MohanPublications Print Books Online store clik Here Devullu.com

కధలు1 , Stories1

కధలు1 
Stories1
ప్రేమలో ఓడా... జీవితాన్ని గెలుస్తా!
మూడు సినిమాలు... ఆరు పార్టీలతో జాలీగా గడిపే కుర్రాడు. ఓ అమ్మాయి రాక అతడి జీవితంలో పెనుతుపాను రేపింది. ఇంతకీ ఏమైంది?
ఆఫీసులో ఉండగా జీటాక్‌లో ‘హాయ్‌’ అనే పలకరింపు. అవతలివైపు అమ్మాయి. నా వేళ్లలో కరెంట్‌. చకచకా వ్యక్తిగత వివరాల్లోకి దిగా. ‘ఎంటెక్‌ చేస్తూనే ఉద్యోగం చేస్తున్నా’ బదులిచ్చింది. నేనూ వివరాలిచ్చా. తర్వాత ఎప్పుడోగానీ మామధ్య మాటలు కలవకపోయేవి. నా ఉద్యోగం అలాంటిది మరి. నిమిషం ఖాళీ దొరికినా తనకే కేటాయించేవాణ్ని. ఎలాగో వీలు చేసుకొని కొన్నాళ్లకి తననో మాల్‌లో కలిశా. ఆకర్షణో, అభిప్రాయాలు కలవడమో... ఒకరికొకరం తెగ నచ్చేశాం. ప్రేమ గోదాలో దిగిపోయాం. ఓ మొగుడితో మాత్రమే చెప్పుకునే విషయాలు నాతో పంచుకునేది. బ్యాంకు ఖాతా సహా ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌లన్నీ ఇచ్చింది. ప్రేమికుల మధ్య ఏ దాపరికాలూ ఉండద్దనేది తన ఫిలాసఫీ. ఇంకేం... పూర్తిగా పడిపోయా.
నాకు వేరే కంపెనీలో ఆఫర్‌ వచ్చింది. బెంగళూరులో శిక్షణ. వెళ్లేముందు కలిశా. మూడు గంటలు మనసారా మాట్లాడుకున్నాం. బై చెబుతుంటే చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడ్చింది. నాకూ కన్నీళ్లాగలేదు. జీవితంలో తన చేయి వదలొద్దనుకున్నా.
శిక్షణ బాగానే సాగుతోంది. మరోవైపు మా ప్రేమ కూడా. ఫోన్‌, చాటింగ్‌, వీడియో కాలింగ్‌... ఓ నెలదాకా ఏదోరకంగా టచ్‌లో ఉండేవాళ్లం. తర్వాతే మొదలైంది తనలో వూహించని మార్పు. అకస్మాత్తుగా నన్ను దూరం పెట్టసాగింది. పరీక్షల ఒత్తిడి... ఫోన్‌ ప్రాబ్లెమ్‌... ఇంట్లో ఇబ్బందులు... ఏదోరకంగా సర్దిచెప్పుకునేవాణ్ని. ఎన్నిరోజులు గడిచినా దేనికీ సమాధానం దొరకదే! పిచ్చెక్కిపోయేది. పాస్‌వర్డ్‌లు గుర్తున్నాయి. ఆఖరిప్రయత్నంగా తన ఖాతాలు తెరిచా. నెలరోజులుగా వాడిన దాఖలాల్లేవు. నాలో భయం మొదలైంది.
నేనీ టెన్షన్‌లో ఉండగా నాకో మెయిల్‌ వచ్చింది. ‘హాయ్‌ భయ్యా... ఆ అమ్మాయి క్యారెక్టర్‌ ఎలాంటిది? తనకు, నీకు ఏంటి సంబంధం?’ అనేది సారాంశం. ఈ కొత్త క్యారెక్టర్‌ ఎవరో తెలియక గాబరాగా ఫోన్‌ కలిపా. ‘మేమిద్దరం క్లాస్‌మేట్స్‌. ప్రపోజ్‌ చేశా. ఒప్పుకుంది. ఫిబ్రవరి 14న లంచ్‌ కూడా చేశాం’ సూటిగా విషయం చెప్పాడు. గుండెలు భగ్గుమన్నాయి. కళ్లలో నీళ్ల సుడులు తిరిగాయి. అప్పుడు తనకి దూరం అవుతున్నానని ఏడ్చా. ఇప్పుడు తను నన్ను దూరం పెడుతోందని ఏడ్చా. ఏ కష్టాలూ తెలియని ఓ కుర్రాడ్ని ఏడిపించే శక్తి ఒక్క అమ్మాయికే ఉందని అర్థమైంది.
నేనందరిలాంటోడ్ని కాదు. ప్రేమ త్యాగం చేసి సైడైపోవడానికి... బాధ మింగలేక ఏ విషమో మింగడానికి. అంతు తేల్చుకోవడానికి తన ముందుకెళ్లా. వాడు చెప్పింది నిజమేనా అని నిలదీశా. ‘హా’ అంది ఏమీ ఎరగనట్టే. బూతులు తిట్టా. ‘హే... నేనెపుడో నీకు బ్రేకప్‌ చెప్పేశాగా’ అంది. నీకివ్వాల్సిన వంద ఎప్పుడో ఇచ్చేశాగా అన్నంత సింపుల్‌గా. ఏడ్వలేక నవ్వా. పరిచయం పెంచుకుంది. ప్రపోజ్‌ చేసింది. అడక్కముందే అన్నీ చెప్పింది. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్టే బ్రేకప్‌ అంటోంది. అదీ అసలు మా మధ్య ఏ గొడవా లేకుండానే. ఒకమ్మాయిలో ఇన్ని కోణాలా?
బాధ పడ్డా. కానీ దేవదాసు కాలేదు. తనపై పీకల్దాకా కోపమొచ్చింది. కానీ యాసిడ్‌ దాడి చేయలేదు. నా దృష్టిలో జీవితం అంటే ఓ ప్రయోగశాల. చేసే ప్రతి ఎక్స్‌పరిమెంట్‌ సఫలం కాదు. నా ప్రేమ విషయంలోనూ అలాగే జరిగింది. తప్పు ప్రేమ ఫార్ములాది కాదు. చేసే విషయంలోనే తేడా జరిగింది. ఈ ఓటమి నాకు చాలా నేర్పింది. ఆఖరికి నేనో రాంగ్‌ ప్రొడక్ట్‌ని ఎంచుకున్నానని తేలింది. ఈసారి మాత్రం ఆ తప్పు చేయను. ప్రేమలో, జీవితంలో... ముందుగా కెరీర్‌లో తప్పకుండా విజయం సాధిస్తా.
ప్రేమ చేయిచ్చింది! స్నేహం చేదోడైంది!
పరిచయానికి ఫేస్‌బుక్‌... బాతాఖానీకి వాట్సాప్‌... బయట కలుసుకోవడానికి పార్కులు, రెస్టరెంట్లు... నేటి కుర్ర స్నేహాలకు కొలమానం ఇది! కానీ ఈ హైటెక్‌ యుగంలోనూ ఉత్తరాలతో చెలిమి చేసేవారుంటారా? కానీ మా స్నేహం అలాంటిదే. - శ్రీనివాస్‌
గాయత్రి... ఈ పేరు వింటేనే నాకు గొప్ప ఆప్యాయత గుర్తొస్తుంది. మా అక్క వాళ్లింటిదగ్గరే తనుండేది. ‘ఆ అమ్మాయి చాలా పద్ధతైన పిల్లరా. పెద్దలంటే గౌరవం’ అడక్క ముందే ఆమె గురించి చాలా సార్లు చెప్పేది అక్క. ఆ మాటల ప్రభావమేమో గాయత్రిని చూడకుండానే అభిమానం పెంచుకున్నా.
నచ్చిన అమ్మాయికి దగ్గరవ్వాలనుకోవడం సహజమే కదా! అక్కాబావలకు తెలియకుండా గాయత్రి కాలేజీకి వెళ్లా. దొంగచాటుగా తనని గమనించా. ఫర్వాలేదు అందగత్తే. నన్ను నేను పరిచయం చేసుకోవడమెలా? ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, తన స్నేహితులు... చాలా దారులే కనిపించాయి. కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. భాషపై నాక్కొంచెం అభిమానం ఎక్కువ. పుస్తకాలు బాగా చదువుతా. అందుకే తనతో ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నానో వివరిస్తూ ఉత్తరం రాశా. ఒకటి.. రెండు.. ఐదు.. నా అంతరంగ భావాల్ని అక్షరాలుగా పేర్చి లేఖలు పంపా. అవతలివైపు నుంచి సమాధానం లేదు. అయినా నా నమ్మకం సడలలేదు. నా ఆలోచనలు తనకు కచ్చితంగా నచ్చుతాయనిపించింది. కాస్త ఆలస్యంగానైనా నా అంచనా నిజమైంది. ‘మీరెవరో నాకు తెలియదు. కానీ మీ అక్షరంలో నిజాయతీ ఉంది. మీ ఆలోచనలు నాలాగే ఉన్నాయి’ అంటూ జవాబిచ్చింది. ఉత్తర ప్రత్యుత్తరాల వేగం పెరిగింది.
చేతి రాతల్ని నోటిమాటలుగా మార్చాలనిపించింది. కలుద్దాం అంటే 'ఓస్‌... దానికేం భాగ్యం’ అంది. గాయత్రిని కలిసి మాట్లాడాక తనకన్నా తన ఆలోచనలు, భావాలు మరింత అందంగా ఉన్నాయనిపించింది. ఖాళీ సమయాల్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతా. స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేస్తా’ అంటుంటే ఇలాంటి అమ్మాయి నా ఫ్రెండ్‌ అని చెప్పుకోవడం గర్వంగా ఉండేది. మేం తరచూ కలిసేవాళ్లం. చాలా విషయాలు చర్చించుకునేవాళ్లం. అందులో వ్యక్తిగత విషయాలకన్నా సమాజ ప్రస్తావనే ఎక్కువ. బాధలు, కష్టాల్లో ఉన్నపుడు ఒకరికొకరం ఓదార్చుకునేవాళ్లం.
మాది కేవలం స్నేహమే. అందులోనే అనిర్వచనీయమైన ఆనందాన్ని వెతుక్కునేవాళ్లం. కానీ మా సాన్నిహిత్యాన్ని ఈ సమాజం మరోలా అర్థం చేసుకుంది. సన్నిహితులే మమ్మల్ని ‘ప్రేమ పక్షులు’ అన్నారు. స్నేహం పేరుతో రొమాన్స్‌ చేస్తున్నారని ఎగతాళి చేశారు. మేమేంటో మాకు తెలుసు. ఎవర్నీ పట్టించుకోలేదు. రాన్రాను అపార్థం చేసుకున్నవాళ్లే నిజం తెలుసుకున్నారు.
కొన్నాళ్లకు నాకింకో అమ్మాయి పరిచయమైంది. పరిచయం త్వరలోనే ప్రేమ బాట పట్టింది.‘నీతో జీవితం పంచుకోవాలనుంది’ నా మనసులో మాట తను చెప్పింది. నా సంతోషానికి పట్టపగ్గాల్లేవ్‌. ఇక ఆమెతోనే నా జీవితం అనుకున్నా. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నా. ‘నాకు ఇంకో అబ్బాయి దొరికాడు. నువ్వు వేరే అమ్మాయిని చూసుకో’ ఓరోజు బాంబు పేల్చింది. నా గుండె పగిలింది. బాధతో దాదాపు పిచ్చివాడినయ్యా. అప్పుడు గాయత్రే నాకు తోడుగా నిలిచింది. తన చల్లని మాటలతో కుంగుబాటు నుంచి బయటికి తీసుకొచ్చింది.
జీవితాంతం తోడుంటానన్న ప్రేమ అర్థాంతరంగా నన్నొదిలి వెళ్లింది. మధ్యలో పరిచయమైన స్నేహం మాత్రం కడదాకా తోడుంటానంటోంది. అందుకే నా దృష్టిలో ప్రేమకన్నా స్నేహమే గొప్పది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ స్నేహాన్ని వదలొద్దు.

ప్రపోజ్‌ చేస్తే...పాపను చూపించింది!
దువు లేకున్నా సర్దుకుపోతా... ఆస్తి లేకున్నా అడ్జస్టవుతా... అమ్మాయి మాత్రం అప్సరసలా ఉండాలి. ఇదీ కాబోయే భార్య విషయంలో నా పంతం. ఆ కలల రాణికోసం ఇంటర్‌ నుంచి ఎంటెక్‌ దాకా ఎంతోమంది అమ్మాయిల వెంటపడ్డా. ఛీత్కరింపులు, చిరుగొడవలు, కొన్ని ప్రేమ వరకూ వెళ్లి ఆనక బ్రేకప్‌లు... అన్నీ జరిగాయి. చిటికెనవేలు అందుకునే చిన్నది మాత్రం దొరకలా!
సీన్‌ కట్‌ చేస్తే నేనిప్పుడో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆఫీసులో కనీసం పదిమంది అందగత్తెలైనా ఉంటారు. వాళ్లు అటూఇటూ తిరుగుతుంటే క్యాట్‌వాక్‌ చేస్తున్న మోడళ్లే కనిపించేవారు. అందులో ఎవర్ని ఎంచుకోవాలో తెలీక నేను సతమతమవుతుంటే నా మగ కొలీగ్స్‌ మాత్రం శిరీష పేరు తెగ పలవరించేవారు. ఎవరీ శిరీష అంటే నాకన్నా కొంచెం సీనియర్‌. మరీ అందగత్తేం కాదు. మరి ఎందుకింత ఫాలోయింగ్‌ అని ఆరా తీస్తే చాలా విషయాలే తెలిశాయి. తను కొలీగ్స్‌కి పనిలో సాయం చేస్తుంది. అవసరాల్లో ఉన్నవాళ్లకి డబ్బులిస్తుంది. అన్నింటికీ మించి అందరితో ఇట్టే కలిసిపోతుంది. అందుకే బోయ్‌ నుంచి బాస్‌ దాకా అందరికీ తనంటే ఇష్టం.
కొద్దిరోజుల్లోనే నేనూ శిరీష మంచితనానికి ఫిదా అయ్యా. నా అదృష్టమో మరేంటో, ఆఫీసులో అందరి సీట్లు మార్చడంతో నేను తన పక్కనే చేరా. ఇంకేం... పక్కనే జోష్‌ మిషన్‌. తనతో మాట్లాడుతుంటే సమయమే తెలిసేది కాదు. రాన్రాను నేనెంతగా మారిపోయానంటే ఆర్నెళ్లలోనే తనే నా డ్రీమ్‌గాళ్‌ అనుకునేంత.
నాది లవ్వే. మరి తనదేంటి? ఆ మాటే అడిగి పెళ్లాడతానన్నా. ‘ప్రపోజల్‌ నెంబర్‌ ఎయిట్‌’ అంది. హో... పోటీ తీవ్రంగానే ఉందని అర్థమైంది. అయినా సిన్సియర్‌గా ప్రయత్నిస్తూనే ఉన్నా. ఇంకో ఆర్నెళ్లు గడిచాయి. ఓరోజు తన ఫోన్‌. ‘రేపు సాయంత్రం మనం ఫలానా రెస్టరెంట్‌లో కలుద్దాం’ అని. ‘యాహూ’ ఉన్న చోటే గెంతేశా. చక్కగా ముస్తాబై తను చెప్పినచోటికి పల్సర్‌ బైక్‌పై వెళ్లా. ఐదు నిమిషాలయ్యాక వచ్చింది. ఓ పాపతో సహా. నా క్వశ్చన్‌మార్క్‌ మొహం చూసి తనే నోరు విప్పింది. ‘ఈ పాప నా కూతురు. నువ్వు నాకు భర్తవి కావాలంటే ముందు తనకి తండ్రివి కాగలవా? అంత దమ్ముందా?’ అంది. నాకంతా అయోమయం. ‘నువ్వు విన్నది కరెక్టే. నేను నా భర్తతో విడిపోయా’ అనడంతో సీన్‌ పూర్తిగా అర్థమైంది. కాస్త టైమివ్వు అని బయటికి నడిచా.
‘ఇంటర్‌ అయ్యాక బావతో పెళ్లైంది. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత పాత లవర్‌తో సంబంధం కొనసాగించేవాడు. పద్ధతి మార్చుకొమ్మన్నా విన్లేదు. నీకిష్టంలేకపోతే నువ్వెళ్లిపోవచ్చని ఆఫరిచ్చాడు. పుట్టింటికొచ్చేశా. తర్వాతే పాప. చదువూ కొనసాగించా’ రాత్రి ఫోన్‌చేసి క్లుప్తంగా వివరాలన్నీ చెప్పింది. నా కళ్లు చెమర్చాయి. ఎప్పుడూ చలాకీగా ఉండే తన జీవితంలో ఇంత విషాదమా అని ఆశ్చర్యమేసింది. జీవితంలో మొదటిసారి ఒకమ్మాయి అందం గురించి కాకుండా మనసు, పరిస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టా. దాదాపు వారం రోజుల తర్వాత ఓ నిర్ణయానికొచ్చా.
నాన్న నా బెస్ట్‌ఫ్రెండ్‌. సలహా అడిగా. ‘చాలా రిస్కు తీసుకుంటున్నావ్‌. మరోసారి ఆలోచించు. కానీ నువ్వే నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు’ అన్నారు. అమ్మ ముందు వద్దన్నా కష్టపడి ఒప్పించాను. తర్వాత శిరీష చెప్పినట్టే మేం సింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్నాం. ‘మా పాప’ సాక్షిగా. ఇప్పుడు నన్నంతా ‘నిజమైన హీరో’ అంటున్నారు. నాకు మాత్రం నా డ్రీమ్‌గాళ్‌ దొరికింది. ప్లస్‌ అందమైన మనసుతో సహా. అమ్మానాన్నలకు అణకువైన కోడలు కూడా.

ఆమెను ప్రేమించా... అతడితో పెళ్లి చేశా!
 చెల్లి కోసం డొంకినవలస రైల్వేస్టేషన్‌లో ఎదురుచూస్తున్నా. అనుకోకుండా నా చూపు అవతలి ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న అమ్మాయిపై పడింది. కన్నార్పకుండా నన్నే చూస్తోంది తను. ఐదు పది నిమిషాలైనా అదేవరస. ఎంత ఆలోచించినా తనెవరో తట్టలేదు. చెల్లి రాకతో ఆలోచనకు బ్రేక్‌ వేసి అక్కణ్నుంచి కదిలా. వారమయ్యాక ఓ గుడిలో ఎదురుపడింది. అడగాలా? వద్దా? అనుకుంటుండగానే చూపులు విసిరి మాయమైంది. మూడోసారి ముచ్చటగా రోడ్డుమీద కలిసింది. పట్టించుకోకుండా వెళ్తుంటే ‘హలో సర్‌... నేను మీ జూనియర్‌ కీర్తిని’ అంటూ చేయందించింది. తన చొరవకు నోరెళ్లబెట్టా. అమ్మాయే మాట కలిపితే ఏ కుర్రాడికైనా హ్యాపీనే కదా! తర్వాత ‘ఈమె మా పెద్దమ్మ’ అంటూ ఇంకొకామెను పరిచయం చేసింది.
కీర్తి నెంబర్‌ కనుక్కోవడం కష్టమేం కాలేదు. వెంటనే ఫోన్‌ కలిపా. బాగానే రిసీవ్‌ చేసుకుంది. పరిచయం పరుగులు పెట్టి తొందర్లోనే ‘ఏరా’, ‘ఏమే’ అని చొరవగా పిలుచుకునే దశకెళ్లాం. ఆపై మాటలు దాటి కలుసుకోవడాలూ మొదలయ్యాయి. కొన్నాళ్లకు ‘నువ్వంటే నాకిష్టం. మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటావ్‌?’ అంది. నిజానికి నేను అడగాలనుకున్న మాట. సమయం కావలన్నా. ­సులు, కలుసుకోవడాలు మాత్రం కొనసాగేవి.
ఓరోజు కీర్తి ఒకబ్బాయితో బైక్‌పై కనిపించింది. ఉత్సుకత ఆపుకోలేక ఎవరనడిగా. ‘ఓహ్‌... తనా? మా అన్నయ్య శివ’ అంది. అనవసరంగా అనుమానించానని తిట్టుకున్నా. వారం తిరక్కముందే మరోసారి కనిపించారు. పక్కన కీర్తి పెద్దమ్మ కూడా ఉంది. ఈసారి ఎలాంటి అనుమానం రాలేదు. పైగా నన్ను శివకి పరిచయం చేసింది.
ఆరోజు ఎప్పట్లాగే తనకి ఫోన్‌ చేశా. తీయలేదు. చాలాసార్లు ప్రయత్నించినా నో రెస్పాన్స్‌. గాబరాగా తన గదికి పరుగెత్తా. తాళం వెక్కిరించింది. ‘మావాళ్లు అద్దె చెల్లించలేకపోతున్నారు. అందుకే ఖాళీ చేసి ­రెళ్లా’ మర్నాడు తనే చెప్పింది. ప్రాణం విలవిల్లాడింది. అయినా ఫోన్‌ చేయడం మరవొద్దన్నా. సరేనంది.
ఇది జరిగాక తనలో ఒక్కసారిగా మార్పు. నేను తన గురించి అడిగితే తనేమో శివ ఎలా ఉన్నాడనేది. ఎంతైనా అన్నయ్య కదా... ఆమాత్రం ఉంటుందిలే అనుకునేవాణ్ని. ఓసారి ‘మా పేరెంట్స్‌ కొన్ని వస్తువులు కొనడానికి ­రి నుంచి వస్తున్నారు. వెళ్లి సాయం చెయ్‌’ అంది. సరేనని వెళ్లా. మాటల మధ్యలో ‘కీర్తి ఈ మందుల చీటీ శివకు ఇవ్వమంది’ అన్నారు. నేనిస్తానని ఆ చీటీ తీసుకున్నా. అది విప్పి చూడగానే నాకు కన్నీళ్లాగలేదు. నిజానికి అది మందుల చీటీ కాదు లవ్‌లెటర్‌. అన్నయ్య అని చెప్పిన వ్యక్తి కీర్తి లవర్‌. ఎంత మోసం?
తర్వాత చాలా విషయాలు తెలిశాయి. నన్ను వాడుకోవడం కోసం కావాలనే వాళ్లిద్దరూ కలిసి అలా చేశారు. ఆ పెద్దమ్మ కూడా అబద్ధమే. ఆవేశంతో తనకి ఫోన్‌ చేసి విపరీతంగా తిట్టా. నిజం ఒప్పుకుంది. క్షమించమని ఏడ్చింది. ‘శివనే ప్రేమిస్తున్నా’నంది. ఇంకేం చేయను? తనది మోసమైనా నాది నిఖార్సైన ప్రేమ. అందుకే ప్రపంచంలో ఏ ప్రేమికుడూ చేయని పని చేయాలనుకున్నా. నేను ఇష్టపడ్డ అమ్మాయిని తను ప్రేమించిన అబ్బాయితో కలపాలనుకున్నా. వాళ్లిద్దరి పెద్దల దగ్గరికెళ్లి బతిమాలా. పెళ్లికి ఒప్పుకోకపోగా నానా మాటలన్నారు. కారణం ఇద్దరివీ వేర్వేరు కులాలు. ‘మేం ఒక్కటవకపోతే చచ్చిపోతాం’ అని పంతం పట్టారు కీర్తి, శివలు. ఆఖరికి నేనే దగ్గరుండి వారికి రిజిస్టర్‌ మ్యారేజీ చేశా.
అమ్మాయిని ప్రేమించడం అంటే నా దృష్టిలో అమ్మాయిని మాత్రమే ప్రేమించడం కాదు. ఆమె కష్టాలు... ఇష్టాలు... బాధ్యతలు... సంతోషాల్నీ ప్రేమించగలగాలి. అందుకే వాళ్లని కలిపా. ఒక ప్రేమికుడిగా నేను చేసింది సమంజసమే అనిపిస్తోంది. మీరేమంటారు?

అమ్మాయికి చేరువయ్యా... అమ్మకి చేదయ్యా!
 ప్రేమంటే ఒకర్నొకరు నచ్చడం కాదు. పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి ఒక్కటవడం కాదు. ప్రేమంటే పేగుబంధాన్ని వదులుకోకపోవడం. పెళ్లంటే కొత్త బంధాల్ని కలపడం... ఇది తెలుసుకునేలోపే అనర్థం జరిగిపోయిందంటున్నాడో యువకుడు.
సంక్రాంతి పండక్కి నాన్నని కలవడానికెళ్లా. ఎవరైనా అత్తారింటికో బంధువులింటికో వెళ్తారుగానీ నాన్నని కలవడమేంటి అంటారా? ఔను... ఎందుకంటే అమ్మానాన్నలు ఎప్పుడో విడిపోయారు. నేను, చెల్లి అమ్మ దగ్గరే పెరిగాం. చిన్నప్పట్నుంచి మామయ్యే మా బాగోగులు చూశారు. అమ్మకి తెలియకుండా అప్పుడప్పుడు నాన్నని కలవడం నాకలవాటు. ఈసారీ అదే చేశా.
గేటు తీసి లోపలికెళ్తుంటే వాకిట్లో చుక్కలముగ్గు వేస్తున్న చక్కని చుక్క కనపడింది. తను నా మేనత్త కూతురు. ‘చూసుకుంటూ వెళ్లు బావా... ముగ్గు పాడవుతుంది’ అనడంతో మరోసారి తనని చూశా. ఈసారేంటో మరీ అందంగా కనిపించింది. ఇంట్లోకెళ్లి నాన్నతో మాట్లాడుతున్నా పదేపదే తన రూపమే గుర్తొస్తోంది. ఆ వూహల్లో ఉండగానే ‘బావా... స్వీట్‌’ అంటూ చేతిలో పాలకోవా పెట్టింది. ఏంటి స్పెషల్‌ అంటే నాకుద్యోగం వచ్చిందంది. ఓ ముక్క నోట్లో వేసుకొని ‘ఈ స్వీట్‌కన్నా బావా అన్న నీ పిలుపే తీయగా ఉంది’ అన్నా. సిగ్గులమొగ్గైంది. ఆపై ఇక చూడాలి. నేను కూర్చుంటే తను నిలబడటం... నేను తిన్నాకే తను భోంచేయడం... ఈసారేంటో తన ప్రవర్తన కొత్తగా ఉంది. నేనూ తన చుట్టే తిరిగేవాణ్ని. మూడ్రోజులు మూడు క్షణాల్లా గడిచాయి.
ఇంటికొచ్చాను. ఆ రాత్రి నిద్రపడితే ఒట్టు. కళ్లు మూసినా, తెరిచినా మరదలు గాయత్రినే. ఎన్నాళ్లొ ఆగలేకపోయా. ఓరోజు వాళ్ల నాన్నకు ఫోన్‌ చేసి ‘మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. తనంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మలా చూసుకుంటా’ అన్నా. వరుసైనోడ్ని, పైగా మంచి ఉద్యోగం. పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే ఓకే చెప్పారు. సంతోషంతో గాయత్రికి చెబితే ‘ఛీ పో... నన్ను అంతగా ఇష్టపడితే నాతో ఒక్కమాటైనా చెప్పవా?’ అని అలకపాన్పు ఎక్కింది. ప్రసన్నం చేసుకోవడానికి చాలానే కష్టపడ్డా. కొన్నాళ్లయ్యాక గాయత్రి ఉద్యోగంలో చేరడానికి సిటీకొచ్చింది. వెళ్లి కలిశాను. చేతిలో ఓ ఫొటో ఆల్బమ్‌ పెట్టింది. నేను వూరెళ్లినపుడు జాతరలో, గుడి, చేల దగ్గర దిగిన ఫొటోల తీపి జ్ఞాపకాలన్నీ అందులో ఉన్నాయ్‌.
ఉగాదికి వూరెళ్లా. నాకన్నా ముందే మా ప్రేమవిషయం అమ్మకి చేరింది. ‘వాళ్లతో మనకు చాలా గొడవలయ్యాయి. మనకు పొసగదు. మేమో, వాళ్లొ తేల్చుకో’ అన్నారు అమ్మ, మామయ్య, అమ్మమ్మలు. ఎప్పుడో జరిగిన గొడవల్ని మా ప్రేమతో ముడిపెట్టొద్దన్నా వినరే. ‘అత్తమ్మవాళ్లు ఒప్పుకునేదాకా ఎదురుచూద్దాం’ అంది గాయత్రి. ఆర్నెళ్లు ఇంటిమొహం చూడలేదు. అయినా అమ్మ నుంచి పిలుపు లేదు. మరోవైపు ‘మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, వేరే సంబంధం చూసుకొమ్మంటావా?’ అని మామయ్య ఒత్తిడి. ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇంటికెళ్లా. వాళ్లు పంతం వీడలేదు. నేనో నిర్ణయానికొచ్చా.
గాయత్రి కుటుంబసభ్యుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకున్నాం. హైదరాబాద్‌లో కాపురం. కొన్నాళ్లు గడిస్తే అమ్మ మనసు మారుతుందని నా ఆశ. కానీ ఆ అంచనా తప్పింది. మేం చేసినదాన్ని అవమానంగా భావించి కొద్దిరోజులు ఇంట్లోంచి బయటికి రాలేదట అమ్మ, అమ్మమ్మలు. భర్తతోపాటు కొడుకూ మోసం చేశాడని ఏడ్చిందట అమ్మ. చాలా తప్పు చేశాననిపించింది. తర్వాత వెళ్లి క్షమించమని అమ్మ కాళ్లపై పడిపోయా. నోరు విప్పలేదు. మొహం కూడా చూడ్డానికి ఇష్టపడలేదు. నిరాశగా తిరిగొచ్చా. కొన్నాళ్లకు చెల్లి పెళ్లని తెలిసి ఆశగా వెళ్లా. నన్నో అపరిచిత వ్యక్తిలా చూశారు. కన్నీళ్లతోనే అక్షింతలు వేసి తిరిగొచ్చా. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాననే సంతోషం కన్నా నేనే ప్రాణం అనుకున్న అమ్మ నన్ను కాదనుకోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. కొన్నాళ్లు వేచి చూస్తే ఈ దుస్థితి తప్పేదేమో!

చెలి గేలిచేసింది...జీవితం గెలిచేసింది!
మనసుపడ్డ అమ్మాయికో ముద్దుపేరు పెట్టుకున్నాడు. కొన్నాళ్లు చాట్లాటలయ్యాక ఐలవ్యూ చెప్పాడు. అప్పటిదాకా బాగానే స్పందించిన అమ్మాయి ఖఠాఠ్‌... నీకేం అర్హతలున్నాయని ప్రేమించాలి?’ అంది. ఆ మాటను ఛాలెంజ్‌గా తీసుకున్న కుర్రాడు ప్రభుత్వోద్యోగం సంపాదించాడు. తర్వాతేంటి?
మ్మా, నేను... జీవితం సాగిపోవడానికో చిన్న ఉద్యోగం. ఇదీ నా ప్రపంచం. జాలీగా గడిచిపోతున్న సమయంలో తన పరిచయం వూహించని మలుపులకు కారణమైంది. ఫేస్‌బుక్‌ ద్వారా నా జీవితంలోకి వచ్చింది ఆమె. వరుసకు బంధువులమ్మాయే. ముద్దుగా ఖస్టార్‌’ అని పిలిచేవాణ్ని.
ఖహాయ్‌ ఎలా ఉన్నావ్‌? ఏం చేస్తున్నావ్‌?’ అంటూ ఓరోజు తెలియని నెంబర్‌ నుంచి మెసేజ్‌. కొద్దిరోజుల దాగుడుమూతలయ్యాక ఖనేను నీ స్టార్‌ని’ అంది. తనపై మొగ్గలా ఉన్న ప్రేమ పువ్వులా వికసించింది. ఉదయం నాలుగుతో మొదలై అర్ధరాత్రైనా మామధ్య సందేశాల వరద పోటెత్తుతూనే ఉండేది. ఖనా గురించి అసలు ఏమనుకుంటున్నావ్‌?’ ఉరుములేని పిడుగులా అడిగిందోసారి. ఇదే మంచి ఛాన్స్‌. ఖనువ్వుంటే నాకిష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అనేశా. మౌనమే తన సమాధానం. ఆపై ఎఫ్‌బీ చాటింగ్‌, మెసేజ్‌లు అన్నీ బంద్‌. ఆమె మనసులో నాకు స్థానం లేదని అర్థమైంది.
 ఒకరు వద్దంటే వదిలే రకం కాదు నేను! రోజూ తన కాలేజీ చుట్టూ చక్కర్లు కొట్టేవాణ్ని. పిలుపొస్తుందనే ఆశతో. కొన్నాళ్లయ్యాక వచ్చింది. కానీ వాళ్ల అమ్మనుంచి. ఖమా అమ్మాయిని సతాయిస్తున్నావట. ఇంకోసారలా చేస్తే బాగుండదు’ అని బెదిరిస్తూ. కోపం, కసి పెరిగాయి. ఖనేనంటే ఎందుకిష్టం లేదు? అసలు నాలో ఏం తక్కువ?’ ఓసారి నేరుగా అడిగా. దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. ఖచదువు, ఉద్యోగం, ఆర్థికపరిస్థితి ఎందులో నువ్వు నాకంటే ఎక్కువ? అసలు నీలో ప్రేమించడానికి ఏం ఉంది?’ అని. బాగా ఆలోచిస్తే తను చెప్పిందే నిజమనిపించింది.
పోటుగాడిలా పోటీ పరీక్షల పుస్తకం అందుకున్నా. ఏడాది బాగానే కష్టపడ్డా. అవతలి వాళ్లు నాకన్నా ఎక్కువ చదివారేమో! ఫలితాల్లో నా పేరు లేదు. కాళ్లావేళ్లాపడి పాత కొలువులోనే చేరా. కానీ ప్రతిక్షణం గుర్తొచ్చేది. తను అన్నమాటలే మనసుని ఈటెల్లా గుచ్చేవి. ఆ బాధ, నేనేం సాధించలేననే అపనమ్మకం... వెరసి విఫల ఆత్మహత్యా యత్నం చేశా. అప్పుడే కుటుంబసభ్యులు నాపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థమైంది. ఖనువ్వు ఉద్యోగం చేయకపోయినా ఫర్వాలేదు. ఇలాంటి పిచ్చిపనులు చేయొద్ద’ని ఏడ్చారు. తప్పు చేశాననిపించింది.
తర్వాతేంటి? నేను ఎదగాలి! కానీ... మళ్లీ ఆ అమ్మాయిని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నాల్లో పడిపోయా. సీతారాముల్ని కలిపిన ఆ ఆంజనేయుడి కాయిన్‌ను నా ప్రేమ గుర్తుగా పంపా. లంకాదహనం మా ఇంట్లో జరిగింది. ఖఇంకోసారి ఇలాంటి పిచ్చివేశాలేస్తే జైళ్లొ ఉంటావ్‌’ ఉరిమింది వాళ్లమ్మ. గొడవ పెద్దది కాకుండా అక్క రాయబారం నడిపింది. ఖపాపం అమ్మాయి... వదిలెయ్‌రా. ముందు తను కోరుకున్నట్టు నిన్ను నీవు నిరూపించుకో’ అంది. దగ్గరుండి ప్రోత్సహించింది. కోచింగ్‌కి సాయం చేసింది. ఈసారి కచ్చితంగా ఏదో సాధించి తీరాలనే కసి నా మనసులోకి ప్రవేశించింది.
మావాళ్ల ఆశీర్వాదం... నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఏడాదయ్యాక నాకు ప్రభుత్వోద్యోగం దక్కింది. నేను గెలిచాను అని తనకి చెప్పాలనుకున్నా. ఒక కొత్త సిమ్‌ కొని నాపేరు చెప్పకుండా ఖనాకు ఉద్యోగం వచ్చింది’ అని మెసేజ్‌ పంపా. తను పసిగట్టేసింది. ఖఆల్‌ ది బెస్ట్‌. నేనూ అమెరికన్‌ కంపెనీలో చేరా’ అని రిప్లై ఇచ్చింది. ఇదే అదనుగా మళ్లీ తన వెంటపడాలని మాత్రం ప్రయత్నించలేదు. తనకు తానుగా నా చేయి అందుకోవాలని కోరిక.
తెలిసో తెలియకో తనకి స్టార్‌ అని పేరు పెట్టుకున్నా. ఆకాశంలో మెరిసే నక్షత్రంలా ఉంటుందని. కానీ ఆ స్టార్‌ని ఎప్పటికీ చేరలేనని చాన్నాళ్ల తర్వాత అర్థమైంది. ఏదేమైనా నన్ను మార్చిన తనకి ధన్యవాదాలు.

అనురాగంలో అపశృతి! 

ద్దరక్కలు, పెద్దబావ, వాళ్ల బావలతో ఇల్లంతా సందడిగా ఉంది. ‘రారా పెళ్లికొడకా’ అన్నారు బావకి బావ నేనింట్లో అడుగు పెడుతుంటే. విషయం అర్థమైంది. కొద్దిరోజులుగా నన్నో ఇంటివాడ్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వాళ్లు. ఇప్పుడేదో సంబంధం తెచ్చినట్టున్నారు. ‘అమ్మాయిని చూడాల్సిన పన్లేదు. మీరే అన్నీ మాట్లాడేయండి’ అన్నా నవ్వుతూ. మనస్ఫూర్తిగా నా మంచి కోరే బంధువులపై నమ్మకంతో.
నా విషయానికొస్తే బీఈడీ పూర్తైంది. ప్రైవేటు స్కూళ్లొ ఉపాధ్యాయుడిగా చేస్తూనే ఎమ్మెస్సీ చదువుతున్నా. నేను ఓకే అన్నా నన్ను చూడాలన్నారు వాళ్లు. వెళ్లాం. అమ్మాయి సిగ్గులమొగ్గైంది. అన్నీ కుదిరి ముహుర్తం పెట్టేసుకున్నాం. నేనైతే ప్రత్యేకంగా తనకో ముత్యాలహారం ఇచ్చా. ఆపై ఫోన్లో కబుర్లు, బైక్‌పై షికార్లు. ముద్దూముచ్చట్లకు కొదవేలేదు. వారంలో పెళ్లనగా అమ్మాయి మేనత్త పిలిచింది. ‘బాబూ ఓసారి నీ సర్టిఫికెట్స్‌ తీసికొచ్చి చూపించు’ అంది ఆర్డరేస్తున్నట్టు. అడిగిన పద్ధతేం బాగోలేదు. పీకల్దాకా కోపమొచ్చినా, గొడవొద్దని ఆమె చెప్పినట్టే చేశా.
పెళ్లి ఘనంగా జరిగింది. అప్పగింతలవేళ అందరమ్మాయిల్లా ఏడవకుండా నవ్వుతూనే ఉంది నా భార్య. మేళం వాళ్లతో సహా అంతా వింతగా చూశారు. ‘కొందరైతే మీది లవ్‌ మ్యారేజీనా’ అనడిగారు. నాపై ప్రేమతో అలా ప్రవర్తిస్తుందనుకున్నా. రెండోరోజు మరో ట్విస్టు ఇచ్చింది. ప్రతి మగాడు తన జీవితంలో ఉత్కంఠగా ఎదురుచూసే రోజది. కానీ నా తొలిరాత్రి కాస్తా కాళరాత్రిలా మారింది. ప్రేమగా దగ్గరికెళ్తే విసురుగా తోసింది. మురిపెంగా మాట్లాడితే కసురుతూ మొహం తిప్పుకుంది. మూడ్రోజులూ అదే తంతు. చిన్నపిల్లని సర్దుకుపోయా. వారాలు మారినా సీన్‌ మారలేదు. ఓరోజు గట్టిగా నిలదీశా. ‘మా మేనత్త ఇలాగే చేయమంది’ అనేసరికి నిర్ఘాంతపోయా. రాన్రాను నాలో చిరాకు, కోపం ఎక్కువయ్యాయి. అది చూసైనా మారాలిగా! వూహూ.. పైగా ‘నువ్వేమైనా అంటే అత్త దగ్గరికెళ్తా’ అని బెదిరించేది. ఓసారి అదే నిజం చేసింది. చిన్న మాటన్నానని గడప దాటబోయింది. ఆపడానికి ప్రయత్నిస్తే నాపైనే చేయి చేసుకుంది.
సంబంధం కుదిర్చిన అన్నయ్యని తీస్కొని వెళ్లా. ‘ఇష్టం లేని పెళ్లి చేశారు. తను రాదు’ నిర్లక్ష్యంగా చెప్పింది వాళ్లత్త. ఎవరు బలవంతం చేశారు? ఎందుకు చేశారు? మరి పెళ్లి కాకముందు నాతో సంతోషంగా ఉన్న రోజుల మాటేంటి? దేనికీ సమాధానం లేదు. ఓపిక నశించి కొన్నాళ్లకి పంచాయతీ పెట్టించాం. ‘తాగొచ్చి కొడుతున్నాడు. అందుకే వెళ్లను’ అంటూ అడ్డంగా అబద్ధం ఆడేసింది నా పెళ్లాం. టీ, కూల్‌డ్రింక్‌ అలవాటు లేని నన్ను అందరిముందూ తాగుబోతుని చేసింది. అయినా పట్టించుకోకుండా రమ్మని బతిమాలా. విన్లేదు. నెల్లాళ్ల నిరీక్షణ ఫలించలేదు. విడాకులు తీస్కొమ్మన్నారు సన్నిహితులు. కానీ మనిషిగా ఆలోచించా. నా బాధంతా తన, తనవాళ్ల గురించే. మామయ్య అత్తమ్మని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. బామ్మర్ది చిన్నప్పుడే చదువాపేసి టీకొట్టు పెట్టుకొని డబ్బులు కూడబెట్టి అక్క పెళ్లి చేశాడు. దూరపు బంధువని మా బావ వాళ్ల బావ కూడా ఆర్థికసాయం చేశాడు. ఇప్పుడు మేం విడిపోతే వాళ్లందరి పరిస్థితేంటి? ఇవేం ఆలోచించదే! దీనంతటికీ కారణం వాళ్ల మేనత్తే. మా పెళ్లపుడు పసుపుకుంకుమల కింద ఇస్తానన్న భూమి ఇవ్వలేదని కక్ష కట్టి అలా చేయిస్తోందట. ఆమె చెప్పుడు మాటలలతో నా భార్య ఆడించినట్టల్లా ఆడుతోంది. ఈ మనసులో మాట చదివాకైనా తను మారుతుందనీ, నా చెంతకొస్తుందని ఆశిస్తున్నా.

ఇద్దరు అమ్మాయిల మధ్య...ఏకాకి! 

మామిడి తోరణాలు.. బంధువుల హడావుడి.. ఇల్లంతా సందడిగా ఉంది. తెల్లారితే మరదలితో పెళ్లి. కళ్ల ముందు మెదులుతున్న కలర్‌ఫుల్‌ జీవితాన్ని వూహించుకుంటున్నా. ఇంతలో అనుకోని ఉపద్రవం. పెళ్లి పనుల్లో ఉండాల్సిన మామయ్య తన కూతుర్ని కిడ్నాప్‌ చేశానంటూ ఇంటి మీదకు గొడవకొచ్చాడు. నాకేం అర్థం కాలేదు. నాక్కాబోయే భార్యని నేనెందుకు కిడ్నాప్‌ చేస్తా? అదే అడిగా. ‘నువ్వూ.. నీ గర్ల్‌ఫ్రెండ్‌ కలిసి చేశారీపని’ మరో మాట తూలాడు. వెంటనే స్రవంతికి ఫోన్‌ కలిపా. లౌడ్‌స్పీకర్‌ ఆన్‌ చేశా. ‘నీ మరదలెవరు? తనతో నాకేం పని? ఇలా అడగడానికి నీకేమైనా బుద్ధుందా’ తిట్టి మరీ ఫోన్‌ పెట్టేసింది. ఆఖరికి తెలిసిందేంటంటే ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని నా మరదలే ఓ ఫ్రెండ్‌ ఇంట్లో దాక్కుందట. ఇది తెలియగానే నేను షాక్‌. అసలిదంతా ఎందుకు జరిగిందంటే నా కథంతా మీకు తెలియాల్సిందే.
మరదలు పుట్టగానే నాకు పెళ్లాం పుట్టిందన్నారు పెద్దవాళ్లు. అచ్చం సినిమాల్లోలాగే. వాళ్ల అభీష్టాన్నే మా ప్రేమగా మార్చుకున్నాం. అలకలు.. గిల్లికజ్జాలు.. ఒకరిపై ఒకరికి చచ్చేంత అభిమానం.. బాల్యం నుంచి యవ్వనం దాకా మా మధ్య ముడిపడ్డ ముచ్చట్లెన్నో. అంతలా.. ప్రాణంలా ప్రేమించిన అమ్మాయిలో ఒక్కసారిగా వూహించని మార్పు. ఉద్యోగం కోసం తను పుణె వెళ్లొచ్చింది. నాకు టార్చర్‌ మొదలైంది. ‘బావా.. నిన్ను పెళ్లి చేసుకున్నవాళ్లెవరూ రెణ్నెళ్ల కంటే ఎక్కువ రోజులు కాపురం చేయలేరు’ అందోపూట. వేళాకోళమనుకున్నా. ఆపై దగ్గరికెళ్తే మొహం తిప్పుకునేది. పలకరిస్తే కళ్లెర్రజేసేది. మరదలి తీరు చిరాకు తెప్పించేది. తిరిగెళ్లాక కూడా అదేవరుస. ఫోన్‌ చేయదు. చేస్తే తీయదు. విసిగిస్తున్నానని ఫోన్‌ నెంబరే మార్చేసింది. తన మాట నా చెవిన పడక దాదాపు పిచ్చివాణ్నయ్యా.
మోడు వారుతున్న జీవితంలోకి వసంతంలా వచ్చింది స్రవంతి. గాయపడ్డ మనసుకి మంచి మాటలతో మందేసింది. దగాపడ్డ మనిషికి ప్రేమ పంచింది. ‘తన కోసం నువ్వెందుకు వెంపర్లాడటం.. నిన్ను కాదన్నందుకు తనేడవాలిగానీ’ అంటూ వూరడించింది. నా గతం తెలిసీ ప్రపోజ్‌ చేసింది. రెండేళ్లు మేం లవర్స్‌ అన్న విషయం ఎవరికీ తెలియనంత పద్ధతిగా ప్రేమించుకున్నాం.
ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగానికి ఎంపికయ్యా. మరదలితో పెళ్లికి రాయబారం పంపాడు మామయ్య. నేనంటే తనకిష్టం లేదు.. ఈ పెళ్లెలాగూ జరగదనుకుంటూ వాయిదాలు వేశా. సమయం చూసి స్రవంతితో నా ప్రేమ విషయం చెప్పాలనేది ప్లాన్‌. అయితే అనూహ్యంగా మరదలు పెళ్లికి ఒప్పుకుంది. ‘నువ్వూ ఒప్పుకోకపోతే మేం ఆత్మహత్య చేసుకుంటాం’ బెదిరించారు కన్నవాళ్లు. నా ప్రమేయం లేకుండానే ముహుర్తం పెట్టేశారు.
ఉద్యోగంలో చేరడానికి చెన్నై వెళ్లా. మరోవైపు పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇంకా నాన్చితే నష్టమని జరిగిందంతా స్రవంతికి చెప్పా. నీదే నిర్ణయమన్నా. నేనూహించని మాట చెప్పింది. ‘ముహుర్తాలు పెట్టుకున్నారుగా.. ఇక స్నేహితుల్లా విడిపోదాం’ అంది. ఆ షాక్‌ నుంచి కోలుకోక ముందే మరదలి మెసేజ్‌. ‘స్రవంతి ఎవరు? తనకూ నీకూ సంబంధమేంట’ని. కోపంతో మా లవ్‌స్టోరీ చెప్పేశా. నన్నిష్టపడనిదానివి నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావని నిలదీశా. తప్పు చేశానంది. అన్నీ మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకుందామంది. చేసేదేం లేక నేనూ రాజీకొచ్చా. కానీ నావల్ల స్రవంతి నష్టపోయిందనే అపరాధభావం కుంగదీసేది. తన కోసమే హైదరాబాద్‌ వచ్చేశా. కెరీర్‌ పరంగా, ఆర్థికంగా తోడు నిలిచా. పరోక్షంగా తనకో మంచి సంబంధం కుదిర్చా. ముగ్గురికీ ఆమోదయోగ్యమైన కొత్త జీవితం మొదలు కాబోతోందనే భరోసా కలిగింది నాలో.
అంతా ఓకే అనుకుంటుంటే ఇదిగో ఈ పెళ్లికూతురు జంప్‌. నా లవర్‌ని పెళ్లాడటానికి నువ్వెవరని స్రవంతి అడగటంతోనే అలా చేశానంది మరదలు. సామరస్యంగా విడిపోదామన్న మాజీ ప్రేయసి ఇలా చేస్తుందనుకోలేదు. ఏదేమైనా నా పెళ్లి పెటాకులైంది. పరువు గంగ పాలైంది. నేనే అందరిలో చెడ్డవాడిగా మిగిలిపోయా. ఇద్దరమ్మాయిల్ని ప్రేమించి, ఒక్కరితో జీవితం పంచుకోవాలనుకున్నా ఆ ఇద్దరి చంచల మనస్తత్వంతో ఏకాకిగా మిగిలిపోయా.

వంచన నాదే... వగచేదీ నేనే!

ఇంటర్లో మొదలయ్యాయి నాలో ప్రేమ వూసులు. అందుక్కారణం చంద్ర. నా క్లాస్‌మేట్‌. అందంగా, అణకువగా ఉండేవాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. క్లాసులో తనెక్కడున్నా నా కళ్లు వెతికేవి. మనసు మూగగాఆరాధించేది. ‘ఈరోజైనా అతడితో నా ప్రేమ విషయం చెప్పాలి’ ఇలా రోజూ అనుకునేదాన్ని. ఆగిపోయేదాన్ని. ఎందుకంటే తను ‘నో’ అంటే తట్టుకోలేను!

 సబ్జెక్టులో సందేహం ఇద్దర్నీ కలిపింది. తర్వాతే అర్థమైంది నేననుకున్నట్టు తను మరీ నెమ్మదేం కాదు! నోరు విప్పితే వసపిట్ట. కొత్త విషయాలెన్నో చెబుతుండేవాడు. చూస్తుండగానే కాలేజీ ముగింపుకొచ్చింది. ఇంకా ఆలస్యం చేయదల్చుకోలేదు నేను. ఓ శుభసమయాన ఆ మూడక్షరాల పదం పలికేశా. ‘నువ్వంటే నాకూ ఇష్టమే. కానీ మన ప్రేమ, పెళ్లి జరిగే పరిస్థితుల్లేవు’ ఒక్కమాటలో తేల్చేశాడు. ఏడుపాగలేదు. అయినా నేనేంటే ఇష్టమే అన్నాడుగా... ఎలాగైనా తను నా సొంతమవుతాడంది మనసు.

డిగ్రీ ఇద్దరం ఒకే కాలేజీలో చేరాం. మూడేళ్లలో ఒక్కరోజు విడిచి ఉండలేదు. కష్టసుఖాల్లో ఒకరికొకరం తోడున్నాం. పెళ్లికాని భార్యాభర్తల్లా మెలిగాం. ఇక డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగవేటలో పడిపోయాం. ఈలోపు అక్క పెళ్లి కుదిరింది. తనని పిలిచి ఇంట్లోవాళ్లకి పరిచయం చేద్దామనుకున్నా. కానీ ఎందుకో భయమేసి ఆగిపోయా.

నాకుద్యోగం వచ్చింది. తనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను కొలువులో చేరాక నాకో కొత్త ప్రపంచం కనపడింది. నాలాగే నలుగురైదుగురు కొలీగ్స్‌ ప్రేమలో ఉన్నారు. తర్వాత పెళ్లాడింది మాత్రం వేరే అబ్బాయిల్ని. తల్లిదండ్రుల్ని కష్టపెట్టలేమని.. కులం అడ్డొచ్చిందని.. అబ్బాయిది మంచి హోదా అని రకరకాల కారణాలు చెప్పారు. ఆ మాటలు నాపై ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. చంద్రకి నాకు మధ్య చాలా అడ్డుగోడలు. వాట్ని నేను బద్ధలు కొడతానేమోగానీ పెద్దల అంగీకారం ఉండదేమో అనిపించింది. స్వార్థమో, భయమో నేనూ సహోద్యోగుల బాటలో వెళ్లాలనుకున్నా.

ఒకప్పుడు చంద్ర మాట కోసం తపించే నేను మీటింగ్‌, పని ఒత్తిడంటూ రకరకాల అబద్ధాలు చెప్పి తననుంచి తప్పించుకునేదాన్ని. అయితే ఓరోజు విడవకుండా ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు. చిరాకుతో ఫోన్‌ ఎత్తా. ‘నాకుద్యోగం వచ్చింది. వెంటనే మీ ఇంటికొచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతా’ అన్నాడు సంతోషంగా. నా గుండెలదిరాయి. ఆ పూటకి ఏదోలా మేనేజ్‌ చేశా. తర్వాత ఏడాదిపాటు ఇదే తంతు. ఆఖరికి నువ్వంటే ప్రాణం అన్న నోటితోనే ‘నువ్వు నాకు నచ్చలేదు. మన పెళ్లి జరగద’ని తెగేసి చెప్పా.

కన్నవాళ్లు తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పి మంచి కూతురనిపించుకున్నా. మంచి భార్యగా సమాజం గౌరవిస్తోంది. కానీ నా మనసు సంద్రంలో రోజూ చెలరేగుతన్న లక్షల భావోద్వేగాలు నన్ను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భర్త ప్రేమ చూపించినప్పుడల్లా చంద్ర గుర్తొచ్చి మనసు కకావికలమవుతోంది. భర్తనీ, ప్రియుడ్నీ మోసం చేశాననే అపరాధభావం అనుక్షణం వేధిస్తోంది. పైగా చంద్ర నాపై చూపిన పెద్దమనసు ముందు నేనెంత అల్పురాలినో తలచుకొని కుంగిపోతున్నా. ఆఖరిసారి తనకి ఫోన్‌ చేసినపుడు మరోసారి ఆలోచించమని కన్నీళ్లతో అర్థించాడేగానీ నాపై కోపం చూపించలేదు. మేం సన్నిహితంగా దిగిన ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేయలేదు. ఇప్పటికీ తను నాపై అంతే ప్రేమతో ఉంటాడని తెలుసు.

తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డా. నిర్ణయం తీసుకోవాల్సిన వయసులో పెద్దవాళ్లు గుర్తొచ్చారు. ఇప్పుడు నన్ను నేనే మోసం చేసుకున్నాననే భావనలో కొట్టుమిట్టాతున్నా. అందుకే పెద్దల్ని ఒప్పించే ధైర్యం ఉంటేనే ప్రేమలో పడండి. ప్రేమ ఒకరితో, పెళ్లి మరొకరితో అయితే జీవితాంతం నాలాగే నటించాల్సి ఉంటుంది.

చెప్పలేదేం తల్లీ? అంత చేదయ్యామా..

సర్వం అనుకున్న కూతురు ప్రాణం ఉసూరుమనేలా చేసింది. వెలకట్టలేని మమకారం పంచినా ప్రేమ మైకంలో కన్నప్రేమనే ధిక్కరించింది. ఆ సంఘటనతో ఎంతటి క్షోభకి గురయ్యాడో చెబుతున్నాడో తండ్రి!కంగారు.. భయం.. సంతోషం.. అన్నీ కలగలిపి టెన్షన్‌తో అటూఇటూ తిరుగుతున్నా. లోపల పురిటినొప్పులతో నా భార్య. పదినిమిషాలయ్యాక ‘కంగ్రాట్స్‌ మీకు పాప’ంటూ కబురు. మహలక్ష్మి పుట్టిందనుకుంటూ మురిసిపోయా. ఆపై నా ప్రతిరూపాన్ని గర్వంగా గుండెలకు హత్తుకున్నా.
నా బంగారుతల్లి పుట్టిన మహత్యమేమో అన్నీ కలిసొచ్చేవి. తనతో రోజూ పండగే. తను ఏడిస్తే నాకు బాధ. నవ్వితే సంతోషం. తన కోసం గుర్రాన్నయ్యా.. పిల్లిలా అరిచా. అలిగితే కానుకనయ్యా. మంచి సమయం చూసి మహాలక్ష్మి అని పేరు కూడా పెట్టేశా. రెండున్నరేళ్ల నా నిరీక్షణ ఫలించి నా చిట్టితల్లి ‘నాన్నా’ అంది. నా జీవితంలో అదే బెస్ట్‌ డే.
పేరు లక్ష్మినే కానీ చదువులో సరస్వతి. ఐదులో క్లాస్‌ఫస్ట్‌ వచ్చింది. టీచర్లు తనకిచ్చిన గిఫ్ట్‌ అందుకొని ప్రపంచకప్పు గెలిచినంత సంతోషంగా యాభై మందికి చూపించా. ఏడులో ఆటల పోటీల్లో గెలిస్తే ఓ మెమొంటో ఇచ్చారు. ఆ పూట ఏం తినకుండానే నా కడుపు నిండింది. పదిలో తొంభైశాతం మార్కులొస్తే వూరంతా మిఠాయిలు పంచా. పైచదువులకు బిడ్డ పట్నం వెళ్తుంటే ముఖం పక్కకు తిప్పుకొని వెక్కివెక్కి ఏడ్చా. ‘డాడీ నిన్ను చూడాలనుంది’ అనడమే ఆలస్యం రెక్కలు కట్టుకొని వాలిపోయేవాణ్ని. ఇంటర్‌లో మంచి మార్కులొచ్చాయని బహుమతిగా నేనే ఓ స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చా. మా ఇద్దర్ని కలుపుతుందనుకున్న ఆ పాడు వస్తువు మా అనుబంధంలో చిచ్చు పెడుతుందని వూహించలేకపోయా.
రెండో ఏడాది పరీక్షలు రాసి ఇంటికొచ్చింది కూతురు. రాగానే ఎప్పట్లాగే నన్ను హత్తుకోలేదు. మనసారా పలకరించలేదు. అమ్మపైనా ప్రేమ చూపదే! ఎప్పట్లాగే తనని గారాబం చేయబోతుంటే ‘మీవన్నీ పాత పద్ధతులు. కొత్తగా ఆలోచించండీ’ అంటూ చిన్నబుచ్చుకునేది. తన ప్రవర్తన కొత్తగా అనిపించినా తనన్నదే నిజమనుకొని మిన్నకుండిపోయా. ఓరోజు ఫ్రెండ్‌ పెళ్లికెళ్తానంది. ‘తోడురానా తల్లీ’ అనడిగా. ‘వ్వాట్‌ డాడ్‌.. నేనింకా చిన్నపిల్లనా?’ అని కసురుకుంది. నా మొహం చిన్నబోయింది. ఇక రోజులో పద్దెనిమిది గంటలు సెల్‌ఫోన్‌తోనే గడిపేది. అనుమానమొచ్చి స్నేహితురాలిని విచారించా. నా గుండె పగిలే మాట చెప్పిందా అమ్మాయి. నా బంగారం ఒకబ్బాయిని ప్రేమిస్తోందట. తట్టుకోలేక ‘ఇది నిజమేనా తల్లీ?’ అనడిగా. కోపంతో వూగిపోయింది. ‘అబద్ధం. అయినా నీకు అనుమానం వస్తే నన్నడగాలిగానీ నా ఫ్రెండ్‌ని అడుగుతావా?’ అని విరుచుకుపడింది.
ఓరోజు ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లొస్తానంది. సాయంత్రం, రాత్రి అయినా రాదే! గుండెలదిరిపోయాయి. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌. ‘మా ఇంటికి రాలేదంకుల్‌’ అంది ఫ్రెండ్‌. పిచ్చివాళ్లలా అర్థరాత్రుళ్లూ తిరుగుతూనే ఉన్నాం. తెల్లవారుతుండగా ఓ కొత్త నెంబర్‌ నుంచి ఫోన్‌. నా చిట్టితల్లే. ఆతృతగా అడిగాం ఎక్కడున్నావని. ‘నేను పెళ్లి చేసుకున్నా. నన్ను వెతకొద్దు’ అంటూ పెట్టేసింది. ఆ క్షణం నా శ్వాస ఆగిపోతే బాగుణ్ణనిపించింది. నెంబర్‌ పోలీసులకిచ్చి కేసు పెట్టాం. సిటీ నుంచి వచ్చిందన్నారు. ఆరోజే పరుగెత్తుకెళ్లాం. తిరిగితిరిగి కాళ్లు చతికిలబడ్డాయి. ఏడ్చిఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. జాడ మాత్రం లేదు. కొన్నాళ్లయ్యాక చిరునామా తెలిసినా ఏం చేయలేకపోయాం.
పిల్లను అదుపులో పెట్టుకోలేకపోయారన్నారంటూ బంధువులు, చుట్టుపక్కల ఎత్తిపొడుపులు. ఆ బాధతోనే అర్థాంగి మంచం పట్టింది. అయినా మా కష్టం తనకి పట్టలేదు. ఇరవై ఏళ్లు మేం పంచిన మమకారం కన్నా ఏడాదో, రెండేళ్లొ ఆ అబ్బాయి ఇచ్చిన ప్రేమే గొప్పదైంది. కానీ ‘డాడీ! నేను ఆ అబ్బాయిని ప్రేమించా’ అని ఒక్కమాట చెప్పి ఉంటే ఆలోచించేవాణ్ని. నా కూతురికి తగ్గవాడైతే కాళ్లు కడిగేవాణ్ని. కానీ అంతా అయిపోయింది. తను గడప దాటేముందు క్షణం మా గురించి ఆలోచించి ఉంటే ఈ క్షోభ తప్పేదే. అయినా ఇప్పటికీ తను బాగుండాలనే కోరుకుంటున్నాం. ఎంతైనా కన్నవాళ్లం కదా!

వద్దు గురూ ఇలాంటి స్నేహాలు

 చురుకైన, తెలివైన అమ్మాయిన్నేను. సొంతడబ్బా కాదిది. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరిదీ ఇదేమాట. పది వరకూ సొంతూళ్లొ చదివా. ఇంటర్‌ కరీంనగర్‌లో. ప్రతిభకుతోడు అందరితో సఖ్యంగా ఉండటంతో కాలేజీలో నేనందరికీ ఇష్టం. రెండేళ్లు జాలీగా గడిచాయి. పైచదువులకోసం సిటీ బస్సెక్కక తప్పలేదు. అప్పుడైతే ఏడుపే.
క్లాసులో స్వీటీ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మాది ఒకే క్లాసు, ఒకే బెంచీ. హాస్టల్‌ వేరే. అయితేనేం? ఎవరికి ఖాళీ ఉన్నా ఇంకొకరి గదిలో వాలిపోయేవాళ్లం. మమ్మల్నంతా ‘ఒకే గూటి పక్షులు’ అనేవాళ్లు. కొన్నాళ్లకి మేం ఒకే హాస్టల్‌ గదికి మారాం. అప్పట్నుంచి ఒకే తనువు, ఒకే మనసులా మెలిగేవాళ్లం.
వేసవి సెలవులిచ్చారు. స్వీటీని చూడకుండా, మాట్లాడకుండా ఉండటం నావల్ల కాలేదు. ఎప్పుడెప్పుడు కాలేజీ తెరుస్తారా అని ఎదురుచూశా. తను కనపడగానే పరుగెత్తి ఆనందంగా హత్తుకున్నా. కానీ స్వీటీ ఉలకదూ పలకదు. ఎదురుపడితే తల తిప్పుకునేది. నోరు తెరిస్తే మూతి ముడుచుకునేది. నిలదీస్తే ‘నువ్వంటే పిచ్చి పెంచుకుంటున్నా. ఇదిలాగే కొనసాగితే ఏమైపోతానో అని భయమేస్తోంది. అందుకే దూరంగా ఉంటున్నా’ అంది. ఆ సమాధానంతో నిజంగానే తను పిచ్చిదానిలా కనిపించింది. అయినా తమాయించుకొని ‘స్నేహంలో ఇవన్నీ భాగమే. ఎవరికేం కాదు. మునుపటిలా ఉండు’ అని నచ్చజెప్పా. ‘అయితే నేను చెప్పినట్టు వినాలి’ షరతు పెట్టింది. సరేనన్నా.
అప్పట్నుంచి ప్రత్యక్ష నరకం చూపించేది. ‘నువ్వు నాతోనే ఉండాలి. నాతోనే మాట్లాడాలి’ అనేది. ఎవరితోనైనా సన్నిహితంగా ఉంటే గొడవ, ఏడుపు. అమ్మాయిలైనా, అబ్బాయైనా. ఏం చేయాలో అర్థం కాకపోయేది. ఇంకొన్నాళ్లకైతే ఏకంగా బెదిరింపులకే దిగింది. అలాగని తనని వదల్లేను. కాదని వేరొకరితో మాట్లాడలేను. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని భయం. నా లవర్‌ నానీతో ఇవన్నీ చెప్పుకొని ఏడ్చేదాణ్ని.
స్వీటీని ఎలాగైనా మార్చాలని నా పాకెట్‌మనీతో ఓ సైకాలజిస్టు దగ్గరికి తీస్కెళ్లా. మనోవ్యాధి ముదిరిందన్నారు. వెంటనే చికిత్స ప్రారంభించాలనీ, పదివేలు ఖర్చవుతుందన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. ఇక తను చెప్పినట్టే వినడం మొదలెట్టా. నా స్నేహితులందరికీ దూరమయ్యా. పోనీలే.. జీవితంలో ఒక్క బెస్ట్‌ఫ్రెండ్‌ అయినా మిగులుతుందని సర్దిచెప్పుకున్నా. ఇన్ని బాధలు అనుభవిస్తూనే బీటెక్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి బంగారు పతకం అందుకున్నా.
ఏడాది గడిచింది. ఇప్పుడు ఆ ఒక్కగానొక్క స్నేహితురాలూ నాతో లేదు. ఏమైందో తెలియదుగానీ మా చదువులయ్యాక నాతో మాట్లాడ్డం తగ్గించింది. ఈ గందరగోళంలో ఉండగానే నాకు నానీతో పెళ్లైంది. తర్వాత కొన్నాళ్లకు నేనే ఫోన్‌ చేశా. అవే పొడిపొడి మాటలు. ఆపై నాకు పాప పుట్టింది. అప్పుడే తన పెళ్లి కుదిరింది. రమ్మంటూ శుభలేఖ పంపింది. పాపకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెళ్లలేకపోయా. దాన్ని తప్పుగా అర్ధం చేసుకుందో లేక నాపై ద్వేషం పెంచుకుందో ఫోన్‌ నెంబర్‌ మార్చేసింది. జీమెయిల్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలు డిలీట్‌ చేసింది. అసలు తనను కలిసే, మాట్లాడే వీలు లేకుండా చేసింది. ఎందుకిలా చేసిందో? ఆ చిత్రమైన వైఖరేంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. తన కోసం నేను నా స్నేహితుల్ని వదులుకున్నా. చిన్నచిన్న ఆనందాలకు దూరమయ్యా. తన వెంటే ఉండి అనుక్షణం నరకం అనుభవించా. బహుమానంగా నన్నో శత్రువులా భావించి తనే కనుమరుగైంది. సంతోషంలో, ఆపదలో తోడుండేవారు నిజమైన స్నేహితులు. నాకు ఆపదలు తెచ్చిపెట్టినా తనే నా ఫ్రెండ్‌ అనుకున్నా. కానీ దారుణంగా మోసం చేసింది. ఇలాంటి స్నేహం విలువ తెలియనివాళ్ల కోసం ఎవరూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు.

ఆన్‌లైన్‌ ప్రేమ.. ఆశయాన్ని చిదిమేసింది 

బాగా చదవాలి.. మంచి జాబ్‌ కొట్టాలి.. ఇదీ నా లక్ష్యం. మొదట్నుంచీ సరదాలు, ప్రేమలకు దూరంగా ఉన్నా. ఫలితం.. బీటెక్‌లో ప్రాంగణ నియామకానికి ఎంపికయ్యా. చేరడమే తరువాయి. కలకు అడుగు దూరంలో నేను.
ఖాళీగా ఉన్నానని ఓరోజు ఫేస్‌బుక్‌ తెరిచా. ఓ అబ్బాయి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌. అందంగా ఉన్నాడు. మంచి ఉద్యోగం. బుద్ధిమంతుడనుకొని ఓకే చేశా. ‘హాయ్‌.. ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు’ మర్నాడే సందేశం. నేనూ స్పందించా. పలకరించే తీరు, మాటల్లో మర్యాద నన్నాకట్టుకున్నాయి. ఎప్పుడూ ఏ కుర్రాడ్నీ పట్టించుకోని నేను తన మెసేజ్‌ కోసం ఎదురుచూసే స్థాయికి చేరా.
చాటింగ్‌ మాటల్లోకి మారింది. తన గొంతు వినకపోతే ప్రాణం పోయేది. తనూ అంతే ఆపేక్ష చూపేవాడు. ఇదిలా కొనసాగుతుండగానే ‘నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా’ అన్నారు నాన్న. ఆలస్యం చేయలేదు. మనోహర్‌తో పరిచయం, ప్రేమ అన్నీ చెప్పేశా. ఒకర్నొకరు నేరుగా చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ప్రేమేంటని ఆశ్చర్యపోయారు. అమ్మతో ప్రతీది పంచుకునేదాన్ని. ప్రేమ విషయం దాచినందుకు చాలా నొచ్చుకుంది. అయినా వాళ్లేం నాపై అరవ లేదు. బంధించలేదు. వాళ్లకి నేనంటే ప్రాణం. ‘సరే.. తను, తన కుటుంబం మంచిదైతే పెళ్లికి ఒప్పుకుంటాం’ అన్నారు. అంతా అనుకూలంగా ఉండాలని ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో.
వారమయ్యాక ప్రేమ ఫలితాలొచ్చాయి. నాకు ప్రతికూలంగా. ‘అబ్బాయి ఓకే. అతడి కుటుంబ వివరాలే బాగా లేవు’ అన్నారు నాన్న. ఆధారాలూ చూపారు. నా నోట మాట లేదు. ‘నాక్కొంచెం సమయం ఇవ్వండి. ఏది మంచో, ఏది చెడో తెలుస్తుంది’ అంటే ఒప్పుకున్నారు. జరిగిందంతా మనోహర్‌కి వివరించా. నాకోసం పోరాడుతున్నావ్‌. నువ్‌ నా పాలిట ప్రేమదేవతవన్నాడు. అతడిపై ప్రేమ రెట్టింపైంది. కానీ ఎన్నిరోజులు గడిచినా మావాళ్లు కోరినట్టు అతడి కుటుంబం గురించి మంచి ఆధారం చూపలేకపోయా.
అన్నీ అనుకూలంగా ఉంటే అమ్మానాన్నలు మా ప్రేమను ఆశీర్వదించేవాళ్లే. నాకాదృష్టం లేదు. నేనూ కన్నవాళ్లని గౌరవించాల్సిందే! ‘మనోహర్‌.. నన్ను మర్చిపో. నేను నీ జీవితంలోకి రాలేదనుకో’ అని మెయిల్‌ పెట్టా. బాధ దిగమింగుకుంటూనే. ఈ సమయంలోనే శిక్షణకు రావాలంటూ కంపెనీ నుంచి పిలుపు. వెళ్లా. ‘ప్లీజ్‌ ఒక్కసారి మాట్లాడు’ అంటూ తన నుంచి వరుస మెసేజ్‌లు, మెయిళ్లు. బాధతో పనిపై దృష్టిపెట్టలేకపోయా. అయినా ఏం చేయలేని దుస్థితి. ఈలోపు ఓ విదేశీ సంబంధం వచ్చింది. నాలోనూ స్వార్ధం ప్రవేశించింది. ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పా. ముహుర్తాలు పెట్టుకునే సమయానికి ఎక్కువ కట్నం ఇస్తున్నారని అతడు మరో అమ్మాయికి తాళి కట్టాడు. చాలా ఫీలయ్యా. ఆ బాధ చాలదా అన్నట్టు శిక్షణలో పరీక్షలు క్లియర్‌ చేయలేదని ఆఫీసు నుంచి వెనక్కి పంపారు. ఈసారి దుఃఖం ఆగలేదు. ఈ బాధ నుంచి తేరుకోకముందే అమ్మానాన్నలు మరో సంబంధం తెచ్చి పెళ్లి చేశారు.
చదువయ్యేదాకా నా జీవితం నా చేతుల్లోనే ఉండేది. ఎప్పుడైతే ఫేస్‌బుక్‌కి అతుక్కుపోయానో అప్పట్నుంచే వూహించని మలుపులు తిరిగింది. ఏదేమైనా నావల్ల ఒకరు నష్టపోయారనే బాధ ఇప్పటికీ వెంటాడుతోంది. అందుకే అతడ్ని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. ‘మనోహర్‌.. ప్రేమించడానికి రెండు మనసులు చాలు. ఆ ప్రేమ ఫలించి ఇద్దరు ఒక్కటవ్వాలంటే మాత్రం రెండు కుటుంబాలూ కలవాల్సిందే. నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్లు ఏడిస్తే నేను సుఖంగా ఉండలేను. అందుకే అలా చేయాల్సి వచ్చింది’.
ఫ్రెండ్స్‌.. empty mind is devils workshop అంటారు. ఫలిస్తుందో, లేదో తెలియని ఆన్‌లైన్‌ ప్రేమ కోసం కెరీర్‌ని పణంగా పెట్టకండి. ఉన్న సమయాన్ని ప్రతిభ పెంచుకోవడానికి ఉపయోగించండి. నేనలా చేసి ఉంటే నా స్వప్నం నెరవేరేదే. నా మాట వింటారని ఆశిస్తున్నా.

అక్కా అంటూనే ముంచేశాడు!

అక్కా అని ఆప్యాయతగా పిలిస్తే అమ్మలా ఆదరించింది. బాగు పడతాడని వెలకట్టలేని సాయం చేసింది. కానీ... ఆ నమ్మకద్రోహి ఏం చేశాడు?'ఉషా త్వరగా తయారవ్వు. ఆసుపత్రిలో ఉన్న నా ఫ్రెండ్‌ని చూసొద్దాం'... శ్రీవారి కేకతో కంగారు మొదలైంది. 'సీరియసేం లేదులే. చిన్న జబ్బే' నా గాబరా గమనించి ఆయనే చెప్పడంతో వూపిరి పీల్చుకున్నా. నా మనస్తత్వమే అంత. నా అన్నవాళ్లు కష్టాల్లో ఉంటే తట్టుకోలేను. మావారూ అంతే.
పలకరింపులయ్యాయి. పండ్ల సంచి ఆయన చేతిలో పెట్టి లేవబోతుంటే పక్కబెడ్ నుంచి ఒక్కసారిగా అరుపులు, కేకలు. ఒళ్లంతా కాలిన ఓ అమ్మాయి దీనంగా అరుస్తోంది. బయటికొస్తుంటే ఆమె తాలూకు బంధువులు కనిపించారు. మనసు కలుక్కుమంది. ఉండబట్టలేక మీ అమ్మాయికేమైందనడిగా. 'దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంటే ప్రమాదవశాత్తు అంటుకుంది' ఏడుస్తూనే చెప్పారు ఆమె అన్నావదినలు. అమ్మానాన్నలు లేరట. చాలా పేద కుటుంబం. ఇప్పటికే చికిత్సకు చాలా ఖర్చైందట. చెల్లెలి కోసం ఆ అన్నయ్య పడుతున్న తపన చూసి నా కళ్లు చెమర్చాయి. ఐదువేలు వాళ్ల చేతిలో పెట్టి అక్కణ్నుంచి కదిలాం.

రెణ్నెళ్త్లెంది. 'నేనండీ ప్రసాద్‌ని. ఆరోజు మీరు మాకు సాయం చేశారు. మా చెల్లి పూర్తిగా కోలుకుంది. మీ మేలు మర్చిపోలేం. మరోసారి థాంక్స్' అన్నాడు ఫోన్ చేసి. తర్వాత అప్పుడప్పుడు పలకరించి యోగక్షేమాలు అడిగేవాడు. అభిమానం కురిపించేవాడు. అతడి మాటల్లో నిజాయతీ కనిపించేది. ఓసారి నేనే ఇంటికి ఆహ్వానించా. తర్వాత రాకపోకలు పెరిగాయి. నన్ను అభిమానంతో 'అక్కా' అనేవాడు. పిల్లలు మామయ్యా అంటూ తనచుట్టే తిరిగేవారు. చిన్నచిన్న పనులుంటే క్షణాల్లో చేసిపెట్టేవాడు ప్రసాద్. రక్తం పంచుకు పుట్టిన అక్కా తమ్ముడిలా మా బంధం బలపడింది.
ఏడాది గడిచింది. 'అక్కా నేనో చీటీ పాడా. హామీ సంతకం పెట్టవా?' అన్నాడోరోజు. ట్రావెల్స్ వ్యాపారం పెడతాడట. రెండ్రోజులు ఆలోచించాం. మేం ఆదుకుంటే వాళ్ల కుటుంబం బాగుపడుతుంది. మా చేతి అన్నం తిన్నవాడు మోసం చేయడనే భరోసాతో సంతకం పెట్టా. కొద్దిరోజులకే ఇంకో లారీ కొనాలన్నాడు. ఈసారి మావారి వంతు. ఏడాదిపాటు చీటీ డబ్బులు బాగానే కట్టాడు. ఆ తర్వాతే మొదలైంది మమ్మల్ని నిలువునా ముంచే కార్యక్రమం. రోజూ ఇంటికొచ్చేవాడు వారం రోజులుగా పత్తా లేడు. ఫోన్ కూడా చేయలేదు. మనసేదో కీడు శంకించింది. వాళ్లింటికి పరుగెత్తాం. 'రెండ్రోజుల కిందటే కుటుంబమంతా వేరే వూరెళ్లిపోయారుగా' పక్కింటివాళ్ల మాటతో మా గుండెలు బద్ధలయ్యాయి.

పదిరోజులు ఇంట్లో మౌనవ్రతం. ఏం చేయాలో తెలియలేదు. ప్రసాద్ బంధువులిళ్లకెళ్లాం. 'ప్రసాద్ పారిపోయాడా? తనలాంటివాడు కాదే?' మమ్మల్నే ఎగాదిగా చూశారు. తనే వస్తాడని కొండంత ఆశతో ఎదురుచూశాం. నెలలు, ఏళ్లు గడిచినా రాలేదు. డబ్బులు కట్టమంటూ నోటీసులు మాత్రం వచ్చాయి. అప్పులు చేసి, నగలు తాకట్టు పెట్టి పది లక్షలు చెల్లించాం. ఆ పీడ వదలడానికి నాలుగేళ్లు పట్టింది.

మనిషి కష్టాల్లో ఉంటే సాటి మనిషిగా స్పందించాం. ఆప్యాయత చూపుతున్నాడని ఆదుకోవాలనుకున్నాం. అదే మా కొంప ముంచింది. ఇప్పుడు ఎవరికైనా రూపాయి సాయం చేయాలన్నా మనసొప్పడం లేదు. మంచితనానికైనా హద్దుండాలి అని మా పెద్దలంటుండేవాళ్లు. అప్పుడర్థం కాలేదు. ఇప్పడు అనుభవంలోకి వచ్చింది. ఇలాంటి ప్రసాద్‌లు కాచుకొని ఉంటారు జాగ్రత్త.

నేరం అతడిది.. శిక్ష నాకా?
‘అబ్బాయిది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. ఒక్కడే కొడుకు. మంచి కుటుంబం. మరోసారి ఆలోచించండి’ మధ్యవర్తి మాటతో అమ్మానాన్నలు కరిగిపోయారు. ఎదురింటి ఆంటీ నన్ను కోడలుగా చేసుకోవాలని అడిగించడం ఇది మూడోసారి. కన్నవాళ్లు నా అభిప్రాయమడిగారు. అబ్బాయి బాగుంటాడు. మంచి ఉద్యోగం. నేనూ అభ్యంతరం చెప్పలేదు.
ముహుర్తం పెట్టుకున్నాం. పెళ్లికింకా మూణ్నెళ్లుంది. నేనూ అందరిలాంటి అమ్మాయినేగా! కాబోయే భర్తతో కబుర్లు చెప్పుకోవాలనీ.. అప్పుడప్పుడు చాటుమాటుగా కలుసుకోవాలని తెగ ఉబలాటంగా ఉండేది. కానీ తను పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. ఆగలేక నేనే ఓసారి ఫోన్‌ చేశా. ‘కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నా సంజూ.. పెళ్లయ్యాక నువ్వు చెప్పినట్టే వింటాగా’ అంటూ నా వూహలకు రెక్కలు తొడిగాడు.
పెళ్లి ఘనంగా జరిగింది. మొదటిరాత్రి. ‘ముందు మనం స్నేహితుల్లా ఉందాం. ఒకర్నొకరం బాగా అర్థం చేసుకున్నాక నిన్ను భార్యగా అంగీకరిస్తా’ అని చిత్రమైన ప్రతిపాదన తెచ్చాడు తను. ఒప్పుకున్నా. కొన్నాళ్లు గడిచాయి. ఇద్దరి మధ్య కావాల్సినంత ఏకాంతం. అయినా ఆయన కొత్త పెళ్లాన్ని పక్కనపెట్టి ఎప్పుడూ ఫోన్‌తోనే గడిపేవాడు. గంటలకొద్దీ చాటింగ్‌, ఎవరితోనో మాట్లాడ్డం. బాత్రూమ్‌కెళ్లినా ఫోన్‌ వదలడు. మొదట్లో వింతగా అనిపించేది. తర్వాత చిరాకేసేది. నేనే చొరవ చేసి మాట్లాడితే మొహం చిట్లించేవాడు. పొరపాటున నా చేయి తగిలితే విసుక్కునేవాడు.
నేనంటే తనకిష్టం లేదని అర్థమైంది. అలాంటపుడు నన్నెందుకు పెళ్లాడ్డం? అదే అడిగా. ‘శర్వాణిని ప్రేమించా. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. మావాళ్ల బలవంతంతో నిన్ను పెళ్లాడా’ అంటూ నా ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. ఆపై మరీ ఘోరంగా తయారైంది నా పరిస్థితి. పూలు పెట్టుకున్నా, కాళ్లకు పట్టీలు వేసుకున్నా ఒప్పుకునేవాడు కాదు. ఎన్నో ఆశలతో.. అందమైన జీవితం వూహించుకున్న నాకు నిద్రలేని రాత్రులే దిక్కయ్యాయి.
నెలలు గడిచినా తనలో మార్పు లేకపోయేసరికి వాళ్ల అమ్మ, అక్కలకి విషయం చెప్పా. నా ముందే అతడ్ని కడిగేశారు. ‘నువ్వేం భయపడకమ్మా. వాడు ప్రేమించిన అమ్మాయికి పెళ్లైంది. తనే మారతాడులే’ అని ధైర్యం చెప్పారు. కానీ అదీ జరగలేదు. అమ్మానాన్నలతో గోడు వెళ్లబోసుకున్నా. ఇరు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. అయినా తను పట్టించుకుంటేగా!
నేనే స్వయంగా రంగంలోకి దిగా. మా ఆయన ప్రేమించిన అమ్మాయిని వెతికి పట్టుకున్నా. ఎందుకిలా చేస్తున్నావని నిలదీశా. నేను కలలో కూడా ్చహించని విషయాలు చెప్పింది తను. ఆమెకి డబ్బులిచ్చి మరీ మాట్లాడించుకుంటున్నాడట మా ఆయన. అసలు మీ ఆయన సంసారానికే పనికి రాడు అందామె. చదువుకునే రోజుల్లో జూనియర్‌ అబ్బాయిలను లైంగికంగా వేధించేవాడట. ఇవన్నీ వింటుంటే నా నోట మాట రాలేదు. డాక్టరు దగ్గరికెళ్దాం రమ్మన్నాను. రాలేదు. నాకేం సమస్య లేదు. కావాలంటే నీకు విడాకులు ఇస్తాగానీ నువ్వు చెప్పినట్టు చేయనన్నాడు. విషయం తేటతెల్లమైంది. నా బతుకు బుగ్గిపాలైంది. ఈ మధ్యే మేం విడాకులు తీసుకున్నాం.
అతడి గురించి వాళ్లింట్లో ముందే తెలుసు. తెలిసీ ఇలా చేశారు. తమ అబ్బాయి లేదా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే పెద్దవాళ్లు కులం, గుణం, మంచి కుటుంబం, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ల గురించి వెతుకుతారు. అలాగే ఎదుటివాళ్ల పరిస్థితేంటి? అని ఒక్కసారి ఆలోచిస్తే నాలా ఎవరికీ అన్యాయం జరగదు.

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list