MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఇంటీరియర్ డిజైన్, Interior Designs

ఇంటీరియర్ డిజైన్
Interior Designs

గదిగదిలో ధగధగ
ఇంటర్నెట్‌డెస్క్‌: సొంతింటి కలను నిజం చేసుకునే క్రమంలో దృష్టి పెట్టాల్సిన అంశాల్లో ముఖ్యమైంది... గదుల్లోని కాంతి!! ఇళ్లల్లో లైటింగ్‌ను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించుకోవచ్చు.. సాధారణ కాంతి, టాస్క్‌ లైటింగ్‌, యాక్సెంట్‌ లైటింగ్‌. ఈ మూడింటిని కలిపి అలంకరణ లైటింగ్‌నీ సిద్ధం చేసుకోవచ్చు.
సాధారణంగా అలంకరణ లైటింగ్‌ మనసును ప్రభావితం చేసేదిగా ఉంటుంది. పలు రకాల రంగులు, ఆకారాల్లో దీనిని ఏర్పాటు చేస్తారు. షాండిలియర్స్‌, పెండెంట్‌ లైటింగ్‌లు ఈ కోవలోకి వస్తాయి.
* జనరల్‌ లైటింగ్‌ (సాధారణ కాంతి): ఇది గదిలో అన్ని వస్తువులు కనిపించేట్లు వేస్తారు. గదుల పైకప్పు, సీలింగ్‌ వంటివి దీని పరిధిలోకి వచ్చేట్లు చూస్తారు. వీటి కోసం టార్చర్స్‌, వాల్‌ స్కోన్సెస్‌, చెస్ట్‌లైట్స్‌, కోన్స్‌ వాడుతుంటారు.
* ప్రత్యేక అవసరాల కోసం: ఇది సాధారణ లైటింగ్‌ కంటే మూడు రెట్లు కాంతిమంతంగా ఉంటుంది. అత్యధిక వాట్స్‌ శక్తి కల్గిన బల్బులను దీనిలో వినియోగిస్తారు.
* యాక్సెంట్‌ లైటింగ్‌: ఇంట్లోని ముఖ్యమైన అలంకరణ వస్తువుల్ని హైలైట్‌ చేసేందుకు వాడతారు. దీంతోపాటూ ఇంట్లో అద్భుతంగా నిర్మించిన కీలక నిర్మాణాలను హైలెట్‌ చేసేందుకూ వినియోగిస్తుంటారు. సాధారణంగా చుట్టుపక్కల ఉన్న కాంతి కంటే మూడు రెట్లు శక్తివంతమైన బల్బులను ఇందుకోసం వినియోగిస్తుంటారు.

చూడచక్కగా చిన్నారి లోకం
ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నారులున్న ఇంటి గదులుఅందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. పడకగది, రీడింగ్‌ రూమ్‌... ఏదయినా సరే ఆ వాతావరణం వాళ్ల మనసుల్ని మురిపించాలి. అది నిజమేకానీ, అదెలా అంటారా... ఇదిగో ఇలా! పిల్లల కోసం రూపొందించిన కొన్ని గదుల లుక్‌ని మీరే చూడండి.
* పసుపు వర్ణంలో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ గది గోడలపై పేపర్‌తో చేసిన సీతాకోక చిలుకల్ని అతికించారు. లేడి తల ఆకారాన్ని పోలివుండే ‘మార్నిన్‌ ల్యాంప్‌’ నుంచి కాంతులు వెదజల్లేలా అమర్చారు. ఇది పిల్లలకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం.
* పిల్లల్లో సృజనాత్మకత కోసం బెడ్‌ రూమ్‌లోనే చాక్‌బోర్డులను కూడా ఏర్పాటుచేయడం ఈ గది ప్రత్యేకత. గోడ మొత్తానికి రంగులు అద్దడం ఇబ్బంది అనుకుంటే.. మీకు కావాలనుకొనే చోట రంగురంగుల గట్టి ప్లైవుడ్‌ ముక్కలను కావాల్సిన చోట అమర్చుకోవచ్చు.
* ఈ గది గోడలకు రకరకాల చక్కని పెయింటింగ్‌ ప్రింట్లను అమర్చారు. తెల్లని ఇటుకలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద గోడల్లో అమర్చిన వివిధ రకాల రంగుల ప్రింట్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి గదుల్లో వుండే చిన్నారులు ఎదుగుతున్న కొద్దీ వీటిపై ఆసక్తి తగ్గేందుకు ఎక్కువ సమయమే పడుతుంది.
* ఈ గది ఎదుగుతున్న ఔత్సాహిక పిల్లలను దృష్టిలో వుంచుకొని రూపొందించారు. ఈ గదిలో ఏర్పాటుచేసిన చాక్‌బోర్డ్‌ పిల్లలకు స్క్రిబ్లింగ్‌ ప్యాడ్‌గా ఉపయోగపడుతుంది. చాక్‌బోర్డులోనే చంద్రుని ఆకారంలోని ల్యాంప్‌ ఏర్పాటు గదికి మరింత కళను తీసుకొస్తుంది.
* పిల్లలు గోడపైకి ఎక్కేందుకు వీలుగా మెట్లు ఏర్పాటుచేశారు. చిన్నారుల్లో వ్యాయామ ప్రక్రియ పట్ల ఆసక్తిని పెంచేందుకు ఈ ఏర్పాటు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ చిత్రానికి కుడివైపున కొన్ని బొమ్మలు వుంచారు. చిన్నారులు ఏ బొమ్మ అయినా కావాలనుకుంటే ఎక్కి తీసుకొనేందుకు వీలుగా షెల్ఫ్‌లు ఏర్పాటు చేశారు.

ఆకట్టుకొనే వంటగదులు
ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం..: ఇంటి నిర్వహణలో వంటింటి పాత్ర ఎప్పుడూ కీలకమే! మరి అటువంటి వంటిల్లుని తక్కువ స్థలంలో, అన్ని వసతులతో, కళాత్మకంగా తీర్చిదిద్దుకునేందుకు శ్రద్ధ పెట్టాల్సిందే! చిన్న చిన్న ఇళ్లు, అపార్టుమెంట్‌లలో సృజనాత్మకంగా ఏర్పాటుచేసిన కొన్ని కిచెన్ల పరిచయమిది!
* చిన్న ఇళ్లకు బాగా నప్పే కిచెన్‌ మోడళ్లలో ఇదొకటి. దీనిని చెక్కతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షెల్ఫ్‌లతో రూపొందించారు. వంటగదిలో గోడలు, ఫ్లోరింగ్‌కు సాధారణమైన రాయినే వాడారు.
* అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ మాడ్యులర్‌ కిచెన్‌ని రంగురంగుల షెల్ఫ్‌లు, కబోర్డులతో చిన్న ఇంట్లోనే కళాత్మకంగా తీర్చిదిద్దారు. అల్పాహారం చేసేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లూ చేసుకోవచ్చు.
* ఒకే వరుసలో కన్పిస్తున్న ఈ కిచెన్‌లో వస్తువులను భద్రపరచుకొనేందుకు వీలుగా షెల్ఫ్‌లు ఏర్పాటుచేశారు. ఈ కిచెన్‌లో గోడలు, పైకప్పు పూర్తిగా చెక్కతోనే రూపొందించారు.
* ‘ఎల్‌’ ఆకారంలో కనబడుతున్న ఈ కిచెన్‌ చిన్న ఇంటికి చక్కగా సరిపోతుంది. మనకు నచ్చిన నమూనాలో రంగురంగుల కబోర్డులు, షెల్ఫ్‌లు ఏర్పాటుచేసుకోవచ్చు.
* తెలుపు, ఆకుపచ్చ రంగుల కలబోతతో కన్పిస్తున్న ఈ కబోర్డులు ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి. చూడ్డానికి సాధారణంగా కనిపిస్తున్నఈ తరహా కిచెన్లను శుభ్రపరచడం సులభం.

ఇక్కడ పుస్తక పఠనం ఎంత హాయో!
ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం..: ఛానళ్లు, సినిమాలు, క్షణం తీరిక దొరకని వ్యాపకాలతో ఈ తరం బిజీగా మారిపోయింది! ఉన్నంతలో ప్రశాంతంగా గడపాలనీ... పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వంటివి చేయాలని ఆశపడుతోంది. అందుకు ఉపయోగపడేవే ఈ హోం లైబ్రరీలు.
ఒక్కో మెట్టుని వినియోగిస్తూ...
స్టెయిర్‌ కేస్‌ లైబ్రరీకి ప్రత్యేకంగా స్థలం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇంట్లో నిర్మించుకునే మెట్లతో పాటుగా ఒక్కో మెట్టుకు ప్రత్యేకంగా ఓపెన్‌ బుక్‌షెల్ఫ్‌లు, లేదంటే ప్రత్యేక అరలు నిర్మించుకుంటే సరి.
బాల్కనీలో భలేగా!
వర్షాకాలంలోనూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవాలనుకునే వారు ఈ తరహా లైబ్రరీ ఏర్పాటు చేసుకోవచ్చు.మొదట బాల్కనీలో స్లైడింగ్‌ గ్లాస్‌ డోర్‌ ఏర్పాటు చేసుకోవాలి. గదిలో అమర్చిన అరలలో ఇష్టమైన పుస్తకాలను నింపుకోవాలి. గదిలో లేజీ ఛైర్లను ఏర్పాటు చేసుకుని, గదికి పూర్తి అందాన్ని సమకూర్చేలా ప్రత్యేకపూలకుండీలు ఏర్పాటు చేసుకుంటే మళ్లీమళ్లీ చూడాలన్పించేలా గది రూపురేఖలు మారిపోతాయి.
ఎక్కడికంటే అక్కడికి... ‘పోర్టబుల్‌’
ఇంట్లో మనకు నచ్చిన ఏమూలనైనా ఇది చక్కగా ఇమిడిపోతుంది. ఎప్పుడు ఎక్కడికి మార్చుకోవాలన్నా సులభంగా మార్చుకునే వీలుంటుంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా దీనిని తయారుచేసుకోవచ్చు.




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list