MohanPublications Print Books Online store clik Here Devullu.com

నీటి మంటలు పుట్టించే స్వాముల గురించి... నీటి మంటలు చేతబడి, Swamyji

నీటి మంటలు పుట్టించే స్వాముల గురించి... నీటి మంటలు చేతబడి
 Swamyji

నీటి మంటలు పుట్టించే స్వాముల గురించి...
నీటి మంటలు చేతబడి:---------+++++++++

స్వాముల్లో నీతిమంతుల గురించి అరుదుగా వింటాం. మరి... నీటి మంటలు పుట్టించే స్వాముల గురించి... దాదాపుగా అసాధ్యమే! ఈ నీటిమంటలు... నీటిమీద రాతలేనా కష్టాలను మాయచేసే ట్రిక్కులా! లేక... జేబులు కొట్టే మేజిక్కులా?

‘‘రా శంకరన్నా... ఎన్నాళ్లైంది చూసి! పిల్లలు, వదిన బావున్నారా?, మంచినీళ్లివ్వనా’’ కుశల ప్రశ్నలతో పలకరించింది హైమవతి. ‘‘అంతా బావున్నాం హైమవతీ, రిటైరయ్యాను. పిల్లల పెళ్లిళ్లయ్యాయి కదా! నేను, మీ వదిన శేషజీవితం సొంతూర్లోనే గడుపుదామనుకుంటున్నాం’’ అన్నాడు శంకరయ్య తాను వచ్చిన పని వివరిస్తూ. ‘‘అంతకంటే సంతోషం ఏముంటుంది! అలాగే రండి! ఇల్లు ఉండనే ఉందాయె’’ శంకరయ్య నిర్ణయాన్ని స్వాగతించింది హైమవతి. ‘‘ఆ ఇంటిని నివాసయోగ్యంగా మార్చుకుందామని వచ్చానమ్మా’’ మనసులో మాట బయటపెట్టాడాయన. ‘‘దానిదేముంది? ఓ గంట విశ్రాంతి తీసుకోండి. వంట చేస్తాను’’ అంటూ వంట పనిలో పడిందామె.
గదిలో ఉన్న పాతకాలం నాటి వస్తువులను, కొత్తగా చేరిన వస్తువులను పరికించి చూడసాగాడు శంకరయ్య. ప్రాచీన భాండాగారంలో ఆధునికతను అమర్చినట్లు ఉందా ఇల్లు. శంకరయ్య చూపు గోడకు వేళ్లాడుతున్న క్యాలెండర్ మీద పడింది. ఎరువుల డీలర్ కంపెనీ పేరు, దుకాణం అడ్రస్సుతో ప్రచురించిన క్యాలెండర్ అది. బ్రహ్మయ్య ఎరువుల దుకాణం... అంటే వీడు తన క్లాస్‌మేట్ బ్రహ్మం గాడేనా?’’... ఆలోచనలు గతంలోకి వెళ్లాయి. క్యాలెండర్‌లో ఉన్న స్వామీజీ ముఖం కూడా తెలిసినట్లే ఉంది. భోజనం చేస్తూ హైమవతిని క్యాలెండర్‌లో ఉన్న స్వామీజీ గురించి అడిగాడు. గత కొద్ది నెలలుగా తాను వింటున్న సంగతులను చెప్పసాగిందామె.

‘‘ఆయన ముఖంలో ఏదో దివ్యమైన కాంతి ఉంది వదినా’’ అబ్బురంగా చెబుతోంది కామాక్షి. ‘‘ఎప్పుడు అన్నం తింటాడో తెలియదు. ఎప్పుడో ఓసారి కళ్లు తెరిచి చెలమలో నీరు తాగి మళ్లీ చెట్టు కిందకు వస్తాట్ట.’’ ‘‘నువ్వెళ్లినప్పుడు కళ్లు తెరిచాడా. నీకేం చెప్పాడు’’ మధ్యలో అడ్డు తగులుతూ అడిగింది హైమవతి. ‘‘ఆయన వచ్చిన వాళ్లను చూడను కూడా చూడడొ దినా! అయినా సరే... ఆయన కళ్లు విప్పే క్షణాల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. రెండు గంటల సేపు కూర్చున్నా. అయినా కళ్లు తెరవలే. నేనెళ్లక ఒక్క ఘడియ ముందే కళ్లు తెరిచాట్ట’’ అన్నది నిరుత్సాహంగా.

సాధువు కళ్లు తెరిచాక ఎదురుగా ఉన్నవాళ్లలో చాలా మందిని పేర్లతో సంభోదించేవారు. తమ పేరు సాధువుకెలా తెలిసిందనే ఆశ్చర్యంతోపాటు మహిమ అంటే అదే మరి అనే సమాధానం కూడా వాళ్లకు వాళ్లే చెప్పుకునేవారు. సాధువుకు తమ కష్టాలను చెప్పుకునేవారు. వాళ్ల కష్టాలను సాధువు నీటిలో మండించేవాడు. సాధువు రెండు నెలల్లోనే స్వామీజీ అయ్యాడు.
కొందరు భక్తులు శిష్యులుగా మారారు. స్వామీజీని అనుక్షణం కనిపెట్టుకుని ఉంటున్నారు. వారి బస కూడా స్వామీజీతోపాటు కుటీరంలోనే. భక్తులు పెరిగారు. కానుకలు పెరిగాయి. శిష్యుల జీవనశైలి మారింది. జీవనస్థాయి పెరిగింది. శిష్యగణం ప్రచారమూ జోరందుకుంది. వైద్యం, జ్యోతిషం, వాస్తు, కుటుంబ కలహాలు... సమస్య ఏదైనా సరే దోష పరిహారం చెబుతారు, మన చేతనే పూజ చేయిస్తారు. ఆయన నీటిని తిప్పి పోస్తే మంటలు మండుతాయి. ఆ మంటల్లో కష్టాలు కాలిపోతాయి... ఇదీ సారాంశం. శంకరయ్య అంతా విన్న తర్వాత హైమవతిని మరికొన్ని ప్రశ్నలడిగాడు.
ఓ వారం తర్వాత...
‘‘మన ఊళ్లోకి కొత్త సన్యాసి వచ్చాడు’’... వార్త ఊరంతా గుప్పుమంది. ఒక సన్యాసి శిష్యులతో పాటు పాదయాత్ర చేసుకుంటూ మన ఊరికి వచ్చాడు. ఆయన శిష్యులు ఇంటింటికీ వెళ్లి... ‘మీ బోరులో నుంచి ఒక గ్లాసెడు నీటిని తెచ్చి పోయండి. మంటలు మండిస్తాం’ అని ప్రచారం చేయసాగారు. నీటిలో నుంచి మంటలు పుట్టించే స్వామి వచ్చారంటూ ప్రచారం రెండు మూడు రోజుల్లోనే పాకిపోయింది. పాత స్వామీజీ శిష్యులు వచ్చి కొత్త స్వామిని కలిశారు. తమ ఆశ్రమానికి వచ్చి విశ్రమించవలసిందిగా ఆహ్వానించారు. కొత్త స్వామి చిరునవ్వుతో వారి ఆహ్వానానికి సుముఖత వ్యక్తం చేశారు. రెండు రోజులు గడిచాయి. ‘‘ఇద్దరు స్వామీజీలు కలిసి ఊరికి సందేశాన్నిస్తారు. మంచి విషయాలు చెప్తారు. అందరూ సమావేశానికి రావలసింది’’ అని డప్పు వేయించారు.
జనం సమావేశమయ్యారు. ‘‘నీటిలో మంట ఎలా వస్తుంది’’ అని చిన్నగా మొదలైన డిబేట్ అరగంటలో తారస్థాయికి చేరింది. ‘‘స్వామీజీ మహిమ వల్లనే’’ అనే స్వామీజీ శిష్యుల వాదన బలహీనపడుతోంది. క్రమంగా వారిలో ఆవేశం పెరుగుతోంది. సన్యాసి శిష్యులు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుగుతున్నారు. జనానికి మాత్రం ఇందులో ఏదో మోసం దాగి ఉందని తెలుస్తోంది. అదేంటో తెలిశాకే కదిలేది అన్నట్లు స్థిరంగా ఉన్నారు.

సన్యాసి శిష్యులు వెళ్లి స్వామీజీ కుటీర పరిసరాల్లోని ఇసుకలో అక్కడక్కడా దాచిన కార్బైడ్ రాళ్లను బయటకు తీశారు. ఓ రాయి మీద నీటిని పోశారు. రాయి నుంచి అసిటలిన్ గ్యాస్ విడుదలైంది. ముందు పొగ రాజుకుని క్షణాల్లో మండిపోయింది. ఊరి జనం చేత అన్ని రాళ్ల మీదా నీటిని పోయించారు. అన్నీ మండాయి. ‘‘ఎంత మోసం’’.. నోళ్లు నొక్కుకున్నారు మహిళలు. మగవాళ్లలోనూ గుసగుసలు మొదలయ్యాయి. ఇంతలో ఆ సన్యాసి గడ్డం తీసేశాడు. ఆ సన్యాసి శంకరయ్య. ‘‘ఇదంతా ఎందుకు చేశానంటే...’’ అని మొదలుపెట్టి స్వామీజీ ఆడుతున్న నాటకంతోపాటు, స్వామీజీ ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరో కూడా చెప్పాడు.

అలాగ వెళ్లినవాడు... ఇలాగ వచ్చాడు!
ఇది పొడరాళ్లపల్లి గ్రామంలో అక్కమ్మ కొండ, గుండుదోనలో పదిహేనేళ్ల కిందట జరిగింది. అంతకు పదేళ్ల ముందు గ్రామంలో చంద్రం అనే ఓ మాయగాడు ఉండేవాడు. తనకు పై స్థాయిలో చాలామంది తెలుసని, హైదరాబాద్‌లో నాయకులు, అధికారులు పలుకుబడి ఉందని చెప్పుకునేవాడు. పదవ తరగతి పరీక్షలో మంచి మార్కులు వేయిస్తానని డబ్బు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మరి కనిపించలేదు. దశాబ్దం దాటాక సాధువు రూపంలో ఊరికొచ్చాడు. క్యాలెండర్‌లో ఉన్న చంద్రాన్ని శంకరయ్య గుర్తు పట్టాడు. శంకరయ్య సైన్స్‌ప్రచార వేదికలో సభ్యుడు. మూఢనమ్మకాల గురించి చైతన్యం తీసుకురావడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంటాడు. అలాంటి శంకరయ్య కళ్లలో పడడంతో చీటింగ్ చంద్రం బండారం బయటపడింది. - ఎస్. శంకర శివరావు, జనవిజ్ఞాన వేదిక జాతీయ మేజిక్ కమిటీ సభ్యులు
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
టాగ్లు: ఎరువుల దుకాణం, శంకరయ్య, భోజనం, Store fertilizers, Sankarayya, Meal



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list