MohanPublications Print Books Online store clik Here Devullu.com

క్యాంపస్‌...కాపురం...... క్యాంపస్‌.. మరో ప్రపంచం! Campus

క్యాంపస్‌...కాపురం...... క్యాంపస్‌.. మరో ప్రపంచం! 
Campus

క్యాంపస్‌...కాపురం......
క్యాంపస్‌.. మరో ప్రపంచం!
అమ్మ ఒడి, నాన్న బడి దాటి.. ఇల్లు దాటి, వూరు దాటి.. కాలు బయట పెడుతున్నప్పుడు.. అది ఏ వయసులోనైనా పెద్ద ప్రయత్నమే!
బడి చదువుల నుంచి విదేశీ పీజీల వరకూ.. చదువుల కోసం ‘క్యాంపస్‌ కాపురం’ అనివార్యమవుతున్న ఈ రోజుల్లో.. పిల్లలు కొత్త వాతావరణంలో, కొత్త మనుషుల మధ్య వాచక పాఠాలే కాదు, జీవిత పాఠాలూ నేర్వాల్సి వస్తోంది. శారీరకంగా, మానసికంగా ఎదిగీ ఎదగని ఈ వయసులో కొన్ని అంశాల పట్ల శ్రద్ధ తీసుకోకపోతే పెను ప్రమాదాలే పొంచి ఉంటాయి. అందుకే ‘క్యాంపస్‌ ఆరోగ్యం’ గురించి సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!
ఇంటి బెంగ
కాలేజీలో, క్యాంపస్‌లో, హాస్టల్‌లో అడుగుపెట్టగానే మొట్టమొదట ఆవరించేది ఒంటరితనం. తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్లను, పాత మిత్రులందరినీ వదిలేసి కొత్త చోట, కొత్త సమూహంలో ఒంటరిగా గడపాల్సి రావటం ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది. దీంతో కొద్దిరోజుల్లోనే ‘బెంగ’ ఆవరిస్తుంటుంది. మనసు ఇంటి మీదికి మళ్లుతుంది. దుఃఖం పొంగుకొస్తుంటుంది. ఇంటికి దూరంగా ఇంక ఒక్కక్షణం కూడా ఉండలేమన్నంత తీవ్రమైన భావేద్వేగాలు ­పేస్తాయి. కాలేజీ క్యాంపస్‌లో కాలుపెట్టిన ప్రతి ఒక్కరూ అనుభవించేదే ఈ ‘హోమ్‌ సిక్‌నెస్‌’. ఇది సహజం కూడా. చుట్టూ కొత్త మనుషులు, కొత్త వాతావరణంలో రేపటి గురించి కొత్త ఆశలు ­రిస్తూనే ఉంటాయిగానీ.. మరుక్షణమే ‘స్వర్గం లాంటి’ ఇల్లు గుర్తుకొచ్చి, మనసు వెనక్కిలాగుతుంటుంది. నిజానికి ఇంటికి దూరం జరిగి, వ్యక్తిగా సొంత జీవిత ప్రయాణాన్ని ప్రారంభించే ఈ తరుణంలో ఈ ­గిసలాట అనివార్యం. ఇది తాత్కాలికమేనని తెలిసినా కూడా ఆ క్షణానికి అదే పెనుభూతంలా కనిపిస్తూ, మనమో పెద్ద అగాధంలో పడిపోతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇది అధిగమించలేనంత తీవ్రమైన సమస్యేం కాదు. క్యాంపస్‌లో చేరిన తర్వాత వచ్చే తొలి సెలవుల్లో ఒక్కసారి ఇంటికి వెళ్లిరావటం ఉత్తమం. దీనివల్ల పిల్లల్లో తీవ్రమైన ఆవేదనలు తగ్గుతాయి. తల్లిదండ్రుల్లో కూడా పిల్లలు దూరంగా ఎలా ఉంటున్నారోనన్న భయాలు తొలగిపోతాయి. కనీసం ఫోన్లోనో, స్కైప్‌లోనో ఇంట్లో అందరినీ పలకరించటం, కాలేజీ అనుభవాలను వారితో పంచుకోవటం వల్ల ఒంటరి భావనలు తగ్గి, మనసు కొంత కుదుటపడుతుంది. ఇదే సమయంలో కొత్త సహచరులను పరిచయం చేసుకోవటం, వారితో అభిప్రాయాలను పంచుకుంటూ స్నేహాన్నిపెంచుకునే ప్రయత్నం చెయ్యటం వల్ల ఒంటరి వాళ్లమన్న ఆవేదన క్రమేపీ తగ్గుతుంది. ఎంత బాధగా ఉన్నా, ఒంటరిగా కూర్చుని దానిలో కూరుకుపోకుండా.. క్యాంపస్‌లో జరుగుతుండే కార్యక్రమాలేమిటో తెలుసుకుని వాటిలో భాగం పంచుకోవటం, సాంస్కృతిక కార్యక్రమాలు, సంఘాల వంటివేమైనా ఉంటే వాటిలో భాగస్వాములు కావటం వంటి పనులు చేస్తే కొత్త పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యంగా గుర్తించాల్సింది- ఈ సమయంలో ఈ బాధ మన ఒక్కరిదే కాదనీ, మనతో పాటే కొత్తగా క్యాంపస్‌లో చేరిన చాలామంది పరిస్థితి ఇదేనని గుర్తించటం ముఖ్యం. మన మనసులోని భావాలను వారితో పంచుకోవటం వల్ల ఎంతో ్చరట, ఉపశమనం లభిస్తాయి.
‘రూమ్మేట్‌’ చికాకులు
ఇంటి బెంగ నుంచి బయటపడగానే క్యాంపస్‌ జీవితం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించటం మొదలుపెడుతుంది. నూతన పరిచయాలు, కొత్త స్నేహాలు కొంతకాలం ఉత్కంఠ భరితంగానే అనిపిస్తాయిగానీ క్రమేపీ ఈ దశలో ‘రూమ్మేట్‌’ రూపంలో కొత్త చికాకులూ మొదలవుతాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధులు ఎదుర్కొంటున్నదే ఈ సమస్య. దీనిపై జరిగిన అధ్యయనాల్లో- ఎంతలేదన్నా ఏటా మూడోవంతు మంది విద్యార్ధులు ‘రూమ్మేట్‌’లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 15-20% మందిలో ఇవి చదువులను ప్రభావితం చేసే స్థాయిలో కూడా ఉంటున్నాయని గుర్తించారు కూడా. ఇంటి దగ్గర ఇష్టం వచ్చినట్టు ఉండటానికి అలవాటుపడిన వారికి ఉన్నట్టుండి ఇతరులతో కలిసి ఉండాల్సి రావటం వల్ల ‘సర్దుబాటు’ అన్నది పెద్ద సమస్యగా తయారవుతుంది. భిన్న సంస్కృతులు, నేపథ్యాల నుంచి వచ్చినవారు కావటం వల్ల రూములో వస్తువులను అమర్చుకోవటం, లైటు వెయ్యటం తియ్యటం నుంచి మాటామంతీ వరకూ ఎన్నో విషయాల్లో తేడాలు కనబడుతుంటాయి. క్రమేపీ అసంతృప్తులు పెరిగి.. చిన్నచిన్న విషయాలు కూడా పెను సమస్యలుగా తయారై స్పర్ధలు, కొట్లాటల వరకూ వెళుతుంటాయి. వీటితో ఆరోగ్యం, చదువు- రెండూ దెబ్బతింటాయి. కాబట్టి రూమ్మేట్‌ విషయంలో అతిగా ఆశించకుండా ముందు నుంచే వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించటం ముఖ్యం. ఒకే చోట కలిసి ఉంటారు కాబట్టి నమ్మకం తప్పనిసరి. అలాగే మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం, చనువు పెరిగినా దురుసుగా ప్రవర్తించకుండా ఉండటం అవసరం. ఎంతసేపూ ‘మనమే కరెక్టని’ అనుకోకుండా, ఎదుటివారి మాట ఆలకించటం, ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించటం ముఖ్యం. ఏదైనా సమస్యగా అనిపిస్తే దాన్నే మనసులో పెట్టుకుని కసి పెంచుకోకుండా, దాని గురించి స్వేచ్ఛగా చర్చించటం, కలివిడిగా ఉండటం, దగ్గరున్నది పంచుకోవటం, ఒక రకమైన సామాజిక జీవితానికి అలవాటు పడటం అవసరం.
నిద్ర సమస్యలు
కొత్త వాతావరణంలో, కొత్త పరిస్థితుల్లో రకరకాల మానసిక ఒత్తిళ్లు పనిచేస్తుంటాయి. దీనివల్ల నిద్ర సమస్యలు తలెత్తటం సహజం. అందుకే ప్రపంచవ్యాప్తంగా క్యాంపస్‌లలో విద్యార్ధులు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో నిద్ర కూడా పైఎత్తునే ఉంటోంది. నిద్ర సరిగా పట్టనప్పుడు తీవ్రమైన అలసట మాత్రమే కాదు, అనాసక్తత కూడా మొదలవుతుంది. కొత్త చదువులు మొదలయ్యే తరుణంలో నిస్సత్తువ ఆవరించటం, నిరాసక్తంగా అనిపించటం వల్ల చదువులు దెబ్బతినటమే కాదు, అంతా మన మీద దురభిప్రాయాలు పెంచుకుని, రకరకాల ముద్రలు వేసే అవకాశం కూడా ఉంటుంది. నిద్ర సరిగా లేనప్పుడు తీసుకునే నిర్ణయాలు కూడా సరిగా ఉండవు. ఏకాగ్రత కుదరదు. క్లాసులో నిద్ర ముంచుకొచ్చే ప్రమాదమూ ఉంటుంది. సాధారణంగా ప్రతిరోజూ కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. కాబట్టి క్యాంపస్‌ సందడిలో పడి అర్ధరాత్రి వరకూ మేలుకొని ఉండకుండా త్వరగా నిద్రపోవటం, పగటి నిద్ర మానుకోవటం, పగలు కొద్దిగా వ్యాయామం చెయ్యటం, నిద్రకు ఉపక్రమించటానికి కొన్ని గంటల ముందు నుంచీ కాఫీ, టీల వంటి వాటికి దూరంగా ఉండటం తదితర మంచి అలవాట్లను పెంచుకోవటం ఉత్తమం. ‘నైట్‌ ఔట్‌’ల వల్ల ప్రయోజనం కంటే సమస్యలే ఎక్కువ.
పార్టీలు, వ్యసనాలు
చాలా క్యాంపస్‌లలో వినోదాలు, పార్టీలు నడుస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్తదనాలను ఆస్వాదించాలని తహతహలాడుంతుండే యువత వీటికి తేలికగా ఆకర్షితులవుతుంటారు. కుటుంబానికి దూరంగా ‘స్వేచ్ఛ’ను అనుభవిస్తున్న యువత- వీటిలో మద్యం, సిగరెట్ల వంటి అలవాట్లకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువ. తెలిసీతెలియని వయసులో ఈ వ్యసనాల బారినపడటం వల్ల మొత్తం జీవితమే తల్లకిందులవుతుందన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. ఈ వ్యసనాల వల్ల విషయ గ్రహణ శక్తి తగ్గటం, ఉద్రేకపూరిత స్వభావం పెరగటం వంటి ‘చదువులను చెడగొట్టే’ తక్షణ సమస్యలే కాదు.. ప్రమాదాల బారినపడటం, హింస, లైంగిక దాడుల వంటి పెను­బిలో చిక్కుకుపోవచ్చు. గుండె పోటు, పక్షవాతం, కాలేయం చెడిపోవటం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలూ ఉంటాయి. ఇక క్యాంపస్‌లలో చాప కింద నీరులా- మాదక ద్రవ్యాల ముప్పూ పొంచి ఉంటుంది. ఏదో ఒకసారి రుచి చూద్దామని ప్రయత్నించినా తిప్పలు తప్పవనీ, వీటికి బానిసలైన వారంతా ఇలా మొదలుపెట్టినవారేనని గుర్తించటం చాలా అవసరం.
గాలి మార్పు
క్యాంపస్‌లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే చాలామంది జలుబు, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, విరేచనాల వంటి రకరకాల రుగ్మతల బారినపడుతుంటారు. కొత్త పరిస్థితుల మూలంగా తెలియకుండానే మానసికంగా ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. దీనికి తోడు చాలామంది ఒకే చోట ఉండటం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరం వంటి వైరల్‌ వ్యాధులు క్యాంపస్‌లను చుట్టబెడుతుంటాయి. వాతావరణం మార్పు వల్ల తుమ్ములు, ముక్కుకారటం వంటి అలర్జీ సమస్యలు, అలాగే అక్కడి ఆహారం సరిపడక వాంతులు, విరేచనాల వంటి ఇబ్బందులూ ఎదురవ్వచ్చు. కొత్తచోట- ఒంటరిగా ఇలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చేసరికి చాలామంది కుదేలైపోతుంటారు. కొత్తలోనే కాదు, క్యాంపస్‌లో ఉన్నంత కాలం ఇలాంటి సమస్యల ముప్పు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి శుభ్రత పాటించటం, తగినంత నిద్రపోవటం, ఒత్తిడి తగ్గించుకోవటం, ఇష్టారాజ్యంగా తినకుండా ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే కొన్ని మందులు దగ్గర ఉంచుకోవటం, అనవసర సంకోచాలు పెట్టుకోకుండా వైద్య సహాయం తీసుకోవటం మంచిది. నలతగా ఉన్న వారికి సాయం చెయ్యటం వల్ల స్నేహాలు బలపడతాయి, రేపు ఆ అవసరం మనకొస్తే వాళ్లు తోడుంటారన్న భరోసా కూడా దక్కుతుంది. అలాగే హాస్టళ్లలో ఒకరి నుంచి ఒకరికి తామర, గజ్జి వంటి చర్మవ్యాధులు, ఆడపిల్లల్లో పేల వంటి బాధలూ సంక్రమించే అవకాశం ఎక్కువ కాబట్టి వ్యక్తిగత శుభ్రతపై పూర్తి శ్రద్ధ పెట్టాలి.
లైంగిక అప్రమత్తత
ఒకవైపు ఉరకలెత్తే యవ్వనం, మరోవైపు కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల క్యాంపస్‌లలో యువత రకరకాల లైంగిక బంధాల్లో, సాలెగూళ్లలో చిక్కుకుపోతోంది. దీంతో లైంగికంగా సంక్రమించే సుఖవ్యాధులు 15-24 ఏళ్ల మధ్యవయసు వారిలో చాలా ఎక్కువగా కనబడుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ కూడా జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే పెను సమస్యలు. మోహావేశాల్లో చిటుక్కున వీటిలో చిక్కుకుంటే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సుఖవ్యాధుల వల్ల ఆడపిల్లలకు పొత్తికడుపు నొప్పులు, అండవాహికలు మూసుకుపోవటం, గర్భధారణ సమస్యలు, సంతాన రాహిత్యం వంటివెన్నో తలెత్తుతాయి. హెచ్‌ఐవీ వంటి తీవ్ర సమస్యలూ పొంచి ఉంటాయి. కాబట్టి లైంగిక ఉద్వేగాలకు లొంగిపోకుండా ఉండటం అత్యుత్తమం. మూత్రంలో మంట, జననాంగాల వద్ద ఎలాంటి తేడాలు కనబడినా దాపరికాలకు పోకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం చాలా అవసరం.
ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు
పోటీతత్వం పెరిగి, చదువులను ర్యాంకులతోనే కొలవటం ఆరంభించిన ఈ రోజుల్లో.. ఒత్తిడి లేని క్యాంపస్‌ చదువును ­హించలేం. బడి వయసు నుంచీ విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుల వరకూ ప్రతి దశలోనూ పిల్లలు ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నారు. కొత్త వాతావరణం, కొత్త చదువుల వల్ల కొంత ఒత్తిడి తప్పదు. పోటీలో ముందుండేందుకు కొద్దిపాటి ఒత్తిడి అవసరం కూడా. అయితే దానివల్ల చిన్నచిన్న విషయాలకు కూడా చికాకు, అసహనం పెరిగిపోవటం, నిర్ణయాలు తీసుకోలేకపోవటం, నిద్ర పట్టకపోవటం, భవిష్యత్తుపై బెంగ, తిండి సయించకపోవటం, జీర్ణ సమస్యలు, ఒళ్లు నొప్పుల వంటి బాధలు పెరగటం.. వీటితో రోజువారీ పనులు కూడా కష్టంగా తయారైతే మాత్రం దాన్నేమాత్రం నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు. ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల్లో కూడా ఇదే తరహా లక్షణాలు కనబడతాయి. తీవ్రమైన కుంగుబాటు కారణంగా 10-24 ఏళ్ల మధ్య వయసు వారిలో ఆత్మహత్యాలోచనలు కూడా ఎక్కువని, ఈ వయసు వారిలో మూడో అతిపెద్ద మరణకారణం ఆత్మహత్యలేనని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి చదువుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి టీచర్లతో ధైర్యంగా చర్చించటం, మంచి స్నేహితుల సాంగత్యంలో ఉండటం, ప్రణాళిక ప్రకారం చదువులు పూర్తిచేసుకోవటం, మానసిక స్థితి గురించి ఎలాంటి జంకూ లేకుండా కుటుంబ సభ్యులతో చర్చించటం చాలా అవసరం. వీటితో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి ఎంతో ఉపశమనం లభిస్తుంది.
తిండి సమస్యలు
అమ్మ ఆలనకు, కుటుంబ పాలనకు దూరమైన పిల్లలు తిండి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టటం చాలా అవసరం. క్యాంపస్‌ జీవితానికి అలవాటు పడే క్రమంలో చాలామంది పిల్లలు ఇష్టమైనవే తింటూ లేనివి మానేస్తుంటారు. చాలా పదార్ధాలు నచ్చలేదంటుంటారు. కెఫెటేరియాల్లో, క్యాంటీన్లలో, మెస్‌లలో దొరికే జంక్‌ ఫుడ్‌కు అలవాటు పడిపోతుంటారు. ఆడపిల్లలు డైటింగ్‌ల పేరుతో తిండి మానేసి ‘అనొరెక్సియా’ తరహా వ్యాధుల బారినపడుతుంటారు. నిజానికి ఈ ఎదిగే వయసులో పిల్లలకు చక్కటి పోషకాహారం చాలా అవసరం. అది లభించకపోతే నిరాసక్తంగా, నిస్సత్తువగా తయారవుతారు. ఏకాగ్రత కుదరదు. చదువుల్లోనే కాదు, శారీరక ఎదుగుదలలో కూడా వెనకబడిపోతారు. కాబట్టి రోజువారీ ఆహారంలో మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పప్పు, పప్పు పదార్ధాలు, మాసం వంటివి దండిగా తీసుకోవాలి. ఎదుగుదలకు అవసరమయ్యే క్యాల్షియం కోసం పాలు, పాలపదార్ధాలు తీసుకోవాలి. తాజా పండ్లు, కూరలు సమృద్ధిగా తీసుకోవటం అవసరమని గుర్తించాలి.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list