MohanPublications Print Books Online store clik Here Devullu.com

సమాధి మందిరమే... సమాధానం-Venkaya Swamy, Devotees, వెంకయ్య స్వామి, భక్తులు


సమాధి మందిరమే... సమాధానం
పుణ్య తీర్థం
∙వెంకయ్యస్వామివారు నారాయణుడి అంశగా భక్తులు భావిస్తుంటారు. అందుకే ప్రతి సంవత్సరం వేంకటేశ్వర స్వామికి జరిపినట్లుగా ఆరాధనోత్సవాల పేరిట బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ∙18వ తేదీన ప్రారంభమైన సర్వభూపాల వాహనసేవతో ఆరంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 22న అశ్వవాహన సేవ, పెద్దశేషవాహనసేవ ∙23న సింహవాహనసేవ, గరుడ వాహనసేవ ∙24న రథోత్సవం, తెప్పోత్సవంతో ముగుస్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ ఆరాధనోత్సవాలకు భక్తులు తరలి వస్తారు.
గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమం ప్రశాంతతకు నిలయంగా, భక్తుల కష్టాలు తీర్చే ఆశ్రమంగా వెలుగొందుతుంది. ఒకప్పుడు సాధారణ కుగ్రామంగా ఉన్న గొలగమూడి, నేడు స్వామి వారు నడియాడిన పుణ్యభూమిగా వెలుగొందుతూ ఇతర రాష్ట్రాల్లో కూడా ఖ్యాతి గడించింది. స్వామివారు గొలగమూడి వచ్చిన సమయంలో రాకపోకలు కూడా లేని అటవీప్రాంతంగా ఉండేది ఇక్కడి వాతావరణం. స్వామి ఇక్కడ చిన్న కుటీరం నిర్మించుకుని నివసిస్తూ నిత్యం ధుని వెలిగించి ధ్యానం చేస్తుండేవారు. కాలక్రమేణా గొలగమూడి ఆశ్రమం ఖ్యాతి గణనీయంగా పెరిగింది. నిత్యాన్నదానం కోసం 1000 మందికి పైగా ఏకకాలంలో భోజనం చేయడానికి భవనాన్ని నిర్మించారు. 145 గదులతో అన్ని వసతులతో కూడిన కాటేజీలను, కల్యాణ మండపాలను నిర్మించారు. వీటితోపాటు 2015లో కోటి వ్యయంతో 410 మంది పిల్లలకు విద్య, ఉచిత వసతి కల్పించేలా బడిని నిర్వహిస్తున్నారు.
స్వామివారి చరితామృతం
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు అనే చిన్న గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ, పెంచలనాయుడు పుణ్యదంపతులకు స్వామివారు జన్మించారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో వెంకయ్యస్వామి చిన్నతనంలో కుటుంబపోషణకోసం కూలిపనులకు వెళ్లేవారు. దయ, కరుణలతో ఉంటూ పశుపక్ష్యాదులపట్ల ప్రేమ చూపుతుండేవారు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఒకసారి తీవ్రజ్వరం రావడంతో స్వామి సమీపంలోని అడవికి వెళ్లిపోయారు. ఎప్పుడైనా ఊళ్లోకి రావడం, మిగిలిన సమయం అడవుల్లో ఉంటుండడంతో వెంకయ్యస్వామికి మతిభ్రమించిందని భావించేవారు. అలా కాలక్రమంలో పెంచలకోన, తిరుపతి, శ్రీశైలం అడవుల్లో యోగసాధన చేశారు. పెంచలకోన అడవుల్లో స్వామివారికి కణ్వమహర్షి అనుగ్రహం లభించిందని. ఆ తర్వాత స్వామి ఏది చెబితే అది జరుగుతున్నట్లు ప్రచారం జరగడంతో ఆయనను భగత్‌స్వరూపంగా భక్తులు భావించారు. వివిధ ప్రాంతాల్లో జనారణ్యంలో ఉన్న సమయంలో స్వామివారి మహిమలు అందరికీ తెలిసేవి. అలా కాలక్రమేణా స్వామివారు ఎక్కడికి వెళ్లినా ధునివేసి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేవారు. స్వామివారు యోగసాధన చేసే క్రమంలో తమిళనాడులోని కంచి, చెన్నై నగరంలోనే ఎక్కువ కాలం ఉన్నారు. తర్వాత పెనుబద్వేలు తిప్ప, కోటితీర్థం గ్రామంలో కొంతకాలం నివసించారు. ప్రశాంతంగా భగవ ధ్యానం చేసుకోవడానికి గొలగమూడి అను వుగా ఉందని భావించి గ్రామానికి వచ్చారు. 
సృష్టి చీటీలు.. నూలు దారాలు..
గొలగమూడిలో స్వామివారి రాకతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ప్రజలు వ్యాధుల బారిన పడిన సందర్భాల్లో తమ బాధలు తీర్చాలని స్వామివద్దకు వచ్చేవారు. అలా వచ్చేవారికి స్వామివారే వడికిన నూలుదారాన్ని రక్షాదారంగా ఇస్తూ ఉండేవారు. అలాగే భక్తులకు అభయమిస్తూ తన వేలిముద్రలు వేసి చీటీలను అందజేసేవారు. ఇవి కాలక్రమంలో సృష్టిచీటీలుగా ప్రసిద్ధి చెందాయి. స్వామివారు పూర్తి నిరాడంబర జీవితం గడిపేవారు. సమాజహితానికి 22 సూక్తులను బోధించారు. అందరినీ సమానంగా చూసుకుంటే దేవుడు కనిపిస్తుండ్లాయ్యా.. అని స్వామివారు తరచూ అంటుండేవారు. ఆశ్రమంలో కులమతాలకు తావులేదు. మీరు వెళ్లిపోతే ఆశ్రమం పరిస్థితి ఏంటని భక్తులు వేదనతో అడిగినప్పుడు ఎక్కడికయ్యా పోయేది సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదయ్యా అని సమాధానం చెప్పి, 1982 ఆగష్టు 24న యోగనిద్రకు చేరుకున్నారు. అలా స్వామివారి సమాధి మందిరం నేడు భక్తులకు సమాధాన మందిరంగా మారింది.
వందకు పైగా మందిరాలు
రాష్ట్రంలో 100కు పైగా భగవాన్‌ శ్రీ వెంకయ్య స్వామి ఆలయాల నిర్మాణం జరిగింది. నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం తదితర జిల్లాల్లో ఆలయాలు ఉన్నాయి. అక్కడ కూడా ఆరాధనలు జరుగుతుంటాయి. ఆశ్రమంలో నిత్యాన్నదానం బాగా ప్రసిద్ధి. నిత్యాన్నదానం ఎక్కువగా జరిగే క్షేత్రంగా స్వామివారికి ఆశ్రమానికి పేరుంది. కూరగాయలు మొదలుకొని పప్పుదినుసుల వరకు అన్నీ ఆశ్రమానికి విరాళాలుగా అందుతుంటాయి. ఆరాధన మహోత్సవాలకు రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భక్తులు హాజరవుతారు.
ఇలా చేరుకోవచ్చు
నెల్లూరు ఆత్మకూరు బస్టాండు నుంచి, రైల్వేస్టేషన్‌ నుంచి 11 కి.మీ దూరంలో గొలగమూడి ఉంది. ఆర్టీసీ బస్టాండు నుంచి నేరుగా గొలగమూడికి బస్సు సౌకర్యం ఉంది. ఆరాధన మహోత్సవాల నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.అలాగే నెల్లూరు నగరంలో ప్రసిద్ధ రంగనాథస్వామి దేవాలయం, మూలాపేటలో శివాలయం దర్శనీయ స్థలాలు. నెల్లూరు నగరానికి 10 కి.మీ దూరంలో జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి దేవస్థానం ఉంది. అక్కడికి సమీపంలోనే వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. బుచ్చిరెడ్డిపాళెం వెళ్లే మార్గంలో ఈ ఆలయాలున్నాయి.#వెంకయ్యస్వామివారు
– కాట్రపాటి కిషోర్, సాక్షి, నెల్లూరు


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list