొచ్చు. జీర్ణాశయంలో క్యాన్సర్‌ ఉంటే కడుపునొప్పి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ కడుపునొప్పి అనేది తీవ్రదశలోనే కనబడుతుంది. అప్పటికే క్యాన్సర్‌ బాగా ముదిరిపోయి ఉంటుంది. అందువల్ల ఒక వయసు వచ్చాక ఎండోస్కోపీ చేసి జీర్ణాశయాన్ని క్షుణ్నంగా పరిశీలించటం మంచిది. దీంతో క్యాన్సర్‌ను తొలిదశలోనే పట్టుకోవచ్చు. క్యాన్సర్‌ అక్కడికే పరిమితమైతే ఈఎస్‌డీ (ఎండోస్కోపిక్‌ సబ్‌మ్యూకోజల్‌ డిసెక్షన్‌) ద్వారా తేలికగా తొలగించొచ్చు. 
* వృద్ధుల్లో చాలామందిలో పెద్దపేగు గోడలకు పిలకలు (పాలిప్స్‌) ఏర్పడుతుంటాయి. కొందరిలో ఇవి క్యాన్సర్‌గానూ మారొచ్చు. కాబట్టి వీటిని ముందుగానే గుర్తించి తొలగిస్తే క్యాన్సర్‌ తలెత్తకుండా కాపాడుకోవచ్చు. అందుకే విదేశాల్లో వృద్ధులకు తరచూ కొలనోస్కోపీ పరీక్షను తప్పనిసరి చేశారు. ఇందులో పిలకలు ఉన్నట్టు తేలితే వెంటనే వాటిని కూడా తొలగిస్తారు. ఈ పద్ధతి ద్వారా పెద్దపేగు క్యాన్సర్‌ను చాలావరకు నివారించగలిగారు. మనదేశంలో పెద్దఎత్తున ఇలాంటి పరీక్షలు చేయటం సాధ్యం కాకపోవచ్చు గానీ వీలున్నవారు కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవటం మంచిది. ఒకసారి పరీక్ష చేయించుకున్నాక.. బుడిపెలు లేకపోతే ప్రతి మూడేళ్లకు ఒకసారి, బుడిపెలుంటే ప్రతి సంవత్సరం దీన్ని చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా రొమ్ము, గర్భాశయ ముఖద్వార, పెద్దపేగు క్యాన్సర్లుంటే చిన్న వయసులోనే కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవటం మంచిది.
ఇవీ.. క్యాన్సర్‌ హెచ్చరికలు
1. ముద్ద సరిగా మింగలేకపోవటం. 
2. ఆకలి తగ్గటం 
3. కడుపునొప్పి 
4. బరువు తగ్గటం 
5. అజీర్ణం 
6. మలవిసర్జనలో మార్పులు 
7. మలంలో రక్తం పడటం

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list