ఆమె మనసు... నలుపు
అందం మనసుకి సంబంధించింది... శరీరానికి కాదు. ఈ నిజం తెలుసుకోలేక బలైపోయానంటున్న ఓ యువకుడు.
‘అమ్మాయి రంగు తక్కువ. మరోసారి ఆలోచించరా’ నసుగుతూనే ఉంది అమ్మ. నేనేం పట్టించుకోలేదు. తన మనసు నాకు నచ్చింది. అంతే. ‘అమ్మాయి నచ్చింది’ మరో మాటెత్తకుండా చెప్పేశా. పెళ్లిచూపులు ముగిశాయి.
నెల కిందటే పరిచయమైంది తను. మొహంపై చెరగని చిరునవ్వు. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆమె సొంతం. ఈరోజుల్లో ఇలాంటి అమ్మాయిలు అరుదు. ఇదే చెప్పి పెద్దల్ని ఒప్పించా. రంగు తక్కువని గొణిగినా నా బలవంతంతో ఒప్పుకున్నారు. ముహూర్తం పెట్టేసుకున్నాం. నెలరోజుల్లో పెళ్లి.
రోజులు గడుస్తున్నా అమ్మ అసంతృప్తి తగ్గలేదు. ‘అమ్మాయి నలుపు. నాకు నచ్చలేదు’ రోజుకు పదిసార్లైనా గుర్తు చేసేది. విధిలేక ‘మీరు చూసిన అమ్మాయినే చేస్కుంటా’ అని కన్నవాళ్లకి మాటిచ్చా. మొదటి సంబంధం కాన్సిల్ అయింది.
తొందర్లోనే నా జీవితంలోకి ఓ అందగత్తె వచ్చింది. కోడల్ని చూసి అమ్మ మురిసిపోయేది. తనతో బయటికెళ్తే నేనూ గర్వపడేవాణ్ని. కానీ తను ఇంట్లోకి అడుగుపెడుతూనే ఏమందో తెలుసా? ‘ఇది ఇల్లా? ఓల్డేజీ హోమ్‌నా?’ అంది అమ్మమ్మ, నాన్నమ్మలను ఉద్దేశించి. మా గుండెలదిరాయి. ఆ ఒక్కరోజే కాదు... ప్రతిరోజూ తూటాల్లాంటి మాటలతో మా మనసుల్ని ఛిద్రం చేసేది. ఏరోజు ఏం వినాల్సి వస్తుందో అని హడలిపోయేవాళ్లం. నోటికి ఏది వస్తే అది వాగేది. మనుషులంటే లెక్క లేదు. నెల తిరిగేలోపే స్వర్గంలాంటి ఇంటిని నరకం చేసింది.
వేరు కాపురం పెడితే తను మారుతుందనుకుంది అమ్మ. పెట్టాక అదీ జరగలేదు. మీ అమ్మానాన్నలతో మాట్లాడొద్దు... కలవొద్దు... అని షరతులు పెట్టేది. ఒక్కగానొక్క కొడుకు జీవితాన్ని నాశనం చేశానని అమ్మ ఏడ్వని రోజు లేదు. తన టార్చర్ భరించలేక ఓరోజు ఆత్మహత్యా యత్నం చేసి ఓడిపోయా. దీంతో తన దృష్టిలో మరింత చులకనయ్యా. చేతకానివాడిననేది. గృహహింస కేసు పెడతానని బెదిరించేది.
మూడేళ్లు గడిచాయి. ఇప్పటికీ నాకు అవే కష్టాలు. మరోవైపు నేను వదులుకున్న అమ్మాయి భర్తతో, పండంటి బాబుతో వూళ్లొ నా కళ్లముందే తిరుగుతోంది. తనని చూసినప్పుడల్లా మనసుకి రంపపు కోత. మేం పెళ్లి రద్దు చేసుకుంటున్నాం అన్నపుడు మాపై గొడవకు దిగలేదు. హుందాగా సెలవు తీసుకుంది. నన్ను మరుగుజ్జును చేసింది. అంతమంచి అమ్మాయిని వదులుకున్నందుకు ఇప్పుడు అందరం బాధ పడుతున్నాం. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? మనం చేసిన తప్పులకు వచ్చే జన్మలో శిక్ష పడుతుందనేది అబద్ధం. ఇప్పుడే అనుభవించి తీరాలి. నేనే నిదర్శనం.
మారాను నేను... మన్నించు నన్ను!
నా అనుభవం చదివాక చాలా మందికి నాపై అసహ్యం వేయొచ్చు. కొందరు జాలి చూపొచ్చు. కానీ మీరు నాలా ఉండొద్దన్నదే నా కోరిక అంటున్న ఓ యువకుడి అంతరంగం ఇది...
నేను దినేశ్. చదువు, అందంలోనే కాదు... అమ్మాయిల్ని ఆకర్షించి నా చుట్టూ తిప్పుకోవడంలోనూ ఫస్టే. ఇలా చేయడం తప్పని నేనెపుడూ ఫీల్ కాలేదు. పైగా నా టాలెంట్‌కి గర్వపడేవాణ్ని.
డిగ్రీ పూర్తై పీజీలో చేరా. నా టార్గెట్ అమ్మాయిలే. ఇంతలో తులసి పరిచయమైంది. తను అందరికన్నా భిన్నం. ఇవ్వడమేగానీ తీసుకోవడం తెలియదు. ‘నేనింతవరకు ఏ అమ్మాయి మొహం చూడలేదు’ అంటే నమ్మేసింది. ‘నువ్వంటే నాకు ప్రాణం’ అనగానే గుండెలపై వాలిపోయింది. తన నిస్వార్థ ప్రేమ చూసి ఒక్కోసారి నాకే ఆశ్చర్యమేసేది. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అనుకునేవాణ్ని. ఏదేమైనా తులసితోనే ఏడడుగులు నడవాలని ఫిక్సయ్యా. కానీ మనం మారాలనుకున్నా మన అలవాట్లు మారనివ్వవు. పాత గాళ్‌ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు, మీటింగ్‌లు చాటుమాటుగా కొనసాగుతూనే ఉండేవి.
పీజీ పూర్తైంది. పెద్దల్ని ఒప్పించి తులసిని పెళ్లాడా. మూణ్నెళ్లు సాఫీగానే సాగింది సంసారం. తర్వాతే మొదలయ్యాయి లుకలుకలు. కొడుకు కట్నం కోసం ఆశ పడ్డ నాన్న ఉత్తి చేతులతో వచ్చిన కోడల్ని సహించేవాడు కాదు. ఇది కాకుండా ఓ పాత స్నేహితురాలితో సరస సంభాషణలు చేస్తూ పట్టుబడ్డా. భార్య దేన్నైనా సహిస్తుందిగానీ భర్త ఇంకొక అమ్మాయితో సన్నిహితంగా ఉండటం తట్టుకోలేదని అప్పుడే అర్థమైంది. అమాయకురాలు అపరకాళిక అయ్యింది. తన ముందు దోషిగా నిలబడ్డం నాకేమాత్రం నచ్చలేదు. ‘నా భార్య నన్ను అనుమానిస్తోంది’ అంటూ అమ్మానాన్నలతో అడ్డంగా అబద్ధం ఆడేశా. అసలే తనపై కడుపుమంటతో ఉన్నవాళ్లు అనుమానించే పెళ్లాన్ని వదిలించుకొమ్మని ఉచిత సలహా ఇచ్చారు.
గొడవలు ముదురుతుండగానే పాప పుట్టింది. కొత్త బాధ్యతలు తలకు మించిన భారమయ్యాయి. సుఖపడాల్సిన వయసులో ఒక్కసారిగా వచ్చిపడ్డ కష్టాల్ని తట్టుకోలేకపోయా. ఇవన్నీ భరించలేక పిరికివాడిలా తులసికి దూరంగా పారిపోయా. నీతో నాకేం సంబంధం లేదని చెప్పేశా. తనూర్కోలేదు. నాపై కేసు పెట్టి కోర్టుకీడ్చింది. కన్నవాళ్లూ మొహం చాటేశారు. విధిలేక మళ్లీ తనతోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడైనా తప్పు తెలుసుకుంటే నా జీవితం వేరేలా ఉండేది.
పరువు తీసిందని పెళ్లాంపై పగ పెంచుకున్నా. ‘అయిందేదో అయిపోయింది. ఇప్పట్నుంచైనా బాగుందాం’ అని బతిమాలేది. నేను వింటేగా! ‘నీతోనే ఉంటా. కానీ బతికినంతకాలం నీతో కాపురం చేయను’ అని శపథం చేశా. మళ్లీ నా పాత జీవితంలోకి వెళ్లిపోయా. ఇదేంటని అడిగితే తిట్టేవాణ్ని, కొట్టేవాణ్ని. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా మారుతుందట. ఎన్నాళ్లని నన్ను భరిస్తుంది తను. ‘మీకు నచ్చినట్టుగా మీరుండండి. మారమని అడగను. నేనూ మీతో మాట్లాడను’ అందోరోజు. ఒకే ఇంట్లో ఒంటరులమయ్యాం.
ఏడేళ్లు గడిచాయి. నేను చేసిన పాపం ఫలితమేమో కొన్ని కారణాలతో నా ఉద్యోగం వూడింది. తల్లిదండ్రులు, తమ్ముడి దగ్గరికెళ్తే ‘ఏరి కోరి పెళ్లి చేసుకున్న పెళ్లాం ఉందిగా. మమ్మల్నెందుకు సాయం అడుగుతున్నావ్?’ అనేవారు. ఇప్పుడు నా భార్యే ఉద్యోగం చేస్తూ నన్ను, పాపని పోషిస్తోంది. మానసికంగా, శారీరకంగా తనని ఎంతో హింసించినా నాకు మాత్రం ఏ లోటూ లేకుండా చూసుకుంటోంది. కానీ మౌనం తప్ప మా మధ్య మరేం లేవు. కొద్దిరోజుల్లోనే నా పరిస్థితి, నా భార్య గొప్పదనం అర్థమైంది. పూర్తిగా మారిపోయాను. ‘తప్పు చేశా. మునుపటిలా కలిసి మెలిసి ఉందాం’ అని బతిమాలా. ఒప్పుకోలేదు. ‘ఇంతకాలం నీవల్ల నాకే సుఖం దక్కలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు? పాప కోసమే బతుకుతున్నాను. అలాగే బతకనివ్వు’ అంది. కానీ తను తప్పకుండా మారుతుందనే ఆశతోనే బతుకుతున్నా.
ప్రేమించడబడటం ఒక గొప్ప వరం అంటారు. తులసి నన్ను ప్రేమించినంతకాలం నాకు ఆ విలువ తెలియలేదు. విలువ తెలిసే సమయానికే ఆమె మనసు విరిగింది. నా జీవితం నాలాంటి భర్తలకు కనువిప్పు కావాలి.
ప్రేమతో.. నో చాటింగ్! నో టాకింగ్!
మరదలిపై మనసు పడ్డాడో బావ. మాటలు కలిపినా కలవడం కుదరదంది మరదలు. పట్టుపడితే చిత్రమైన షరతు పెట్టింది. ఏంటది? అబ్బాయి మాటల్లోనే.
‘వన్ ఇయర్ నాతో మాట్లాడొద్దు. చాట్ చేయొద్దు. అలా చేస్తే నేనే వచ్చి నిన్ను కలుస్తా’ మరదలి మాట నా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అది తలచుకున్నప్పుడల్లా మనసును మెలిపెట్టే బాధ. ఏడాది తనతో మాట్లాడకుండా ఎలా ఉండాలా అని. చెప్పలేనంత సంతోషం కూడా. సంవత్సరం గడిస్తే తను నాకు దక్కుతుందని.
డిగ్రీ దాకా నేనూ అందరిలాంటోడినే. చదువంతా ఇంటికి దూరంగానే సాగింది. కో-ఎడ్ కాకపోవడంతో అమ్మాయిలతో పెద్దగా మాట్లాడింది లేదు. చదువయ్యాక పోలీసు కావాలనే లక్ష్యంతో కోచింగ్ తీసుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో నాకో మరదలు ఉందని తెలిసింది. తనువంతా ఉద్వేగం. ఏవో గొడవలతో మామయ్య కుటుంబానికి, మాకు రాకపోకల్లేవ్. ఇప్పుడు తన గురించి తెలియగానే చూడాలి, కలవాలనే ఉబలాటం. తన నోటి నుంచి ‘బావా’ అనే పిలుపు వినాలనే తపన.సిటీలో బీటెక్ చదివేది తను. కలుసుకోవడం ఎలా అనుకుంటుంటే ఫేస్‌బుక్ దారి చూపింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే మర్నాడే ఆమోదించింది. ‘ఎక్కడుంటావ్? ఏం చేస్తావ్?’ ప్రశ్నలు సంధించా. అంతే వేగంగా స్పందించింది. నేను తన బావనని చెప్పలేదు. అన్నట్టు మా ఇద్దరి బ్లడ్ గ్రూప్, పుట్టినవారం, నచ్చిన ఆట, ఇష్టదైవం... అన్నీ ఒకటే. పేర్లూ కలిశాయి. ఇవన్నీ చెబుతుంటే నోరెళ్లబెట్టేది. ‘ఇన్ని ఎలా తెలుసుకున్నావ్? నాపై నీకంత ఆసక్తి ఎందుకు?’ అనడిగిందోసారి. ఇదే మంచి ఛాన్స్. ‘ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ గురించి ప్రతి చిన్న విషయం నాకు ముఖ్యమే’ అన్నా. ‘సారీ... నేను ప్రేమించట్లేదుగా’ ఒక్కమాటతో గాలి తీసేసింది. బాధ నుంచి తేరుకుంటూనే నేను నీ బావనని చెప్పా ఆఖరి అస్త్రంగా. అయినా తను పట్టించుకుంటేగా!
డిగ్రీ దాకా నేనూ అందరిలాంటోడినే. చదువంతా ఇంటికి దూరంగానే సాగింది. కో-ఎడ్ కాకపోవడంతో అమ్మాయిలతో పెద్దగా మాట్లాడింది లేదు. చదువయ్యాక పోలీసు కావాలనే లక్ష్యంతో కోచింగ్ తీసుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో నాకో మరదలు ఉందని తెలిసింది. తనువంతా ఉద్వేగం. ఏవో గొడవలతో మామయ్య కుటుంబానికి, మాకు రాకపోకల్లేవ్. ఇప్పుడు తన గురించి తెలియగానే చూడాలి, కలవాలనే ఉబలాటం. తన నోటి నుంచి ‘బావా’ అనే పిలుపు వినాలనే తపన.సిటీలో బీటెక్ చదివేది తను. కలుసుకోవడం ఎలా అనుకుంటుంటే ఫేస్‌బుక్ దారి చూపింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే మర్నాడే ఆమోదించింది. ‘ఎక్కడుంటావ్? ఏం చేస్తావ్?’ ప్రశ్నలు సంధించా. అంతే వేగంగా స్పందించింది. నేను తన బావనని చెప్పలేదు. అన్నట్టు మా ఇద్దరి బ్లడ్ గ్రూప్, పుట్టినవారం, నచ్చిన ఆట, ఇష్టదైవం... అన్నీ ఒకటే. పేర్లూ కలిశాయి. ఇవన్నీ చెబుతుంటే నోరెళ్లబెట్టేది. ‘ఇన్ని ఎలా తెలుసుకున్నావ్? నాపై నీకంత ఆసక్తి ఎందుకు?’ అనడిగిందోసారి. ఇదే మంచి ఛాన్స్. ‘ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ గురించి ప్రతి చిన్న విషయం నాకు ముఖ్యమే’ అన్నా. ‘సారీ... నేను ప్రేమించట్లేదుగా’ ఒక్కమాటతో గాలి తీసేసింది. బాధ నుంచి తేరుకుంటూనే నేను నీ బావనని చెప్పా ఆఖరి అస్త్రంగా. అయినా తను పట్టించుకుంటేగా!
తను చిన్నచూపు చూస్తేనేం... నేనొదులుతానా? ఫ్రెండ్ సాయంతో తన ఫొటో సంపాదించా. ఫర్వాలేదు... అందంగానే ఉంది. అడక్కముందే నా ఫోటోని పంపా. ఫోన్‌నెంబరూ జత చేశా. మర్నాడే ‘హాయ్’ అంటూ మెసేజ్. నా ఆనందానికి అవధుల్లేవ్. ‘ఫోన్ నెంబర్ ఇచ్చావు... ఫొటో కూడా పంపొచ్చుగా’ అన్నా ఏమీ ఎరుగనట్టే. ఆ ఛాన్స్ లేదు. ఇంకోసారి అడగొద్దంది.
తనకి సెలవులిచ్చారట. చెప్పకుండానే ఇంటికెళ్లిపోయింది. విషయం తెలిసి చాలా బాధపడ్డా. మాటమాత్రమైనా చెప్పొద్దా? అదే అడిగితే ‘నీకు చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? నా ఇష్టం. మా నాన్న ఇష్టం’ అంది. నేనెంతో తల్లడిల్లిపోతుంటే తనకి అంత నిర్లక్ష్యమా? ‘ఇంకెప్పుడూ నీ గురించి అడగను. జీవితంలో డిస్ట్రబ్ చేయను. గుడ్‌బై’ అన్నా కోపంతో. ‘థాంక్స్, బై’ తన సమాధానం. కానీ రెండ్రోజులకు మించి తనతో మాట్లాడకుండా ఉండలేకపోయా. కాళ్లబేరానికెళ్లా. ‘సరేలే... ఇంకోసారి పోజు కొట్టకు’ అంది. మనసు కుదుటపడింది.
రోజూ చాట్లాడుకుంటున్నాం. కుదిరినపుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. ఇంతేనా? మరదల్ని కలవాలని కోరికగా ఉండేది. తనేమో కుదరదనేది. నాకు పట్టుదల పెరిగిపోయేది. ‘నన్ను కలవాల్సిందే. దాని కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం’ అన్నానోసారి ఆవేశంగా. అదిగో అప్పుడే ఏడాదివరకు మాట్లాడొద్దు, చాటింగ్ చేయొద్దనే షరతు పెట్టింది. అలా చేస్తే స్వయంగా వచ్చి కలుస్తానంది. ఇప్పటికి ఆర్నెళ్లు పూర్తయ్యాయి. బాధగా. నా ప్రియమైన ప్రేమకోసం ఇంకో ఆర్నెళ్లు ఎదురుచూస్తూనే ఉంటా. తీయనైన బాధతో.
నిజం...మా ఆయన బంగారం
పెళ్లీడుకొచ్చిన అమ్మాయికి చాలా ఆశలుంటాయ్. కలలుంటాయ్. చేసుకోబోయేవాడు అందగాడు, ఆస్తిపరుడై ఉండాలని కోరుకుంటారు. నేనూ అందరిలా వూహల్లో తేలిపోయేదాన్ని.
నాకో కజిన్ ఉండేది. నా వయసే. ఒకేలా ఆలోచించేవాళ్లం. డిగ్రీ కాగానే తనకో మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఇద్దరిలో ఒకరి కల నెరవేరింది. కొద్దిరోజులకే నా వంతు. ‘అబ్బాయిఅందంగా ఉంటాడు. నెలకి ఎనభైవేల జీతం. ఆస్తిపరులు’ నాన్న చెబుతుంటే నా పాదాలు గాల్లోకి లేచాయి. చివర్లో ‘కానీ’ అంటూ ఆగిపోయారు. నాలో కంగారు. ‘తను కొంచెం హ్యాండీక్యాప్డ్. సర్దుకుపోవాలమ్మా’ అనడంతో గుండె కలుక్కుమంది. ‘నాకీ సంబంధం వద్దు’ క్షణం ఆలోచించకుండా చెప్పేశా. రెండ్రోజులు మౌనవ్రతం చేశా. ‘ఇంతకంటే మంచి సంబంధం తేలేనమ్మా. దయచేసి అర్థం చేసుకో. ఎవరితోనూ పోల్చి చూసుకోవద్దు’ చేతులు పట్టుకొని అర్థించారు నాన్న. జలజలా కన్నీళ్లు రాలాయి.
ముహూర్తం పెట్టుకున్నాం. నా కష్టాలు మొదలయ్యాయి. మంచి సంబంధం దొరికింది అన్నవాళ్లే అవిటివాడ్ని చేసుకుంటోందని చాటుగా గుసగుసలాడుకునేవాళ్లు. ఈ బాధలో నేనుంటే ఆయన ఫోన్. మాట్లాడ్డం ఇష్టంలేక ఏదో చెప్పి తప్పించుకునేదాన్ని. ఈ బాధలోనే పెళ్లి కూడా జరిగిపోయింది. ఏదైనా ఫంక్షన్‌కెళ్తే నా కజిన్ జంటని ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అనేవాళ్లు. నాకేమో జాలి చూపులు. ఇది భరించేక నా జీవితం త్వరగా ముగిస్తే బాగుండు అనుకున్నరోజులున్నాయి. నా మనసులో ఉన్నది మా ఆయనకు తెలియదు కదా! నన్ను ఇంప్రెస్ చేయడానికి తెగ ప్రయత్నించేవారు.
పెళై్ల ఏడాదైంది. ఓసారి మా ఇంటికి బంధువులొచ్చారు. నా కజిన్ కాపురం బాగా లేదన్నారు. తన భర్త రోజూ తాగొచ్చి గొడవ చేస్తాడనీ, జల్సాలకు చాలా ఖర్చు చేస్తున్నాడని చెప్పారు. బాధేసింది. ‘తనతో పోలిస్తే నువ్వు అదృష్టవంతురాలివి. మీ ఆయన చాలా మంచోడు’ అన్నారు. మొదటిసారి మా ఆయన గురించి మనస్ఫూర్తి ప్రశంస విన్నా. అది నాకో టానిక్‌లా పనిచేసింది. నిజంగా నా భర్త అంత మంచివారా? ఆలోచనలు మొదలయ్యాయి. ఎంగేజ్‌మెంట్ నుంచి ఆయన్ని దూరంగా పెడుతున్నా. చిరాకు పడుతున్నా. మా ఆయన మాత్రం నన్ను ఒక్క మాట అన్లేదు. పైగా ఏ లోటూ రాకుండా ప్రేమగా చూసుకునేవారు. ఆలోచిస్తుంటే నేనెంత అమానుషంగా ప్రవర్తించానో బోధ పడింది. ఆరోజు నుంచే మారాలనుకున్నా.
ప్రతి వీకెండ్, ప్రతి ఫంక్షన్‌కి ఆయనతో కలిసి బయటికెళ్లేదాన్ని. ఇష్టంగా, మనస్ఫూర్తిగా. ఈ మార్పు చూసి నా భర్త చాలా సంతోషించారు. ఇంతలో ఆయనకు జర్మనీ వెళ్లే అవకాశమొచ్చింది. దేశం దాటాక మా మధ్య అన్యోన్యత మరింత పెరిగింది. ఆయన ఆఫీసు నుంచి వచ్చేవరకు ఎదురుచూడటం... సరదాగా బయటికెళ్లడం... భలే థ్రిల్లింగ్‌గా ఉండేది. ఇద్దరం కలిసి దిగిన ఫొటోల్ని అప్పుడప్పుడు సరదాగా ఫేస్‌బుక్‌లో పెట్టేదాన్ని. ‘మీ ఆయన హీరోలా ఉన్నాడే’ అనేవారు ఫ్రెండ్స్. నాలో కొత్త అనుమానం మొదలైంది. ‘మీరు ఏ అమ్మాయినైనా ప్రేమించారా?’ అడిగానోసారి. తిండికీ లేని నేపథ్యం... బడికి కిలోమీటర్లు నడిచి వెళ్లిన రోజుల గురించి చెప్పారు. మంచిస్థాయికి చేరడం కోసం కాలేజీ రోజుల్లో చదువు తప్ప వేరేవాటిపై దృష్టి పెట్టలేదన్నారు. నా కళ్లు చెమర్చాయి.
ఏడాదిలో మా ఆయన ప్రాజెక్ట్‌వర్క్ విజయవంతంగా పూర్తైంది. ఇండియా తిరిగొచ్చాం. రిసీవ్ చేసుకోవడానికి బంధువులు, స్నేహితులు చాలామంది ఎయిర్‌పోర్ట్‌కి వచ్చారు. మా ఆయనతోపాటు నన్నూ పొగడ్తల్లో ముంచెత్తారు. అదీ మనస్ఫూర్తిగా. ఒక గొప్ప వ్యక్తి భార్యగా నేనెంతో పొంగిపోయా. ఇంటికొచ్చాక విన్న ఓ వార్త కలవరపాటుకి గురి చేసింది. చెడు అలవాట్లతో నా కజిన్ భర్త ఆస్తి మొత్తం కరిగించాడట. కుటుంబం గడవడానికి తను ఉద్యోగం చేస్తుందని తెలిసింది.
నేను గొప్ప స్థానంలో ఉన్నానని చెప్పడానికి మీ ముందుకు రాలేదు. జీవిత భాగస్వామి ఎంపికలో అందం, ఆస్తి ఒక్కటే ప్రామాణికం కాదు. గుణగణాలు, వ్యక్తిత్వం అంతకన్నా ముఖ్యమని అనుభవంతో చెబుతున్నా.
మాటలు మన్నించు...మనసును గమనించు!
అప్పుడు ఇంటర్. నాలో ఏం నచ్చిందోగానీ ఓ అమ్మాయి నన్ను తెగ ఫాలో అయ్యేది. ‘రేపు సాయంత్రంలోగా ప్రేమిస్తున్నానని చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా’ అందోసారి. జడుసుకొని ఓకే చెప్పేశా. ఆ కొద్దిరోజులకే నా కష్టాలు తీర్చడానికి రాఖీ పండగొచ్చింది. ఆమె ఇంటికెళ్లి అందరిముందే రాఖీ కట్టమన్నా. చేసేదేంలేక కట్టింది. వారం తిరక్కముందే వేరే అబ్బాయితో తిరగడం మొదలెట్టింది. పట్టించుకోలేదు.డిగ్రీ పూర్తై ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నా. ఓరోజు ఓ అమ్మాయి ఫోన్ చేసింది. వరుసకు మరదలవువుతానంది. ఆ వంకతో తరచూ కాల్ చేసేది. క్యాజువల్‌గా మాట్లాడి అమ్మకిచ్చేవాణ్ని. తను మాత్రం నన్ను ప్రేమిస్తున్నానంది. లైట్ తీసుకున్నా. తర్వాత పైచదువుల కోసం సిటీకెళ్లా. అప్పట్నుంచి నేను చేస్తే తన ఫోన్ బిజీ వచ్చేది. ఆరా తీస్తే తను ఇంకో అబ్బాయితో ప్రేమలో పడిందని తెలిసింది. కొంచెం బాధేసింది.
‘మాదాపూర్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్ ఉంది. తీస్కెళ్లవూ?’ గోముగా అడిగింది అత్తయ్య కూతురు. నా లైఫ్‌లోకి వచ్చిన మూడో అమ్మాయి. సాయంత్రం తిరిగొస్తుంటే చదువు, ప్రేమ సంగతులు కూపీ లాగింది. స్వచ్ఛంగా ఉండాలనుకునేవాణ్ని కదా! అంతా చెప్పా. ‘నిన్ను కోల్పోయిన రెండో అమ్మాయి దురదృష్టవంతురాలు. నా ప్రేమను ఒప్పుకో. జీవితాంతం తోడుంటా’ అంది. ఆశ్చర్యమేసింది. కొద్దిరోజులు ఆలోచించా. వరుసైందీ, పైగా నా గురించి తెలిసిన అమ్మాయి. పచ్చజెండా వూపా. గెంతులేసింది.
సెలవుల్లో ఇంటికెళ్లా. ‘మీ అత్తయ్య కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించిందట. నాల్రోజుల్లో అతడితో పెళ్లి’ అంది అమ్మ. నాకు షాక్. పెళ్లి కూడా ఫిక్సయ్యాక ఇంక తనతో మాట్లాడ్డం వ్యర్థం అనిపించింది. తర్వాత తెలిసిందేంటంటే చాలాకాలం నుంచి అత్తయ్య కూతురు వేరే అబ్బాయిని ‘కూడా’ ప్రేమిస్తోందట. ఈ దెబ్బతో అమ్మాయిలపైనే నమ్మకం పోయింది.
కొన్నాళ్లకి బంధువుల పెళ్లికి వూరెళ్లా. చుట్టాలంతా ఓ అమ్మాయిని తెగ పొగుడుతున్నారు. తనే సీత. అందం, పెద్దలంటే గౌరవం చూపే అమ్మాయి. కుర్రాళ్ల వంక కన్నెత్తి చూడదు. రెండ్రోజులు గమనించాక వాళ్లు చెప్పింది నిజమేననిపించింది. తనే నా భార్యని ఫిక్సయ్యా. అన్నయ్య పెళ్లికార్డు ఇవ్వడానికి మళ్లీ ఆ వూరెళ్లా. ఏదో పనిమీద బయటికెళ్లిందట. కార్డు వెనకాల నా వివరాలు రాసి వాళ్లింట్లో ఇచ్చా. దాదాపు నెలకు నా ఎదురుచూపులు ఫలించాయి. కొత్త సంవత్సరం రోజున శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ పంపింది. వెంటనే డయల్ చేశా. రిప్లై లేదు. ఆపై ఎన్నిసార్లు ప్రయత్నించానో లెక్కేలేదు.
చాన్నాళ్లకు కరుణించింది. మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ మొదలయ్యాయి. తర్వాత నా గతంతోపాటు మనసులోమాట కూడా చెప్పా. ‘నువ్వు ముందు మా అమ్మానాన్నలకు నచ్చాలి. వాళ్లు ఓకే అంటేనే మన పెళ్లి’ అంది నిర్మొహమాటంగా. కష్టపడి ప్రయత్నించి సీత అమ్మానాన్నల్ని ఇంప్రెస్ చేశా. వాళ్లింట్లో ఒకడిగా కలిసిపోయా. మా పరిచయమైన తన మొదటి పుట్టినరోజుకి వాళ్లూరెళ్లా. రాత్రి పన్నెండిటికి నేనే స్వయంగా తనతో కేక్ కట్ చేయించా. ఆరోజు తనే ‘ఐలవ్యూ సోమచ్’ అంది. మనస్ఫూర్తిగా తనని నా గుండెలకు హత్తుకున్నా.
కారణాలేంటో తెలియదు. తను ఫోన్ చేయడం తగ్గించింది. నేను చేస్తే ఎత్తదు. చాలారోజులు ఇదేవరుస. పాత అమ్మాయిలు గుర్తొచ్చారు. సీత కూడా అలాంటిదేమో? అనే అనుమానం మొదలైంది. ‘గాళ్స్ అంతా ఇంతేరా. వాడుకొని వదిలేసే రకం’ స్నేహితుల మాటలతో విచక్షణ కోల్పోయా. ఆవేశంతో నానా మాటలన్నా. ‘నా మీద నమ్మకం లేకపోతే నన్నొదిలెయ్’ అని ఒకే ఒక మాట అంది. కోపం, కసి. నేరుగా వాళ్లింటికెళ్లా. అనారోగ్యంతో ఉంది. ఇతర సమస్యలతో బాధ పడుతోందని తెలిసింది. ఇవన్నీ చెబితే నేను ఎక్కడ బాధ పడతానోనని కొన్నాళ్లుగా నన్ను దూరం పెడుతోందట. నిజం తెలిశాక సిగ్గుతో తలొంచుకున్నా.
ఉద్యోగరీత్యా ఇప్పుడు విదేశంలో ఉన్నా. నా మనసు మాత్రం సీత దగ్గరే ఉంది. తనకేమో నాపై అలక. అనుమానించానుగా... సహజమే! కానీ నా గతం నాతో ఆ పనిచేయించింది. మన్నించి క్షమిస్తే పెళ్లి బాజాలకు సిద్ధమవుతా.
ప్రేమ మధురం... పెద్దలు కఠినం
‘హాయ్... నేను స్రవంతిని. ప్రాజెక్టు వర్క్ కోసం హైదరాబాద్ వస్తున్నా. మీ సాయం కావాలి’ పొద్దునే మెసేజ్. అది చూడగానే నా మొహం వెలిగిపోయింది. ఉత్సాహంగా ఓకే చెప్పా.
స్రవంతి... ఆ పేరెలా మర్చిపోగలను? తను ఎంసీఏలో నా జూనియర్. అందగత్తేకాదు తెలివైంది కూడా. టాపర్‌గానో, ఏదో పోటీల్లో ఫస్టొచ్చిందనో తన గురించి తరచూ వినేవాణ్ని. సీనియర్‌ననే గౌరవంతో అప్పుడప్పుడు నన్ను పలకరించేది. నేనూ ‘హాయ్’ అనేవాణ్ని. అంతవరకే మా పరిచయం.
చదువు పూర్తై కొలువు వేటలో పడ్డా. పెద్దగా కష్టపడకుండానే ముంబయిలో ఉద్యోగమొచ్చింది. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. ఈమధ్యలో స్రవంతితో ఎప్పుడూ టచ్‌లో లేను. తెలివైన అమ్మాయిగా, జూనియర్‌గా మాత్రం గుర్తుంది. ఇదిగో ఈ సందేశంతో మళ్లీ తన ఆలోచనల్లోకి వెళ్లిపోయా.
ప్రాజెక్టు వర్కు, కొలువు సలహాలు... కారణం ఏదైతేనేం మా మధ్య రోజూ సంభాషణలు కొనసాగేవి. మధ్యమధ్యలో వ్యక్తిగత చర్చలు, అభిరుచులు, అభిప్రాయాలూ పంచుకునేవాళ్లం. నేనుండేది ముంబయి, తనది హైదరాబాద్. అయినా పక్కపక్కనే ఉన్నట్టు ఫీలయ్యేవాళ్లం. ఉన్నట్టుండి ‘నన్ను పెళ్లి చేసుకుంటారా సర్?’ అనడిగిందోరోజు. నిజం చెప్పాలంటే తనంటే నాకూ ఇష్టమే. అందం, అణకువ, తెలివైన అమ్మాయి ఎవరికి నచ్చదు? కాకపోతే మా నేపథ్యాలు వేరు. తను బాగా ఆస్తిపరురాలు. ఒక్కతే కూతురు. నాదేమో పేద కుటుంబం. అదే మాట చెప్పి ‘ఇది జరిగేపని కాదేమో. నీ ఆలోచన మానుకో’ అన్నా. ‘ఆకర్షణ లేదా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదిది. మీరంటే మనస్ఫూర్తిగా ఇష్టం’ అంది. ఇంట్లోవాళ్లను నేనొప్పిస్తానంది. అంతకన్నా ఏం కావాలి? సంతోషంగా ఒప్పుకున్నా. కానీ ‘మీ ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటేనే మన పెళ్లి’ అని షరతు పెట్టా.
ప్రతి పుట్టినరోజుకి స్రవంతి పేరెంట్స్ ఏదో బహుమతి ఇస్తారు. ఈసారి నన్ను భర్తగా ఇమ్మందట. ఠాఠ్... వీళ్లేదంది వాళ్లమ్మ. ఆపై వెంటనే నాకు ఫోన్ చేసి ‘మాకున్నది ఒకే కూతురు. నీలాంటివాడికి కాకుండా బాగా డబ్బున్నవాడికి ఇవ్వాలనుకుంటున్నాం. తనని మర్చిపో’ అందామె దబాయింపుగా. ‘ఒకర్నొకరం ఇష్టపడ్డాం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నాకూ మంచి జాబ్ ఉంద’ని ప్రాధేయపడ్డా విన్లేదు. స్రవంతే నన్నోదార్చింది.
నా దురదృష్టంకొద్దీ అప్పుడే నా ఉద్యోగం వూడింది. స్రవంతి జాబ్‌లో చేరింది. తనకి సంబంధాలు చూడటం మొదలెట్టారు. ఎన్‌ఆర్‌ఐ సహా మంచి సంబంధాలొచ్చాయి. నా కోసం అన్నీ వదులుకుంది. ‘మన పెళ్లి కచ్చితంగా జరిగితీరుతుంది’ అని ధైర్యం చెప్పేది. మరోవైపు నా ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఓరోజు అమ్మకి సీరియస్ అని ఫోన్ రాగానే పరుగెత్తుకెళ్లింది స్రవంతి. అక్కడికెళ్తే అంతా ఉత్తిదే. తిట్టి, కొట్టి పెళ్లికి బలవంతపెట్టారు. నాతో చెప్పి ఏడ్చింది. ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం. తర్వాత వాళ్లే ఒప్పుకుంటారంది. నేనొప్పుకోలేదు. పాతికేళ్లుగా ప్రాణం పెట్టుకున్న కన్నవాళ్ల పరువు తీయడం నాకిష్టంలేదు. ఎలాగోలా వాళ్లని ఒప్పిద్దాం అని స్రవంతికి నచ్చజెప్పా. తర్వాత మా ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. ఈమధ్యే తెలిసింది. మేం ఒప్పించడానికింకేం లేదని. స్రవంతి ఆమోదం లేకుండానే వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేసేశారు ఆ కఠినహృదయులు.
చాలామంది అమ్మాయిలు డబ్బున్నవాడు దొరకగానే ప్రేమించినవాడ్ని వదిలేస్తారు. కానీ నా స్రవంతి అలా కాదు. పేదవాడినైనా నాకోసం కడదాకా పోరాడింది. అసరమర్థత, అవివేకంతో నేనే తనని దక్కించుకోలేకపోయా. పెద్దల ధనవ్యామోహానికి మా ప్రేమ బలైంది. ఇది చదివాకైనా అలాంటి వాళ్లలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా.
ప్రేమను అడ్డగించా...పెళ్లికి పెద్దనయ్యా!
సాయంత్రం ఆరున్నరకి బొబ్బిలిలో ట్రెయిన్ ఎక్కా. జనంతో బోగీ కిక్కిరిసిపోయింది. సర్దుకునేలోపే తర్వాతి స్టేషనొచ్చింది. పద్మవ్యూహాన్ని ఛేదిస్తున్నట్టుగా ఓ కుర్రాడు జనాన్ని తప్పించుకుంటూ వచ్చి నా పక్కనే నిలబడ్డాడు. కాసేపయ్యాక ఉబుసుపోక పలకరించా. మాటల్లో తెలిసింది తను మా దూరపు బంధువని.
ఆ కుర్రాడి బ్యాగులోంచి నీటిచుక్కలు కారుతున్నాయి. చెబితే బ్యాగు కిందికి దించి తెరిచాడు. లోపల తడి దుస్తులున్నాయి. అంతకన్నా అందులో ఉన్న అమ్మాయి దుస్తులు నన్నాకర్షించాయి. ఉత్సుకత ఆపుకోలేక ‘ఎవరిదా డ్రెస్?’ అన్నా. గాఢంగా నిట్టూర్చి ఫ్లాష్‌బ్యాక్ విప్పడం మొదలుపెట్టాడు.
‘ఇంటర్ అయ్యాక త్వరగా స్థిరపడొచ్చని ఐటీఐలో చేరాలనుకున్నా. దరఖాస్తు పత్రం కోసం విజయనగరంలోని ఓ కాలేజీకెళ్లా. ఆ పక్క కాలేజీలో ఆరోజు ఏయూ పీజీ ప్రవేశ పరీక్ష జరుగుతోంది. రంగురంగుల డ్రెస్సుల్లో సీతాకోకచిలకల్లా గుమిగూడిన అమ్మాయిలను చూస్తూ అక్కడే ఆగిపోయా. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి చూపులు నన్ను తాకాయి. తదేకంగా నన్నే చూస్తోందామె. అందగత్తెకాదుగానీ తన మొహంలో ఏదో ఆకర్షణ. ధైర్యం చేసి తనదగ్గరికెళ్లా. ‘మీదేవూరు’ అంటూ మాట కలిపా. అయిదు నిమిషాల్లో ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం.
నా ఇంటర్, తన డిగ్రీ పూర్తయ్యాయి. అంటే ఆమె నాకన్నా మూడేళ్లు పెద్ద. మా అనుబంధానికి దీన్నో అడ్డంకిగా భావించలేదు. తను పీజీలో చేరింది. మా ఆనందాలకు హద్దే లేకుండా పోయింది. తరగతులు ఎగ్గొట్టి మరీ కలుసుకునేవాళ్లం. రోడ్లు, సినిమాలు, హోటళ్లు, పార్కులు... మేం తిరగని చోటు లేదు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదాని కొన్నిసార్లు తొందరపడ్డాం కూడా. తర్వాతేంటి? మావాళ్లెలాగూ పెళ్లికి ఒప్పుకోరు. అందుకే చెన్నై వెళ్లి అక్కడే ఓ గుళ్లొ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తను విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుతుంది. ఆమెకోసమే ఈ డ్రెస్’ సినిమా స్టోరీలా కథంతా వివరించాడు.
వాళ్లు ఇంట్లోంచి పారిపోతున్నారని నాకర్థమైంది. పైసా సంపాదన లేదు. అంతదూరం వెళ్లి ఎలా బతుకుతారు? ఒకవేళ పాపో, బాబో పుడితే? వూహించుకుంటేనే భయమేసింది. జీవితంపై అవగాహనలేని ప్రాయంలో తప్పు చేస్తున్నారనిపించింది. ఎలాగైనా వాళ్లని ఆపాలనుకున్నా. చాలాసేపు ఆలోచించాక నాకో ఉపాయం తట్టింది. ‘ఆ అమ్మాయి నాకు ముందే తెలుసు. నీలాగే తను ఇంకో ఇద్దరు కుర్రాళ్లతో తిరగడం చూశా’ అని అడ్డంగా అబద్ధమాడేశా. ఓ అమ్మాయి గురించి చెడుగా చెప్పడం తప్పే. కానీ ఆ క్షణంలో తప్పలేదు. నా మాట వినగానే ఆ కుర్రాడి మొహంలో రంగులు మారాయి. ‘నిజమే అన్నయ్యా. చాలాసార్లు తన ఫోన్ బిజీ వచ్చేది. బహుశా వాళ్లతో మాట్లాడేదేమో?’ అన్నాడు. నేను మరింత రెచ్చిపోయి కట్టుకథలల్లాను. ‘ఏదైనా తేడా వస్తే జైళ్లొ వేస్తార’ని భయపెట్టాను. బెదిరిపోయాడు. అమ్మాయి అక్కర్లేదంటూ వైజాగ్ రాకముందే దిగిపోయాడు.
ఆ కుర్రాడ్ని బహుశా జీవితంలో మళ్లీ కలవలేనేమో అనుకున్నా. కానీ కలిశాడు. నేనూహించని షాక్ ఇచ్చాడు. ఏడాదయ్యాక ఓరోజు మా ఇంటికొచ్చాడు. ‘అన్నయ్యా... మా పెళ్లికి రావాల’ంటూ ఓ శుభలేఖ చేతిలో పెట్టాడు. పెళ్లికూతురు తను ప్రేమించిన అమ్మాయే. నాకు దిమ్మతిరిగిపోయింది. ‘నువ్వు చెప్పినపుడు నీ మాటలే నిజమనుకున్నా. తర్వాత ఆలోచిస్తే నేను చూడంది నమ్మడం తప్పనిపించింది. నా ప్రేయసి ప్రేమలోనూ తేడా కనిపించలేదు. ఆపై నా అదృష్టంకొద్దీ ఓ మంచి పనిలో చేరా. పెద్దలూ పెళ్లికి ఒప్పుకున్నారు’ అంటూ సంతోషంగా చెప్పాడు. ఆ క్షణం నాలో ఒకింత సిగ్గు, ఒకింత గర్వం.
ఉద్దేశం ఏదైనా ఆరోజు నేను చేసినదాంతో ఆ ప్రేమికులిద్దరికీ మంచే జరిగింది. వాళ్లకు పెద్దల ఆమోదం దొరికింది. జీవితం గాడిలో పడింది. నేనలా చెప్పి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. అన్నట్టు వాళ్ల పెళ్లికి కూడా వెళ్లి కొత్తదంపతుల్ని ఆశీర్వదించా. కానీ వాళ్లు చెన్నై పారిపోవాలనుకున్నారనే విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు.
అలుసు చేసి... మనసు మూసి!
‘కాలంతోపాటూ అభిప్రాయాలూ మారిపోతుంటాయి. అలా మార్చుకోనివాడు మనిషే కాదు’. ఎక్కడో చదివినట్టు గుర్తు. ఇది నాకూ వర్తిస్తుందని వూహించలేకపోయా.
ఎందుకో తెలియదు. మొదట్నుంచీ నాకు మగాళ్లంటే చిరాకు, కోపం, భయం. ప్రేమ వూసులు మొదలయ్యే కౌమారంలోనూ నా అభిప్రాయం మారలేదు. టెన్త్, ఇంటర్, బీటెక్ సెకండియర్ పూర్తయ్యాయి. ఆ తర్వాతే ఓ మిరకిల్ జరిగింది. అందుక్కారణం చైతూ. మొదటిచూపులోనే తను బాగా నచ్చేశాడు. ముఖ్యంగా అతడి నవ్వు. నన్నేదో శక్తి ఆవహించినట్టు కొద్దినిమిషాలు అతడ్నే చూస్తుండిపోయా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. ఆకర్షణ.. పేర్లేవైనా పెట్టుకోవచ్చుగాక. చైతూ నాకు నచ్చేశాడు. మొదటిసారి ఒకబ్బాయికి దగ్గర కావాలనే ఉబలాటం మొదలైంది నాలో. రోజులు వారాల్లోకి మారాయి. చైతూని చాటుమాటుగా గమనించడం నాకలవాటైంది.
‘ఎన్నాళ్లీ నిరీక్షణ?’ నిలదీసిందోరోజు నా మనసు.
నెంబర్ కనుక్కొని కాల్ చేశాను. మాట పెగల్లేదు. ‘హాయ్.. నేను పూజిత. ఎలా ఉన్నావ్? చదువు బాగా సాగుతోందా?’ కష్టమ్మీద మూడు ముక్కలు మాట్లాడా. తనూ పెద్దగా స్పందించలేదు. ఆపై మళ్లీ పాత కథే. చూపుల్తోనే సరిపెట్టుకోవడం. ఐదారు నెలలయ్యాక మళ్లీ మాట కలిపా. ఈసారి మాత్రం బాగా ప్రిపేరయ్యా. యోగక్షేమాలయ్యాక ‘నీ నవ్వు బాగుంటుంది. నీతో మాట్లాడ్డం నాకిష్టం’ అన్నా ధైర్యంగా. ఓ అమ్మాయి అలా అంటే ఏ అబ్బాయైనా ఎగిరి గంతేయాలి. కానీ గురుడిలో కదలిక లేదు. ‘థాంక్స్’ చెప్పి ఫోన్‌లో ఎర్ర మీట నొక్కేశాడు. నా మనసు నొచ్చుకుంది. బహుశా నేను చెప్పిన విధానం బాగా లేదేమో అనుకొని ఎసెమ్మెస్ పెట్టా. ‘నువ్వంటే ఇష్టం. నీతో మాట్లాడాలని ఉంది’ అంటూ. రోజంతా ఎదురుచూసినా సమాధానం లేదు. కన్నీళ్లు పొంగుకొచ్చాయి.
తనతో ఇంకోసారి మాట్లాడొద్దనుకున్నా నావల్ల కాలేదు. పుట్టినరోజు, పండగ, ప్రత్యేక సందర్భం ప్రతిసారీ పిచ్చిదానిలా తనకు ఫోన్ చేస్తూనే ఉండేదాన్ని. వెంటపడుతున్నానని చులకనయ్యానేమో? ‘అస్తమానం ఫోనెందుకు చేస్తున్నావ్? ఇంకోసారలా చేయకు. చిరాగ్గా ఉంది’ అనేశాడోసారి. ఏడుపాగలేదు. ఎంత గింజుకున్నా తనవైపు నుంచి స్పందన లేదు. అయినా మనసు మారదే! ఓసారి ఫ్రెండ్ ఫోన్ నుంచి చేశా. అపరిచితురాలిలా మాట్లాడా. బాగానే స్పందించాడు. నేను హ్యాపీ. కానీ అదే నా కొంప ముంచింది. నా స్నేహితురాలు చైతూ నెంబర్ సేవ్ చేసుకొని నాకు తెలియకుండా పరిచయం పెంచుకుంది. ప్రేమాయణం మొదలుపెట్టింది.
‘నీ ఫ్రెండ్‌ని నాతో పరిచయం పెంచుకొమ్మని నా నెంబర్ ఇచ్చావటగా. ఇప్పుడు తనంటేనే నాకిష్టం. ఆమెని లవ్ చేస్తున్నా. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు’ అని చైతూ నాకు వార్నింగ్ ఇచ్చాడు. నా గుండె పగిలింది.
‘మీ ఫ్రెండ్, నేను ఫలానా చోట కలుసుకున్నాం’, ‘రేపు కలిసి సినిమాకెళ్తున్నాం’ అంటూ కావాలనే మెసేజ్‌లు పంపేవాడు. చదువుతుంటే ఏడుపొచ్చేది. ఇంకా తన వెంటపడటంలో అర్థం లేదనిపించింది. అతడిపై ప్రేమ చంపుకొని డ్రాప్ అయ్యాను. నెంబర్ మార్చేశాను.
మూడేళ్లు గడిచాయి. ఓరోజు ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ‘హాయ్ ఎలా ఉన్నావ్?’ అవతలివైపు చైతూ. యోగక్షేమాలడిగాను. తను ఏడవడం మొదలెట్టాడు. నాకేం అర్థం కాలేదు. ‘నీ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది. వాడుకొని వదిలేసింది’ బావురుమన్నాడు. కాసేపు నిశబ్దం. తర్వాత ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అనడిగాడు. నవ్వాలా? ఏడవాలా? అర్థం కాలేదు. ‘చెప్పు పూజితా.. చేస్కుంటావా?’ మళ్లీ రెట్టించి అడిగాడు. ఏడుపూ, నవ్వూ కలగలిసి నా కళ్లు వర్షించడం మొదలెట్టాయి. కానీ అతడి ప్రపోజల్‌కి మాత్రం నేనొప్పుకోలేదు. ఎందుకంటే పదిరోజుల కిందటే నాకు పెళ్లైంది.
సినిమా కల..జీవితం విలవిల
తొలి ప్రేమ. నాకు సినిమాలపై ప్రేమ పుట్టించిన తొలి సినిమా. తెరపై ఆడే బొమ్మలు మనసునీ ఆడిస్తాయని అప్పుడే అర్థమైంది.
గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు మాది. చదువులో చురుకైన విద్యార్థిని. మొదట్లో థియేటర్‌కెళ్లడం తక్కువ. తొలిప్రేమ తర్వాత మాత్రం ఏ సినిమానీ వదల్లేదు. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ కంఠతా వచ్చేసేది. ‘ఫలానా స్టార్ డైరెక్టర్‌ది మన పక్క వూరే’, ‘ఆ హీరో ఇక్కడివాడే’ ఇలాంటి మాటలతో నా రోమాలు నిక్కబొడుచుకునేవి. వాళ్లలా జనం నా గురించి గొప్పగా చెప్పుకోవాలనిపించేది.
మూడేళ్లు గడిచాయి. ఆరా తీస్తే మా బంధువొకాయన ఇండస్ట్రీలో ఉన్నాడని తెలిసింది. ఆ భరోసాతో ఫిల్మ్‌నగర్‌లో వాలిపోయా. బీటెక్ ఫైనలియర్ పరీక్షలు వదిలేసి మరీ. ఇంట్లోవాళ్లు ఎంతమొత్తుకున్నా విన్లేదు. హీరో అవుతానంటే ‘ముందు ఏదో ఒక డైరెక్టర్ దగ్గర పెట్టిస్తా. పరిచయాలయ్యాక హీరోగా ప్రయత్నిద్దువులే’ అన్నారు బంధువు. వారంలోపే ఓ దర్శకుడి దగ్గర చేర్పించారు. కెమేరాలు మోయడం, హీరోహీరోయిన్లు ఏ సీన్‌లో ఏ డ్రెస్‌లు వేసుకున్నారో గుర్తుపెట్టుకోవడం, కప్పులు కడగడం ఇదీ నా పని. రెండునెలలకే తెచ్చుకున్న ఇరవైవేలు కరిగిపోయాయి. నాన్నే నెలనెలా ఖాతాలో డబ్బులేసేవారు.ఆర్నెళ్ల పురిటినొప్పులు పూర్తై సినిమా విడుదలైంది. అట్టర్‌ఫ్లాప్ టాక్. తెరపై నా పేరూ పడ్డా నాకు తప్ప వేరొకరికి గుర్తులేదు. ఇంకోచోట ప్రయత్నం మొదలుపెట్టా. ‘ఖాళీల్లేవ్’ బోర్డులు వెక్కిరించేవి. కొందరు దగ్గరికే రానిచ్చేవారు కాదు. కష్టాల డోసు పెరిగింది. ఇంట్లోంచి డబ్బులు రావడమూ తగ్గాయి. ఓ పూట తినడం, మరోపూట పస్తులు. అయినా ప్రయత్నాలు ఆపలేదు.
అన్నట్టు నాకో లవ్‌స్టోరీ ఉంది. స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సిటీకెళ్తుంటే ఆల్ ది బెస్ట్ చెప్పింది తను. తర్వాత ‘ఎందుకీ కష్టాలు. వదిలేసి వచ్చెయ్. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుందువుగానీ’ అనేది. విన్లేదు. ఐదారునెలలకి మరో చోట చేరా. అసిస్టెంట్‌గానే. పెద్ద బ్యానర్, స్టార్‌హీరోతో క్లాప్ కొట్టాం. ఈ దెబ్బతో దశ తిరిగిందనుకున్నా. నా దురదృష్టం.. ఏవో కారణాలతో ఆ సినిమా మొదట్లోనే ఆగిపోయింది. మెల్లిగా నాపై నాకు నమ్మకం సడలసాగింది. లవర్ చెప్పింది విని కొన్నాళ్లు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. చేతిలో డిగ్రీ కూడా లేదు. అటెండర్‌కి తప్ప దేనికీ పనికిరానన్నారు. మళ్లీ సినిమా వేట మొదలైంది. ఆరేళ్లలో ముగ్గురు దర్శకుల దగ్గర పనిచేశా. అసిస్టెంట్ నుంచి అసోసియేట్‌కు ఎదిగా. సొంతంగా కథలు రాసుకొని హీరోలు, నిర్మాతల చుట్టూ తిరిగా. కొందరు కథ బాగున్నా డేట్స్ లేవన్నారు. ఓ యువహీరో తప్పకుండా ఛాన్స్ ఇస్తానన్నాడు. తర్వాత ఆయన రెండు సినిమాలూ ఆడకపోవడంతో తనకే అవకాశాల్లేకుండా పోయాయి. వీటన్నింటికన్నా ఓ నిర్మాత మాటలు నన్ను బాగా బాధించాయి. ‘చాన్నాళ్లుగా నిన్ను గమనిస్తున్నా. నీలో ఫైర్ లేదయ్యా. అందరితో కలిసిపోలేవు. ఇండస్ట్రీకి సూట్ కావు’ అన్నారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ కష్టానికి తోడు పుండుమీద కారం చల్లినట్టు ఇష్టపడ్డ అమ్మాయికి పెళ్లైందని తెలిసింది. తను మాత్రం ఎన్నాళ్లని నాకోసం ఎదురుచూస్తుంది?
సినిమా ఆశలు ఆవిరయ్యాయి. ఇంటికెళ్లడానికి మొహం చెల్లలేదు. ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ కూడా లేదు. అప్పుడే ఓ మిత్రుడు దేవుడిలా ఆదుకున్నాడు. ఆర్థికసాయం చేసి వెబ్‌డిజైనింగ్ కోర్సులో చేర్పించాడు. శిక్షణ పూర్తిచేసుకొని ఉద్యోగంలో చేరా. సినిమాలపై ప్రేమ చావక అప్పుడప్పుడు ఘోస్ట్ రైటర్‌గానూ పనిచేస్తున్నా. ప్రస్తుతం సినిమా కష్టాలేం లేవు. కానీ వయసు మీరింది. పెళ్లాడ్డానికి ఏ అమ్మాయి ముందుకు రావట్లేదు. అనుభవంతో చెబుతున్నా. కలలు కన్న ప్రతి ఒక్కడూ హీరో కాలేడు. అలా కాకపోయినా బతకగలిగే ఓ ప్రత్యామ్నాయం కూడా ఆలోచించుకోవాలి. ఈ పరాజితుడి నుంచి కూడా పాఠాలు నేర్వొచ్చనే మీ ముందుకొచ్చా.
కూతురి మనసు తెలుసుకోవేం నాన్నా!
కూతురు చిటికెనవేలు పట్టుకొని బుడిబుడి అడుగులు వేయిస్తూ మురిసిపోయేది నాన్న. గారాబం చేస్తూనే బాధ్యతలు నెరవేర్చేది నాన్న. కానీ మా నాన్నకి నాన్న లక్షణాలే లేవు.
కన్నతండ్రి గురించి ఓ అమ్మాయి ఇలా చెప్పడం తప్పే. కానీ నాకు తప్పడం లేదు. ఇంట్లో అమ్మానాన్నలకు రోజూ గొడవలే. అమ్మ ఏడుస్తూ తరచూ అమ్మమ్మ వాళ్లింటికెళ్లిపోయేది. మొదట్లో నాకేం తెలిసేది కాదు. తర్వాత నాన్నకు వేరే మహిళలతో సంబంధాలున్నాయని అర్థమైంది. ఆ విషయం తెలిశాక ఆయనపై ఉన్న కాస్త గౌరవం పోయింది.
నేను చదువులో ఎప్పుడూ క్లాస్ ఫస్టే. అంతా మెచ్చుకునేవారు. నాన్న తప్ప. పైగా ‘బాగా చదివి ఎవర్ని ఉద్ధరిస్తావటా?’ వెటకారమాడేవారు. ఏడుపొచ్చేది. టెన్త్‌లో మండలం ఫస్ట్ వచ్చా. అప్పుడు మాత్రం చాలా సంతోషించారు. ‘నీ కూతురు చదువయ్యేదాకా సర్కారే చదివిస్తుందిక’ ఎవరో చెప్పారట నాన్నతో. అందుకే ఈ ప్రేమ.
ట్రిపుల్‌ఐటీలో ఉచితంగా సీటొచ్చింది. ఏడాది గడిచిందో లేదో ‘మా చెల్లి కొడుకుని పెళ్లి చేస్కో. చదువు సంగతి తర్వాత చూద్దాం’ బలవంతపెట్టారు నాన్న. నాకిప్పుడే పెళ్లి వద్దని ఏడ్చినా వినరే! ఇంటికెళ్లడమే మానేశా. నాపై కోపాన్ని అమ్మపై చూపేవారు. నానా చిత్రహింసలు పెట్టేవాడు. ‘మా గురించి పట్టించుకోకు. నువ్వు చదువుపై దృష్టి పెట్టి పెద్ద ఉద్యోగం సంపాదించాలి’ ప్రోత్సహించేది అమ్మ.
బీటెక్ పూర్తైంది. ఇంటికెళ్లడం ఇష్టంలేదు. ఉద్యోగం వెతుక్కునే సాకుతో సిటీకొచ్చాను. అక్కడే పరిచయమయ్యాడు శ్రీధర్. మొదట్లో మగాళ్లంతా మా నాన్నలాగే ఉంటారనుకున్నా. శ్రీధర్‌ని చూశాక ఆ అభిప్రాయం మారింది. తను అమ్మాయిలతో ప్రవర్తించే తీరు, చూపించే ఆప్యాయత నన్ను కట్టిపడేసేవి. పైగా అతడిది మా సామాజికవర్గమే అని తెలిశాక అభిమానం స్థానంలో ప్రేమ మొదలైంది. నాలుగైదుసార్లు వాళ్లింటికెళ్లా. శ్రీధర్ అమ్మానాన్నలూ నాపై విపరీతమైన అభిమానం చూపించేవారు. శ్రీధర్ నన్ను ఇష్టపడుతున్నాడని తెలిశాక సొంత కోడలిలాగే చూడ్డం మొదలుపెట్టారు. శ్రీధర్ కుటుంబం మా కుటుంబానికి పూర్తి వ్యతిరేకం. వాళ్ల ఇల్లు అనుబంధాల పొదరిల్లులా ఉండేది. కొన్నాళ్లకు తన గైడెన్స్‌తోనే నాకు ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
సెలవులకు వూరెళ్లా. నాన్న పాతపాటే పాడారు. మేనత్త కొడుకుని పెళ్లాడమని. ఇంకా నాన్చడం నాకిష్టం లేదు. శ్రీధర్‌తో ప్రేమ విషయం చెప్పా. అతడ్నే పెళ్లాడతానన్నా. ప్రేమ పేరెత్తగానే ఇంతెత్తున లేచారు. కన్నకూతురని చూడకుండా అనరాని మాటలన్నారు. మాటలు పడ్డాను. నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. మౌనవ్రతం చేశా. ప్రేమగా అడిగా. కన్నీరు పెట్టుకున్నా. ఆయనది పాషాణ హృదయం కదా. కరగలేదు. అన్ని మార్గాలూ మూసుకుపోయాక ఆఖరి అస్త్రం ప్రయోగించా. ‘నేను మేజర్‌ని. నా ప్రేమను ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్లిపోతా’ అని బెదిరించా. పరువు గుర్తొచ్చిందేమో! ఇక చేసేదేం లేక చివరికి అయిష్టంగానే ఒప్పుకున్నారు.
మాకు పెళ్లి చేయడం నాన్నకు ఇప్పటికీ ఇష్టం లేదు. అయినా త్వరలోనే శ్రీధర్‌తోనే నా జీవితం ముడిపడబోతోంది. కన్నతండ్రిని విలన్‌ని చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రాలేదు. బాధ్యత మర్చిపోయిన తండ్రులు కనీసం కూతుళ్ల మనసునైనా అర్థం చేసుకోవాలని విన్నవిస్తున్నా.
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565