వర్ణశోభితలింగం
పుణ్య తీర్థం
పంచారామక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ప్రాచీన దేవాలయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి ప్రాంతంలోని శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయం. శాపగ్రస్థుడైన చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి శాపవిముక్తుడైనట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. బోళాశంకరుడు ఆ రాక్షసుడి కోరికపై తన ఉపాసన లింగంలో ప్రాణాన్ని దాచి దానిని కంఠాభరణంగా పొందేలా వరం ఇచ్చాడు. దానితోబాటు శివుడి కుమారుడి తప్ప మరెవరి చేతిలోనూ చావని విధంగా వరం పొందాడు తారకుడు. వరబలంతో తారకుడు దేవతలపై దండెత్తాడు. ఇంద్రుణ్ణి ఓడించి సింహాసనాన్ని అధిష్టించాడు. తారకుడి దుర్మార్గాలను భరించలేక దేవతలు కుమారస్వామిని వేడుకున్నారు. కుమారస్వామి తారకాసురుడితో యుద్ధానికి దిగాడు. శక్తిమంతమైన అస్త్రంతో తారకుడి కంఠంలోని ఉపాసన లింగాన్ని ముక్కలు చేశాడు. అది ఐదు ముక్కలుగా విడిపోయి ఐదు ప్రాంతాలలో పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలోనిదే శ్రీ ఉమాసోమేశ్వర జనార్దనస్వామి వారి శ్రీసోమారామం.
వర్ణాలు మార్చే సోమేశ్వర లింగం
ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా శ్రీసోమేశ్వర లింగానికి వర్ణాలు మారే ప్రత్యేకత ఉంది. పౌర్ణమి రోజు శ్వేత వర్ణంలోకి మారిన శివలింగం క్రమేపీ అమావాస్య నాటికి రంగుమారి గో««ధుమరంగు... అక్కడినుంచి నలుపు వర్ణంలోకి మారుపోతుంది. మళ్లీ అమావాస్య నుంచి నలుపు వర్ణం ఉన్న శివలింగం క్రమేపీ పౌర్ణమి నాటికి శ్వేత వర్ణంలోకి మారుతుంది. వృద్ధిక్షయలున్న చంద్రుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల చంద్రునిలోని మార్పులే శివలింగంలో ప్రతిబింబిస్తుంటాయని చెబుతారు.
ఆలయం ప్రత్యేకత
సహజంగా శివాలయాల్లో పార్వతీ, అన్నపూర్ణదేవి విగ్రహాలు శివునికి ఇరువైపులా ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలో శివుని ఆలయంపైన అన్నపూర్ణ దేవి ఉండటం ప్రత్యేకం. ఆలయం ఎదురుగా ఉన్న సోమగుండ చెరువు వద్ద గల రాతిస్తంభంపై నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే సాధారణంగా శివుడు కనిపించాలి.
కానీ అన్నపూర్ణమ్మ కనిపిస్తుంది. ఈ ఆలయం పురాణ కాలం నాటిది. 9వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య భీముడితో సహా ఎందరో రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. సాధారణ సోమవారాల్లో శివుని దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రాగా కార్తీక మాసంలో భక్తులు స్వామి దర్శనం కోసం పోటెత్తు్తతారు. ఆ రోజుల్లో ఆలయంలో కార్తీక నోములు, స్వామి వారికి అభిషేకాలు చేసుకునే వారి సంఖ్య భారీగా ఉంటుంది. పంచారామక్షేత్రాల దర్శనంలో భాగంగా అయితే గాని స్వామి వారి దర్శనం కోసం అయితే గాని భక్తులు హైదరాబాద్, గుంటూరు, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి యాత్ర బస్సులు, ఇతర వాహనాల ద్వారా వస్తుంటారు. ముఖ్యంగా పంచారామ క్షేత్రాలను దర్శించేవారు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఇక్కడ స్వామికి నిత్యం ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తుంటారు.
క్షేత్ర పాలకుడు జనార్దనస్వామి
ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు శ్రీజనార్దనస్వామి వారు. అందుచేత ఈ ఆలయంలో వివాహాలు చేసుకుంటే వైవాహిక జీవితం శుభప్రదంగా సాగుతుందన్న నమ్మకంతో ఏటా ఈ ఆలయంలో అనేకమంది వివాహం చేసుకుంటారు.
ఈ కేత్రంలో దర్శించాల్సిన ఇతర ఆలయాలు
ఈ క్షేత్రంలో నవగ్రహాలయం, ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, సూర్యాలయం కూడా ఉన్నాయి.
ఈ ఆలయానికి ఇలా చేరాలి
హైదరాబాద్ విజయవాడ, గుంటూరు, విశాఖ, విజయనగరం, రాజమండ్రి నుంచి వచ్చే భక్తులు బస్సు ద్వారా అయితే భీమవరం బస్సుస్టేషనుకు చేరి అక్కడ నుంచి కాలినడక ద్వారా లేదా ఆటోల ద్వారా గునుపూడి చేరుకుని ఆలయం వద్ద చేరాలి. రైలు ద్వారా అయితే భీమవరం జంక్షన్ స్టేషన్‌లో దిగి ఆటోలో లేదా కాలినడక ఆలయానికి చేరుకోవచ్చును.
– బి. రామాంజనేయులు, సాక్షి, భీమవరం, ప్రకాశం చౌక్
టాగ్లు: Janardana Swamy Temple, Bhimavaram, జనార్దన స్వామి ఆలయం, భీమవరం
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565