MohanPublications Print Books Online store clik Here Devullu.com

చూసుకోండి..మీ ట్రైగ్లిజరైడ్లు, Cholesterol

చూసుకోండి..మీ ట్రైగ్లిజరైడ్లు, Cholesterol

కొలెస్ట్రాల్‌.. దీని గురించి మనకు ఇప్పుడు ఎంతో కొంత తెలుసు. మనం కొలెస్ట్రాల్‌ గురించి ఎక్కువే ఆందోళన చెందుతున్నాం. తరచుగా కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకుని చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటే వెంటనే తగ్గించుకునే మార్గం గురించి ఆలోచిస్తున్నాం. ఇది అవసరమేగానీ.. ఇంతకంటే ప్రాముఖ్యం ఉన్నదీ, మనం బాగా నిర్లక్ష్యం చేస్తున్నదీ మరోటి ఉంది. అదే ట్రైగ్లిజరైడ్లు! 

మనం ‘లిపిడ్‌ ప్రొఫైల్‌’ పరీక్ష చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్‌తో పాటుగా రిపోర్టులో ఇది కూడా ఉంటుందిగానీ దీన్ని గురించి మనం ఎక్కువగా పట్టించుకోవటం లేదు. ఇది సరికాదు. ఆరోగ్య పరంగా, వైద్యపరంగా కొలెస్ట్రాల్‌ కంటే ట్రైగ్లిజరైడ్లకు కాస్త ఎక్కువ ప్రాధాన్యమే ఉందిగానీ తక్కువ కాదు. ముఖ్యంగా మన భారతీయుల్లో చాలా అనారోగ్యాలకు, వ్యాధులకు ట్రైగ్లిజరైడ్లే కీలక పాత్ర  పోషిస్తున్నాయి. అందుకే దీనికి సంబంధించిన వివరాలు మీ ముందుకు తెస్తోంది సుఖీభవ!
భారతీయుల్లో మరీ ఎక్కువ: మన భారతీయులకు రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువుండటం కంటే కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువుండటమనే సమస్య అధికం! ఈ విషయాన్ని యాభై ఏళ్లుగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వంటి అత్యున్నత సంస్థలు చేస్తున్న అధ్యయనాలు వెల్లడిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఆ విజ్ఞానం రోగుల వరకూ, చికిత్సల వరకూ రావటం లేదు. వైద్యులు కూడా కొలెస్ట్రాల్‌ గురించి తీసుకున్నంతటి శ్రద్ధ ఈ ట్రైగ్లిజరైడ్ల విషయంలో చూపించటం లేదన్న వాదన ఉంది. కానీ మన భారతీయులకు సంబంధించి ట్రైగ్లిజరైడ్లు మరీ కీలకమైనవని గుర్తించటం చాలా అవసరం.
ఎక్కువుంటే నష్టం ఏమిటి?
* ట్రైగ్లిజరైడ్లు ఎక్కువుంటే గుండె జబ్బులు పొంచి ఉంటాయి. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువ ఉండటం వల్ల ఎప్పుడైనా కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, రక్తనాళాల వ్యాధుల వంటివన్నీ పొంచి ఉంటాయి. ఇదొక రకం సమస్య అయితే... గుండె, రక్తనాళాల జబ్బుల బారినపడుతున్న 70% మందికి కొలెస్ట్రాల్‌ సాధారణ స్థాయిలోనే ఉండి, కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి చాలా రకాల జీవనశైలి సంబంధ రుగ్మతలకు ట్రైగ్లిజరైడ్లను మూలంగా భావిస్తున్నారు.
* ట్రైగ్లిజరైడ్ల స్థాయి చాలా ఎక్కువైతే (ఈ సమస్య మద్యం ఎక్కువగా తాగే వారిలో మరీ అధికం) క్లోమగ్రంథి దెబ్బతినే ‘పాంక్రియాటైటిస్‌’ అనే తీవ్ర సమస్య తలెత్తుతుంది.
* ట్రైగ్లిజరైడ్లు అనేవి కొవ్వు పదార్థం. ఇవి ఎక్కువగా ఉంటే శరీరంలోని ప్రతి జీవ రసాయన క్రియకూ అడ్డుపడుతూ శారీరక ప్రక్రియలన్నింటినీ మందగింపజేస్తాయి. హైపోథైరాయిడిజం, లివర్‌ సిరోసిస్‌ వంటి సమస్యలుంటే దీనివల్ల అవి ఎక్కువ కావచ్చు.
* ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం వల్ల అతిపెద్ద నష్టం- రక్తనాళాల గోడలు దెబ్బతినటం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ కొవ్వు ముద్దలు పేరుకోవటం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాస్తవానికి అక్కడ కొలెస్ట్రాల్‌ పేరుకోవటానికి ముందే- రక్తంలో అధికంగా ఉన్న ట్రైగ్లిజరైడ్లు ఆ ప్రాంతాన్ని (ఎండోథీలియం) దెబ్బతీస్తాయి. ఇవి ముందు దెబ్బతీస్తే.. తర్వాత ఆ  ప్రదేశంలో కొలెస్ట్రాల్‌ (ఎథిరోమా) వచ్చి పేరుకుంటుంది. వాస్తవంగా పరీక్షించి చూస్తే అక్కడ పేరుకునే దానిలో కొలెస్ట్రాలే ఉండొచ్చుగానీ అసలు దారి తీసే పరిస్థితిని సృష్టించేవి ఈ ట్రైగ్లిజరైడ్లే! కాబట్టి ముందే వీటిని అడ్డుకుంటే కొలెస్ట్రాల్‌ పేరుకునే సమస్యను బాగా నివారించవచ్చు.
ఎందుకు పెరుగుతాయి?
1. వూబకాయం, 2. మధుమేహం
3. మద్యం ఎక్కువగా తీసుకోవటం వల్లగానీ, క్లోమంలో రాళ్ల వల్లగానీ ఏదైనా కారణంతో పాంక్రియాస్‌ గ్రంథి వాపునకు గురైతే దానివల్ల ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి.
4. లివర్‌ జబ్బులు, సిరోసిస్‌, 5. పసరుతిత్తిలో రాళ్ల వంటివీ ట్రైగ్లిజరైడ్లను పెంచుతాయి.
6. పుట్టుకతో వచ్చే కొన్ని కొవ్వుల సమస్యలు. ఇవి ప్రధాన కారణాలేగానీ.. 
వాస్తవానికి భారతీయుల్లో 70% మందికి ఇవేమీ లేకుండా కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వీటి విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది.
మన తీరు వేరు!
మనం ఆహారం తీసుకుంటాం. అది జీర్ణమై.. మన శరీరానికి అవసరమైన శక్తి రూపంలోకి ఎలా పరిణామం చెందుతోంది? ఈ ప్రక్రియ ఎలా జరుగుతోందన్న దానిపై బెంగళూరుకు చెందిన సెయింట్‌ జాన్స్‌ వైద్య కళాశాల ఫిజియాలజీ విభాగం వారు దాదాపు 25 ఏళ్ల క్రితమే లోతుగా అధ్యయనం చేసి.. ఈ విషయంలో మన భారతీయులకూ - పాశ్చాత్యులకూ మధ్య చాలా కీలకమైన వ్యత్యాసం ఉందని గుర్తించారు. ఆహారం తీసుకున్నప్పుడు దానిలోని కొవ్వు పదార్ధాల్ని మన భారతీయుల్లో శరీరం ముందుగా గ్లిజరాల్‌, ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చుకుని.. పేగుల గోడల్లోనే ‘ట్రైగ్లిజరైడ్లు’గామార్చేసుకుని.. అక్కడి నుంచే దాన్ని దాచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అలా నిల్వ రూపంలోకి మార్చుకోగా మిగిలే దాన్నే శక్తిగా మార్చుకుని ఖర్చు పెడుతోందని గుర్తించారు. కానీ పాశ్చాత్యుల్లో వారి శరీరం తిన్న ఆహారంలోని కొవ్వుల్ని ముందుగా గ్లిజరాల్‌, ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చుకుని.. శక్తిలా వినియోగించుకుంటూ, అలా వాడుకోగా మిగిలిన దాన్ని అప్పుడు ట్రైగ్లిజరైడ్లు, కొవ్వులుగా మార్చుకుని నిల్వ చేసుకుంటోంది. మన భారతీయులకూ, పాశ్చాత్యులకూ ఇంత తేడా ఎందుకు వచ్చిందన్న దానికి చాలా సిద్ధాంతాలున్నాయి. బలంగా వినిపించేది మాత్రం ‘థ్రిఫ్టీ  జీన్‌’ సిద్ధాంతం. దీనిప్రకారం ఒకప్పుడు మన ప్రాంతంలో కరవులు, క్షామాలు ఎక్కువగా ఉండటం వల్ల శక్తిని, ఆహారాన్ని ఎక్కువగా నిల్వ ఉంచుకునేందుకు మనలో జన్యుపరంగానే మార్పులుచోటుచేసుకున్నాయి. అందువల్ల పాశ్చాత్యులతో పోలిస్తే మన భారతీయుల్లో ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తలెత్తుతోంది. కొలెస్ట్రాల్‌ కంటే మరీ ప్రమాదం..  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలన్నీ కూడా కొలెస్ట్రాల్‌ కంటే కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం మరింత ప్రమాదకరమైన విషయమని నానాటికీ గుర్తిస్తున్నాయి. క్రమేపీ వైద్యరంగం దృష్టి కొలెస్ట్రాల్‌ మీది నుంచి ట్రైగ్లిజరైడ్ల మీదికి మళ్లుతోంది. అందుకు ముఖ్యమైన ఉదాహరణ- ఆధునిక రుగ్మతలన్నింటికీ మూలకారణంగా భావిస్తున్న‘మెటబాలిక్‌ సిండ్రోమ్‌’ను నిర్వచించే విషయంలో దానికి కారణమయ్యే అంశాల్లో ‘టోటల్‌ కొలెస్ట్రాల్‌’కు బదులుగా ట్రైగ్లిజరైడ్లను ఉంచటం! ఆ కారణాలేమిటన్నది చూస్తే- బొజ్జ, అధిక బీపీ, రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, మంచి కొలెస్ట్రాల్‌ తక్కువుండటం. దీన్నిబట్టి ట్రైగ్లిజరైడ్ల ప్రాధాన్యం సుస్పష్టం.
తగ్గించుకునేదెలా?:  ట్రైగ్లిజరైడ్లు స్థాయిని మించి ఉంటే వాటిని తగ్గించుకోవటం అవసరం. ఇందుకు జీవనశైలిని మార్చుకోవటం కీలకం.
* లావుగా ఉంటే బరువు తగ్గాలి.
* మద్యం, పొగతాగటం వల్ల ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. వాటికి దూరంగా ఉండాలి.
* కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండే మాంసాహారం తగ్గించాలి.
* అన్ని రకాల నూనెలు, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు బాగా తగ్గించాలి.  * తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు తింటే ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కాబట్టి వీటిని బాగా తగ్గించాలి. బజార్లో ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాలు, రకరకాల చిప్స్‌, నూడుల్స్‌, సేమియా, పాస్తా, పిజ్జాల వంటివి, కేకులు, బిస్కట్లు.. ఇవన్నీ తేలికగా జీర్ణమయ్యే పిండిపదార్థాలే.
వీటన్నింటినీ తగ్గించాలి
* పంచదార, జామ్‌లు, జెల్లీల వంటివి ఎక్కువగా తినేవారికి ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. కాబట్టి ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవారు పంచదార, తీపి పదార్థాలు బాగా తగ్గించెయ్యాలి. కాఫీలో కూడా పంచదార మానెయ్యటం మంచిది.
* మామూలుగా మధుమేహం ఉన్నవారు పండ్ల వంటివి మితంగా తినటం, కాఫీలో పంచదార వంటివి మితంగా వేసుకున్నా ఫర్వాలేదుగానీ ట్రైగ్లిజరైడ్లు ఎక్కువున్న వారు మాత్రం పండ్లు, పంచదార, కూల్‌డ్రింకుల వంటి వాటన్నింటినీ మానెయ్యటం, మరీ అవసరమైతే చాలాచాలా మితంగానే తీసుకోవటం ముఖ్యం.
తేలికగా జీర్ణమయ్యే వరి అన్నం మానేసి గోధుమలకు, చపాతీలకు మారటం మంచిది.ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను ఇవ్వటం వల్ల ట్రైగ్లిజరైడ్లు తగ్గుతాయన్న భావన ఒకటుందిగానీ వీటితో ఆశించినంత ఫలితం ఉండటం లేదని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది.
ఎంత ఉండాలి?
మన రక్తంలో ట్రైగ్లిజరైడ్లు..
* 100 ఎంజీ/డీఎల్‌ లోపు ఉండటం ఉత్తమం
* 150 ఎంజీ/డీఎల్‌ వరకూ ఫర్వాలేదు, దాటితే రిస్కులు పెరుగుతాయి * 200 ఎంజీ/డీఎల్‌ దాటితే చికిత్స తప్పదు.
పరీక్ష ఎలా?:  మన రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయులు తేలికగా ప్రభావితమవుతుంటాయి. కాబట్టి పరీక్షకు వెళ్లే ముందు రోజు రాత్రి 8 గంటల తర్వాత ఆహారం తీసుకోకుండా ఉండాలి. రాత్రిపూట ప్రయాణాలు చేసినా, రాత్రంతా మేలుకున్నా, మద్యం తాగినా, మసాలా పదార్థాలు తిన్నా ట్రైగ్లిజరైడ్లు పెరిగిపోతాయి. కాబట్టి ఇవేమీ చెయ్యకుండా ఉదయం పరగడుపున, లేచిన గంటలోపు పరీక్ష కోసం రక్తం నమూనా ఇవ్వాలి. సాధారణంగా కొలెస్ట్రాల్‌ పరీక్షతో పాటే దీన్నీ చేస్తారు.
ఏమిటీ ట్రైగ్లిజరైడ్లు? ట్రైగ్లిజరైడ్లనేవి ఒక రకమైన కొవ్వులు. ఇవి కూడా మనకు కీలకమైన శక్తి నిల్వలు. ఈ ట్రైగ్లిజరైడ్లను మన శరీరం గ్లూకోజుగా మార్చుకుని శక్తిగా వినియోగించుకుంటుంది. మనం ఆహారం తీసుకున్న మొదటి రెండు మూడు గంటల్లో రక్తంలో గ్లూకోజు పెరిగినట్లే ట్రైగ్లిజరైడ్లు కూడా పెరుగుతుంటాయి. గ్లూకోజు కొద్దిగంటల్లోనే తరిగిపోతుందిగానీ ట్రైగ్లిజరైడ్లు మాత్రం నిల్వ రూపాలు కాబట్టి అంత త్వరగా తగ్గవు. మన శరీరం నిరంతరం గ్లూకోజును, దానితో పాటే ఈ ట్రైగ్లిజరైడ్ల నిల్వలను శక్తిరూపంలో మార్చుకుని వాడుకుంటూ ఉంటుంది. ఒకవేళ మనం 15-18 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండిపోతే అప్పుడు శరీరంలో గ్లూకోజు నిల్వలు మొత్తం అయిపోయి.. అప్పుడు శరీరం పూర్తిగా ట్రైగ్లిజరైడ్ల మీదే, వాటిని శక్తిగా మార్చుకోవటం మీదే ఆధారపడుతుంది. అయితే ట్రైగ్లిజరైడ్లు కేవలం శక్తిగా మారటమే కాదు.. కొలెస్ట్రాల్‌ కొవ్వుగా కూడా మారుతుంటాయి. అందుకే ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే అవి ఎల్‌డీఎల్‌ వంటి కొలెస్ట్రాల్‌ రూపంలోకి మారుతూ... కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగటానికీ దోహదం చేస్తాయి. ఇదే వీటితో పెద్ద సమస్య. మొత్తమ్మీద- ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ. 70% భారతీయుల్లో కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే ఎక్కువ ఉంటాయి, వీటిని వదిలేస్తే మున్ముందు కొలెస్ట్రాల్‌ పెరగటానికి దారి తీస్తాయి. కాబట్టి ట్రైగ్లిజరైడ్లనే నియంత్రిస్తే మున్ముందు కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకునే అవకాశంఉంటుందని గుర్తించాలి. కాబట్టి కొలెస్ట్రాల్‌ పరీక్ష ఒక్కటే చేసి చూసుకుంటూ అది బాగుంటే అంతా బాగుందని భావించటం సరికాదు. ట్రైగ్లిజరైడ్లు కూడా చూసుకోవటం అవసరం. రక్తంలో ట్రైగ్లిజరైడ్లు స్థాయికి మించి ఉండటాన్ని ‘హైపర్‌ ట్రైగ్లిజరిడీమియా’ అంటారు. ఇవి ఎక్కువున్నా ఎటువంటి లక్షణాలూ ఉండవుగానీ క్రమేపీ శరీరంలో వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
చికిత్స: కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు.. ఈ రెంటిలో ట్రైగ్లిజరైడ్లను తగ్గించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే కొలెస్ట్రాల్‌!
* హైపోథైరాయిడిజం, పాంక్రియాటైటిస్‌, మధుమేహం వంటి ఇతరత్రా కారణాల వల్ల ట్రైగ్లిజరైడ్లు పెరిగితే.. ఆ సమస్యలకు చికిత్స చేస్తే ట్రైగ్లిజరైడ్లూ తగ్గిపోతాయి.
* ఇతరత్రా సమస్యలేమీ లేకుండా కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే 200 కంటే ఎక్కువ ఉంటే వారికి పిండి పదార్థాలు తగ్గించటం వంటి జీవనశైలి మార్పులతో పాటు ప్రత్యేకించి ట్రైగ్లిజరైడ్లను తగ్గించేందుకు ఇచ్చే ‘ఫైబ్రైట్స్‌’ రకం మందులు కూడా ఇస్తారు.
* ట్రైగ్లిజరైడ్లతో పాటు కొలెస్ట్రాల్‌ కూడా ఎక్కువగా ఉంటే ముందు కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్లను సిఫార్సు చేస్తారు. దానితో ట్రైగ్లిజరైడ్లూ తగ్గుతాయి. ఒకవేళ అలా తగ్గకపోతే ట్రైగ్లిజరైడ్లను తగ్గించే ఫైబ్రైట్స్‌ సిఫార్సు చేస్తారు. ఒకవేళ కొలెస్ట్రాల్‌ పరిమితుల్లోనే ఉండి కేవలం ట్రైగ్లిజరైడ్లు మాత్రమే ఎక్కువగా ఉంటే ‘ఫైబ్రైట్స్‌’ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది.
* కొలెస్ట్రాల్‌ తగ్గించటానికి ఇచ్చే స్టాటిన్‌ మందులూ, ట్రైగ్లిజరైడ్లు తగ్గించేందుకు ఇచ్చే ఫైబ్రైట్‌ మందులూ.. రెండూ కలిపి వాడితే శరీరంలోని కండర క్షీణత రావచ్చు. కాబట్టి ఈ రెంటినీ వాడుకునేటప్పుడు 3 నెలలకు ఒకసారి సీపీకే అనే ఎంజైమ్‌ (క్రియాటినైన్‌ ఫాస్ఫో కైనేస్‌) పరీక్ష చేయించుకుని అది పెరుగుతున్నట్లుంటే వైద్యుల సలహాతో ఈ రెంటిలో ఏదో ఒక దాన్నే తీసుకోవాల్సి ఉంటుంది.
* మధుమేహం ఉన్న వారికి మధుమేహాన్ని సమర్థంగా నియంత్రణలోకి తెస్తే ట్రైగ్లిజరైడ్లు కూడా చాలా వరకూ నియంత్రణలోకి వస్తాయి. ఒకవేళ రాకపోతుంటే దీనికీ మందు తీసుకోవాలి.  మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నాయేమో చూసుకోవటం, దాన్ని తగ్గించుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వటం తప్పనిసరి. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నవారు పండ్లు మానెయ్యటం, లేదా బాగా తగ్గించటం మంచిది.
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list