MohanPublications Print Books Online store clik Here Devullu.com

వ్యాధులు - బాధలు, Health Problems


వ్యాధులు - బాధలు

Health Problems


                    కాలేయానికి శత్రువు 
                                       Liver



కాలేయం ఒక కర్మాగారం. ఇది నిరంతరం జీర్ణక్రియకు అవసరమైన రసాయనాలు ఉత్పత్తి చేయటం దగ్గర్నుంచి.. శరీరంలోని విషతుల్యాలను నిర్వీర్యం చేయటం వరకు రకరకాల పనులు చేస్తుంటుంది. నిజానికిది మొండి అవయం. ఎప్పుడైనా దెబ్బతింటే తిరిగి తనంత తానుగా కోలుకుంటుంది కూడా. అయినప్పటికీ దీనిపై దాడి చేసి, దెబ్బతీయటానికి హెపటైటిస్‌ వైరస్‌లు మన చుట్టూ కాచుకొని ఉంటాయి. ఇవి కాలేయవాపు (హెపటైటిస్‌) వంటి పలు సమస్యలు తెచ్చిపెడతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 12 మందిలో ఒకరు హెపటైటిస్‌ వైరస్‌ల ఇన్‌ఫెక్షన్లకు గురవుతున్నారని అంచనా. చిత్రమేంటంటే చాలామందికి తమ శరీరంలో ఈ వైరస్‌లు పాగా వేశాయని గానీ కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయని గానీ తెలియదు. హెపటైటిస్‌ బాధితుల్లో దాదాపు 70% మందికి ఇన్‌ఫెక్షన్‌ బాగా ముదిరిన తర్వాతే బయటపడుతోంది. కాబట్టి హెపటైటిస్‌ వైరస్‌ల గురించి.. వాటి వ్యాప్తి, నివారణ చర్యల గురించి తెలుసుకొని ఉండటం అవసరం.
హెపటైటిస్‌ కొందరిలో ఎలాంటి హాని తలపెట్టకపోవచ్చు. కొద్దిరోజుల్లో దానంతటదే తగ్గిపోవచ్చు. కానీ దీర్ఘకాలం కొనసాగితే కాలేయ కణజాలం దెబ్బతినటం(ఫైబ్రోసిస్‌), కాలేయం గట్టిపడటం(సిరోసిస్‌), కాలేయ క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. హెపటైటిస్‌కు ముఖ్య కారణం వైరస్‌లు. కొన్ని ఇతర ఇన్‌ఫెక్షన్లు, మద్యం అలవాటు, స్వీయ రోగనిరోధక జబ్బులు సైతం దీనికి దోహదం చేస్తాయి.
* హెపటైటిస్‌ వైరస్‌లలో ఎ, బి, సి, డి, ఇ రకాలు ప్రధానమైనవి. ఎ, ఇ రకాలు ప్రమాదకరం కాదు. ఇవి కలుషిత ఆహారం, నీరు ద్వారా వ్యాపిస్తాయి. మనం చూసే సాధారణ కామెర్లకు ఇవే కారణం. ఇవి తగినంత విశ్రాంతి తీసుకుంటే వాటంతటవే తగ్గుతాయి.
* హెపటైటిస్‌ బి వైరస్‌ రక్తం ద్వారా లేదా లాలాజలం, వీర్యం, యోని స్రావాల వంటి శారీరక స్రావాల ద్వారా వ్యాపించొచ్చు. ఇది ఒంట్లో చేరినా చాలామందిలో పెద్దగా ఎలాంటి లక్షణాలు కనబడకపోవచ్చు. కొద్దిమందిలో ఫ్లూ జ్వరం లాంటి లక్షణాలు, తీవ్రమైన అలసట, కళ్లు, చర్మం పసుపురంగులోకి మారటం, కడుపునొప్పి, విరేచనాలు, కీళ్ల నొప్పుల వంటివి కనబడతాయి.
* హెపటైటిస్‌ సి వైరస్‌ ప్రధానంగా రక్తం ద్వారా వ్యాపించే రకం. ఇన్‌ఫెక్షన్‌ తొలిదశలో పెద్దగా లక్షణాలేమీ ఉండకపోవచ్చు. కొందరిలో హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌లో మాదిరిగానే ఫ్లూ, కామెర్ల లక్షణాలు.. అలసట, వికారం వంటివి కనబడతాయి.
* హెపటైటిస్‌ డి ఇన్‌ఫెక్షన్‌ కేవలం హెపటైటిస్‌ బి బారినపడినవారిలోనే కనబడుతుంది. ఇవి రెండూ కలిసి సమస్యను మరింత తీవ్రం చేస్తాయి కూడా.
నివారణ ఉత్తమం
* శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలి.
* ఇతరులు వాడిన సిరంజీలు, సూదులు, రేజర్లు, టూత్‌ బ్రష్‌ల వంటి వాటికి దూరంగా ఉండాలి. అరక్షిత శృంగారం జోలికి వెళ్లొద్దు.
* ఎప్పుడైనా రక్తం ఎక్కించాల్సి వస్తే అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
* హెపటైటిస్‌ ఎ, బి రాకుండా చూసేందుకు ఇప్పుడు టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకోవటం హెపటైటిస్‌ నివారణకు అత్యుత్తమ మార్గం.

              గుండెకు కలివిడి బలం
                              Heart
గుండెజబ్బు, పక్షవాతం ముప్పు కారకాలనగానే అందరికీ అధిక రక్తపోటు, ­బకాయం, పొగ తాగటం వంటివే గుర్తుకొస్తాయి. కానీ ఒంటరితనం కూడా గుండెజబ్బు, పక్షవాతం ముంచుకు రావటానికి దోహదం చేస్తుంది!
నలుగురితో కలసిమెలసి తిరగటం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం మానసికంగా ఎంతో మేలు చేస్తుంది. నిరుత్సాహం తొలగిపోయి కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. కలివిడితనం శారీరకంగానూ మంచి ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నలుగురితో కలవకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోవటం వల్ల గుండెపోటు ముప్పు 29% పెరుగుతున్నట్టు తేలింది. పక్షవాతం ముప్పూ 32% ఎక్కువవుతోంది. ఇది పొగ తాగటం లేదా ­బకాయం మూలంగా తలెత్తే ముప్పుతో సమాన స్థాయిలో ఉంటుండటం గమనార్హం. 1.81 లక్షల మందిపై చేసిన 23 అధ్యయనాలను విశ్లేషించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఒంటరితనం రోగనిరోధక వ్యవస్థనూ బలహీనం చేస్తుంది. అధిక రక్తపోటుతోనూ దీనికి సంబంధం ఉంటోంది. అందువల్ల కుటుంబ సభ్యులు, బంధువులతో సత్సంబంధాలు కలిగుండటం.. కొత్త స్నేహాలను ఏర్పరుచుకోవటమనేది ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఉబ్భు సహజమే కానీ 

గవారిలో సాధారణంగా 25 ఏళ్ల నుంచి ప్రోస్టేట్‌ గ్రంథి పరిమాణం పెరుగుతూ పెద్ద వయసుకు వచ్చే సరికి ఇబ్బందికర స్థాయికి చేరుతుంది. ఇది సహజమైన పరిణామం. దీనికి క్యాన్సర్‌తో ఎలాంటి సంబంధం లేదు. దీన్నే బినైన్‌ ప్రోస్టాటిక్‌ హైపర్‌ప్లేసియా (బీపీహెచ్‌) అంటారు. ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బుకు ఇదే ప్రధాన కారణం. నిజానికిదేమీ ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు దారితీయదు. కానీ చాలామందిలో ఈ రెండు సమస్యలు కలిసే కనబడుతుంటాయి. కాబట్టి పెద్ద వయసులో మూత్రం ధార సన్నబడటం, మూత్రం పోస్తున్నప్పుడు మంట వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. ఒకవేళ క్యాన్సర్‌ ఉంటే ముందుగానే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది.

కట్టుడుపళ్లే కదా అనుకోవద్దు! 
Dental 
ళతళ మెరిసే దంతాలు ముఖానికి అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే కొందరికి చిగుళ్లజబ్బు, పుచ్చిపోవటం, గాయాలు, ప్రమాదాల వంటివి దంతాలు వూడిపోవటానికి దారితీస్తాయి. దీంతో నోరు బోసిపోయినట్టు, ఖాళీఖాళీగా కనిపిస్తుంది. ఇలాంటివారికి కట్టుడుపళ్లు బాగా ఉపయోగ పడతాయి. మామూలు దంతాల మాదిరిగానే కనిపిస్తూ.. ఆహారాన్ని నమలటానికి తోడ్పడే వీటిని కాపాడుకోకపోతే ఇతరత్రా సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి కట్టుడుపళ్లే కదా అని తీసిపారేయకుండా వీటిని కాపాడుకోవటానికి తగు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.
మొదట్లో కట్టుడుపళ్లు ఇబ్బందిగా అనిపించొచ్చు. వీటితో ఆహారం నమలటం కష్టం కావొచ్చు. కాబట్టి ఆరంభంలో గుడ్లు, పెరుగు వంటి మెత్తటి పదార్థాలు తీసుకోవాలి. పదార్థాలను నెమ్మదిగా నములుతూ తినాలి. పళ్లకు అతుక్కుపోయేలా జిగురుగా ఉండేవి తినకపోవటం మంచిది. ఆహారాన్ని ఒకే సమయంలో రెండు వైపులా నములుతూ తింటే కట్టుడుపళ్లు ముందుకు కదలకుండా, జారిపోకుండా చూసుకోవచ్చు. క్రమంగా అలవాటు పడిన తర్వాత ఎలాంటి పదార్థాలైనా తీసుకోవచ్చు.
కట్టుడుపళ్లను ధరించి నిద్రపోవటం మంచిది కాదు.
ఇవి సున్నితంగా ఉంటాయి కాబట్టి తేలికగా విరిగే అవకాశముంది. అందువల్ల వీటిని చేత్తో పట్టుకునేటప్పుడు సింక్‌లో నీళ్లు నింపి గానీ, టేబుల్‌ మీద రుమాలు పరచిగానీ పట్టుకోవాలి. దీంతో ఒకవేళ పొరపాటున కట్టుడుపళ్లు జారినా భద్రంగా ఉంటాయి.
కట్టుడుపళ్లను నోట్లోంచి తీసి పక్కనపెట్టినపుడు పిల్లలకు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండేలా చూసుకోవాలి.
వీటిని కూడా మామూలు దంతాల మాదిరిగానే రోజూ శుభ్రం చేయాలి. కట్టుడుపళ్లను శుభ్రం చేయటానికి వాడే ద్రవంలో రాత్రిపూట వేసి.. ఉదయంపూట మెత్తటి కొసలు గల బ్రష్‌తో పూర్తిగా శుభ్రం చేయాలి. ఆ తర్వాతే ధరించాలి.
మామూలు సబ్బు, వేడినీటితో కూడా కట్టుడుపళ్లను శుభ్రం చేసుకోవచ్చు. కానీ పౌడరు రూపంలో ఉండే క్లీనర్లు, బ్లీచ్‌, టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేయటం మంచిది కాదు. టూత్‌పేస్ట్‌తో కట్టుడు పళ్లు త్వరగా అరిగిపోయే ప్రమాదముంది.
నోటిని రోజూ శుభ్రం చేసుకోవాలి. చిగుళ్లను, నాలుకను, నోటిలోపలి పైభాగాన్ని శుభ్రంగా కడుకున్న తర్వాతే కట్టుడుపళ్లు పెట్టుకోవాలి.
వీటిని నోట్లోంచి బయటికి తీసినప్పుడు కట్టుడుపళ్లను శుభ్రం చేసే ద్రవంలో లేదా గోరువెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. బాగా వేడిగా ఉన్న నీటిలో కట్టుడుపళ్లను వేయొద్దు. అలాచేస్తే వీటి ఆకారం దెబ్బతింటుంది.
కట్టుడుపళ్లను ధరించినవాళ్లు వాటిల్లో పుల్లలు, పిన్నీసుల వంటివి పెట్టి కెలకటం తగదు.
కట్టుడుపళ్లలో ఏదైనా మార్పు గానీ నోటి సమస్యలను గానీ గమనిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.

మధుమేహ పుండ్ల ఆందోళనతో కీడు
Sugar
ధుమేహుల్లో నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువ. వీరిలో కాళ్లకు, పాదాలకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు కూడా సన్నబడుతుంటాయి. దీంతో పాదాలకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా పెద్దగా అవుతుంటాయి. మానకుండా చాలాకాలం వేధిస్తుంటాయి. ఇన్‌ఫెక్షన్‌ బారినపడి మొండి పుండ్లుగానూ మారతాయి. ఫలితంగా కొందరికి వేళ్లు, పాదాలు తొలగించాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది. ఇలాంటి పుండ్లతో బాధపడే మధుమేహులు తమ పరిస్థితి గురించి తీవ్రంగా ఆందోళన చెందటం గానీ.. వీటి మూలంగా మున్ముందు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనలతో గడపటం గానీ మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రతికూల ఆలోచనలు, భావాలు గలవారు మిగతావారికన్నా త్వరగా మరణిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైందని వివరిస్తున్నారు. మధుమేహ పుండ్లకు సంబంధించిన ఇతరత్రా అంశాలతో పాటు ప్రతికూల ఆలోచనలు కూడా మధుమేహుల ఆయుష్షుపై ప్రభావం చూపగలవని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని చెబుతున్నారు.
ఆందోళనకు ఆహార కళ్లెం!
Food
ఆందోళన మానసికంగానే కాదు.. శారీరకంగానూ దెబ్బతీస్తుంది. కాబట్టి ఆందోళన లక్షణాలను గుర్తించి వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవటం మంచిది. దీనికి ఆహారంతోనూ కళ్లెం వేయొచ్చు! సమతులాహారం తీసుకోవటం.. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు తాగటం.. కెఫీన్‌, మద్యం మానెయ్యటం లేదా తగ్గించటం వంటివి ఆందోళన నుంచి ఉపశమనం కలిగించేందుకు తోడ్పడతాయి. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాల కన్నా సంక్లిష్ట పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణమవుతూ.. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికి తోడ్పడతాయి. ఇలా ఇవి మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి. అలాగే ఎప్పుడు తినాలనేదీ ముఖ్యమే. వేళకు ఆహారాన్ని తినకుండా మధ్యమధ్యలో మానేస్తే రక్తంలో గ్లూకోజు తగ్గిపోయి ఆందోళన లక్షణాలు తీవ్రమవుతాయి. ఆందోళన విషయంలో మెదడు-పేగుల మధ్య సంబంధమూ కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే నాడుల మధ్య సమాచారాన్ని చేరవేసే సెరటోనిన్‌ గ్రాహకాలు పేగుల గోడల్లో పెద్దఎత్తున ఉంటాయి. కాబట్టి ఆందోళనతో బాధపడేవారు కొన్ని పోషకాలు ఎక్కువగా గల ఆహారంపై దృష్టి పెట్టటం మంచిది.
మెగ్నీషియం తక్కువగా గల ఆహారంతో ఆందోళన సంబంధ ప్రవర్తన పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మెగ్నీషియంతో కూడిన పాలకూర, పప్పులు, గింజ పప్పులు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తినటం మంచిది.
జీడిపప్పు, కాలేయం, గుడ్డ పచ్చసొనల్లోని జింక్‌ కూడా మేలు చేస్తుంది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు దండిగా గల సాల్మన్‌ వంటి చేపలు సైతం ఆందోళన తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.
పెరుగు, నిల్వ పచ్చళ్ల వంటి ప్రొబయోటిక్‌ పదార్థాలు నలుగురిలోకి వెళ్లినపుడు తలెత్తే ఆందోళన లక్షణాలను తగ్గిస్తాయి.
బి విటమిన్లు మానసికోల్లాసాన్ని కలిగించే సెరటోనిన్‌, డొపమైన్ల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి ఆకుకూరలు, పొట్టుతీయని ధాన్యాలు, పచ్చ బఠానీలు, వేరుశనగలు, బాదంపప్పు, చికెన్‌, చేపలు, గుడ్ల వంటివి తరచుగా తినటం మంచిది..
బొల్లి మచ్చలెందుకు?
Bolli 
చూడటానికి ఎబ్బెట్టుగా కనబడుతుంది గానీ బొల్లి హానికరమైన సమస్యేమీ కాదు. ఒకరి నుంచి మరొకరికి అంటుకునేదీ కాదు. కానీ దీని బారినపడ్డవారిని మానసికంగా వేధిస్తుంది. అక్కడక్కడా చర్మం రంగు మారి.. తెల్లగా.. మచ్చలు మచ్చలుగా కనబడే ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. సాధారణంగా మన చర్మం, వెంట్రుకలు, కళ్ల రంగు మెలనిన్‌ అనే వర్ణద్రవ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దీన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్‌ కణాలు పనిచేయకపోయినా, పూర్తిగా దెబ్బతిన్నా రంగు ఏర్పడదు. దీంతో ఆ భాగంలో రంగు మారిపోతుంది. బొల్లికి కారణమేంటో కచ్చితంగా తెలియదు. మన రోగనిరోధక శక్తి పొరపాటున మెలనోసైట్స్‌ కణాల మీద దాడి చేయటం వల్ల వస్తుండొచ్చని అనుకుంటున్నారు. మెలనోసైట్స్‌ వాటంతటవే దెబ్బతినటం వల్ల వస్తుండొచ్చని మరికొందరు పరిశోధకుల భావన.
ఎవరికి వస్తుంది?
పిల్లలు, పెద్దలు.. స్త్రీలు, పురుషులనే తేడా లేకుండా బొల్లి ఎవరికైనా రావొచ్చు. సాధారణంగా చాలామందిలో 20 ఏళ్లకు ముందే బయటపడుతుంది. ముదురు చర్మం గలవారిలో స్పష్టంగా కనబడుతుంది. రోగనిరోధశక్తి పొరపాటున శరీరం మీదే దాడిచేసే (హైపర్‌థైరాయిడిజమ్‌ వంటివి) సమస్యలు గలవారికి బొల్లి వచ్చే అవకాశం ఎక్కువ. వంశపారంపర్యంగా వచ్చే అవకాశముంది గానీ.. ఇలా కచ్చితంగా వస్తుందని చెప్పలేం. తల్లిదండ్రులకు బొల్లి ఉన్నా చాలామంది పిల్లల్లో రాకపోవచ్చు.
మచ్చలు ఒళ్లంతా వ్యాపిస్తాయా?
కొందరిలో బొల్లి మచ్చలు ఆయా భాగాలకే పరిమితమవుతాయి. మరికొందరిలో ఇతర భాగాలకూ వ్యాపిస్తుంటాయి. కొందరికి మచ్చలు వ్యాపించటానికి చాలా ఏళ్లు పడితే.. మరికొందరిలో చాలా వేగంగా విస్తరిస్తాయి.
చికిత్సలతో ప్రయోజనం
బొల్లికి కారణమయ్యే మెలోనోసైట్స్‌ కణాలు దెబ్బతినటాన్ని ఆపేందుకు ఎలాంటి మందులు లేవు. కానీ కార్టికోస్టిరాయిడ్‌ వంటి పైపూత మందులు చర్మం రంగు మెరుగుపడటానికి తోడ్పడతాయి. విటమిన్‌ డి పైపూత మందు కూడా బాగా ఉపయోగపడుతుంది. అవసరమైనవారికి వైద్యులు అతినీలలోహిత కిరణాల చికిత్స చేస్తారు. మచ్చల మీద రంగు తిరిగి రావటానికి తోడ్పడే లేజర్‌ చికిత్స కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. కొత్త మచ్చలు రావటం ఆగిపోయినవారికి పంచ్‌ గ్రాఫ్టింగ్‌ ప్రక్రియ ద్వారా వేరే చోటు నుంచి చర్మం తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా అతికించి రంగు మారుపోయేలా చేసే ప్రక్రియ కూడా అందుబాటులో ఉంది.



మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


















No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list