MohanPublications Print Books Online store clik Here Devullu.com

కండరాలు కకావికలం!Muscles

కండరాలు కకావికలం!Muscles

తీవ్రమైన అలసట. భరించలేని బడలిక. కొద్దిదూరం నడిస్తే ఒళ్లు సహకరించదు. నాలుగు మెట్లు ఎక్కేసరికి పని అయిపోతుంది. మెల్లగా ఏ చిన్న పనీ చెయ్యలేని పరిస్థితి వచ్చేస్తుంది. తల దువ్వుకోవటం కూడా కష్టమైన పని అయిపోతుంది. అసలు ఒంట్లో ఏమవుతోందో.. ఇలా ఎందుకు జరిగిపోతోందో తెలియనంతటి అయోమయం ఆవరిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆలోచించాల్సిన సమస్య మయస్తీనియా గ్రేవిస్‌! మనిషిని నిలువూనా కుప్పకూల్చే కండరాల సమస్య ఇది! ముందుగా గుర్తిస్తే దీన్ని చాలా వరకూ అదుపులో ఉంచుకోవచ్చు. కొన్నిసార్లు దాదాపుగా బయటపడొచ్చు కూడా. అందుకే దీనికి సంబంధించిన వివరాలను అందిస్తోంది ఈ వారం సుఖీభవ!
కొన్ని జబ్బులు మనకు అంతగా తెలియవు. చిన్నగానే మొదలై క్రమేపీ పెద్ద సమస్యలుగా పరిణమిస్తాయి. ఇతరత్రా జబ్బుల మాదిరిగా కనిపిస్తూనే చివరికి తీవ్రంగా వేధిస్తాయి. మయస్తీనీయా గ్రేవిస్‌ అలాంటి సమస్యే. అలసట, నీరసం వంటి లక్షణాలతో చాలా తేలికగా మొదలవుతుంది. క్రమేపీ కనురెప్పలు వాలిపోవటం, రెండు దృశ్యాలు కనబడటం వంటివి మొదలవుతాయి. కానీ వాటిని చూసి అంతా దీన్నో కంటి సమస్యగా పొరబడుతుంటారు. నడవటం కష్టమవుతుంటుంది కాబట్టి ఎముకల జబ్బు అనుకుంటుంటారు. ఇలా అసలు సమస్యను వదిలేసి.. ఏవేవోగా అనుమానిస్తుండటం వల్ల చాలా సమయం వృథా అవుతుంది. అందుకే మయస్తీనియా లక్షణాల గురించి అవగాహన ఉంటే తప్పించి దీన్ని సత్వరమే గుర్తుపట్టలేరు.
మనం ఏ పని చెయ్యాలన్నా కండరాలన్నీ చక్కటి సమన్వయంతో కదలాలి. అవసరమైతే చురుకుగా కదలాలి. వేగంగానూ కదలాలి. అయినా కూడా పెద్ద అలసట అనిపించకూడదు. కానీ కండరాల చేత చురుకుగా పని చేయించే యంత్రాంగమే జావగారిపోతుంటే? మెదడు నుంచి అందాల్సిన సంకేతాలు సమర్థంగా అందకపోతే? క్రమంగా ఒక్కొక్క కండరమూ నిస్తేజమవుతూ వస్తుంది. స్తబ్దుగా మారిపోతుంది. కొద్దిపాటి పనికే కుప్పకూలుతుంది. ఇలాంటి చిత్రమైన, అరుదైన సమస్యే మయస్తీనియా గ్రేవిస్‌. కండరాలు, నాడుల మధ్య సంబంధాన్ని దెబ్బతీసి.. మనం కావాలనుకున్నప్పుడు కదల్చగలిగే కండరాలపై నియంత్రణను కోల్పోయేలా చేయటం ద్వారా చిన్న చిన్న పనులు కూడా చెయ్యటం కష్టమైపోవటం దీని ప్రత్యేకత. ఈ సమస్య వంశపారంపర్యంగా రావొచ్చు. తీవ్రమైన శారీరకశ్రమ, ఇన్‌ఫెక్షన్‌లతోనూ రావొచ్చు. కొన్నిసార్లు విపరీతమైన వేడి, చలికి గురికావటం కూడా దీనికి దారితీయొచ్చు. తీవ్రమైన భావోద్వేగానికి, ఒత్తిడికి లోనవటమూ ఈ సమస్యను తెచ్చిపెట్టొచ్చు. ఇది స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా.. ఏ వయసులోనైనా రావొచ్చు. కానీ 40 ఏళ్ల లోపు మహిళల్లో, 60 ఏళ్లు పైబడిన పురుషుల్లో తరచుగా కనబడుతుంది. రజస్వల ఆరంభమైన తొలినాళ్లలో యుక్తవయసు బాలికలకూ మయస్తీనియా వచ్చే అవకాశముంది.
ఏమిటీ సమస్య?
మనం నడవాలన్నా, రాయాలన్నా, తినాలన్నా.. ఇలా ఏ పనులు చేయాలన్నా కండరాల సంకోచ వ్యాకోచాలే కారణం. వీటిని మన మెదడు నుంచి వెలువడే నాడీ ప్రచోదనాలు నియంత్రిస్తాయి. ఇవి నాడుల గుండా ప్రయాణించి కండరాలతో నాడులు కలిసే చోటుకి చేరుకుంటాయి. నిజానికివి నేరుగా కండరాల పోచలను తాకవు. కండర పోచలు, నాడుల చివర్ల మధ్య కొంత ఖాళీ స్థలం (నాడీకండర కూడలి) ఉంటుంది. సంకేతానికి సంబంధించిన విద్యుత్‌ ప్రచోదనాలు ఇక్కడికి చేరుకున్నప్పుడు అసిటీల్‌కోలైన్‌ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది కండరాలు చురుకుగా, శక్తిమంతంగా పని చేయటానికి తోడ్పడుతుంది. అందువల్ల రక్తంలో దీని మోతాదు లోపిస్తే కండరాలు నిస్తేజంగా, స్తబ్ధుగా మారిపోతాయి. అసిటీల్‌కోలైన్‌ నాడీకండర కూడలిలో తిరుగుతూ రకరకాల గ్రాహకాలకు అంటుకుంటుంది. ఈ గ్రాహకాలు గల భాగాలు తగినంతగా ప్రేరేపితమైతే కండరాలు సంకోచిస్తాయి. అయితే మయస్తీనీయా బాధితుల్లో ఈ గ్రాహకాల భాగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం అసిటీల్‌కోలైన్‌ను దెబ్బతీసే, నిలువరించే ఏసీహెచ్‌ ఆర్‌ అనే యాంటీబాడీలే. ఇవి రక్తంలో పెద్దమొత్తంలో పేరుకుపోయి.. అదేపనిగా అసిటీల్‌కోలైన్‌ గ్రాహకాన్ని దెబ్బతీస్తుంటాయి. సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థలో భాగమైన యాంటీబాడీలు శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లపై దాడి చేస్తుంటాయి. కానీ మయస్తీనీయా బాధితుల్లో ఇవి ఏసీహెచ్‌ ఆర్‌ గ్రాహకాలపై దాడి చేసి వాటిని దెబ్బతీస్తాయి. ఫలితంగా కండర సంకోచాలు తగ్గుముఖం పడతాయి. వీరిలో కండర సముదాయం తరచుగా బలహీనమవుతూ ఉంటుంది. ఫలితంగా చిన్నపాటి పనులకే కండరాలు తీవ్ర అలసటకు లోనవుతాయి. చివరికి పూర్తిగా పనిచేయని స్థితికీ చేరుకుంటాయి. అందుకే మయస్తీనియా గ్రేవిస్‌ బారినపడ్డ వారికి కొద్దిదూరం నడిచినా, తేలికపాటి వ్యాయామం చేసినా వెంటనే నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. కొన్నిసార్లు ప్రాణం పోతుందేమో అన్నంతగా అలసిపోతుంటారు కూడా.
కారణాలేంటి?
మయస్తీనీయా గ్రేవిస్‌కు ప్రధాన కారణం మన ఛాతీలో ఉండే థైమస్‌ గ్రంథి సైజు పెరగటం. ఛాతీ మధ్యఎముక, వూపిరితిత్తులకు మధ్యలో ఉండే థైమస్‌ గ్రంథి యుక్తవయసు వరకే చురుకుగా పనిచేస్తుంది. ఆ తర్వాత మనం పెద్దగా అవుతున్నకొద్దీ క్రమంగా కుంచించుకుపోతుంది. థైమస్‌ గ్రంథి నుంచి థైమోసిన్‌ అనే హార్మోన్‌ విడులవుతుంది. ఇది వ్యాధులతో పోరాడే టి కణాల వృద్ధిని ప్రేరేపిస్తుంది. అసిటీల్‌కోలైన్‌ను దెబ్బతీసే ఏసీహెచ్‌ ఆర్‌ యాంటీబాడీల ఉత్పత్తిని ఈ గ్రంథి ప్రేరేపిస్తున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. చిన్నప్పుడు పెద్దగా, పెద్దయ్యాక చిన్నగా మారే థైమస్‌ గ్రంథి.. మయస్తీనియా బారినపడ్డ కొందరు పెద్దవారిలో చాలా పెద్దగా ఉంటుంది. కొందరిలో థైమస్‌గ్రంథిలో కణితులు కూడా ఉండొచ్చు. దీంతో గ్రంథి పరిమాణం పెరుగుతుంది. 90% మందిలో మయస్తీనీయాకు గ్రంథి సైజు పెరగటమే ప్రధాన కారణం. 10% మందిలో మాత్రం రోగనిరోధకశక్తి పొరపాటున మన శరీరం మీదే దాడి చేయటం వల్ల వస్తుంటుంది.
అనుమానించటమెలా?
మయస్తీనీయా తొలిదశలో తల దువ్వుకోవటం కష్టమనిపిస్తుంది. తేలికైన వస్తువులను తరచుగా ఎత్తమంటే వెంటనే అలసిపోతుంటారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, నెమ్మదిగా పరుగెడుతున్నపుడు కొద్దిసేపటికే తీవ్ర నిస్సత్తువలో కూరుకుపోతారు. కొన్నిసార్లు తేలికపాటి వ్యాయామం చేసినప్పుడే కాదు.. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడతారు.
శిశువులకూ రావొచ్చు
గర్భిణులకు మయస్తీనియా ఉంటే వారికి పుట్టిన శిశువులూ దీని బారినపడే అవకాశముంది. ఏసీహెచ్‌ ఆర్‌ యాంటీబాడీలు తల్లి రక్తం నుంచి శిశువు రక్తంలోకి చేరటమే దీనికి కారణం. దీని మూలంగా పిల్లలు పాలు సరిగా తాగలేరు. శ్వాస తీసుకోవటంలోనూ ఇబ్బంది పడతారు. ఇది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. శిశువులు ఏడ్వటం ఆరోగ్యానికి మంచిది. కానీ మయస్తీనియా గల పిల్లల్లో ఏడ్వటమూ తగ్గుతుంది. కళ్లు కూడా సరిగా తెరవలేరు. అందువల్ల మయస్తీనియా గల గర్భిణులకు కాన్పు చేసే డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి పుట్టే పిల్లలకు మయస్తీనియా వచ్చే అవకాశముందని గుర్తించాలి. శిశు సంరక్షణకు పూర్తిస్థాయి సదుపాయాలు, ఎల్లవేళలా నిపుణులు అందుబాటులో గల ఆసుపత్రుల్లోనే కాన్పు చేయాలి.


శస్త్రచికిత్సతో మంచి ఫలితం!
  యస్తీనియా లక్షణాలను తగ్గించటానికి కొన్నిరకాల సమర్థమైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటితో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువ. ఉదాహరణకు ప్రెడ్నిసలోన్‌ మందుతో ఒంట్లో నీరు, లవణాలు అధికంగా పేరుకుంటాయి. దీంతో ముఖం, కాళ్లు, చేతుల వంటివి ఉబ్బరిస్తాయి. ఈ దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే మయస్తీనియాకు శస్త్రచికిత్స చేయటమే ఉత్తమ పరిష్కారంగా తోస్తుంది. ఇందులో ఛాతీలోని థైమస్‌ గ్రంథిని పూర్తిగా తొలగిస్తారు. ఈ శస్త్రచికిత్స ద్వారా నాలుగు రకాల ప్రయోజనాలున్నాయి. 1. థైమస్‌ గ్రంథిని తొలగించటం వల్ల చాలామందిలో సమస్య దాదాపు పూర్తిగా నయమవుతుంది. 2. మయస్తీనీయా లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. సమస్య ప్రాణాంతక స్థితి వరకూ చేరకుండా ఆగిపోతుంది. 3. శస్త్రచికిత్స తర్వాత అవసరమైన మందుల మోతాదు చాలావరకు తగ్గించటానికి వీలవుతుంది. 4. థైమస్‌ గ్రంథిలో కణితి ఏర్పడితే కొందరిలో అది క్యాన్సర్‌గానూ పరిణమించొచ్చు. అందువల్ల గ్రంథిని తొలగిస్తే ముందుగానే క్యాన్సర్‌ ముప్పు నివారణకూ తోడ్పడుతుంది. కాబట్టి మయస్తీనీయాకు ఇటీవలికాలంలో పాశ్చాత్యదేశాలన్నీ శస్త్రచికిత్సనే ప్రధాన పరిష్కారంగా గుర్తిస్తున్నాయి. అయితే కొందరిలో ఇతరత్రా సమస్యల కారణంగా థైమస్‌ గ్రంథి తొలగింపు శస్త్రచికిత్స కుదరకపోవచ్చు. అలాంటి వారికి మందులు తప్ప మరో మార్గం ఉండదు. కానీ మనదేశంలో చాలామంది వైద్యులు మయస్తీనియాకు ముందుగా మందులు ఇవ్వటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మందులతో దుష్ప్రభావాలు తలెత్తటంతో పాటు ఆర్థికంగానూ భారంగా పరిణమిస్తుంది. ఒకవేళ థైమస్‌గ్రంథిలో క్యాన్సర్‌ కణితి ఉంటే దాన్ని తొలిదశలోనే తొలగించే అవకాశమూ తప్పిపోతుంది.


లక్షణాలు
యస్తీనీయా ప్రభావానికి గురైన కండరాలను తరచుగా వాడుతుంటే సమస్య తీవ్రమవుతుంటుంది. అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లక్షణాలు తగ్గుముఖం పడుతుంటాయి. అయితే మయస్తీనీయా లక్షణాలు క్రమంగా పెరుగుతూ వస్తుంటాయి. సమస్య మొదలైన కొన్నేళ్ల తర్వాత చాలా తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. మయస్తీనీయా మన నియంత్రణలో ఉండే కండరాలను ప్రభావితం చేసినప్పటికీ.. కొన్ని కండర సముదాయాల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. 
రెప్పలు వాలిపోవటం: మయస్తీనియా తీవ్రమవుతున్నకొద్దీ ఒక కనురెప్ప కిందికి వాలిపోతుంటుంది. ఒక కన్ను గానీ రెండు కళ్లను గానీ చాలాసేపు పూర్తిగా తెరిచి ఉంచటం కష్టమవుతుంది. నేరుగా చూడటమంటే కనురెప్పలు పైకి ఎత్తలేరు. ఒకవేళ రెప్ప పైకి లేచినా నిమిషం సేపు కూడా నిలబడదు. వెంటనే కిందికి వాలిపోతుంది. తల పైకెత్తకుండా ఆకాశం వైపు చూస్తే కనురెప్పలు కొద్దిసేపట్లోనే వాటంతట అవి కిందికి వాలిపోతాయి. కొందరిలో రెండు కనురెప్పలూ పూర్తిగా వాలిపోవచ్చు. కన్ను సరిగా మూసుకోకపోవటం వల్ల కళ్లు మద్యం మత్తులో ఉన్నవారి మాదిరిగా కనబడతాయి. ఒక వస్తువు మీద దృష్టి కేంద్రీకరించటం కష్టమవుతుంది.
రెండు దృశ్యాలు కనబడటం: ఒకే వస్తువు రెండుగా కనబడటం మరో లక్షణం. ఈ దృశ్యాలు నిలువుగా గానీ అడ్డంగా గానీ కనబడొచ్చు. ఒక కన్ను మూస్తే మాత్రం తిరిగి మామూలుగా కనబడుతుంటుంది.
ముఖంలో భావాలు పలకవు: మయస్తీనియా తీవ్రమవుతున్నకొద్దీ ముఖంలో నవ్వటం వంటి భావాలు పలకవు. ముఖం చెక్కలా నిస్తేజంగా తయారవుతుంది. పెదవి ముందుకు పొడుచుకువస్తుంది. కింది దవడ కూడా బాగా కిందికి జారిపోతుంది. నవ్వితే ‘మూలిగినట్టుగా’ అనిపిస్తుంది.
మింగటంలో ఇబ్బంది: తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు తరచుగా గొంతుకు అడ్డం పడుతుంటాయి. దీంతో తినటం, తాగటం, మాత్రలు వేసుకోవటం కష్టమవుతుంది. కొన్నిసార్లు తాగుతున్న నీళ్లు ముక్కు నుంచి బయటకు వస్తుంటాయి. నీళ్లు, లాలాజలం నోటికి ఒక పక్క నుంచి చుక్కలు చుక్కలుగా పడుతుంటాయి. తింటున్నప్పుడు.. ముఖ్యంగా గట్టిగా ఉండే పదార్థాలు నములుతున్నప్పుడు కండరాలు మధ్యలోనే అలసిపోతాయి. దీంతో తినటంలోనూ ఇబ్బంది తలెత్తుతుంది.
మాట తత్తర: మాట తత్తర పోతుంది. నత్తి ఉన్నట్టు, ముక్కుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వీళ్లు బిగ్గరగా మాట్లాడటమంటే ఇబ్బంది పడతారు. అంకెలను బిగ్గరగా లెక్కపెట్టలేరు. ఒకటి నుంచి మొదలుపెట్టి 10 వరకు లెక్కపెట్టేలోపు గుసగుసగా మాట్లాడుతున్నట్టు మారుతుంది.
చేతులు నిటారుగా ఉంచకపోవటం: మయస్తీనీయా మెడ, చేతులు, కాళ్ల కండరాలనూ బలహీనం చేస్తుంది. కాళ్ల కన్నా చేతులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మయస్తీనియా బాధితులు చేతులను నిటారుగా పైకెత్తితే వెంటనే కిందికి దించేస్తారు. నిమిషం సేపు కూడా పైకెత్తి ఉంచలేరు. కాళ్ల కండరాలు బలహీనమైతే ఈడ్చుకుంటూ నడుస్తారు. మెడ ప్రభావితమైతే తలను పెకెత్తి నిలపటం కష్టమవుతుంది.

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list