MohanPublications Print Books Online store clik Here Devullu.com

కాలం-ధర్మం, Kalam-Darmam

కాలం-ధర్మం
Kalam-Darmam

+++++ కాలం-ధర్మం +++++
కాలం, ధర్మం రెండూ పరమాత్మ తత్వాలే. కాలానికి కొలమానం లేదు. ధర్మానికి పరిధులు లేవు. కాలప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషికి ధర్మం ఒక పట్టుగొమ్మ లాంటిది. కాలం చెల్లినా, ఆ ధర్మమే అతణ్ని చిరంజీవిగా, అమరజీవిగా కలకాలం నిలబెడుతుంది. ధర్మం కోసం జీవితాలను ధారబోసిన మహనీయుల చరిత్రలు, వారిని ఆ ధర్మమే ఎలా ఆదుకున్నదో చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ధర్మానికి కట్టుబడి అడవులపాలైన ధర్మరాజుకు చివరికి సార్వభౌమత్వాన్ని కట్టబెట్టింది ధర్మమే. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్న సూక్తి అక్షరసత్యం.
కాలాన్ని గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలతో కొలుస్తున్నాం. ఈ కొలతలు భౌతిక సౌలభ్యం కోసమే. కాలం- భూత భవిష్యత్‌ వర్తమానాల విరాట్‌ స్వరూపం. భూత, భవ్య, భవత్‌ ప్రభువు ధర్మాన్ని రక్షించటానికి యుగయుగాలుగా భూమిపై అవతరిస్తూనే ఉన్నాడు. ఆ అవతార మూర్తులు దుష్టశక్తులను నిగ్రహించి, శిష్ట జనులను అనుగ్రహించటానికే దిగివచ్చారు. శ్రీరామచంద్రుడు ధర్మప్రభువుగా అందరి హృదయ మందిరాల్లో శాశ్వతంగా నిలిచాడు. త్రేతాయుగంలో ఆదర్శ మానవుడై అయోధ్యలో వెలసిన దశరథ నందనుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే.
భూలోకంలో మానవులు సత్య ధర్మ పరాక్రములుగా పరిణతి చెందాలన్నదే ఆ పరమాత్మ కోరిక. మనమందరం ధర్మమార్గంలో పయనించి, పరమార్థం సాధించాలన్నదే సారాంశం. మానవుడు మానవేశ్వరుడిగా మారితే, ఈ భూలోకం ఒక స్వర్గమే అవుతుంది. తనలో దాగి ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోవటమే మానవ జీవిత పరమార్థం. కాలాతీత వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దటానికి మౌలికమైన మూడు అంశాలు, అఖిల ధర్మాలకూ మూలమైన వేదంలో ఉన్నాయి. అవి- రుతం, సత్యం, తపం.
రుతం అంటే, నైతిక జీవనం. నిత్యజీవితంలో సత్యసాధకుడికే ‘రుతం’ సాధ్యమవుతుంది. తపస్సు ద్వారా రుతసత్యాలను పొందటానికి మనిషికి శరీరం, మనసు, బుద్ధి- మూడూ ముచ్చటైన పరికరాలు. ఆరోగ్యమైన శరీరం, మనోనిగ్రహం, ఏకాగ్రబుద్ధి, పరస్పరం సహాయ సహకారాలు అందించినప్పుడే తపస్సిద్ధి కలుగుతుంది.
తపస్సిద్ధి పొంది త్రికాలవేదులైన రుషులు మానవ అభ్యుదయ ప్రణాళికను రూపొందించారు. మానవ సమాజం కలిసికట్టుగా సహజీవనం సాధించగలిగితే భూలోకంలో నిత్యకల్యాణం పచ్చతోరణం సుసాధ్యమేనని వారి అభిప్రాయం. ఆ ఆశయ సాధన కోసం వేదరుషులు ఆశ్రమ, వర్ణధర్మాలను ప్రవేశపెట్టారు. కాలక్రమంలో అవి సోమరితనానికి, కులభేదాలకు దారితీశాయి. వృత్తిధర్మాల వర్ణ వ్యవస్థ- వక్ర భాష్యం వల్ల కుల వ్యవస్థగా మారిపోయింది. వర్ణ వ్యవస్థలో కర్మ కౌశలానికి, గుణగణాలకు తగిన అవకాశం ఉండేది. ఆనాటి వర్ణ వ్యవస్థ కులవ్యవస్థగా మారటానికి చాలా కారణాలున్నాయి.
ఆశ్రమ ధర్మాల్లో గృహ ధర్మానికి ప్రాధాన్యం ఉండేది. గృహస్థులను బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు వేసవిలో మంచినీటి బావిగా భావించేవారు. స్త్రీని గృహదేవతగా పూజించేవారు. ఇల్లాలిగా గౌరవించేవారు.పురుషులతో సమానంగా స్త్రీలు విధాత అనే కవిసమ్మేళనాల్లో పాలుపంచుకునేవారు. వేద వాదినులకు రాజసభల్లో, పండిత పరిషత్తుల్లో సన్మానాలు జరిగేవి.
భూమండలంలో కలకాలం ధర్మం నాలుగు పాదాల మీద నడవటమే దైవనిర్ణయం. ఈ ప్రపంచానికి, సృష్టికి ఒక పరమార్థం ఉన్నదని, అది వేదవేద్యుడైన పరమాత్మ సంకల్పమేనని ఉపనిషత్తులు చెబుతున్నాయి. రుషులు, దేవతలు పరస్పర అవగాహనతో ఈ జగత్‌ చక్రాన్ని నడిపిస్తున్నారు. ఇహపర సాధనకు ధర్మబద్ధమైన నైతిక జీవనమే రాజమార్గం. ఆ మార్గంలో పయనించి సర్వగమ్యమైన మోక్షం పొందవచ్చు. మోక్షం అంటే బంధవిముక్తి, స్వేచ్ఛ! ధర్మం నాలుగు పాదాల నడిచే కాలం కోసం ఎదురుచూడటం ఆశాజీవి అయిన మానవుడికి సహజం. ఏది ధర్మమో కాలమే నిర్ణయిస్తుంది!
- ఉప్పు రాఘవేంద్రరావు


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list