MohanPublications Print Books Online store clik Here Devullu.com

పూజల వేళ... వ్రతా మాసం, It's Time for Puja....

పూజల వేళ... వ్రతా మాసం
 It's Time for Puja....

పూజల వేళ... వ్రతా మాసం!
శ్రావణమాసంలో ఏరోజు ప్రత్యేకత ఆరోజుదే. ఈ నెలలోనే... విష్ణుమూర్తి వరాహరూపం ధరించాడు, హయగ్రీవుడిగా అవతరించాడు. మంగళగౌరీ పూజలూ, వరలక్ష్మీవ్రతాలూ జరుపుకొనేదీ ఇప్పుడే. సూర్యభగవానుడిని అర్చించడానికి అనువైన సమయమూ ఇదేనంటారు.
శ్రావణం అనగానే పట్టుచీరల రెపరెపలతో, పసుపు పాదాల గలగలలతో కళకళలాడే పడుచు ముత్తయిదువలే గుర్తుకొస్తారు. ఆషాఢంలో పండగపబ్బాలుండవు. దీంతో, ఓరకమైన నిర్లిప్తత ఆవరించి ఉంటుంది. అదంతా, ఇప్పుడు తొలగిపోతుంది. భాద్రపదంలో వినాయక చవితినీ, ఆశ్వయుజంలో శరన్నవరాత్రులనూ నిష్ఠగా నిర్వహించుకోడానికి అవసరమైన ఆధ్యాత్మిక సాధన శ్రావణంలోనే మొదలవుతుంది. చంద్రుడు పున్నమిరోజు శ్రవణా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి, శ్రావణమాసమన్న పేరు స్థిరపడింది. మహావిష్ణువు జన్మనక్షత్రమూ ఇదే.
రోజుకో దేవుడు...
ఈనెలలో సోమవారం పరమేశ్వరుడినీ, మంగళవారం గౌరీదేవినీ, బుధవారం పాండురంగ విఠలుడినీ, గురువారం ఇష్ట గురువునూ, శుక్రవారం లక్ష్మీదేవినీ, శనివారం శనిదేవుడినీ అర్చించాలని పెద్దలు చెబుతారు. శుక్లపక్షంలో వచ్చే తిథులకూ ఎంతో ప్రాధాన్యం ఉంది. పాడ్యమినాడు బ్రహ్మనీ, తదియనాడు పార్వతినీ, చవితినాడు వినాయకుడినీ, పంచమినాడు చంద్రుడినీ, షష్ఠినాడు నాగేంద్రుడినీ, సప్తమినాడు సూర్యభగవానుడినీ, అష్టమినాడు దుర్గమ్మనూ, నవమినాడు మాతృదేవతల్నీ, ద్వాదశినాడు మహావిష్ణువునూ, చతుర్దశినాడు పరమేశ్వరుడినీ పూజించాలని చెబుతారు. అంటే, శ్రావణంలో దాదాపుగా ప్రతి రోజూ ప్రత్యేకమైందే. మొత్తంగా, ఇది వ్రతాల మాసం. నోముల నెల. ప్రతి మంగళవారం ముత్తయిదువలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ ఏడాదే కొత్తగా పెళ్లయిన వధువులు మంగళగౌరీ నోము పడతారు. కుటుంబ సౌభాగ్యాన్నీ, భర్త శ్రేయస్సునూ ఆకాంక్షిస్తూ మహిళలు మంగళ స్వరూపిణి అయిన గౌరమ్మను పూజిస్తారు. శ్రీకృష్ణపరమాత్మ ద్రౌపదికి వ్రత మహత్యాన్ని వివరించాడని పురాణాలు చెబుతాయి. పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మీ వ్రతం. వరదాయిని అయిన తల్లి, తమ కోర్కెల్ని తప్పక ఈడేరుస్తుందని భక్తుల నమ్మకం. శ్రావణశుద్ధ ద్వితీయనే ‘తల్ప ద్వితీయ’ అనీ అంటారు. శ్రీకృష్ణుడిని అర్చించి, చంద్రోదయ సమయంలో అర్ఘ్యం ఇస్తారు. చవితిని ‘అలోల చతుర్థి’గా జరుపుకొంటారు. ఈరోజున వూయలలూగే సంప్రదాయం ఉంది.
మనిషి ప్రకృతిలోని చాలా ప్రాణుల్ని నయానో భయానో మచ్చిక చేసుకున్నాడు. అయినా, దారికిరాని జీవుల్ని దివ్యశక్తులుగా అర్చిస్తూ...నైవేద్యాలు సమర్పిస్తూ... తమ జోలికి రావొద్దని వేడుకుంటున్నాడు. అందులోనూ గ్రామీణుడికి సర్పగండాలు ఎక్కువ. ఆ భయాన్ని తొలగించి, అభయం ఇవ్వమంటూ పంచమినాడు పుట్టలో పాలుపోస్తాడు. ఈరోజే గరుత్మంతుడు తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోడానికి స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకొచ్చాడని ఐతిహ్యం. కాబట్టే ఈ పంచమిని ‘గరుడపంచమి’ అనీ పిలుస్తారు.
మనిషి ఆశాజీవి. మంచిని కోరుకుంటాడు. విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ ఆశను నిజం చేసుకోడానికి మనోశక్తినిచ్చే రోజు ఆశాదశమి, దీన్నే ‘కామికా దశమి’ అనీ అంటారు. పగలు ఉపవాసం చేసి, సాయంత్రం శివుడిని అర్చిస్తారు. మన విన్నపాల్ని పరమేశ్వరుడి చెవిలో వేసి..వాటిని నెరవేర్చే బాధ్యత తీసుకునే చల్లనితల్లి పార్వతీదేవి. ఆశాదేవి రూపంలో భక్తులు కొలిచేది పార్వతమ్మనే. మరుసటి రోజు ‘పుత్రదా ఏకాదశి’. సంతాన భాగ్యాన్ని ఆశించే దంపతులు ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తారు. రోజంతా ఉపవాసం ఉంటారు. పుత్రదా ఏకాదశి వ్రతాన్ని చేపట్టే మహాజిత్తు అనేరాజు సంతానాన్ని పొందినట్టు పురాణగాథ. ‘దామోదర ద్వాదశి’ నాడు విష్ణుమూర్తికి పూజలుచేస్తారు. ఆలూమగల అనుబంధాన్ని నిత్యనూతనం చేసే దేవుడు మన్మథుడు. ఆ చెరుకువింటి వేలుపును త్రయోదశినాడు కొలుస్తారు. ప్రత్యేకించి ‘అనంగ వ్రతం’ ఆచరిస్తారు. కుంకుమ కలిపిన అక్షితలతో పాటూ గులాబీలూ మందారాలూ మొదలైన ఎరుపురంగు పూలు మాత్రమే పూజకు ఉపయోగిస్తారు.
జయంత్యుత్సవాలు...
శ్రావణంలో రెండు ప్రధానమైన జయంతులున్నాయి. ఒకటి వరాహ జయంతి, మరొకటి హయగ్రీవ జయంతి. చతుర్దశినాడు, వరాహ అవతారంలో మహావిష్ణువు హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి... నీటిపాలైన భూమిని ఉద్ధరించాడు, వేదాల్ని కాపాడాడు. పూర్ణిమరోజు హయగ్రీవ జయంతి! హయగ్రీవ రూపంలో శ్రీమహావిష్ణువును కొలుస్తారు. శ్రావణ పూర్ణిమనాడే రక్షాబంధనోత్సవం! ఆడపిల్లలు అన్నదమ్ములకు రాఖీలు కట్టి రక్ష తీసుకుంటారు.
కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్దశిగా భావిస్తారు. సంకటనాశకుడైన వినాయకుడిని అర్చించడం సంప్రదాయం. షష్ఠి నాడు... సూర్యోపాసన చేసి గోధుమనూక పాయసాన్ని నివేదిస్తారు. శ్రావణ బహుళాష్టమినాడు కృష్ణయ్య పుట్టినరోజు. చిన్ని కృష్ణుడికి వెన్న, అటుకులు నైవేద్యంగా పెడతారు. ఈ మాసం చివరిరోజు... పోలాల అమావాస్య. మహిళలు కందమొక్కలోకి సంతానలక్ష్మిని ఆవాహనం చేసి పూజిస్తారు. ఇదే వృషభ అమావాస్య కూడా. ఎద్దులకు ఆపూట విశ్రాంతి. చెట్టులో చేమలో, పాములో పశువులో..సృష్టిలోని ప్రతి జీవరాశిలో దైవత్వాన్ని చూడమంటుంది భారతీయత. శ్రావణ వ్రతాలే అందుకు సాక్ష్యాలు.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list