MohanPublications Print Books Online store clik Here Devullu.com

enki patalu యెంకి పాటలు



              యెంకి పాటలు

          1. ముద్దుల నా యెంకి
  
   గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
      కూకుండనీదురా కూసింతసేపు !
    ...............................

      నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,
      యెల్లి మాటాడిస్తె యిసిరి కొడతాదీ !
   గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
    ...............................

      కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది,
      దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ !
   గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
    ...............................

      యీడుండమంటాది యిలు దూరి పోతాది,
      యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ !
   గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
    ...............................

      మందొ మాకో యెట్టి మరిగించినాదీ,
      పల్లకుందామంటె పాణమాగదురా !
   గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ 

    ...............................

                2.వొనలచ్చిమి
  

    జాము రేతిరి యేళ జడుపు గిడుపూ మాని
    సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె
                          మెల్లంగ వస్తాది నా యెంకీ !
                          సల్లంగ వస్తాది నా యెంకీ !
 
    పచ్చన్ని సేలోకి పండు యెన్నెల్లోన
    నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటె
                          వొయ్యారమొలికించు నా యెంకీ !
                          వొనలచ్చి మనిపించు నా యెంకీ !

    యెంకి వస్తాదాని యెదురూగ నేబోయి
    గట్టుమీదా దాని కంటి కాపడగానె
                          కాలు కదపాలేదు నా యెంకీ !
                          కరిగి నీరౌతాది నా యెంకీ !

    మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి
    గోనెపట్టా యేసి గొంగడీ పైనేసి
                          కూలాసగుంటాది నా యెంకీ !
                          కులుకు సూపెడతాది నా యెంకీ !

    యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి
    మల్లీ యెప్పటల్లె తెల్లారబోతుంటె
                          సెందురుణ్ణీ తిట్టు నా యెంకీ !
                          సూరియుణ్ణీ తిట్టు నా యెంకీ !

            3. యెంకి ముచ్చట్లు


     యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
     యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు ?

                 దొడ్డి తోవ కళ్ళె తొంగి సూడంగానె
                 'తోటకాడే వుండు తొరగొస్త' నంటాది !

    యెన్నాని సెప్పేది.........

                 యెంకి రాలేదాని యేటొ సూత్తావుంటె
                 యెనకాలగా వచ్చి 'యెవురు వో'రంటాది !

    యెన్నాని సెప్పేది.......

                 'సిట్టీ సేబా'సాని నిట్టూరమేత్తుంటె
                 మాటా యినబడనట్టు మరియేటొ సెపుతాది !

    యెన్నాని సెప్పేది.......

                 'కోడి గూసేసరికి కొంపకెల్లాలి, నీ
                 కోసరమె సెపుతాను కోపమొ'ద్దంటాది !

    యెన్నాని సెప్పేది.....

                 'యెంత సేపున్నాను యిడిసి పెట్టాలేవు
                 తగువోళ్ళలో మనకి తలవొంపు'లంటాది !

    యెన్నాని సెప్పేది.....

    యెనకెనక సూత్తానె యెల్లుతావుంటాది,
    యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు
    యేటి సెప్పేది నా యెంకి ముచ్చట్లు ?

        4.యెంకితో తిరపతి

     యెంకీ, నాతోటీ రాయే !
                   మన
                   యెంకటేశరుణ్ణి యెల్లీ సూసొద్దాము !


          25. పంటసేలకే పయనం

      యీయేపు నోయావు ఆయేపు నోయావు
      జోడావులకు నడుమ నాయెంకి,
                                      యీడు
                 జోడుగా నిలుసుండె నాయెంకి,
                                       ఆట
                 లాడతా కలిసుంటె నాయెంకి,
                                      నన్నె
                 సూడు మన్నట్టుండు నాయెంకి !

    ఈయేపు నోయేరు ఆయేపు నోయేరు
    యేళ్ళ రెంటికి నడుమ నాయెంకి
                                      తలను
                  పాలకడవెత్తుకొని నాయెంకి,
                                      సేత
                  పూలు పుణుకుకొంట నాయెంకి,
                                      పూల
                  బూరవోయిస్తానె నాయెంకి,
                                      నన్నె
                  పోలుండుమంటాది నాయెంకి !
     ఈకాడ నోకొండ ఆకాడ నోకొండ
     కొండాకోనల నడుమ నాయెంకి,
                                      పాల
                  కుండ దించుకోని నాయెంకి,
                                      గుడికి
                  దండ మెడతావుంటె నాయెంకి,
                                      సూడ
                  రెండే కళ్ళనిపించు నాయెంకి !

     ఈసాయ నోసేను ఆసాయనో సేను
     సేలరెంటికి నడుమ నాయెంకి,
                                       పాలు
                  పూలు నా కందిచ్చి నాయెంకి,
                                       'సొమ్ము
                  లేల మన'కంటాది నాయెంకి,
                                        గుండె 
                  జాలి పుట్టిస్తాది నాయెంకి !

       26. సాటేలా ?
   
      సాటేలా ? నీకు మాటేలా ? సిన్నతనమేలా ? సిగ్గేలా ?

              ఆ సీమ యీ సీమ
              అందరందాలు
              తిన్నంగ నినుసూసె
              దిద్దుకుంటారు !
                           
                      సాటేలా ? నీకు మాటేలా ?......

              ముందు మన పాపణ్ణి
              కింద దిగనీరు,
              యెంకి కో వంటారు
              యెత్తుకుంటారు !


       3.అణకువ

     ఎంతెంత దూరాన
     ఎందరిలొ నే నున్న-

          సూటిగా నావెనుక చూసె నా యెంకి
          చురికి నేతనవైపు తిరుగవలసినదే !

      ఏటవల నేబోయి
      యిల్లుచేరని రేయి-

          ఏటదీపము పళ్ళ నిడినదా యెంకి
          వెలుగులో నేనచట మొలవవలసినదే !

      కథ నడుమ మాజోడు
      నిదుర దోగిన నాడు-

          కథ కొస తళుకుగోరి కల గనెన యెంకి
          కలను నే జొరి కథలు తెలుపవలసినదే !

       31.ముసుముసులు

     ఎంకి జలకపు పలుకు లెచట నిడుకొందు ?
     ఎంతదాచిన చెణుకు లెగురు నిందందు !

          మడుగున జలకమాడ
          మానీడ లలలపై
          గోరంత మా నటన
          కొండంత జేసెనట !       ఎంకి జలకపు....

          నీలపై మా రహ
          స్యాలగొని తీరతీ
          రాల పరుగిడి, మమ్ము,
          గాలె యెగతాళియట !      ఎంకి జలకపు....

          మెరుపు మేఘుల మించు
          సరసులను మముగాంచి
          ఆకసమెవులికి మడు
          గడుగున పడినదంట !     ఎంకి జలకపు....

          రతనాల వేదికను
          రవల చాందిని కింద
          ముత్తెపు తలంబ్రాలు
          ముసిముసుల పెళ్ళంట !      ఎంకి జలకపు...

       32.దీపసుందరి

       దీపసుందరి తోటి సాపత్యమా నాకు
       దీప సుకుమారి దరిదాపు చనగలనా ?

              రంగుకోక ధరించి
              రాజురాక తపించు
              నీడలను తెలివి విడ
              నాడి కననుంకించు !     దీపసుందరి....

              రెప్పవాల్పక మింట
              లెక్కించు చుక్కలను
              అలికిడికి వులికిపడు
              నలుదెసల విరగబడు !   దీపసుందరి...

              నిలువంత చెవిజేసి
              పిలుపువిన నోరగిలు
              కటి బిగించును శిరసు
              కానిలెమ్మని విసురు !     దీపసుందరి...

              కెవ్వుమని కిందబడు
              నవ్వు నాలుక సాచు
              'రాజా'యనుచు నెగిరి
              'రారా' యనుచు కునుకు !    దీపసుందరి...

              వేదన సుఖానమను
              వెలుగుచు శుభాన చను !    దీపసుందరి....

         33.జాలి

       రాలురేలును పూలె జాలి నొలికెడురా ?
       వేలుపే నీకంటె చాల సులభుడురా !

            నా యలికిడి నేనె
            రేయి కొండలనడల
            శిఖర శిఖరమ్ము నీ
            ముఖమె చూపునురా !     రాలు రేలును...

            ఒక్కననె మళ్ళగని
            చుక్కల మొయిళ్ళగొని
            నీ కళ్ళె నీ నిలువె
            నింగి రాయునురా !       రాలు రేలును...

            పూలతలె నా వెతల
            పోలిచి మెలికెలారి
            వొళ్ళు ఝల్లన నిన్నె
            కళ్ళ గట్టునురా !       రాలు రేలును....

            ఏమియడుగకె గుడిని
            సామికడ నే నిలిచి
            హారతీయగ వెలిగె
            మూర్తి నీదేరా !!      రాలు రేలును...

            వుసురుల పసలు చెల్లి
            ఒంటినై యుంటగని !    రాలు రేలును...

          34.మరపు

        ఏటికోయి మనచెలిమి-నీట చిత్తరవుల కలిమి ?
        కలయె తెలుపు మనమనసుల కలయికల నిజానిజాల !

               అలక నలసి నేను కునుక
               తెలివిని నను నీవు చెనక-
               కనకె నీ సరాగసరణి
               కల రెక్కల పరతుదివిని !      ఏటికోయి....

               కనులుకునుక బొమలుకులుకు
               నని నను తనివారక నెదు
               యెరుగవింత కలలోనా
               మరుగుమరులు తిరుగుతెరలు !     ఏటికోయి....

               నీ యెద వూయల లీయెడ
               పోయెద కల పలుపోకల-
               కలలో కలగందు నొకట
               తెలివి నిదుర లచట నచట !     ఏటికోయి....

               యీ నందనమును నిను నను
               ఆనంద సుఖమున మరతు !
               కలలో నను చూతువేమొ
               కత్తికెరను జేతువేమొ !         ఏటికోయి....


            35.జయభేరి
           -------------

       కళలీను వనమె వెల-తెలలేల నోయీ ?
       వనలక్ష్మి కనగాచు-కొను దినములేమో !

       వుండుండి పూలటుల-వులికె నేమోయీ ?
       కడుపులో పాప చ-క్కలిగింతలేమో !

       చిలుక పావురము లటు-చిందులేలోయీ ?
       ఆప్తమిత్రుని రాక కాత్రమో యేమో !

       వురుములు మెరుపులాయె-దరికి రావోయీ ?
       జయభేరితో వెలుగె దయసేయునేమో !

             36.శివ శివా

     తనివితీరలేదే ఆ తరుణ మాగిపోదే !
     కార్తిక దీపాల గంగకలలె కందునే పదేపదే !

            తలకిందుతపసున కాశి
            నిలిచె గంగనను నీ పగ !
            శంకరుడె యెరుగడింత
            సావాసమ్మను నీ వగ !    తనివి...

            నీలను మన వేలు వేలు
            కీలింపగ వెదకు సుకము !
            ననుతాకిన అలయె నిన్ను
            పెనగొన నీ పులక తళుకు !  తనివి...

            నీ కరముల వెలుగు గంగ
            నా శిరమునె అభిషేకము !
            'శివశివా' యనన్గ ప్రజలు
            సిగ్గున మునిగెడు నీ భ్రమ !   తనివి...

            ఉదయమె నా దోయిలి నీ
            వుదక ధారలుంచు రక్తి
            బిందు బిందు కోటి
            సూర్యబింబము లొలికించు శక్తి !   తనివి...

        37.బరిణె

     కలవారిగని అలంకారాలు గొనుట
     పులి బోలదలచి వాతలనింపుకొనుటె !

          ఘనులు తమ సకియలను
          మణులతో కైసేయ
          ఆకులలములె యెంకి
          కాయె నాయిడుసరులు !    కలవారి...

          ఆకుల కులపుసరులె
          వేకనులలో కదిలె
          మెప్పునమెరిసె కనులు
          నిప్పులగురిసె మణులు !    కలవారి....

          పనితనమనగ సఖులు
          పసలేదనగ ఘనులు
          పలువాయి సమరాల
          నలిగె నాకుల సరులె !   కలవారి...
          
          వెలవోని మా సరులు
          నిలువనీడనొసన్గి
          స్వంతమటు దాచెనొక
          వలపు పలుకుల బరిణె !   కలవారి....

          ననుగూడ నటె దాచు
          మని పొగిలె నా యెంకి !    కలవారి....

        38.యెంకితనము

       ఆ చిత్రముకు మెరుగు నీ చక్కదనమే !
       యీ చిత్తమునకు వెలుగు నీ యెంకితనమే !

             కొమ్మనొక చేయూని
             గోవునొక చేయాని
             వేళ్ళు కదిపితివా, నె
             మళ్ళజత దిగియాడ !      ఆ చిత్ర...

             చిలుక, పావురము, నీ
             చే వ్రాల చెంపగొని
             అంత ననుగని, వింత,
             వంత, మీ మువురెగుర !    ఆ చిత్ర...

             కోడె, పసిలేడి, నడి
             కోన నిను పసిగట్టి
             'నేను, నే'నని యురికి
             నినుతాకి కనుమూయ !      ఆ చిత్ర...

             యేట కనుచాటొసగ
             తోట నీడల తెరలు
             నాటి వెన్నెలనావ
             నా,నీ, మరువ నీవ !     ఆ చిత్ర...

        39.చిలుక పలుకు

      ఎకసకె మెవరికి తెలుసు ?
      ఎంకిచిలుక మనుసు గడుసు !      ఎకసకె...

          'పేరంటము పిలిచి తోట
          చూరవిడుతె' యని నేనన-
          చిలుకను పురికొలిపి నన్ను
          'బలిరాజా'యనిపించిన      ఎకసకె...

          గాయపడిన లేగకు నే
          సాయమిడకె సాగిపోవ-
          చిలుకను వుసికొలిపి నన్ను
          'శిబిరాజా' యనిపించిన     ఎకసకె...

          కలలో తన సెలవులేకె
          కానలబడి పోతినేమొ-
          మెలకువగని చిలుక బిలిచి
          'నలరాజా' యనిపించిన     ఎకసకె....

          పూలను గద్దియ నమరించి
          పూలకిరీటము కూరిచి
          'రాజా' యన తానెకోరు
          'రాణీ'తన మనుకొంటిని !    ఎకసకె...

      ఎగతాళియు ఎంతో సొగసు
      ఎంకి చిలుక మనుసె మనుసు !       ఎకసకె...

        4.చెర

      కరములు సిరులు పరుల కారింపనా ?
                                         ఎంకి
      కనులెత్తెనా రాజు గతులెరుగునా ?

           'నారాజు కగుశయ్య
           రేరాజు చేరె'నని
           శయ్య సదురును యెంకి
           చంద్రుగని కనులార్చు !     కరములు సిరులు....

           పానుపున మాజోటి
           పవళింపు భావించు
           వెచ్చవెచ్చని పాన్పు
           వే విధుల లాలించు !       కరములు సిరులు....

           తనను వెన్నెల సోక
           తప్పువలె కోపించు
           'రాజుపస గనురాజు
           రాడ ?' యని తలయూచు !  కరములు సిరులు...

           నేరాక తనుతరలు
           నా రాక గని మరలు
           కళ్ళలో చందురుని
           కైదుగొని నిదురించు !      కరములు సిరులు....

       దూరాల దొర,పై నిగారాల రాజు కీ
       కరములు సిరులు పరుల గారింపనా
                                          ఎంకి
       కనులెత్తెనా రాజె గతులెరుగునా ?

          41.రేవెలుగు

      ఎవరైన యెపుడైన యేవాడనైన
      యింత జాలి గనెర యెంకి చిత్రాలు ?

      మొయిలు జొరె చంద్రుడని
      భయపు మిష నా యెంకి
      పూసెజ్జ నాపజ్జ
      పోగుపడ-ఆరటము !    ఎవరైన యెపుడైన...

      మబ్బు వెలువడు చంద
      మామ గని, తన చీర
      చెరగు మాటిడి నన్ను
      జీరు సిగ్గరితనము !   ఎవరైన యెపుడైన....

      'కళ్ళ ములుకులు దించె
      కంఠపాశము లేసె
      కిరణాలు నువులేని
      తరి' యనెడు-ఆకులము !  ఎవరైన యెపుడైన...

      'దృష్టి'తొలగగ తనను
      తిలకముగ నేగొనిన
      నెలవంక నా రాజు
      తులయె యను-అతిశయము !  ఎవరైన యెపుడైన...

      రేవెలుగు గీవెలుగు
      నా వెనుకె యనుమతము !   ఎవరైన యెపుడైన...

       42.ఉయ్యాల

     ఎంకి వూగెను కొమ్మ వుయ్యాలా ! చంద్ర
     వంక వూగెను బొమ్మవుయ్యాలా !

          ఏటిపైకొమ్మ నూ
          యెల యెంకి అమరించె
          నీట బొమ్మవుయ్యాల
          నెలవంక వెలయించె        ..ఎంకి...

          ఎంకి వన్నెలచీర
          నెగిరె వెన్నెల పూలు
          ఎండుటాకుల గొలుసు
          వెండితీగలు చేరె !       ...ఎంకి...

          సికపూలు, ముంగురులు
          చిరుమువల మొలనూలు
          ఒకచే సదురుకొనుచు
          ఒయ్యారమే వూగె !         ...ఎంకి....

          తీగల నడుమ నూగె
          దీపమై, తిలకమై,
          పీఠమై-ఎంకికి-కి
          రీటమై,నెలవంక !      ..ఎంకి....

          మున్నీటి యాజోడె
          ఆనాటి కీనాడు !        ...ఎంకి....

      43.తపస్సు

      "సాగరుని సల్లాపమా అల
      చందురుని యుల్లాసమా సిక
      తాతలాల విలాసమా
      ఆ పగిది బంధించు నీ కనుపాప నెయ్యది తాపసీ ?"

      "కలదు నా పాలకుని కంటను
      కడలి, కల దీ చందమామయు
      అలల తలపై నాట్యమాడుదు
      రచట దంపతు లెవ్వరో ?

      ఆట కలరును సాగరుండును
      అలల ననుకూలముగ నడుపును,
      దంపతులు నింపుదు రతని రత
      నంపు కాంతుల కాన్కలన్ !

      బాలభక్తులవలె, నిలింపుల
      లీల, శంపాలతికయన,గో
      పాలు దరహాసాంచలమువలె
      నటన సలిపిరి చిటుకలో !

      ఆటలాడెడు నా సురూపమె
      కోటి గుణితంబయ్యె త్రుటిలో
      పాలకుడు తనుమరచి పరవశులీల
      కన్నులు మూయగన్ !

      సాగరుని సల్లాపమేలా
      చందురుని యుల్లాసమేలా
      సైకతంపు విలాసమేలా
      లోకమిక నేలా ?"

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list