MohanPublications Print Books Online store clik Here Devullu.com

శివాషాఢం, Shivashadam

శివాషాఢం
Shivashadam


++++++++ శివాషాఢం ++++++
‘ఆషాఢం’ అనే పదం రెండు అర్థాలను చెబుతోంది. మొదటిది, ఆషాఢ మాసం. రెండోది, మోదుగ కర్ర. ఈ రెండు పేర్లూ శివార్చనతో సంబంధం కలిగినవే కావడం విశేషం. గ్రీష్మరుతువు చివరిలో ఉండే ఆషాఢమాసం వర్షరుతువుకు ముఖద్వారం లాంటిది అనడం సమంజసం. వర్షరుతువు ఛాయలు ఆషాఢమాసంలోనే కనిపిస్తాయి. కాళిదాసు తన మేఘసందేశ కావ్యంలో- ఆషాఢమాసంలోని తొలిరోజుల్లోనే నింగిలో విరివిగా మబ్బులు అలముకొన్నాయని వర్ణించాడు. ఆషాఢం వర్షాగమన సూచక మాసంగా ప్రసిద్ధం. గ్రీష్మరుతువు మండే ఎండలతో కూడినదై, శివుడి ఫాలనేత్రాన్ని గుర్తుకు తెస్తుంది. వర్షరుతువు శివుడి జటాజూటంలోని గంగకు ప్రతిరూపంలా కనిపిస్తుంది. ఇలా గ్రీష్మ-వర్ష రుతువులకు, శివుడికి మధ్య పోలికలు సుస్పష్టం.
హిమాలయాల్లోని గౌరీ శిఖరంపై పార్వతీదేవి శివుడి కోసం ఘోర తపస్సుకు సిద్ధమైంది. ఆమె తపోనిష్ఠను పరీక్షించడానికి ఆయన కపట బ్రహ్మచారి రూపంలో వెళ్లాడు. శివుడు బ్రహ్మచర్యదీక్షకు ఉచితమైన మోదుగ కర్రను చేత ధరించి వెళ్లాడని కాళిదాసు కుమార సంభవ కావ్యంలో వర్ణించాడు. ‘ఆషాఢ ధరుడై’ (మోదుగ కర్రను చేతిలో కలవాడై) పార్వతీదేవి తపోవనానికి శివుడు వెళ్లాడట. ఆయన ధరించిన ‘ఆషాఢం’ (మాసంకానీ, కర్రగానీ) ఎంతో పవిత్రమైందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రకృతిలో ఎండలు మండిపోతుంటే సకల జీవరాశులు తహతహలాడతాయి. చల్లదనం కోసం పరితపిస్తాయి. చెట్లనీడలు, జలాశయాలు తాపాన్ని ఉపశమింపజేసే ఆశ్రయాలవుతాయి. ఈ సమయంలో మనిషి శివార్చన చేయడం ఉత్కృష్టం. శివార్చనకు ఏ ఆడంబరాలూ అవసరం లేదు. శివుడు అభిషేకప్రియుడు. అంటే స్నానాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. ఇందుకు కారణం లేకపోలేదు. శివుడి శరీరంలో ఉష్ణతాపాన్ని పెంచేవి రెండున్నాయి. ఒకటి ఫాలనేత్రం. అంటే నొసటిపై ఉన్న కన్ను. ఇది నిప్పుల కుంపటి వంటిది. అందుకే దీన్ని అగ్నినేత్రం అంటారు. రెండోది, గరళ కంఠం. అంటే, గొంతులో ఉన్న కాలకూట విషం. ఇది కూడా మంటలు రేపేదే. లోకరక్షణ కోసం, ప్రాణుల మనుగడ కోసం ఈ రెండింటినీ త్యాగబుద్ధితో ధరించినవాడు శివుడు. ఆయన ఈ రెండింటినీ ధరించకపోయి ఉంటే, లోకాలన్నీ భస్మమైపోయేవి.
ఆషాఢ మాసశివరాత్రి శివుడికి ప్రీతిపాత్రం. కనుక చల్లని నీటితో శివలింగానికి చేసే అభిషేకం ఆహ్లాదదాయకమే కాదు, బహుపుణ్యదాయకం కూడా.
జలలింగం శివరూపమే కదా! జలలింగం అంటే ‘నీటి బొట్టు’. నీటిబొట్టు శివుడైనప్పుడు ఆ శివుడితోనే మృణ్మయ, శిలామయ, రజతమయ, స్ఫటికమయ, రసమయ, స్వర్ణమయ, సైకతమయ లింగాలకు అర్చనలు చేయడం వెనక ప్రకృతిలోని సమస్తమూ శివమయమే అని చాటిచెప్పే రహస్యం దాగి ఉంది.
గ్రీష్మరుతువులో నీటికొరత ఏర్పడుతుంది. ప్రచండ సూర్యకాంతికి మహాజలాశయాలే ఆవిరైపోతాయి. అలాంటి సమయంలో ప్రకృతి అనే శివుడికి జలాలతో చేసే అభిషేకం శివప్రీతికరం. ప్రాణికోటిని సృష్టించిన పరమేశ్వరుడికి ప్రాణులు చేసే పూజలంటే ఎంతో ఇష్టం. శివుడు ప్రాణుల్లోని భక్తిభావాన్ని ఇష్టపడతాడు. అందుకే శ్రీకాళహస్తి మాహాత్మ్యంలోని సాలెపురుగు, పాము, ఏనుగు చేసిన భక్తిమయ అర్చనలకు ఆయన పొంగిపోయి, వాటికి శివసాయుజ్యాన్ని కలిగించాడు.
భక్తితో చేసే పూజ అల్పమైనా అనల్పమే. భక్తి లేకుండా చేసే పూజ ‘పత్రి చేటు’ తప్ప మరొకటి కాదని శతకకారులు ఉపదేశించారు. మనిషి ఎప్పుడూ ‘భక్తి’నే పూజాసాధనంగా చేసుకుంటే శివానుగ్రహం వెంటనే లభిస్తుందంటారు. భక్తికి మనసే ప్రధానం. వస్తువులు అప్రధానాలు. ఈ సత్యాన్ని గ్రహిస్తే మనసే ఒక కోవెలగా మారుతుంది!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list