MohanPublications Print Books Online store clik Here Devullu.com

సద్గుణ సంపద, Sadhguru Sampadha

సద్గుణ సంపద
Sadhguru Sampadha

+++++++సద్గుణ సంపద++++++
మంచి గుణాలతో శోభిల్లే వ్యక్తి ‘సద్గుణ సంపన్నుడు’ అని పెద్దలంటారు. తన సుగుణాలతో శ్రీరామచంద్రుడు మనందరి మనసుల్లో స్థానం సంపాదించాడు. ఎందరికో మంచి మార్గం చూపించాడు. వాల్మీకి మహర్షి శ్రీరాముడి గుణ వర్ణన చేస్తూ- ఆయనకు పితృసేవ అనేది సహజ లక్షణమంటాడు. పట్టాభిషేకం భంగమైందని లక్ష్మణుడు ఆగ్రహిస్తే, శ్రీరాముడు అతణ్ని శాంతింపజేస్తాడు. తండ్రి ఏం చెప్పినా, ఏ విధంగా చెప్పినా ఆయన మాటను పాటించడమే తనయుడి కర్తవ్యమని హితవు పలుకుతాడు. భరతుడు చిత్రకూటానికి వెళ్లి అన్నను అయోధ్యకు రమ్మని బతిమిలాడినప్పుడు శ్రీరాముడు ఒప్పుకోడు. ‘నా మాట వినకపోతే నీ ముందే ప్రాయోపవేశం చేస్తా’నన్న భరతుడితో- ‘నాలాంటి కొడుకు, దశరథుడిలాంటి తండ్రి సత్యం పాటించకపోతే, ఇక లోకం ఎలా నడుస్తుంది?’ అనడం ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.
రంగనాథ రామాయణంలో బుద్ధారెడ్డి- శ్రీరాముడి గుణాన్ని వర్ణిస్తూ, మనసులో రోషం దాచుకోని వాడంటాడు. రోషం ఉండటం మానవ సహజ లక్షణం. దీర్ఘకాల కోపం శాంతిని దూరం చేస్తుంది. శ్రీరాముడికి కోపం వచ్చిన సంఘటనలు రామాయణంలో చాలా తక్కువగా ఉంటాయి. ఆ కోపం తాటాకు మంటలా చప్పున చల్లారిపోతుంది తప్ప, దావానలమై ప్రజ్వరిల్లదు.
శ్రీరాముడు రావణాసురుడి పైకి యుద్ధానికి వెళుతూ, వానర సైన్యం సముద్రాన్ని దాటడానికి దారి ఇవ్వాలని సముద్రుణ్ని ప్రార్థిస్తాడు. అతడు పట్టించుకోకపోయేసరికి రాముడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. సముద్రుడు భయపడి దారి ఇచ్చిన మరుక్షణం, రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు తప్ప ప్రయోగించడు. కోపాన్ని నిగ్రహించుకోవడమన్నది ఆయన నుంచి నేర్చుకోవాలి.
శ్రీరాముడిలోని మరో మంచి గుణం- స్థిరచిత్తం. ఏ సందర్భంలోనూ చాంచల్యం కనిపించదు. తండ్రి చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చడానికి వనవాసానికి సిద్ధమవుతాడు. పట్టాభిషేకం జరగనందుకు బాధపడడు. తండ్రి దుఃఖాన్ని చూసిన శ్రీరాముడు కైకేయిని కారణమడుగుతాడు. ఆమె ‘దశరథుడు చెప్పినదానికి నీకు ఇష్టమైనా కాకపోయినా, ఒప్పుకొంటేనే చెబుతా’ అంటుంది. సమాధానంగా శ్రీరాముడు- ‘నేను రెండు విధాలుగా మాట్లాడను, వనవాసానికి సిద్ధపడే వచ్చాను’ అని ప్రస్ఫుటం చేస్తాడు. రాముడిది ఒకటే మాట. చెప్పిందే ఆచరిస్తాడు.
శ్రీరాముడి స్థిరచిత్తానికి పరాకాష్ఠ, సీతా పరిత్యాగ ఘట్టం. ఆమెలో దోషం లేదని, ఆమెను పరిత్యజించడం వల్ల తనకు కష్టం, దుఃఖం కలుగుతాయని తెలిసి కూడా మహారాజుగా ప్రజాభిప్రాయానికి విలువిస్తాడు. అగ్నిపునీత సీతను అనివార్య పరిస్థితిలో అడవికి పంపిస్తాడు. శ్రీరాముడిలోని మరో ముఖ్య గుణం ఏకపత్నీవ్రతం. అందులో ఆయన- జాతికి ఆదర్శంగా నిలిచాడు. సీతను అడవికి పంపించిన అనంతర పరిస్థితుల్లో, ఆమె బంగరు ప్రతిమను ఉంచి యజ్ఞాలు నిర్వహించడంలోనూ రాముడి మూర్తిమత్వం స్పష్టమవుతుంది.
పౌరులు దశరథుడితో- శ్రీరాముడు ఎవరితోనైనా మాట్లాడటానికి ముందు చిరునవ్వులు చిందిస్తాడంటారు. ఆంజనేయుడు అశోకవనంలో ఉన్న సీతతో రాముడి గురించి చెబుతూ- ఆయన తన నడివడికను తానే రక్షించుకునే వాడంటాడు. సీత ఆంజనేయుడికి శ్రీరాముడి గుణం గురించి వివరిస్తూ- ఆయన తన జీవితానికి అపకారం కలుగుతున్నప్పుడూ ఎవరితోనూ అప్రియంగా మాట్లాడడని అంటుంది.
విపత్కర పరిస్థితుల్లోనూ ఓర్పు కలిగి ఉండటం ఉత్తమ లక్షణం. దశరథుడికి తన పుత్రులందరి మీదా ప్రేమ ఉన్నా, శ్రీరాముడిపై మరింత ప్రత్యేకానురాగం ఉండటానికి కారణం- ఆయన గుణ సంపద. సత్యసంధుడు, ధర్మాత్ముడు అయిన శ్రీరామచంద్రమూర్తి తన సద్గుణాలతో మనందరికీ ఆప్తుడయ్యాడు. ఆదర్శప్రాయుడయ్యాడు!
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list