MohanPublications Print Books Online store clik Here Devullu.com

తలంబ్రాలు_Talambralu





చూచువారలకు చూడముచ్చట..
          తలంబ్రాలు!!

తెలుగువారి పెళ్ళిలో అందరినీ అత్యంత ఉత్సాహభరితం చేసే ఘట్టం తలంబ్రాలు! దీనినే అక్షతారోపణం అని కూడా అంటారు. వధూవరులు పోటీపడి తలంబ్రాలు పోసుకుంటుంటే ఇరుపక్షాలవారూ ముఖ్యంగా కుర్రకారు అమ్మాయికీ అబ్బాయికీ చేతనైనంత సాయమందిస్తుంటారు. దానికి తగినట్టు ‘సీతమ్మ పెళ్లికూతురాయనే.. మా రామయ్య పెళ్లికొడుకాయెనే’ అంటూ అలనాటి ‘సీతారామ కల్యాణం’ చిత్రంలోని నేపథ్య సంగీతాన్ని భజంత్రీలందిస్తుంటే వధూవరులతోపాటు వివాహితులు, అవివాహితులు కూడా ఓ విధమైన పులకరింతకు గురవుతారు.. కొత్తగా ఎన్నిపాటలు వచ్చినా పైన చెప్పిన గీతం నిత్యనూతనమై దశాబ్దాల తరబడి తెలుగువారి పెళ్లిపందిరికి శోభనిస్తోంది. తలంబ్రాల ఘట్టం వివాహితులకు తమ కల్యాణవైభోగం గుర్తుకు తెస్తుంటే అవివాహితులు కాబోయే భాగస్వామిని ­హించుకుంటూ పరవశిస్తుంటారు. ఉత్సాహానికి ఉత్సాహం.. వినోదానికి వినోదం.. సంప్రదాయానికి సంప్రదాయం త్రివేణి సంగమంలా వన్నెచిన్నెలు సమకూర్చి ఈ ఘట్టాన్ని మనోహరంగా మారుస్తోంది.
ప్రాలు అంటే బియ్యం. తలన్‌ + ప్రాలు= తలంబ్రాలు.. తలమీద పోసుకునే బియ్యం. వధూవరులు పరస్పరం తలమీద పోసుకునే బియ్యం అన్నమాట. మంగళ సంకేతంగా ఇందులో పసుపు కలుస్తుంది. అది అతుక్కుని ఉండేందుకు కొంచెం నెయ్యి కలుపుతారు.
ఆదర్శ దంపతులంటే మన మనసులో మొదట మెదిలేది సీతారాములే! ఆ తర్వాతే ఇంకెవరైనా!! ఆ సీతారాములు తమ కల్యాణ మహోత్సవంలో తలంబ్రాలుగా ముత్యాలు పోసుకున్నారట. సీతమ్మ దోసిట్లో కెంపుల్లా భాసించిన ముత్యాలు రామయ్య తలపైనుంచి దేహంమీదకు జారేటప్పుడు నీలాల్లా శోభిల్లాయట. ఎంతగొప్ప భావన! ముత్యాల అసలు రంగు తెలుపు. సీతమ్మ దేహచ్ఛాయకు అనుగుణంగా ఆమె చేతుల్లో ఉన్నప్పుడు అవి కెంపుల్లా ప్రతిఫలించాయి. అనంతరం రామయ్య శిరోమండలంమీద నుంచి కిందికి జారేటప్పుడు ఆయన దేహచ్ఛాయను ప్రతిఫలిస్తూ నీలంగా మారాయట. ఆయన నీలమేఘశ్యాముడు కదా?అదీ అందులోని కవి చమత్కారం. మనం చాలా శుభలేఖలలో చూచే ‘జానక్యా కమలాంజలే పుటే..’ శ్లోకం చెప్పేది ఈ వర్ణన గురించే!

తలంబ్రాల వేళ ముందుగా వరుడు పాలతో వధువు అరచేతులను తుడుస్తాడు. అనంతరం ఓ ఎండుకొబ్బరి చిప్పతో రెండుసార్లు ఆమె దోసిట పసుపుబియ్యాన్ని పోస్తాడు. తర్వాత ఆ బియ్యాన్ని పాలతో రెండుసార్లు ప్రోక్షిస్తాడు. అదేవిధంగా వరుడి చేతిలో పసుపుబియ్యాన్ని పోసి వధువు దోసిలిపై వరుడిదోసిలి ఉంచి మంత్రాలు చదువుతాడు పురోహితుడు. క్లుప్తంగా ఆ మంత్రాల సారాంశం ఏమంటే- దానధర్మాలతో పుణ్యం వృద్ధిపొందాలి. శాంతి, పుష్టి, తుష్టి వృద్ధి కలగాలి. విఘ్నాలు తొలగాలి. ఆయుష్షు, ఆరోగ్యం కలగాలి.. క్షేమం, శుభం కలగాలి. మన దాంపత్యం సఖ్యతగా ఉంటూ వృద్ధిపొందాలి.. సంతానాభివృద్ధి కలగాలి. పశు సంపదలు, పాడిపంటలతో కలకాలం వర్థిల్లాలి. ఇలా మంత్రాలు చెప్పి వధూవరులు ఒకరిపై ఒకరు మూడేసిసార్లు తలంబ్రాలు పోసుకునేలా సహకరిస్తాడు పురోహితుడు. ఆ తర్వాత వారు పరస్పరం యథాశక్తి ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ తాము వినోదిస్తూ అందరికీ వినోదం పంచుతారు.

ఆధునిక కాలంలో ఈ ఘట్టాన్ని విశేషంగా కొనసాగించడం, వినోదించడం గమనార్హం. మన పెళ్లి మంత్రాలలో, ఆచారవ్యవహారాలలో దేన్ని పరిశీలించినా నూతన దంపతులు సంతోష సౌభాగ్యాలతో కలకాలం వర్థిల్లాలనే ఆకాంక్ష అంతస్సూత్రంగా ఇమిడి ఉందన్నది మనం అందరం గుర్తించాలి.                           - చంద్ర ప్రతాప్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list