నరాల పటుత్వానికి చేయాలంటే...
‘‘కాసేపు నడవగానే కాళ్లు గడగడా వణకడ ం, ఏ చిన్న బరువు లేపినా చేతులు జివ్వున లాగేయడం ఏమిటిదంతా? ఏ రోజుకారోజు ఇక ముందు ఎందుకూ పనికి రానేమోననే భావన పెరిగిపోతోంది. ఇలా అయితే ముందున్న జీవితాన్నంతా ఈడ్చేదెలా?’’ నరాల పటుత్వం కోల్పోయిన వాళ్ల నరకం ఇలానే ఉంటుంది!
మనిషిలో పనితనం తగ్గినప్పుడు, శరీరమంతా శక్తిహీనమైనప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు! ముఖ్యంగా ఒక నిర్దిష్టమైన వ్యాధి అంటూ కూడా ఏదీ బయటపడనప్పుడు, ఇంకేముంది? ఒళ్లు పట్టు తప్పిపోయిందీ అంటూ ఉంటారు. ఆ మాటకు అర్థం నరాలు చచ్చుబడిపోయాయనే! నరాలదో పెద్ద వ్యవస్థ. మంచి రక్తాన్ని గుండె నుంచి వివిధ అవయవాల కణజాలాలకు చేర్చేవాటిని ‘ధమనులు’ అనీ, ఆ కణజాలాల్లో విడుదలయ్యే వ్యర్థాలను, ఊపరితిత్తులకు, అక్కడి నుంచి గుండెకు కొనిపోయేవి ‘సిరలు’ అనీ పిలుస్తారు. ఈ రెంటినీ కలిపి రక్తనాళాలు అంటారు. నిజానికి నరాలనేవి మెదడులో పుట్టి, వివిధ అవయవాల రక్త, మాంసాది వివిధ కణజాలాలకు చేరి, ఆయా అవయవాల పనులను నియంత్రిస్తూ ఉంటాయి.
ఎప్పుడొస్తుందీ బలహీనత?
మనిషికి బలం అనేది తాను తిన్న ఆహార సారాం నుంచి వస్తుంది. దీన్నే ‘ఓజస్సు’ అంటారు. ఏ పని చేయాలన్నా ఇది అవసరమే. ఓజస్సును సప్తధాతువుల సారంగా చూస్తాం కాబట్టి, అన్ని ధాతువుల పోషణకూ అవసరమైన పోషకాంశాలు ఆహారంలో ఉండితీరాలి. అలా తీసుకునే ఆహారాన్నే సమతులాహారం అంటాం. అయితే ఆహార రస- రక్త ధాతువుల నుంచి పోషకాంశాలను తీసుకోవడంలో థైరాయిడ్ వంటి అంతఃస్రావ గ్రంథులు సహకరిస్తుంటాయి. అయితే ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఈ అంతఃస్రావాలు లోపిస్తే, కణజాల వ్యవస్థ బలహీనపడవచ్చు. నరాల బలం తగ్గిపోవ చ్చు.
రసాయన చికిత్సలు
నరాలకు సంబంధించిన పక్షవాతం, క్యాల్షియం లోపంతో వచ్చే కీళ్లు, ఎముకల నొప్పులు (ఆస్టియో మలాసియా), ధాతుక్షయం, వెన్నెముకలో డిస్కు ఒత్తిళ్లు మరో ఎత్తు. ఇక సహజంగా వచ్చే వృద్ధాప్యం, దాని తాలూకు సమస్త నరాల సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇన్ని కారణాలతో వచ్చే నరాల బలహీనతలను పారదోలి, నరాల పటుత్వాన్ని కూడదీయాలంటే, ఆహార పోషక లోపాలు, అంతఃస్రావ లోపాలు, ధాతు పరిణామ లోపాలను ముందు గుర్తించాలి. అయితే, వ్యాధి పేరుతో సంబంధం లేకుండా, జీర్ణ ప్రక్రియ నుంచి, ధాతు ప్రక్రియ దాకా అద్భుతంగా పనిచేసే ఔషధ వర్గాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటినే ‘రసాయన వాజీకరణ’ చికిత్సలు అంటారు. వ్యాధులేవీ లేకున్నా, వ్యాధులు ఏర్పడక ముందే సూచన మాత్రంగా కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు గానీ, ఫలానా వ్యాది అని నిర్ధారణ అయినప్పుడు గానీ, రసాయన చికిత్సలు ఎంతో అద్బుతంగా తోడ్పడతాయి. వృద్ధాప్యాన్ని జయించడానికి కూడా తోడ్పడటం వల్ల వీటికి ‘జరాచికిత్సలు’ అన్న పేరు కూడా ఉంది. రసాయన ఔషధాల్లో ఉసిరితో చేసే ‘ఆమ్లకీ రసాయనం’, కరక్కాయతో చేసే ‘హరీతకీ రసాయనం’, గుంటగలగరాకుతో చేసే ‘భృంగరాజ రసాయనం’, పిప్పళ్లతో చేసే ‘చౌషష్టి పిప్పలీ రసాయనం’ ముఖ్యమైనవి. ఇవి కాక, ఖనిజ మూలకాలతో చేసే ‘ఆరోగ్య వర్ధనీ’, ‘ప్రవాళ పంచామృతం’, ‘గంధక రసాయనం’, ‘శిలాజిత్’ మరికొన్ని ఇతర రసౌషధాలన్నీ ‘రసాయనాలు’గా చెప్పబడతాయి, ఇవి పోగా అల్లం, నిమ్మకాయ రసంతో చేసిన ‘మాదీఫల రసాయనం’, ‘అర్జునారిష్ట’, ‘దశమూలారిష్ట’ వంటివి, లేహ్యరూపంలో ఉండే చ్యవనప్రాశ, అగస్త్య, భల్లాతక వంటి రసాయనాలు ఉన్నాయి.
సహజ మార్గంలో
ఔషధ చికిత్సలు సరే! అందుకు భిన్నంగా, మందులతో పనిలేకుండా, అసలు వైద్యులతోనే పనిలేకుండా నరాల పటుత్వాన్ని పెంచే సహజమార్గాలు కూడా ఉన్నాయి. ఆహార, జీవనశైలిని మార్చుకోవడమే ఆ మార్గం. దీన్నే ఆచార రసాయనంగా పిలుస్తారు. ఆహారంలో పండ్లు, కూరగాయలతో కూడిన సాత్వికాహారం, అపక్వాహారానికి ప్రాధాన్యమిస్తూ, జీవనశైలిలో యోగాను జీవన విధానంగా చేసుకోవాలి. ప్రాణాయామంతో ఆక్సిజన్ సంపూర్ణంగా అంది, నరాలు ఉత్తేజంగా పనిచేస్తాయి. ఫలితంగా నరాల బలహీనత మటుమాయమవుతుంది.
ప్రొఫెసర్ చిలువేరు రవీందర్
ఇక.. కొవ్వెక్కదు!
ఎంత స్థూలకాయం ఉంటే మాత్రం... ఎవరి శరీరాన్ని వాళ్లే మోసుకుంటారు తప్ప.. ఎదుటి వాళ్లేమీ మోయరు. అయినా ‘‘ఏమిటి విత్రమా! అలా పెంచేస్తున్నావ్! శరీరాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశామిటి?’’ ఇలా ఏదో అనేస్తారు. ఎవరికి మాత్రం స్లిమ్‌గా ఉండాలని ఉండదు. కాకపోతే కొంతమంది ఆ విషయంలో బాగా నిర్లక్ష్యంగా ఉండిపోతారు. కొన్నాళ్ళకు ఆ స్థూలకాయం కూడా అలవాటైపోతుంది! ఈ సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే, అధిక రక్తపోటు, మధుమేహం, మోకాళ్లనొప్పులే కాదు ఒక ద శలో అంతకన్నా తీవ్రమైన రుగ్మతలే తలెత్తుతాయి. అవలీలగా బరువు తగ్గిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే.. ఏ మార్గమైనా ఏదో చాక్లెట్ తినేసినంత సులువుగా మాత్రం ఉండదు. నియమిత ఆహారం, నిరంతర వ్యాయామం, అవసరమైన వైద్య చికిత్సలు- ఈ మూడు విషయాల్లో శ్రద్ధ వహించాల్సిందే!!
ఎందుకీ స్థూలకాయం?
అవసరానికి మించి తినేయడం, శరీర శ్రమ బొత్తిగా లేకపోవడం, హార్మోన్, థైరాయిడ్ గ్రంథి తాలూకు సమస్యలు- స్థూలకాయానికి దారితీసే ప్రధాన కారణాలు ఇవే! మాంసాహారమే అని కాదుశాకాహారమైనా అవసరానికి మించి తీసుకుంటే అది కొవ్వుగా మారి శరీరంలో నిలిచిపోతుంది. కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకుంటే స్థూలకాయం తప్పనిసరి. అందుకే బరువు పెరుగుతున్న వారిని పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆకు, కూరగాయలు తీసుకోవాలి. అయితే, అవసరానికి మించి తీసుకుంటే కూరగాయలైనా కొవ్వుగానే మారతాయి. పండ్లరసం కూడా ఇందుకు మినహాయింపు కాదు.
థైరాయిడ్ సమస్యలు
స్థూలకాయానికి అతిగా ఆహారం తీసుకోవడం ఒక్కటే కారణం కాదు. థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేసినప్పుడు కూడా శరీరం లావెక్కుతుంది. ఈ స్థితిలో థైరాయిడ్ సమస్యకు చికిత్స తీసుకోవాలి. కేవలం ఆహార నియమాలు పాటించడం వల్ల ప్రయోజనం ఉండదు. స్త్రీలలో రుతుక్రమం నియమిత కాలంలో లేకపోవడానికి కూడా థైరాయిడ్ గ్రంథి లోపాలే కారణం. ఈ రుతు సమస్యలను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా అది కూడా స్థూలకాయానికి దారితీస్తుంది. అందువల్ల స్థూలకాయానికి హార్మోన్ లోపాలు కారణమో, లేక అధిక ఆహారం కారణమో ముందు తెలుసుకోవాలి. స్థూలకాయంతో వచ్చే సమస్యల్లో గుండె జబ్బులు ప్రధానం. వీటికి తోడు అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలు కూడా వస్తాయి. దీనివల్ల కొలెస్ర్టాల్ పెరిగిపోయి, గుండె రక్తనాళాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అధిక బరువు కారణంగా కీళ్ల మీద భారం పెరిగి కీళ్లనొప్పులు మొదలవుతాయి. శారీరక సమస్యలే కాదు వీరు మానసిక ఒత్తిళ్లకూ లోనవుతారు.
అతి ఎప్పుడూ ముప్పే!
ఆహారం విషయంలో రెండు విపరీత ధోరణులు కనిపిస్తాయి. అతిగా తినేవారు ఒక వర్గమైతే, అతిగా తిండి తగ్గించేవారు మరో వర్గం. బరువును తగ్గించుకునే యత్నంలో కొందరు కనీస ఆహారం కూడా తీసుకోరు. తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేలా వ్యాయామం చేయాలే గానీ, ఆహారాన్ని అమితంగా తగ్గించడం సరికాదు. దీనివల్ల శరీరంలో మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఫ్లోరైడ్లు, గ్లూకోజ్ తగ్గిపోతాయి. కాళ్లు లాగడం, ఒంటి నొప్పులు వస్తాయి.
కనీస స్థాయి తగ్గకుండా..
బరువు తగ్గడానికి కొందరు మరీ తక్కువగా ఆహారం తీసుకుంటూ, విపరీతంగా వ్యాయామం చేస్తారు. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పడిపోతుంది. రక్తహీనత ఏర్పడుతుంది. ఏ కాస్త జబ్బు చేసినా గ్లూకోజ్, రక్తం ఎక్కించవలసిన అవసరం ఏర్పడుతుంది. నరాలు బలహీనమవుతాయి. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోతాయి. నిద్రలేమి ఏర్పడుతుంది. కాళ్లూ చేతుల్లో తిమ్మిర్లు, నొప్పులు తలెత్తుతాయి. మొత్తంగా జీవనసామర్థ్యమే తగ్గిపోతుంది. ఎవరైనా చాలా వేగంగా బరువు తగ్గిపోవాలనుకోవడం ప్రమాదకరం. 15 రోజులకు 500 గ్రాముల కన్నా బరువు తగ్గకూడదు. వ్యక్తి ఎత్తును అనుసరించి అతని బరువు ఉండాలి. ప్రతి అడుగు ఎత్తుకూ పదికిలోల బరువు ఉండడం ఆరోగ్యరీత్యా సరియైనది. ఉదాహరణకు 6 అడుగుల వ్యక్తి 60 కి లోల బరువు ఉండాల్సిందే.
ఆహారం... వ్యాయామం
స్థూలకాయం తగ్గడమన్నది దాదాపు 60 శాతం ఆహార, వ్యాయామాల మీదే ఆధారపడి ఉంటుంది. మందుల ప్రభావం మిగతా 40 శాతం మాత్రమే. ఇతర వైద్య విధానాల్లో కొందరు ఆకలి తగ్గిపోయే మందులు కూడా ఇస్తారు. తీసుకునే ఆహారం తగ్గిపోవడం వల్ల బరువు తగ్గిపోవచ్చు. కానీ ఈ విధానం వల్ల కొంతకాలం తరువాత కొత్త సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆకలి తగ్గించడం కాకుండా, కొవ్వు శరీరంలో ఇమడకుండా చేసే మందులకు హోమియో ప్రాధాన్యమిస్తుంది. శరీరంలో నిలబడలేని కొవ్వు, విసర్జన ద్వారా బయటికి వెళ్లిపోతుంది. ఫైటోలక్కాబర్రి, ఫ్యూకస్ వంటి మందులు ఇలా పనిచేస్తాయి. స్థూలకాయ నియంత్రణలో ఆహారం, వ్యాయామం, వైద్యచికిత్స- ఈ మూడింటికీ సమాన ప్రాధాన్యం ఉంది. అందుకే వైద్య చికిత్స తీసుకుంటూనే అవసరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చె య్యాలి. అప్పుడే స్థూలకాయాన్ని విజయవంతంగా తగ్గించవచ్చు.
థైరాయిడ్ చికిత్సలు
థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సరిగా ఉత్పత్తి చేయలేనప్పుడు స్థూలకాయం వచ్చేస్తుంది. దీనికి వైద్య చికిత్సలే పరిష్కారం. హోమియోలో హార్మోన్ లోపాలను సవరించడానికి కృత్రిమంగా హార్మోన్ మాత్రలు ఇవ్వడం ఉండదు. హార్మోన్లను ఉత్పత్తి చేసేలా థైరాయిడ్ గ్రంథిని చైతన్యపరిచే మందులు ఇస్తాం. గర్భాశయం తొలగించిన కొంత మంది స్త్రీలలో కూడా హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కూడా స్థూలకాయానికి దారితీస్తుంది. అందుకే తిరిగి ఆ సమతుల్యతను నిలబెట్టే వైద్య చికిత్సలు తీసుకోవాలి. సిబియా వంటి మందులు ఈ విషయంలో బాగా పనిచేస్తాయి. కాకపోతే ఈ మందులను హోమియో వైద్యుల పరిరక్షణలోనే తీసుకోవాలి.
ప్రొఫెసర్ బి. సోహన్ సింగ్
రిటైర్డ్ సూపరింటెండెంట్
గవర్నమెంట్ హోమియో హాస్పిటల్, హైదరాబాద్
కలుస్తున్నా.. కలగకపోతే?
దంపతులిద్దరూ నిండు ఆరోగ్యంతో ఉంటారు. ఇద్దరిలోనూ ఎలాంటి లోపాలూ ఉండవు. అయినా ఏళ్లు గడిచినా వారికి పిల్లలు పుట్టరు. అలాంటప్పుడు ఇక ఈ జన్మలో తల్లితండ్రులమయ్యే భాగ్యం మాకు లేదనుకుని కుంగిపోనవసరం లేదంటున్నారు వైద్యులు. అకారణ వంధ్యత్వమైన ‘ఈడియోపతిక్ ఇన్‌ఫెర్టిలిటీ’కి మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటున్నారు. వాటితో పండంటి బిడ్డను కనే వీలుందని భరోసా కూడా ఇస్తున్నారు.
పిల్లల కోసం ఎంతకాలం ఆగొచ్చు?
ఎలాంటి గర్భనిరోధక విధానం అవలంబించకుండా సంవత్సరంపాటు కాపురం చేసినా గర్భం దాల్చకపోతే దంపతుల్లో లోపం ఉందని అర్థం. ఇలాంటప్పుడు లోపం ఏ ఒకరిలోనో ఉండొచ్చు. లేదా ఇద్దరికీ ఉండొచ్చు. కాబట్టి ఇద్దరూ వైద్యులను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షలతో పురుషుల్లో శుక్ర కణాల సంఖ్య, వాటి కదలికలు, మార్ఫాలజీల గురించి తెలుస్తుంది. ఒకవేళ వీర్య కణాల సంఖ్య తగినంత లేకపోయినా, వాటి వేగం తక్కువగా ఉన్నా మందులతో సరిదిద్దవచ్చు.
వివరణకందని సమస్య!
స్త్రీలలో ‘అండాల విడుదల ఎలా ఉంది? ఫాలోపియన్ ట్యూబ్స్ క్లియర్‌గా ఉన్నాయా, లేవా? ఎండోమెట్రియాసిస్ ఉందా? లేదా? ...అనేవి పరీక్షలతో తెలుసుకుని ఆ సమస్యలను కూడా చికిత్సతో వైద్యులు సరిదిద్దుతారు. ఒక్కోసారి ఈ పరీక్షల్లో కూడా దంపతులిద్దరికీ ఎలాంటి సమస్యా లేదని తేలుతుంది. మరి సమస్య లేనప్పుడు సహజంగానే గర్భం దాల్చాలి. అయినా అలా జరగలేదంటే ఆ దంపతుల విషయంలో వైద్యులు ఓ నిర్ధారణకు వస్తారు. ఆ దంపతుల్లో ఎవరికి వారికి పిల్లల్ని కనే సామర్ధ్యం ఉంటుంది కానీ ఇద్దరూ కలిసి పిల్లల్ని కనలేరు. ఈ కోవకు చెందిన వారు ‘అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ’ కిందకు వస్తారు. వీళ్లిద్దరూ కలిసి ఎందుకు పిల్లల్ని కనలేపోతున్నారు అనే దానికి కచ్చితమైన కారణం ఉండదు. ఇప్పటివరకూ జరిపిన వైద్య పరిశోధనల ద్వారా శుక్ర కణాలలోని ‘డిఎన్‌ఎ డ్యామేజ్’ ఓ కారణం అయి ఉండవచ్చని పరిశోధకులు ఓ అంచనాకొచ్చారు.
పురుషుల్లోనే ఎక్కువ
పూర్వం పిల్లలు పుట్టకపోతే దానికి స్త్రీలనే బాధ్యులను చేసేవాళ్లు. కానీ వంధత్వానికి కారణం ఇద్దర్లోనూ ఉండొచ్చు. ఒక్కోసారి స్త్రీలలో కాకుండా పురుషుల్లోనే ఆ లోపం ఉండొచ్చు. ప్రస్తుతం పురుషుల వీర్య కణాల్లో లోపాలనేవి సర్వసాధరణమైపోయాయి. ఒక స్ఖలనంలో కనీసం 20 మిలియన్ల వీర్య కణాలుండాలి. వీటిలో సగం వీర్య కణాల మార్ఫాలజీ సహజంగా ఉండాలి. కానీ అలా ఉండట్లేదు. వీర్య కణం ఆకారంలో లోపాలు ఎక్కువవుతున్నాయి. వీర్య కణంలో తల, మధ్యభాగం, తోక ఉంటుంది. ఈ మూడింట్లో ఏ ఒక్కదాన్లో లోపం ఉన్నా పిల్లలు పుట్టడం కష్టం. తల భాగంలో డిఫెక్ట్ ఉంటే అండంలోకి చురుగ్గా చొరబడలేదు. మధ్యభాగంలో లోపముంటే అండంలోకి పూర్తిగా చేరుకోలేదు. ఒకవేళ తోకలోనే లోపం ఉంటే అండం దాకా వీర్య కణం ఈదలేదు. ఇలాంటి వీర్య కణాలు 20 మిలియన్లు ఉన్నా ఉపయోగం ఉండదు. అలాగే వీర్య కణం కదలికలు కూడా చురుగ్గా ఉండాలి. ఈ లోపాలన్నిటినీ కొంతమేరకు సరిదిద్దే చికిత్సలున్నాయి. నోటి మాత్రలు, హెల్త్ సప్లిమెంట్ల ద్వారా వీర్య కణాల కదలికలు, వాటి సంఖ్యను పెంచవచ్చు.
స్త్రీలలోనూ వంధ్యత్వం
వాతావరణ కాలుష్యం, మరీ ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ కూడా పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తాయి. పోషకాహార లోపం, ఒత్తిడి, నిద్రలేమి, అస్తవ్యస్త జీవనశైలి వల్ల అండాల విడుదల ఆలస్యమవటం లేదా నిలిచిపోవటం జరుగుతుంది. అలాగే అండాశయంలో ఫాలికల్ రిజర్వ్ ఉన్నా అవి తగినంత పరిణతి చెందవు, విడుదల కావు. ఈ సమస్యలన్నిటినీ సరిదిద్దే చికిత్సలున్నాయి.
ఇద్దరిలోనూ లోపం లేకున్నా..
కొన్నిసార్లు దంపతులిద్దరిలో ఎలాంటి లోపమూ ఉండదు. పురుషుడిలో వీర్య కణాల సంఖ్య, కదలికలు మెరుగ్గానే ఉంటాయి. అలాగే స్త్రీలలోనూ అండాల విడుదల, రుతుక్రమం సక్రమంగా ఉంటుంది. ఇలా ఇద్దరికీ పిల్లల్ని కనే సామర్థ్యం ఉన్నా, పిల్లల్ని కొందరు కనలేరు. ఇలాంటి ‘ఈడియోపతిక్ ఇన్‌ఫర్టిలిటీ’ కోవకు చెందిన దంపతులు సాధారణ లైంగిక కలయిక ద్వారా పిల్లల్ని కనలేరు. కాబట్టి ఇందుకోసం వైద్యులు కొన్ని ప్రత్యేక వైద్య విధానాలను అనుసరిస్తారు. అవేంటంటే..
అండాశయాన్ని ప్రేరేపించే మందులు, ఇంట్రా యుటెరైన్ ఇన్‌సెమినేషన్ (ఐయుఐ), ఇంట్రా సర్వికల్ ఇన్‌సెమినేషన్ (ఐసిఐ), ఇంట్రా ఇన్‌విట్రో ఫర్టిలేషన్ (ఐఐఎఫ్), ఇక్సీ.... చికిత్సలతో గర్భం దాల్చేలా చేయవచ్చు.
ప్రత్యేక వైద్య విధానాలు
ఇంట్రా యుటెరైన్ ఇన్‌సెమినేషన్: అండంలోకి వీర్య కణాలను నేరుగా గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దాంతో అండం ఫలదీకరణం చెంది, పిండంగా మారుతుంది.
ఇంట్రా సర్వికల్ ఇన్‌సెమినేషన్: వీర్య కణాలను సర్విక్స్ (గర్భాశయ ద్వారం) లోకి ఇంజెక్ట్ చేస్తారు.
ఇంట్రా ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్: ఒకవేళ ఐయుఐ ఫెయిల్ అయితే ఈ పద్ధతి ద్వారా గర్భం దాల్చే ప్రయత్నం చేయొచ్చు. ఈ విధానంలో అండాన్నీ, వీర్య కణాన్నీ ప్రయోగశాలలో ఫలదీకరింపజేసి గర్భాశయంలో ప్రవేశపెడతారు.
ఇట్సీ: ఇంట్రా సైకోప్లాజమిక్ ఇంజెక్షన్ అనే ‘ఇక్సీ’లో అండాన్నీ, వీర్య కణాన్నీ ల్యాబ్‌లో ఫలదీకరణం చేయకుండా నేరుగా అండ కణంలోకే వీర్య కణాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఎంతో ఆధునిక ప్రక్రియ. గర్భం దాల్చే అవకాశాలు కూడా ఈ విధానంలో మరింత మెరుగ్గా ఉంటాయి.
ఈ చికిత్సా విధానాల వల్ల గర్భం దాల్చే అవకాశాలు మెరుగైనా కూడా వైద్యులు సూచించిన కొన్ని జాగ్రత్తలను పాటించకపోతే ఫలితం ఉండదు. జీవనశైలి మెరుగు పరుచుకోవటం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం, పోషకాహారం తీసుకోవటం, శరీర శుభ్రత పాటించటం, తగినంత నిద్ర పోవడం, దురలవాట్లకు దూరంగా ఉండడం లాంటివి గర్భధారణకు ఎంతో అవసరం.
దత్తత ఎప్పుడు?
పైన చెప్పిన పద్ధతులన్నీ అనుసరించినా ఒక్కోసారి గర్భం నిలవకపోవచ్చు. పిండాన్ని శరీరం రిజెక్ట్ చేయొచ్చు. అంతమాత్రాన మరోసారి ప్రయత్నం చేయకూడదనేమీ లేదు. ఇయుఐ, ఐఐఎఫ్, ఐసిఐ, ఇట్సీ చికిత్సా విధానాలను ఐదేళ్లపాటు ప్రయత్నించవచ్చు. అప్పటికీ గర్భం నిలవకపోతే దత్తత తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు.
దత్తత తర్వాత గర్భం
కొంతమంది ఇడియోపతిక్ ఇన్‌ఫెర్టిలిటీ కోవకు చెందిన దంపతులు ఐదేళ్లపాటు ఆధునిక చికిత్సలన్నీ ప్రయత్నించి విఫలమై చివరకు పిల్లల్ని దత్తత తీసుకుంటారు. అయితే చిత్రంగా దత్తత తీసుకున్న కొంతకాలానికి ఆ స్త్రీలు గర్భం దాలుస్తారు. ఇలా జరగటానికి కారణం మానసిక ప్రశాంతతే! గర్భం దాల్చలేకపోతున్నామనే మానసిక ఒత్తిడి కూడా గర్భధారణను అడ్డుకుంటుంది. ఇదే ఒత్తిడి ఐయుఐ, ఐవిఎ్‌ఫ...మొదలైన చికిత్సలు తీసుకుంటున్నప్పుడూ కొనసాగి గర్భం దాల్చలేకపోతారు. అయితే ఎప్పుడైతే పిల్లల్ని దత్తత తీసుకుంటారో వారికి పిల్లలు లేని లోటు తీరి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఫలితంగా శరీరంలో గర్భం దాల్చటానికి అనుకూలమైన మార్పులు మొదలై గర్భధారణ జరుగుతుంది.
చికిత్స మానసికం, శారీరకం
ఎటువంటి గర్భ నిరోధక సాధనాలూ వాడకుండా దంపతులు లైంగికంగా కలిస్తే చాలు పిల్లలు పుట్టేస్తారని సాధారణంగా అనుకుంటారు. కానీ లైంగిక కలయికతోపాటు మరెన్నో అంశాలు కూడా అనుకూలించాలి. అవేంటంటే...
పోషకాహారం: స్త్రీపురుషులిద్దరూ ఆరోగ్యాన్నందించే పోషకాహారం తీసుకోవాలి. పోషకాహారం వల్ల స్త్రీలలో అండాల ఉత్పత్తి పెరిగితే, పురుషుల్లో వీర్య కణాల నాణ్యత మెరుగవుతుంది. డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, పళ్లు, ప్రొటీన్లు తీసుకోవాలి. రెడ్ మీట్ మానేయాలి.
దురలవాట్లు: ధూమపానం, మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. పొగతాగటం వల్ల పురుషుల వీర్య కణాలలోని డిఎన్‌ఎ దెబ్బ తింటుంది. మద్యం, ఖైనీ, గుట్కాలాంటి వ్యసనాల వల్ల ఈ సమస్య వస్తుంది.
డ్రగ్స్: కొకెయిన్, హ్యాషిష్, వీడ్, మారిజువానా వంటి డ్రగ్స్ ప్రభావం కూడా వీర్య కణాల మీద ఉంటుంది. 20 ఏళ్ల వయసులో ఇలాంటి అలవాట్లు ఉండి తర్వాత మానేసినా వీర్య కణాలకు జరిగిన నష్టం భర్తీ కాదు.
జీవనశైలి: సమయానికి తిండి, నిద్ర ఎంతో అవసరం.
ఒత్తిడి: మానసిక ఒత్తిడి శరీరం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు కలగరేమోనని దిగులు పడుతూ, పిల్లలు లేని భవిష్యత్తుని ఊహించుకుంటూ మానసికంగా కుంగిపోతుంటే ఆ ప్రభావం వల్ల కూడా గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లుతాయి.
కాలుష్యం: వాతావరణ కాలుష్యం కూడా గర్భధారణ అవకాశాలను సన్నగిల్లేలా చేస్తుంది. వాయు కాలుష్యం నుంచి తప్పించుకోవటం కోసం ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి. కూరగాయలను ఎక్కువ నీటితో కడిగి వండాలి. తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలి.
గర్భం దాల్చినా.. అబార్షన్.. ఎంబ్రియో అలర్జీ
ఈమధ్య కాలంలో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ‘ఎంబ్రియో అలర్జీ’. ఈ సమస్య ఉన్నవాళ్ల శరీరం పిండాన్ని రిజెక్ట్ చేస్తుంది. దాంతో గర్భం దాల్చినా వాళ్లకు తెలియకుండానే అది అబార్షన్ అయిపోతుంది. గర్భం దాల్చినప్పుడు ఆగిపోవలసిన నెలసరి ఆగిపోదు... గర్భం దాల్చినా, శరీరం ఆ పిండాన్ని రిజెక్ట్ చేయటంతో గర్భంలో పిండం నాటుకోలేక సాధారణ నెలసరి రూపంలో బయటికి వచ్చేస్తుంది. తమ శరీరంలో ఇలా జరుగుతోందని స్త్రీలు కూడా కనిపెట్టలేరు. ఎంతకాలమైనా పిల్లలు కలగక వైద్యులను సంప్రదించినప్పుడు అక్కడ చేసిన పరీక్షలో అసలు సమస్య తెలుస్తుంది. అయితే ఈ సమస్యను చక్కదిద్దే వైద్య చికిత్సలు కూడా ఉన్నాయి.
30 లోపే మేలు!
స్త్రీల గర్భధారణకు అనువైన వయసు 24 నుంచి 30 ఏళ్లు. 35 ఏళ్ల వరకూ గర్భం దాల్చే వీలున్నా, 30వ సంవత్సరంలో పెళ్లైతే ఆరు నెలలలోపే గర్భం దాల్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ 30 ఏళ్ల వయసులో పెళ్లై 6 నెలలైనా గర్భం దాల్చకపోతే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని కలవాలి. అంతకంటే ముందు పెళ్లైతే సాధ్యమైనంత త్వరగా పిల్లల్ని కనే ప్రయత్నం చేయటం మంచిది. చదువు, కెరీర్‌పరంగా గర్భధారణను వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయటం వల్ల గర్భం దాల్చే అవకాశాలను చేతులారా నాశనం చేసుకున్న వాళ్లమవుతాం. పూర్వం 35, 40 ఏళ్ల వయసులో కూడా పండంటి బిడ్డను ప్రసవించగలిగేవాళ్లు. కానీ కాలక్రమేణా పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల గర్భం దాల్చే అవకాశాలు సన్నగిల్లటం మొదలుపెట్టాయి. 30 దాటిన తర్వాత గర్భం దాల్చగలిగినా పుట్టే పిల్లల్లో అవకరాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ వయసులోగానే పిల్లల్ని కనే ప్రయత్నం చేయటం మేలు. పురుషుల్లో కూడా 35 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత నుంచి వీర్య కణాల నాణ్యత తగ్గుతూ పోతుంది.
పిప్పళ్లతో పలు లాభాలు
సమాజంలో పిప్పళ్ల వాడకం చాలా ఎక్కువే. వీటివల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే. స్థూలకాయాన్ని తగ్గించడం నుంచి మొదలుకుని, దగ్గు, ఆయాసం దాకా సమసిపోతాయి. పిప్పళ్ల ప్రయోజనాల్లో కొన్ని....
3 గ్రాముల పిప్పళ్ల చూర్ణాన్ని ప్రతి రోజూ వేడినీటితో తీసుకుంటే శరీరం బరువు తగ్గుతుంది. ఈ చూర్ణంతో పాటు మోడి (పిప్పలి వేరు) కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక పూట జావా మాత్రమే తాగాలి. దప్పిక వేసినప్పుడు గోరు వెచ్చని నీరు తాగాలి.
పిప్పళ్లను తేనెతో సేవిస్తే ఆకలి పెరుగుతుంది. పులితేన్పులు తగ్గుతాయి.
నెయ్యితో కలిపిన పిప్పలి కషాయాన్ని... తేనెతో కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. ఈ సమయంలో రోజూ పాలు తీసుకోవడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది.
పిప్పళ్ల చూర్ణాన్ని గానీ, లేదా మిరియాల చూర్ణాన్ని గానీ, సేవిస్తే చాలా కాలంగా బాధించే విరేచనాలు సైతం వేగంగా తగ్గుతాయి.
పిప్పళ్లను నేతిలో వేయించి, దానికి సైందవ లవణం చేర్చి మాత్రలుగా చేసి వేసుకుంటే దగ్గు తగ్గుతుంది.
పిప్పళ్ల చూర్ణాన్ని బెల్లంతో కలిపి సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
మన డీఎన్‌ఏలో 75% వ్యర్థమే!
మన జన్యువుల్లోని డీఎన్‌ఏల్లో దాదాపు 75శాతం వ్యర్థమైనవేనని, వీటివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని తాజా పరిశోధన వెల్లడించింది. జన్యువుల్లో ఉండే డీఎన్‌ఏ ఏదో ఒక పనిచేస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతూ వస్తున్నారు. స్వల్ప మొత్తంలో పనికిరాని డీఎన్‌ఏ ఉండొచ్చని వారి అభిప్రాయం. అయితే, యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ శాస్త్రవేత్తలు ఈ నమ్మకాన్ని తోసిపుచ్చారు. జన్యురాశిలో పనికివచ్చే డీఎన్‌ఏ కేవలం 10 నుంచి 15 శాతంగా ఉంటుందని చెప్పారు. గరిష్ఠంగా అంటే.. ఇది 25 శాతానికి మించదని పేర్కొన్నారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565