చెడును నివారించు నేన్తం..
‘‘వల్ తకుమ్ మిన్‌కుమ్ ఉమ్మతుయి యద్‌ఊన ఇలల్ ఖైరి వయామురూన బిల్ మారూఫి వయన్ హౌన అనిల్‌మున్‌కరి వ ఉలాయిక హుముల్ ముఫ్‌లిహూన్’’ (దివ్య ఖుర్‌ఆన్ ఆలి ఇమ్రాన్: 104)
‘‘మీలో మంచి వైపునకు పిలిచేవారూ, మేలు చేయండి అని అజ్ఞాపించేవారూ, చెడు నుంచి వారించేవారూ.. కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు’’ అని అర్థం.
దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ వాక్యం.. విశ్వాసుల ఉనికి అసలు ఉద్దేశం ఏమిటో, వారి జీవిత లక్ష్యం ఏమిటో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నేడు సమాజంలో ప్రబలుతున్న చెడును రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. మంచిని మరింత పెంపొందించడానికీ, సత్కార్యాలు వృద్ధి చేయడానికీ ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నం కొనసాగాలి.
నేటి సమాజంలో కొందరు చెడును.. చెడుగా భావించడం లేదు. ఇది సరైనది కాదు. చెడును తుదముట్టించడానికి ప్రయత్నించేవారే సాఫల్యం పొందుతారు. సమాజంలో చెడును రూపుమాపి.. మంచిని పెంచడానికి ప్రయత్నించని వారి గురించి మహా ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా సెలవిచ్చారు: ‘దైవాజ్ఞలను ఉల్లంఘిస్తున్న వారినీ, ఆ ఉల్లంఘిస్తున్నవారిని విమర్శించని వారినీ.. రెండంతస్తుల ఓడలో ప్రయాణం చేసే ప్రయాణికులతో పోల్చవచ్చు. కొందరు పై అంతస్తులో, మరికొందరు కింది అంతస్తులో కూర్చున్నారు. కింది అంతస్తులో ఉన్నవాళ్లు బొక్కెనతో సముద్రం నుంచి నీళ్లు తోడుకోవడానికి.. పై అంతస్తుకు వెళ్తుండేవాళ్లు. నీళ్ల కోసం వాళ్లు పైకి వెళ్లినప్పుడల్లా.. అక్కడున్న వారికి ఇబ్బంది కలిగేది. పైకి ఎందుకొచ్చారంటూ విసుక్కునేవాళ్లు. వారి మాటలు పడలేక.. కింది అంతస్తులో ఉన్న వాళ్లు ఒక గొడ్డలి తీసుకొని.. ఓడ అడుగున ఉన్న ఒక పలకను తీసివేయడం ప్రారంభించారు. అది చూసి పై అంతస్తులో ఉన్నవాళ్లు.. ‘‘ఇదేమిటి ఇలా చేస్తున్నారు?’ అని అడిగారు. దానికి కింది అంతస్తు వాళ్లు.. ‘‘మాకు నీళ్లు కావాలి. నీళ్ల కోసం మాటిమాటికీ పైకి వస్తుంటే మీకు ఇబ్బంది కలుగుతోంది కదా! అందుకని మేము ఓడ పలకను ఊడదీసి.. నీళ్లు తీసుకోదలిచాము’’ అన్నారు.
ఓడ పలకను ఊడదీయకుండా కింది అంతస్తువాళ్లను అడ్డుకోగలిగితేనే.. వాళ్లూ క్షేమంగా ఉంటారు. వీళ్లనూ రక్షించిన వాళ్లు అవుతారు. అలా అడ్డుకోకపోతే.. ఇద్దరూ మునిగిపోతారు. (బుఖారి)
ఈ ప్రవచనం ద్వారా అంతిమ ప్రవక్త (స).. ‘‘ప్రతి ఒక్కరూ మంచి కోసం పాటుపడాలి. చెడు దారిలో ఉన్న వారిని వారించే ప్రయత్నం చేయాలి. అలాంటి సద్బుద్ధి అందరిలో కలగాలి’’ అని తెలియజేశారు.
ఫ మహమ్మద్ వహీదుద్దీన్, సిద్దిపేట
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565