MohanPublications Print Books Online store clik Here Devullu.com

గోదావరి అంత్య పుష్కరాలు, Godavari Antyapuskaralu

గోదావరి అంత్య పుష్కరాలు
Godavari Antyapuskaralu

++++++++ గోదావరి అంత్య పుష్కరాలు ++++++
జల ప్రవాహాలను ‘నదీనదాలు’ అంటారు. తూర్పుగా ప్రవహిస్తూ నేరుగా సముద్రుడితో సంగమించేది- నది. దారిలో సెలయేళ్లను కలుపుకొంటూ పశ్చిమంగా పారి సాగరాన్ని చేరుకునేది- నదం! భారతీయుల దృష్టిలో నదీనదాలంటే కేవలం నీళ్లు కావు, భూమి అంటే మట్టీ కాదు- అవి దేవతా స్వరూపాలు! అందుకే నదీమ తల్లి అని, భూమాత అని వాటిని పిలుచుకుంటారు. మనిషి మనుగడకు ఆ రెండూ ముఖ్య జీవనాధారాలు.
దేశంలో ఎన్నో నదులున్నా, ముఖ్యమైన 12 నదులకు మాత్రమే పుష్కరాలొస్తాయి. ఆ సమయంలో నదీజలాల్లో ఆధి దైవిక తేజస్సు ప్రసరిస్తుందని నిరూపణ అయింది. పన్నెండు సంఖ్య మనిషి శరీరంలోని పన్నెండు ప్రధాన నాడులకు ప్రతీకలని చెబుతారు. పుష్కర స్నానం ఆ నాడులను ప్రభావితం చేస్తుందని పెద్దల విశ్వాసం.
గోదావరి నారాయణనాడికి ప్రతీక అని, పుష్కర గోదావరి పుణ్యస్నానం ఆ నాడిని ఉత్తేజితం చేస్తుందని శాస్త్ర వచనం. రేవా తీరంలోని తపోఫలం, కురుక్షేత్రంలో చేసిన దాన ఫలం, గంగాతీరాన మరణం కారణంగా దక్కే ముక్తి ఫలం- మూడూ ఒక్క గోదావరి తీరంలోని పుష్కర స్నానంతోనే లభిస్తాయని సప్త రుషులు ప్రకటించారు. అందులోని అంతరార్థం- నారాయణ నాడికి కలిగే దీప్తి వల్లనే అంటారు. ఏ నదికీ లేని అంత్య పుష్కరశోభ కేవలం గోదావరికి దక్కడంలోని విశేషాన్ని మనం ఈ కోణంలోంచి అర్థం చేసుకోవచ్చు.
సృష్టిలో ప్రతిదానికీ ఒక్కొక్క ప్రత్యేక సందర్భం ఉంటుంది. ఆ సమయంలో దాని వినియోగం సర్వ సంపన్నంగా ఉంటుంది. నదులకు పుష్కరాలు అటువంటివి. పుష్కరుడంటే పుష్కల తేజస్సును ఇచ్చేవాడని అర్థం. తమ పుణ్యసంపదలను మానవులకు పంచి, వారి పాపాలను గ్రహించడం వల్ల నదులకు తేజస్సు తరిగిపోతుంది. వాటికి తిరిగి పుష్టిని, తుష్టిని పుష్కరుడు అందిస్తాడు. కనుక పుష్కరుడొస్తే నదులకు పండుగ!
స్వయంగా పరమపావని అయిన గోదావరిలో స్నానంతో దేహమాలిన్యం, జలపానంతో అంతర కాలుష్యం దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. పుష్కరాల సమయంలో, చూపు మాత్రంతోనే గోదావరి మనిషిని సంస్కరిస్తుందని యజుర్వేదం ప్రకటించింది. నానా మూలికా సంపర్కంతో, గైరికాది ధాతు సంపదతో అలరారే గోదావరి నదిలో పుష్కర స్నానం కోసం ప్రజలు ఎదురుచూసేది అందుకే! భద్రగిరికి, యాదగిరికి, తిరుమలగిరికి ఏ రకమైన దీక్షతో భక్తిభావంతో వెళతామో- అదే రకమైన పవిత్ర భావనలతో చేరి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి... అంత్య పుష్కరాలు మరోసారి చక్కని అవకాశం కల్పిస్తున్నాయి.
ఆధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక తాపత్రయ నివారణ కోసం చేసే ప్రయత్నాలకు ఇది మంచి తరుణం. రుషిరుణం, దేవరుణం, పితృరుణాలను తీర్చుకోవాలన్నా ఇదే మంచి సందర్భం. పుష్కరాల సమయంలో ప్రజలు తమ పూర్వీకుల పేరిట నిర్వహించే పిండప్రదానాలు తర్పణాలు స్నానవిధులు, దానధర్మాలు- అంత్య పుష్కరాల్లోనూ అంతే ఫలితాన్ని ఇస్తాయని ప్రజల విశ్వాసం. కనుకనే గోదావరి అంత్య పుష్కరాలకూ ప్రాధాన్యం లభిస్తోంది.
పుష్కరాల్లో పితృకార్యాలు ప్రధానమైనవన్న శాస్త్రవచనం అంత్య పుష్కరాలకూ వర్తిస్తుందని పండితుల మాట. మళ్లీ పన్నెండేళ్లకు గాని పుష్కరాలు రావు కనుక- గోదావరి అంత్య పుష్కరాల సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవడం ఆస్తికుల విధి. నిత్యం జలసంద్రం దిశగా ఉరకలెత్తే గోదావరి ఉత్సాహం జనసంద్రం వైపు మళ్లుతోందంటే- దానికి కారణం అంత్య పుష్కరాలే! - ఎర్రాప్రగడ రామకృష్ణ


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list